‘పచ్చ’ధనం పరవళ్లు
సాక్షిప్రతినిధి, గుంటూరు :జిల్లాలోని 17 అసెంబ్లీ, మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో బుధవారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు మరో రెండు రోజులే గడువున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో, పట్టణాల్లో వార్డుల వారీగా ఓట్ల కొనుగోలు ప్రారంభించింది. ఓటర్లకు పంచేందుకు ఇప్పటికే కార్యకర్తలకు భారీగా నగదు చేరింది. ప్రధానంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలోని కాలనీల్లో ఓటుకు రూ.1000 చొప్పున పంచుతున్నారు. వీటితో పాటు ఓ ప్రధాన సామాజికవర్గానికి కల్యాణమండపం నిర్మించేందుకు శుక్రవారం రాత్రి టీడీపీ అభ్యర్థి రూ.10 లక్షలు అందజేసినట్లు సమాచారం. నిర్మాణానికి కావాల్సిన స్థలం కొనుగోలుకు కూడా సహాయ, సహకారాలు అందించేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని గుంటూరు రూరల్ మండలం బుడంపాడులో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న దేవాలయం నిర్మాణానికి అవసరమైన మొత్తం రూ. 32 లక్షలను అందించేందుకు అక్కడి టీడీపీ నాయకులు శనివారం ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా తొలివిడతగా రూ.10 లక్షలను రాత్రికిరాత్రి అందజేశారు. శ్మశాన వాటికలకు స్థలం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. స్థానికంగా ఉన్న చర్చిలో కూడా ఆ నాయకులు మంతనాలు చేసి అవసరమైన నగదు అందజేశారు.
నరసరావుపేట పార్లమెంటరీ పరిధిలో
బంపర్ ఆఫర్.: నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఓటుకు బాగానే రేటు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఓటుకు ఏకంగా రూ.3 వేల వరకు పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి కార్యకర్తల ద్వారా ఓటర్లకు డబ్బు చేరవేస్తున్నారు. గురజాల, మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, చిలకలూరిపేటల్లో టీడీపీ పెద్ద మొత్తంలో ఓటర్లకు డబ్బులు పంచుతోంది. చిలకలూరిపేటలో ఓ సామాజికవర్గం ఓట్లు దాదాపు నాలుగు వేలు ఉండగా వారికి కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు పది సెంట్ల భూమిని ఇచ్చేందుకు టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అంగీకరించి వారితో గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు. అలాగే తాడికొండలో సామాజికవర్గాల వారీగా ఓటర్లను విభజించి మరీ డబ్బు పంచుతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఓటర్లకు డబ్బు పంచుతున్న టీడీపీ కార్యకర్తను స్థానికులు గుర్తించారు. పట్టుకొనేందుకు ప్రయత్నించగా గోడదూకి పారిపోబోతూ అతడు గాయాలపాలయ్యాడు.
ప్రచారం ముసుగులో నగదు చేరవేత.: ఇదిలా ఉంటే ఓటు వేసేందుకంటూ వచ్చిన ఎన్‌ఆర్‌ఐలు ఓటర్లను ప్రలోభపెట్టేందు కు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా వీరు డబ్బును వెదజల్లుతున్నారు. ముఖ్యంగా పొన్నూరు, తెనాలి, బాపట్ల, రేపల్లె, వినుకొండ నియోజకవర్గాల్లో వార్డుల వారీగా వీరు దత్తత తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా ప్రచారం ముసుగులో వీరు భారీగానే నగదు గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ఇప్పటికే తొలి విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని టీడీ పీ కార్యకర్తలు, ఎన్‌ఆర్‌ఐలు పూర్తిచేశారు. పెదకూరపాడు నియోజకవర్గం లోనూ నగదు పంపిణీ పూర్తిచేశారు. అమరావతి, బెల్లంకొండ, క్రోసూరు, పెదకూరపాడు మండలాల్లో ఓటు కు రూ.1,500 చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇలా ఓటమి భయంతో డబ్బు, మద్యం పంపిణీ చేసి ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాపట్లలో శనివారం రాత్రి ఓ వ్యక్తి టీడీపీ ఇచ్చిన నగ దు రూ 2లక్షలు తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వారు కేసులకు కూడా వెరవడంలేదని ఈ సంఘటన రుజువు చేస్తోంది.
మద్యంతో పట్టుబడిని కార్యకర్తలు.: గుంటూరు శివారు కాలనీలైన శివనాగరాజుకాలనీ, బాలాజీనగర్, శారదాకాలనీ, మంగళదాస్‌నగర్‌లో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున మద్యం నిల్వ ఉంచారు. గుంటూరు రూరల్ మండలం పరిధిలోని వెంగళాయపాలెం వద్ద టీడీపీ నాయకులు ఆటోలో తరలిస్తున్న 29 కేసుల మద్యాన్ని ఆదివారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆటోడ్రైవర్‌తో పాటు టీడీపీకి చెందిన మరో కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపల్లె, చెరుకుపల్లిలో మద్యం పంపిణీ చేస్తున్న ఇరువురిని వేరువేరుగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 405 సీసాల మద్యం స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వినుకొండ పట్టణంలో టీడీపీ నేతలు పాస్టర్ల సమావేశం నిర్వహించి గిఫ్ట్‌లు పంచుతున్నారన్న సమాచారంతో రిటర్నింగ్ అధికారి అక్కడకు వెళ్ళేసరికి పాస్టర్లతోపాటు, టీడీపీ నేతలు పలాయనం చిత్తగించారు.