వచ్చిందెంత.. పోయేదెంత
సాక్షి, ఏలూరు : సార్వత్రిక సమరం ముగిసింది. వంచనకు, విశ్వసనీయతకు మధ్యే ప్రధానంగా పోటీ జరిగింది. ఓటరు తీర్పు స్ట్రాంగ్ రూము ల్లో పదిలంగా ఉంది. అది బట్టబయలయ్యేందుకు ఇంకా వారం రోజుల గడువుంది. ఈలోగా ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులకు పడిన ఓట్లు ఎన్ని అనే దానిపై లెక్కలు వేసుకునే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఏ ప్రాంతంలో.. ఏ వర్గం ఓట్లు అనుకూలంగా వచ్చాయో, ఎవరు వ్యతిరేకంగా పనిచేశారోననే విషయాలపై అభ్యర్థులు, నాయకులు సమాచారం సేకరిస్తున్నారు. గెలుపు పవనాలు వీస్తున్నందున వైఎస్సార్ సీపీ అభ్యర్థులు తమకు ఎంత మెజారిటీ వస్తుందనే దానిపై విశ్లేషణ జరుపుతుంటే.. ఓటమి అంచున ఉన్న టీడీపీ అభ్యర్థులు తమ ఓటమికి కారణాలను వెతుక్కుంటున్నారు.
మారిన రాజకీయ ముఖచిత్రం
జిల్లాలోని 2 లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వహించిన పోలింగ్ జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. కాంగ్రెస్ పార్టీతో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నెలకొల్పిన జై సమైక్యాంధ్ర పార్టీ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయూరుు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో చిన్నాచితకా పార్టీలు కనుమరుగయ్యాయి. ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే పోటీ జరి గింది. బీజేపీ ఓ లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేయగా, టీడీపీ రెబెల్ అభ్యర్థులు మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీచేశారు.
ఓటింగ్ సరళిని చూస్తే గెలుపు ఓటములపై టీడీపీ, బీజేపీ కచ్చితమైన నిర్థారణకు రాలేకపోతున్నారుు. వైఎస్సార్ సీపీ అన్ని స్థానాల్లోనూ ప్రత్యర్థులను తలదన్నేలా ఓట్లు సంపాదించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు తమ అభ్యర్థుల గెలుపోట ములపై కాకుండా మెజారిటీ ఏమేరకు వస్తుందనే విషయంపైనే చర్చలు జరుపుతున్నాయి. భారీ మెజారీటీలతో జిల్లాలోని అన్ని స్థానాలు గెలుచుకుంటామనే గట్టి నమ్మకం వారిలో కనిపిస్తోంది.
మేకపోతు గాంభీర్యం
ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కొన్నిచోట్ల తక్కువ మెజారిటీతోనైనా తమ అభ్యర్థులు బయటపడతారనే భ్రమలు కల్పిస్తోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న టీడీపీ అభ్యర్థులు గురువారం నిద్రలేచింది మొదలు నిద్రపోయేవరకు పోలింగ్‌పై విశ్లేషణలు ప్రారంభించారు. కార్యకర్తలను ఇళ్లకు, కార్యాల యాలకు రప్పించుకుంటున్నారు. వారినుంచి సమాచారం సేకరిస్తున్నారు. మండలాల వారీగా, బూత్‌ల వారీగా తమకు పోలైన ఓట్లపై అంచనాలు వేస్తున్నారు.
అనుకూలంగా వ్యవహరించిన వర్గాలేమిటి, చివరి నిమిషంలో దెబ్బకొట్టిన వారెవరు, ఓడిపోతే ప్రజలకు, కార్యకర్తలకు చెప్పాల్సిన కారణాలేమిటి అనే అంశాలపై చర్చిస్తున్నారు. పోలింగ్‌కు ముందు ఓటర్లను ప్రలోభపెట్టే పనిని ద్వితీయ శ్రేణి నాయకులకు అప్పగించిన టీడీపీ ఆ సొమ్ముకు లెక్కలు కూడా సేకరిస్తోంది. ఎవరికి ఎంత ఇచ్చాం, ఎంత పంపిణీ చేశారు. పక్కదారి పట్టించారా అనే విషయాలపై కూపీ లాగుతున్నారు.