బాపట్ల: విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం మంగళవారం రాత్రి చోటు చేసుకున్న పావని మృత్యువాత. గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌లు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని గతంలో అనేక కథనాలు సాక్షిలో ప్రచురించినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో ఓ నిండు ప్రాణం విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యానికి బలైంది. మండలంలోని చెరువుజమ్ములపాలెం వద్ద బోయిన పావని విద్యుత్ వైర్లు తగులుకొని మృతి చెందినప్పటికి అధికారులు ఇంకా కళ్లుతెరవలేదు. భర్తీపూడి, ముత్తాయపాలెం జిల్లాపరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల మధ్యలో రోడ్డుపక్కనే ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదభరితంగా ఉంది. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహాం
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండుప్రాణం పోయిందని ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. మండలంలోని చెరువుజమ్ములపాలెంలో మంగళవారం రాత్రి మృతి చెందిన బోయిన పావని మృతదేహాన్ని బుధవారం పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు ట్రాన్స్‌ఫార్మర్ గురించి చెప్పినా ఫలితం లేదని పావని తండ్రి నాగరాజుతోపాటు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కోన రఘుపతి విద్యుత్ అధికారులను మందలించారు. నియోజకవర్గంలో ప్రమాదభరితంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించాలని సూచించారు. ఈవిషయంపై విద్యుత్ శాఖను నివేదిక కోరటంతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని చెప్పారు. నరాలశెట్టి ప్రకాశరరావు, కోకి రాఘవరెడ్డి, ఆట్ల ప్రసాద్‌రెడ్డి,రాజా ఉన్నారు.
ఎమ్మెల్సీ అన్నం పరామర్శ
విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన బోయిన పావని మృతదేహాన్ని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ పరామర్శించారు. కుటుంభ సభ్యులను ఓదార్చటంతోపాటు ప్రభుత్వ పరమైన సాయం అందేవిధంగా చూస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment