వెన్నెల్లో హాయ్‌హాయ్
- బోటులో బ్రేక్‌ఫాస్ట్, క్యాండిల్ డిన్నర్‌కు విశేష స్పందన
- ఆకర్షితులవుతున్న పర్యాటకులు
- పుష్కర యాత్ర స్పెషల్స్ హౌస్‌ఫుల్
సాక్షి, విజయవాడ : పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రవేశపెట్టిన (ఏపీటీడీసీ) కొత్త ప్యాకేజీలకు విశేష స్పందన లభిస్తోంది. క్యాండిల్ డిన్నర్, బోటులో బ్రేక్‌ఫాస్ట్‌పై పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదయం కృష్ణానదిలో బోటులో తిరుగుతూ బ్రేక్‌ఫాస్ట్, రాత్రిపూట కొవ్వొత్తుల వెలుగులో డిన్నర్ చేసే కార్యక్రమాన్ని ఏపీటీడీసీ ఇటీవలే ప్రారంభించింది. ఈనెల 5వ తేదీన తొలిసారిగా క్యాండిల్ డిన్నర్‌ను ఏర్పాటుచేయగా, 30 మంది పర్యాటకులు పాల్గొన్నారు. 12వ తేదీ ఆదివారం ఒక కంపెనీ తన సిబ్బం దికి ఆటవిడుపు కలిగించడం కోసం 50 మందితో క్యాండిల్ డిన్నర్‌కు బుకింగ్ చేసుకుంది. సాధారాణ రోజుల్లో 10-15 మంది వస్తున్నట్లు తెలిసింది.
వీనుల‘విందు’
క్యాండిల్ డిన్నర్ రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కృష్ణానదిలో బోటులో విహరిస్తూ చల్లనిగాలుల మధ్య వీనులవిందైన సంగీతం వింటూ రుచికరమైన వంటలు తినొచ్చు. మెనూలో రైస్‌తో పాటు పుల్కాలు, బిర్యానీ, పప్పు, రెండు రకాల కూరలు, స్వీట్స్, హాట్స్ ఉంటాయి. పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.200 చెల్లించాలి. ఉదయం పూట సూర్యుడి లేలేత కిరణాలు తాకుతుండగా, నదిలో తిరుగుతూ ఇడ్లీ, పూరి, దోసె, గారెలు వంటి రుచికరమైన వంటలు వేడివేడిగా ఆరగించొచ్చు. ప్రచారం అవసరం క్యాండిల్ డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రచారం కల్పిస్తే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు.
పుష్కర ప్యాకేజీలు ఫుల్
గోదావరి పుష్కరాల కోసం నగరం నుంచి రాజమండ్రికి ఏపీటీడీసీ ఏర్పాటుచేసిన రెండు ప్యాకేజీల బస్ సర్వీస్ ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు ఫుల్ అయిపోయాయి. విజయవాడ-రాజమండ్రి-అంతర్వేది- పాలకొల్లు- భీమవరం-విజయవాడ, విజయవాడ-రాజమండ్రి, భీమవరం-విజయవాడ ప్యాకేజీలను భక్తులు ఎక్కువగా బుక్ చేసుకున్నారని, ఏపీటీడీసీ విజయవాడ డివిజనల్ మేనేజర్ వీవీఎస్ గంగరాజు తెలిపారు. కాగా, గోదావరి పుష్కర స్పెషల్‌కు మంచి డిమాండ్ ఏర్పడటంతో ఏసీ బస్సు కావాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. ఈ బస్సు వస్తే ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు రోజూ నడపాలని అధికారులు భావిస్తున్నారు.