మాల్దీవుల తరహాలో రాష్ట్రంలో ‘సీ ప్లేన్’ పర్యాటకానికి ప్రణాళిక
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహణకు టెండర్లు
తొలి దశలో ఆరు ప్రాంతాల్లో సేవలకు ప్రతిపాదన
ఆకాశంలో విహరిస్తూ సహజసిద్ధ పర్యాటక అందాలు ఆస్వాదించేలా ఏర్పాట్లు
పర్యాటక స్థలాల మధ్య దూరాన్ని తగ్గించేలా సరికొత్త ప్రాజెక్టు
జలవనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ పర్యాటకం అభివృద్ధి
రోజుకు 2 ఫ్లోటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసులు ప్రవేశపెట్టే యోచన
హౌస్‌బోట్లతో సీప్లేన్ టెర్మినల్ నిర్మాణ యోచనలో ఏపీటీడీసీ
విజయవాడ కృష్ణా నదిలో ‘సీ ప్లేన్’ ఎక్కి నేరుగా కాకినాడ వద్ద దిగాలనుకుంటున్నారా.. లేదా విశాఖ రుషికొండ నుంచి బయలుదేరి నేరుగా కోనసీమ వెళదామనుకుంటున్నారా.. బహుశా మీ కల త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా, మాల్దీవుల వంటి దేశాల్లో పర్యాటకంగా ప్రసిద్ధి గాంచిన ‘సీ ప్లేన్’లు మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ దిశగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. ఇదే జరిగితే.. విజయవాడ–కాకినాడ, కాకినాడ– రుషికొండ, కోనసీమ–విశాఖపట్నం, రుషికొండ–లంబసింగికి హాయిగా సీ ప్లేన్‌లో రయ్యిన దూసుకుపోయే అవకాశం కలుగుతుంది.
తొలి దశలో ప్రతిపాదించిన 40 నిమిషాల ప్రయాణ షెడ్యూల్
విజయవాడ–కాకినాడ, కాకినాడ–రుíÙకొండ, రుషికొండ–లంబసింగి,
లంబసింగి–రుషికొండ, రుషికొండ–కోనసీమ, కోనసీమ–విశాఖపట్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక గమ్యస్థానాల మధ్య దూరాన్ని చెరిపేసేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. అపార జలవనరుల మీదుగా ఆకాశంలో విహరిస్తూ సహజసిద్ధ పర్యాటక అందాలను ఆస్వాదించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలోకి ‘సీ ప్లేన్’ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. తద్వారా పర్యాటక ప్రాంతాలను ఒకదానికొకటి అనుసంధానించనుంది.
ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘సీ ప్లేన్’ల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో టెండర్ల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి దశలో 9–10 మంది ప్రయాణ సామర్థ్యంతో ఆరు ప్రాంతాల్లో రెండు ‘ఫ్లోటింగ్ ఎయిర్ క్రాఫ్ట్’లు నడిపేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు చేసింది. ప్రయాణికుల ఆసక్తికి అనుగుణంగా 19–20 సీట్లు ఉండే సర్విసులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
అంతర్జాతీయంగా డిమాండ్..
‘సీ ప్లేన్’ సేవలపై అంతర్జాతీయంగా పర్యాటకులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. మాల్దీవుల పర్యాటకంలో ఫ్లోటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా, కెనడాలోనూ పెద్ద సంఖ్యలో సీ ప్లేన్‌లు పని చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో 48 శాతం సీ ప్లేన్ సేవలు నడుస్తున్నాయి. ఆ తర్వాత కెనడాలో 34 శాతం, ఐరోపాలో 8 శాతం, ఆ్రస్టేలియాలో 4 శాతం, ఇతర ప్రాంతాల్లో 6 శాతం సేవలు అందిస్తున్నాయి.
కాగా, పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అవసరమైనన్ని పర్యాటక ప్రాంతాలు ఏపీలో ఉన్నాయి. హోటళ్లు, పర్యాటక ప్రాంతాలకు గంట దూరంలోనే విమాన సేవలుండాలనే ప్రాథమిక అంశాలకు పెద్దపీట వేస్తున్నాం. అందుకే సీ ప్లేన్ సేవలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించాం.
ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు సమీపంలోని నీటి వ్యవస్థలను సీ ప్లేన్‌లకు ల్యాండింగ్ గ్రౌండ్‌గా ఉపయోగించవచ్చు. వీటి ద్వారా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఎన్నికల ప్రక్రియ ముగియగానే టెండర్ల ప్రక్రియను వేగవంతం చేస్తాం’ అని పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment