
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది.
సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు కస్టడీ ముగిసింది. ఐదు గంటల పాటు ఆయనను పోలీసులు విచారించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వంశీని జీజీహెచ్‌కి పోలీసులు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. విచారణలో భాగంగా వంశీని 20 ప్రశ్నలను పోలీసులు అడిగారు. తనపై ఉన్న కేసులు తప్పుడువేనని వంశీ చెప్పినట్లు సమాచారం. తనపై కేసులు అన్ని ఆరోపణలేనని.. కేసులు ఎందుకు పెడుతున్నారో అందరికీ తెలిసిందేనని చెప్పినట్లు తెలిసింది.
కాగా, వంశీ రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో వంశీకి జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. దీంతో వంశీతో పాటు మరో నలుగురిని పోలీసులు మంగళవారం వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీరికి మార్చి 11 వరకు రిమాండ్‌ను పొడిగించారు.
అనంతరం పోలీసులు వంశీతో పాటు మరో నలుగురికి వైద్యపరీక్షలు నిర్వహించి జైలుకు తరలించారు. కాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా స్థలం కబ్జా పేరుతో మంగళవారం మరో కేసును గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు.