APTDC: ఏపీ పర్యాటకం.. ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం   | APTDC Plans New Restaurants And Resorts In Tourist Spots In AP | Sakshi
Sakshi News home page

APTDC: ఏపీ పర్యాటకం.. ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం  

Published Wed, Nov 10 2021 7:59 AM | Last Updated on Wed, Nov 10 2021 2:35 PM

APTDC Plans New Restaurants And Resorts In Tourist Spots In AP - Sakshi

సాక్షి, అమరావతి : పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడంలో భాగంగా రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీటీడీసీ) పర్యాటక ఆస్తులను ఆపరేషన్, మెయింటెనెన్స్‌(వో అండ్‌ ఎం) విధానంలో అభివృద్ధి చేయనుంది. ప్రైవేట్‌ సంస్థలకు 34 చోట్ల లీజుకు ఇచ్చేందుకు ప్రదేశాలను ఖరారు చేసి టెండర్లు ఆహ్వానించింది. వివిధ జిల్లాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్‌ను ప్రైవేటు నిర్వహణకు అప్పగించడం ద్వారా పర్యాటకులకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి రావడంతో పాటు సంస్థకు ఏటా రూ.2 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. నూతన పర్యాటక విధానం–2025 పెట్టుబడిదారులకు అనేక రాయితీలిస్తుండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. 

అత్యధికంగా రెస్టారెంట్లు, రిసార్టులు..
వో అండ్‌ ఎం కింద 15, 20, 33 ఏళ్లపాటు లీజుకి ఇవ్వనున్నారు. వీటిల్లో అత్యధికంగా రెస్టారెంట్లు, రిసార్ట్స్‌ ఉన్నాయి. ఇటీవల ఏపీటీడీసీ అధికారులు వాటి కనీస ధరను నిర్ణయించి టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. 25వ తేదీ బిడ్డింగ్‌ ప్రక్రియకు తుది గడువుగా నిర్ణయించారు. పశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, చిత్తూరులో రెండేసి, గుంటూరులో మూడు, విశాఖలో ఐదు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏడు.. రెస్టారెంట్లు, రిసార్ట్స్, హోటళ్లను ప్రైవేట్‌ ద్వారా నిర్వహించనున్నారు.

మరోవైపు పర్యాటక శాఖకు చెందిన స్థలాల్లో కన్వెన్షన్‌ హాళ్లు, ఫుడ్‌ కోర్టులు, వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయనున్నారు. రాజమండ్రిలో ఇటీవల ప్రారంభించిన ఫ్లోటింగ్‌ జెట్టీ, అలిపిరిలో 103 గదులతో నిర్మాణ దశలో ఉన్న హరిత హోటల్, నెల్లూరు నగరంలోని ఎకో పార్క్, విశాఖలో యారాడ బీచ్‌ ఎమినిటీస్‌ను వో అండ్‌ ఎం ద్వారా అందుబాటులోకి తేనున్నారు. పాత టూరిజం పాలసీ ప్రకారం లీజు అద్దె అక్కడి మార్కెట్‌ విలువలో రెండు శాతంగా ఉండేది. దీనికి తోడు ఏటా 5 శాతం అద్దె పెరుగుతూ వచ్చేది. ఫలితంగా పెట్టుబడిదారులు ఆసక్తి చూపేవారు కాదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీ ప్రకారం లీజు అద్దెను ఒక శాతానికి తగ్గించడంతో పాటు.. మూడేళ్లకోసారి మాత్రమే 5 శాతం లీజు అద్దెను పెంచనున్నారు. కొత్తగా మారిటైం సమయాన్ని నెల నుంచి 4 నెలలకు పెంచారు.

పర్యాటక ఆస్తుల సద్వినియోగం..
రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ఆస్తులను వినియోగంలోకి తెస్తున్నాం. ఈ క్రమంలోనే 34 ప్రాజెక్టులను వో అండ్‌ ఎం కింద ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నాం. తద్వారా ఆయా హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు అందుబాటులోకి రావడంతో పాటు, పర్యాటక ఆదాయం కూడా పెరుగుతుంది.  
– ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, ఏపీటీడీసీ చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement