సాక్షి, అమరావతి: కరోనా కష్టాల నుంచి పర్యాటకశాఖ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పర్యాటక ప్రాంతాలకు సందర్శకులను అనుమతించడంతో రాష్ట్రంలో చాలాచోట్ల పర్యాటక ప్రాంతాల్లో సందడి మొదలైంది. పాపికొండలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పర్యాటకులను అనుమతిస్తున్నారు. పర్యాటక సందడి మొదలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చిన్నా, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల్లో ఇక ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతామనే నమ్మకం కనిపిస్తోంది. పర్యాటకుల కోసం ఏపీటీడీసీ (ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ) కొన్ని టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖపట్నం హెరిటేజ్ టూర్, విశాఖ–అరకు, విశాఖ–అరసవెల్లి, విజయవాడ–శ్రీశైలం టూర్ ప్యాకేజీలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. బస్సు ఉదయం బయలుదేరి అదేరోజు రాత్రికి తిరిగి వచ్చేలా, టిఫిన్, భోజనాలకు కూడా కలిపి తక్కువ ధరకే ఏర్పాటు చేస్తుండటంతో ఈ ప్యాకేజీలను పర్యాటకులు బాగా వినియోగించుకుంటున్నారు.
విజయవాడలో సీ ప్లేన్ సేవలకు అవకాశం...
విజయవాడ ప్రకాశం బ్యారేజీలో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసింది. గుజరాత్‌లో ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన సీ ప్లేన్ సర్వీసు విజయవంతం కావడంతో పలు రాష్ట్రాల్లో ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీన్లో భాగంగా ప్రకాశం బ్యారేజీని ఎంపిక చేశారు. సీ ప్లేన్ కోసం నదిలో వాటర్ ఏరోడ్రోమ్ (కాంక్రీట్ కట్టడాన్ని) నిర్మిస్తారు.
విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా 12 చోట్ల స్టార్ హోటళ్లు
విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో 7 స్టార్, 5 స్టార్ హోటళ్లు నిర్మించనున్నారు. గండికోట (వైఎస్సార్ కడప), కాకినాడ, పిచుకల్లంక (తూర్పు గోదావరి), హార్సలీ హిల్స్ (చిత్తూరు), నాగార్జునసాగర్, సూర్యలంక బీచ్ (గుంటూరు), ఓర్వకల్లు (కర్నూలు), కళింగపట్నం (శ్రీకాకుళం), రుషికొండ (విశాఖపట్నం), భవానీఐల్యాండ్ (కృష్ణా), తిరుపతి–పెరూర్ (చిత్తూరు), పోలవరం (పశ్చిమగోదావరి)లలో ఈ హోటళ్లు నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి జాతీయస్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి
టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. టెంపుల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద శ్రీశైలంలో రూ.47.45 కోట్లు, సింహాచలం ఆలయంలో రూ.53.69 కోట్లలో పనులు చేపట్టనున్నారు. ద్వారకా తిరుమల ఆలయానికి రూ.76 కోట్లు, శ్రీముఖలింగేశ్వర ఆలయానికి రూ.55 కోట్లు, అన్నవరం ఆలయానికి రూ.48.58 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
భద్రత కోసం కంట్రోల్ రూమ్‌లు
పర్యాటకుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునికమైన కంట్రోల్ రూమ్‌లలో శిక్షణ పొందిన సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. రక్షణ, భద్రతా ప్రమాణాలను పాటించేలా నిర్దేశిత ప్రొటోకాల్ ఉంటుంది. అనుకోని ఘటన జరిగితే ఏం చేయాలన్న దానిపై విపత్తు నిర్వహణ ప్రొటోకాల్ ఉంటుంది. బోటు కదలాలంటే డిపార్చర్ క్లియరెన్స్ తప్పనిసరి. ప్రయాణికులు, పర్యాటకుల వివరాలు సమగ్రంగా నమోదు చేస్తారు.
రుషికొండ బీచ్‌కు అంతర్జాతీయస్థాయి గుర్తింపు
విశాఖలోని రుషికొండ బీచ్‌కి ఇటీవల అంతర్జాతీయస్థాయి గుర్తింపు లభించింది. పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్‌లకు ఇచ్చే బ్లూఫాగ్ సర్టిఫికెట్ ఈ బీచ్‌కి దక్కింది. దేశంలో 13 బీచ్‌ల నుంచి ఎనిమిది బీచ్‌లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌కు ఎంపికకాగా వాటిలో రుషికొండ ఒకటి. బ్లూఫ్లాగ్ బీచ్‌లనే విదేశీ పర్యాటకులు ఎంపిక చేసుకుంటారు.
టూర్ ప్యాకేజీలు
ఏపీటీడీసీ పర్యాటకుల కోసం బ్రేక్‌పాస్ట్, లంచ్‌తో పాటు సాయంత్రం టీ, స్నాక్స్, మినరల్ వాటర్‌తో కూడిన ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. బస్సు ఉదయం బయలుదేరి రాత్రికి తిరిగి వస్తుంది.
విశాఖపట్నం–అరకు: పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీతోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహలు చూపిస్తారు. ఆఖరులో ట్రైబల్ ధిమ్సా డ్యాన్స్‌ను తిలకించవచ్చు. టికెట్ ధర పెద్దలకు రూ.1,450, పిల్లలకు రూ.1,160.
విశాఖపట్నం హెరిటేజ్ టూర్: కైలాసగిరి, సింహాచలం, తొట్లకొండ, ఫిషింగ్ హార్బర్ బోటింగ్, రుషికొండ బీచ్, విశాఖ సబ్‌మెరిన్ మ్యూజియం, జాతర శిల్పారామం చూడవచ్చు. టికెట్ ధర పెద్దలకు రూ.675, పిల్లలకు రూ.563.
విశాఖపట్నం–అరసవల్లి: టికెట్ ధర పెద్దలకు రూ.931, పిల్లలకు రూ.742.
Comments
Please login to add a commentAdd a comment