![Growing caravan tourism culture in India - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/31/CARAVAN.jpg.webp?itok=yxfYHkfx)
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా క్యారవాన్ పర్యాటకం పరుగెడుతోంది. వినోద, విహార యాత్రలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కుటుంబం, స్నేహితులతో కలిసి బడ్జెట్‌లో విలాస టూర్లు చేయిస్తోంది. నచ్చిన చోటుకు.. కావాల్సిన సమయంలో తీసుకెళ్తూ.. బస గురించి బెంగ లేకుండా.. సకల వసతులతో హోం స్టే అనుభూతులన్నీ అందిస్తోంది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.
విస్తరిస్తున్న క్యారవాన్ సంస్కృతి..
విదేశాల్లో ఉండే ఓవర్ ల్యాండర్ (క్యారవాన్) సంస్కృతి భారత్‌లోనూ క్రమంగా విస్తరిస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, ఈశాన్య భారతం, హిమాచల్ ప్రదేశ్, నాగ్‌పూర్, మహారాష్ట్ర, గోవాలో ప్రత్యేక ప్యాకేజీల్లో మొబైల్ హౌస్ పర్యాటకం లభిస్తోంది. ఇటీవల కేరళలో ఈ తరహా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా క్యారవాన్ టూరిజం పాలసీని సైతం తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే టూరిజం శాఖ క్యారవాన్ పర్యాటకాన్ని ప్రవేశపెట్టగా.. రాష్ట్ర విభజన అనంతరం టీఎస్‌టీడీసీ దానిని నిర్వహిస్తోంది. తాజాగా ఏపీటీడీసీ తీర్థయాత్రల ప్యాకేజీలు అందిస్తున్న విధానంలోనే క్యారవాన్ టూరిజాన్ని కూడా తీసుకురావాలని కసరత్తు చేస్తోంది.
చక్రాలపై పర్యాటకం!
సినిమా స్టార్స్ షూటింగ్ సమయాల్లో, రాజకీయ నాయకులు తమ పర్యటనల్లో సకల సౌకర్యాలు ఉండే క్యారవాన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో విశ్రాంతి తీసుకోవడానికి విలాసవంతమైన ఏర్పాట్లు ఉంటాయి. ఏసీ, ఆధునిక టాయిలెట్లు, షవర్ (వేడి, చల్ల నీళ్లతో), ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఉండడమే కాకుండా ఒక రిఫ్రిజిరేటర్‌తో కూడిన కిచెన్, బార్బిక్యూ సౌకర్యం కూడా ఉంటుంది. ఇక్కడ నచ్చిన ఆహారాన్ని వండుకుని తినేందుకు పాత్రలుంటాయి. ఇందులో ఉండే సోఫాలను బెడ్‌లుగా కూడా మార్చుకోవచ్చు. గుడారాలు వేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. అయితే ఇలాంటి వాహనాలను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడదు. అయితే అద్దెకు తీసుకొని కోరిన చోటుకి విహార యాత్రకు వెళ్లడానికి వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖలు, టూర్ ఆపరేటర్ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. వినోదానికి బోర్డ్ గేమ్‌లు, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది.
వాహనం సైజును బట్టి..
ఒక్కో వాహనం సైజును బట్టి నలుగురు నుంచి 9 మంది వరకు ప్రయాణించవచ్చు. డ్రైవర్‌తో పాటు లేకుంటే సెల్ఫ్ డ్రైవింగ్‌లో కూడా క్యారవాన్ టూర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణ దూరం, సమయాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment