Andhra Pradesh Tourism
-
పర్యాటక ద్వీపం.. హోప్ఐలాండ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మనకు అండమాన్ నికోబార్, లక్షదీవుల గురించి తెలుసు. అక్కడ విహరించాలనుకునేవారూ ఎక్కువే. అయితే దూరాభారం, అధిక వ్యయం వల్ల వెనుకడుగు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో మనకు సమీపంలోనే బంగాళాఖాతంలోనే ఉన్న హోప్ ఐలాండ్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కాకినాడ సముద్ర తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం దాదాపు 150 ఏళ్ల క్రితం సహజసిద్ధంగా ఏర్పడింది. ఈ కాలంలో వచ్చిన ఎన్నో తుపాన్ల నుంచి పెట్టని కోటగా నిలిచి కాకినాడ నగరాన్ని, నౌకాశ్రయాన్ని హోప్ ఐలాండ్ రక్షించింది. 1996లో నవంబర్ 6న తుపాను విజృంభణతో తీరమంతా చిగురుటాకులా వణికిపోయి వందలాది మంది మత్స్యకారులు మృత్యువాతపడ్డారు. అంతటి విలయంలో సైతం హోప్ ఐలాండ్‌ను విడిచి ఒక్క కుటుంబం కూడా బయటకు రాకపోవడం విశేషం. వృద్ధ గౌతమి, తుల్యభాగ నదీ పాయలతో.. మన రాష్ట్రంలోని సముద్ర జలాల్లో ఉన్న ఏకైక ద్వీపం.. హోప్ ఐలాండ్. ధవళేశ్వరం ఆనకట్ట దిగువన వృద్ధ గౌతమి నదీ పాయ యానాం సమీపంలో సముద్రంలో కలుస్తోంది. అలాగే కోరింగ మడ అడవుల సమీపంలో తుల్యభాగ పాయ సముద్రంలో అంతర్భాగమవుతోంది. ఈ రెండు పాయల నుంచి వచ్చిన ఇసుక కారణంగానే హోప్ ఐలాండ్ ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గోదావరి బంగాళాఖాతంలో కలిసే ప్రాంతానికి 50 కిలోమీటర్ల ఎగువన 1850లో కాటన్ ఆనకట్ట నిర్మాణం జరిగింది. ఈ బ్యారేజ్ నిర్మాణం తర్వాత ఈ హోప్ ఐలాండ్ వేగంగా విస్తరించిందని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. బ్యారేజ్‌తో గోదావరి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట పడ్డాక నదీ ప్రవాహంలో వచ్చిన మార్పులతో ఇసుకమేటలు పేరుకుపోయాయి. ఈ మేటలతోనే ద్వీపం ఏర్పడిందని చెబుతున్నారు. 18 కిలోమీటర్లు పొడవు, 1.8 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ద్వీపం కాకినాడ నగరానికి, పోర్టుకు ఆయువుపట్టుగా నిలుస్తోంది. వందేళ్ల క్రితమే జనసంచారం.. ఈ ద్వీపంలో జనసంచారం వందేళ్ల క్రితమే మొదలైంది. ఇప్పుడు అక్కడున్నది రెండో తరం. హోప్ ఐలాండ్‌లో నివసిస్తున్న వారి పూర్వీకులంతా సముద్రతీరంలోని వివిధ గ్రామాల నుంచి వలస వచ్చి స్థిరపడ్డవారే. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో ఈ ద్వీపాన్ని గుర్తించి వేటకు అనుకూలమని అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఐలాండ్‌లో తొలి నివాసం ఏర్పాటు చేసుకున్న పుత్రయ్య పేరుతో దాన్ని పుత్రయ్యపాకలుగా పిలుస్తున్నారు. మొదట్లో సీజన్ సమయంలో ఈ ఐలాండ్‌కి వచ్చి, చేపల వేట పూర్తి అయ్యాక తిరిగి స్వగ్రామాలకు వెళ్లిపోయే వారు. కాలక్రమంలో అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ సోలార్ విద్యుత్ సదుపాయం ఉంది. చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ ఎక్కడ బోరు వేసినా మంచినీరే లభిస్తుండటం విశేషం. సముద్రం నడిబొడ్డున ఉన్న ఆ పల్లెలో 118 కుటుంబాలు నివసిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మక్కువతో అక్కడే నివాసం.. హోప్ ఐలాండ్‌లో నివసించేవారు ఏ చిన్న సరకులు కావాల్సినా పడవపైన సముద్రం దాటి కాకినాడ రావాల్సిందే. ఐలాండ్‌లో ఉంటున్న పలువురికి కాకినాడ రూరల్ మండలం తూరంగి పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయినా వారంతా అక్కడి వాతావరణంపై మక్కువతో తిరిగి ద్వీపానికి వెళ్లిపోయారు. వీరి ఓట్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగిలో ఉన్నాయి. హోప్ ఐలాండ్‌కు ఇలా చేరుకోవాలి.. హోప్ ఐలాండ్ పర్యాటకులు ఆస్వాదించేందుకు ఎంతో అనువైన ప్రాంతం. ఇక్కడకు వెళ్లడానికి కాకినాడ నుంచి సూర్యోదయానికి ముందు బయలుదేరితే సముద్ర అలల ఉధృతి తక్కువగా ఉండి ప్రయాణం సాఫీగా సాగుతుంది. కాకినాడ నుంచి హోప్ ఐలాండ్ చేరుకోవాలంటే సాధారణ ఇంజిన్ బోటులో గంట ప్రయాణం. కాకినాడ హార్బర్ నుంచి లేదా నగరంలోని జగన్నాథపురం నుంచి బోటులో హోప్ ఐలాండ్‌కు చేరుకోవచ్చు. అయితే పర్యాటకులు ముందుగా హార్బర్లో అటవీ అధికారుల అనుమతులు తీసుకోవాలి. గతంలో ఏపీ టూరిజం అధికారులు ద్వీపానికి వెళ్లే పర్యాటకుల కోసం కాకినాడ జగన్నాథపురం బకింగ్‌హామ్ కెనాల్ నుంచి బోట్లు కూడా నడిపారు. ఇరుగు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సముద్ర ప్రయాణం, హోప్ఐలాండ్ తీరం ఆస్వాదించేందుకు పర్యాటకులు వచ్చేవారు. ఈ నేపథ్యంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు జరిగాయి. పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు హోప్ ఐలాండ్‌కు పర్యాటకులు రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారుచేస్తాం. అక్కడున్న కుటుంబాలకు సదుపాయాలు మెరుగుపరుస్తాం. –కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్, కాకినాడ ఇక్కడే పుట్టాం.. ఇక్కడే ఉంటాం ఇక్కడే పుట్టాం.. ఇక్కడే ఉంటాం. మా పూర్వీకులు కూడా ఇక్కడే గంగమ్మతల్లి ఒడిలో జీవించారు. మాకు సముద్రమంటే భయం లేదు. తుపానులతో కూడా మాకేమీ కాదు. హోప్ ఐలాండ్‌లో పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఉన్నాయి. ఇంకా సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుతున్నాం. ఇలా చేస్తే పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుంది.– మచ్చా బాగయ్య, స్థానికుడు, హోప్ ఐలాండ్ -
పర్యాటకులను ఆకర్షిస్తున్న లంబసింగి రిసార్ట్స్
-
ఆంధ్రప్రదేశ్ టూరిజం దేశంలోనే మూడో స్థానంలో ఉంది: మంత్రి రోజా
-
జాతీయ స్థాయిలో సత్తాచాటిన ఏపీ.. టూరిజం అభివృద్ధిలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ టూరిజం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. రాష్ట్రాలకు అవార్డులను ప్రదానం చేశారు. కాగా, వీటిలో ఏపీకి పలు అవార్డులు వచ్చాయి. అవార్డుల లిస్ట్ ఇదే.. - సమగ్ర టూరిజం అభివృద్ధిలో ఏపీకి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు. - బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్. - విదేశీ భాషలో ఏపీ కాఫీ టేబుల్ బుక్కు అవార్డ్. - విజయవాడ ది గేట్ వే హోటల్‌కు బెస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ అవార్డు . - బెస్ట్ టూరిజం గోల్ఫ్ కోర్సుగా హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌కు అవార్డు. - అపోలో హెల్త్ సిటీకి బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ అవార్డు - సమగ్ర టూరిజం అభివృద్ధిలో తెలంగాణకు మూడో బహుమతి లభించింది. -
క్రేజీ.. క్యారవాన్ టూర్!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా క్యారవాన్ పర్యాటకం పరుగెడుతోంది. వినోద, విహార యాత్రలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కుటుంబం, స్నేహితులతో కలిసి బడ్జెట్లో విలాస టూర్లు చేయిస్తోంది. నచ్చిన చోటుకు.. కావాల్సిన సమయంలో తీసుకెళ్తూ.. బస గురించి బెంగ లేకుండా.. సకల వసతులతో హోం స్టే అనుభూతులన్నీ అందిస్తోంది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. విస్తరిస్తున్న క్యారవాన్ సంస్కృతి.. విదేశాల్లో ఉండే ఓవర్ ల్యాండర్ (క్యారవాన్) సంస్కృతి భారత్‌లోనూ క్రమంగా విస్తరిస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, ఈశాన్య భారతం, హిమాచల్ ప్రదేశ్, నాగ్‌పూర్, మహారాష్ట్ర, గోవాలో ప్రత్యేక ప్యాకేజీల్లో మొబైల్ హౌస్ పర్యాటకం లభిస్తోంది. ఇటీవల కేరళలో ఈ తరహా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా క్యారవాన్ టూరిజం పాలసీని సైతం తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే టూరిజం శాఖ క్యారవాన్ పర్యాటకాన్ని ప్రవేశపెట్టగా.. రాష్ట్ర విభజన అనంతరం టీఎస్‌టీడీసీ దానిని నిర్వహిస్తోంది. తాజాగా ఏపీటీడీసీ తీర్థయాత్రల ప్యాకేజీలు అందిస్తున్న విధానంలోనే క్యారవాన్ టూరిజాన్ని కూడా తీసుకురావాలని కసరత్తు చేస్తోంది. చక్రాలపై పర్యాటకం! సినిమా స్టార్స్ షూటింగ్ సమయాల్లో, రాజకీయ నాయకులు తమ పర్యటనల్లో సకల సౌకర్యాలు ఉండే క్యారవాన్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో విశ్రాంతి తీసుకోవడానికి విలాసవంతమైన ఏర్పాట్లు ఉంటాయి. ఏసీ, ఆధునిక టాయిలెట్లు, షవర్ (వేడి, చల్ల నీళ్లతో), ఎల్ఈడీ స్క్రీన్లు ఉండడమే కాకుండా ఒక రిఫ్రిజిరేటర్‌తో కూడిన కిచెన్, బార్బిక్యూ సౌకర్యం కూడా ఉంటుంది. ఇక్కడ నచ్చిన ఆహారాన్ని వండుకుని తినేందుకు పాత్రలుంటాయి. ఇందులో ఉండే సోఫాలను బెడ్లుగా కూడా మార్చుకోవచ్చు. గుడారాలు వేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. అయితే ఇలాంటి వాహనాలను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడదు. అయితే అద్దెకు తీసుకొని కోరిన చోటుకి విహార యాత్రకు వెళ్లడానికి వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖలు, టూర్ ఆపరేటర్ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. వినోదానికి బోర్డ్ గేమ్‌లు, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. వాహనం సైజును బట్టి.. ఒక్కో వాహనం సైజును బట్టి నలుగురు నుంచి 9 మంది వరకు ప్రయాణించవచ్చు. డ్రైవర్‌తో పాటు లేకుంటే సెల్ఫ్ డ్రైవింగ్‌లో కూడా క్యారవాన్ టూర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణ దూరం, సమయాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తారు. -
టూరిజం డెస్టినీ.. పీఎన్ఎస్ ఘాజీ
విశాఖ మహా నగరాన్ని ఎన్నిసార్లు సందర్శించినా.. టూరిస్టులు మరోసారి వచ్చేందుకు మొగ్గు చూపుతుంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త పర్యాటక ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా విభిన్న టూరిస్ట్ స్పాట్లు కనువిందు చేస్తున్నాయి. సువిశాల సాగరతీరం.. సబ్‌మెరైన్ మ్యూజియం, ఎదురుగా టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం.. కొత్తగా సిద్ధమవుతున్న సీ హారియర్.. ఇలా ఎన్నో విశిష్టతలతో అలరారుతోంది. ఇప్పుడు కాస్త శ్రమిస్తే అదే జాబితాలో మరో బెస్ట్ స్పాట్ సిద్ధంగా ఉంది. 1971 ఇండో పాక్ యుద్ధ సమయంలో తూర్పు నావికాదళ ప్రధాన స్థావరమైన విశాఖను దెబ్బతీసేందుకు ప్రయత్నించి జలసమాధి అయిన పాకిస్తాన్ సబ్‌మెరైన్ పీఎన్ఎస్ ఘాజీ.. భిన్నమైన అంతర్జాతీయ టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. –సాక్షి, విశాఖపట్నం అసలేం జరిగిందంటే.. 1971 డిసెంబర్ 3 సాయంత్రం మొదలైన ఈ యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసి.. భారత్ పాకిస్తాన్ మధ్య తక్కువ రోజుల్లో జరిగిన అతిపెద్ద యుద్ధమిది. బంగ్లాదేశ్ విమోచన అంశం ఈ యుద్ధకాండకు ప్రధాన కారణం. పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుతం పాకిస్తాన్) నుంచి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) విడిపోయి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. తూర్పు పాక్‌కు భారత్ మద్దతు ప్రకటించడంతో పాకిస్తాన్.. మన దేశంపై దాడులకు పాల్పడింది. భారత్, పాక్ బలగాలు తూర్పు, పశ్చిమ దిక్కుల్లో తలపడ్డాయి. పశ్చిమ ప్రాంతం వైపు డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆపరేషన్ ట్రై డెంట్ పేరుతో భారత నావికా దళం కరాచీ ఓడరేవుపై చేసిన దాడిలో డిస్ట్రాయర్ పీఎన్ఎస్ ఖైబర్, పీఎన్ఎస్ మహాఫిజ్ మునిగిపోగా, పీఎన్ఎస్ షాజహాన్ పాక్షికంగా దెబ్బతింది. మరోవైపు.. భారత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను విశాఖలో రంగంలోకి దించారు. పాకిస్తాన్ అత్యంత శక్తిమంతమైన జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీని పంపింది. విషయం తెలుసుకున్న భారత్ నావల్ కమాండ్.. ఐఎన్ఎస్ రాజ్‌పుత్ జలాంతర్గామిని రంగంలోకి దించింది. రాజ్‌పుత్ రాకను పసిగట్టిన ఘాజీ కుయుక్తులతో రాజ్‌పుత్‌ను మట్టికరిపించేందుకు దాడికి పాల్పడ్డారు. అయితే, దాడిలో పాక్షికంగా దెబ్బతిన్న రాజ్‌పుత్‌లోని నావికాదళం ఘాజీపై సర్వశక్తులూ ఒడ్డి ఘాజీని విశాఖ తీరంలోని సాగరగర్భంలో కుప్పకూల్చారు. బంగాళాఖాతంలోని జలప్రాంతాలన్నీ ఇండియన్ నేవీ ఆధీనంలోకి తెచ్చుకుంది. డిసెంబర్ 16న పాకిస్తాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగుబాటు జరిగిన యుద్ధమిదే. ఘాజీని సందర్శించేందుకు ఇలా తీసుకెళ్తారు.. సాగర గర్భంలోనే ఘాజీ.. విశాఖ తీరంలో ఐఎన్ఎస్ రాజ్‌పుత్ ధాటికి సైనికులతో సహా పీఎన్ఎస్ ఘాజీ జలసమాధి అయ్యింది. ఆ సమయంలో ఘాజీ నుంచి లభ్యమైన కొన్ని శకలాల్ని మాత్రమే విజయానికి గుర్తుగా తూర్పు నావికాదళం తీసుకొచ్చి భద్రపరచుకుంది. తర్వాత ఘాజీని అలాగే సాగర గర్భంలోనే విడిచిపెట్టేశారు. అనంతరం దాని గురించి పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత ఘాజీని పర్యాటక ప్రాంతంగా వినియోగించుకునేందుకు నేవీ, టూరిజం శాఖ సమాలోచనలు చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం టీయూ–142 యుద్ధ విమానాన్ని నేవీ అధికారులు ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో మరికొన్ని ప్రాజెక్టుల గురించి చర్చించినప్పుడు ఘాజీ ప్రతిపాదన వచ్చింది. తర్వాత దీనిపై కదలిక లేదు. ఇటీవల మరోసారి ఘాజీ అంశం తెరపైకి వచ్చింది. పర్యాటకానికి కొత్త చిరునామా ఆర్కే బీచ్ నుంచి డాల్ఫిన్ నోస్ మధ్య ప్రాంతంలో 1.8 నాటికల్ మైళ్ల దూరంలో సముద్ర తీరంలో ఘాజీ జల సమాధి అయ్యింది. దాదాపు 30 మీటర్ల లోతులో ఘాజీ ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. దీని వద్దకు వెళ్లి ఘాజీని నేరుగా చూసే అవకాశం పర్యాటకులకు కల్పించనున్నారు. ఘాజీ ఎక్కడ ఉందో అన్వేషించేందుకు గతంలో టూరిజం శాఖ నేవీని సంప్రదించింది. దీనిపై స్పందించిన నావికా దళం ఇందుకోసం ఓ కెప్టెన్ సహా ఇద్దరు నేవీ అధికారులు, మరో ఇద్దరు టూరిజం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే విశాఖలో పలు అడ్వెంచర్, బీచ్ టూరిజానికి సంబంధించిన ప్రాజెక్టులను టేకప్ చేసిన నగరానికి చెందిన ఓ సంస్థను ఈ కన్సల్టెన్సీ కోసం పర్యాటక శాఖని సంప్రదించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడనుందని టూరిజం వర్గాల సమాచారం. స్పెషల్ సర్టిఫికెట్ ఉండేలా.. పీఎన్ఎస్ ఘాజీని ఓపెన్ టూరిస్ట్ స్పాట్‌గా చేయబోతున్న తరుణంలో దీన్ని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. అయితే, తీరం నుంచి కొంత దూరం వెళ్లాక అక్కడి నుంచి 30 మీటర్ల లోతుకి వెళ్లాలంటే సాహసంతో పాటు ధైర్యం ఉండాలి. ముందుగా దీన్ని చూసేందుకు సర్టిఫైడ్ సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ (పాడీ) సంస్థ అం దించే అడ్వాన్స్డ్ ఓపెన్ ఆర్డర్ డైవర్ సర్టిఫి కెట్ పొందే వారికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వా లని భావిస్తున్నారు. ప్రస్తుతం పర్యాటక శాఖ కు ఈ అంశంపై మరోసారి లేఖ రాసినట్లు కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళ్తే.. విశాఖ పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుంది. -
ఆ రోజున రోజాకు అభినందన సభ.. ఎందుకంటే ?
చెన్నై సినిమా : ప్రముఖ నటి రోజా సెల్వమణి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక యువజనశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, తమిళ నిర్మాతల సంఘం, దర్శకుల సంఘం, సంగీత కళాకారుల సంఘాలు మే 7న చెన్నైలో ఆమెను ఘనంగా సత్కరించనున్నాయి. ఈ అభినందన సభకు ప్రముఖ దర్శకుడు భారతీరాజా నేతృత్వ వహించనున్నారు. దీనికి సంబంధించి బుధవారం (ఏప్రిల్ 27) సాయంత్రం స్థానిక అన్నాశాలైలోని ఫిలింఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. దక్షిణ భారత సినీ పరిశ్రమకు చెందిన దర్శకుడు భారతీరాజా, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి పూర్వ అధ్యక్షుడు సి. కల్యాణ్, ప్రస్తుత అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్, దర్శకుడు ఆర్వీ ఉదయ్ కుమార్, పెప్సీ అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి, సంగీత దర్శకుడు దీన తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ రోజా విజయం వెనుక ఆమె భర్త దర్శకుడు ఆర్.కె సెల్వమణి సహకారం ఎంతో ఉందన్నారు. కాగా రోజాను సత్కరించాలని నిర్ణయించిన దక్షిణ భారత సినీ పరిశ్రమకు ఈ సందర్భంగా సెల్వమణి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఆచార్యను వెంటాడుతున్న రాజమౌళి సెంటిమెంట్! ఈ సంవత్సరం సీక్వెల్స్‌తో తగ్గేదే లే.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
త్వరలో టూరిజం యాప్
విశాఖ తూర్పు/భవానీపురం (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల వివరాలతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజం యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. జాతీయ పర్యాటక దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలను మంగళవారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ అనుమతితో విశాఖ నుంచి రాయలసీమ వరకు టూరిజం సర్క్యూట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అందమైన ప్రాంతాలు పురాతన, చారిత్రాత్మక ప్రాంతాలతోపాటు ఆలయాలు, సాహస క్రీడల పర్యాటకానికి అపార అవకాశాలున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రాముఖ్యత వచ్చేలా విశాఖ నుంచి గోదావరి, కృష్ణలంక, గండికోట మొదలైన ప్రాంతాలను సర్క్యూట్‌గా తీర్చిదిద్దితే పర్యాటకం గణనీయంగా అభివృద్ది చెందుతుందన్నారు. కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వరప్రసాదరెడ్డి, కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి భారతదేశ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కృషి చేస్తోందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏఎల్ మల్రెడ్డి చెప్పారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లో మంగళవారం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాగా, యోగా నిపుణుడు కేవీఎస్‌కే మూర్తి 12 నిమిషాల్లో 12 సూర్య నమస్కారాలను 108 సార్లు ప్రదర్శించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు దక్కించుకున్నారు. అవార్డును ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జివీఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ వరప్రసాద్ ప్రదానం చేశారు. -
పాపికొండల సోయగాలు.. నదీ విహారం
సాక్షి, అమరావతి: గోదావరిలో పాపికొండల సోయగాలు.. గోదావరి ఇసుక తిన్నెల్లో వెన్నెల రాత్రులు.. పోచవరం నుంచి భద్రాచలానికి హాయిహాయిగా ప్రయాణం.. కృష్ణా నదిలో భవానీ ద్వీపంలో ఆట పాటలు.. నాగార్జున సాగర్‌లో చల్ల గాలుల మధ్య విహారం.. ఇలా ఎన్నో ప్రకృతి అందాల మధ్య ప్రపంచాన్ని మరిచి ప్రయాణం చేస్తారా.. అందుకు మీరు సిద్ధమేనా అంటోంది రాష్ట్ర పర్యాటక శాఖ. రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆధునిక బోట్లను అందుబాటులోకి తెస్తోంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటుండంతో డిమాండ్‌కు అనుగుణంగా ఆధునిక బోట్ల సంఖ్యను పెంచుతోంది. నిలిచిపోయిన బోట్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతోంది. ప్రస్తుతం పాపికొండలకు వారాంతంలో 45 మంది ప్రయాణికుల సామర్థ్యంతో పర్యాటక శాఖ బోటు నడుపుతుండగా 95 మంది సామర్థ్యంతో మరో హరిత బోటును అందుబాటులోకి తేనుంది. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటును తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సాగర్–శ్రీశైలం ప్రయాణానికి సంతశ్రీ బోటును రూ.35 లక్షలతో మరమ్మతులు చేపట్టి సంక్రాంతి నాటికి తీసుకురానుంది. చాలా కాలం తర్వాత విజయవాడలోని భవానీ ద్వీపంలో బోధిశ్రీ బోటు సేవలకు సిద్ధమైంది. రాబడి పెంచుకునేందుకు యత్నాలు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పాపికొండలకు నిత్యం రెండు బోట్లు (ప్రైవేటు) తిరుగుతున్నాయి. వారాంతాల్లో పర్యాటక శాఖ బోట్లతో కలిపి ఐదు సేవలందిస్తున్నాయి. సగటున రోజుకు 300 మంది ప్రయాణిస్తున్నారు. భవానీ ద్వీపంలో బోటింగ్ ద్వారా రోజుకు సగటున రూ.40 వేలు, వారాంతాల్లో రూ.2.50 లక్షల ఆదాయం వస్తుండటం విశేషం. ఇక్కడ వారాంతంలో సుమారు 1,500 మంది బోట్లలో ప్రయాణిస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా 12 ప్రదేశాల్లో పర్యాటక శాఖకు చెందిన 48 బోట్లు, వందకు పైగా ప్రైవేటు బోట్లు సేవలందిస్తున్నాయి. గతంలో కేవలం బోటింగ్ ద్వారా రూ.7 కోట్లకు పైగా ఆదాయం రాగా ప్రస్తుతం అది రూ.కోటికి పడిపోయింది. డిసెంబర్ నుంచి మార్చి వరకు సమయం ఉండటంతో రాబడి పెంచుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాపికొండల నైట్ ప్యాకేజీలు ఇలా.. పర్యాటక శాఖ పాపికొండలకు రెండు రోజుల (నైట్) ప్యాకేజీలను అందిస్తోంది. గండిపోచమ్మ – పేరంటాళ్లపల్లి ప్రయాణానికి చార్జి సాధారణ రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) పెద్దలకు రూ.3,200, పిల్లలకు 2,300, వారాంతాల్లో (శుక్రవారం నుంచి ఆదివారం) పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,500గా నిర్ణయించారు. రాజమండ్రి–గండిపోచమ్మ– పేరంటాళ్లపల్లి ప్యాకేజీలో సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.4,000, పిల్లలకు రూ.3,000, వారాంతాల్లో పెద్దలకు రూ.4,300, పిల్లలకు రూ.3,300 టికెట్ ధర ఖరారు చేశారు. ఇందులో రాజమండ్రి నుంచి పర్యాటక శాఖ బస్సులో ప్రయాణికులను బోటింగ్ పాయింట్‌కు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రయాణం మొదలై మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు ముగుస్తుంది. పేరంటాళ్లపల్లి నుంచి తిరుగు ప్రయాణంలో కొల్లూరు, కొరుటూరులోని గిరిజన సంప్రదాయ తరహా బ్యాంబూ హట్స్‌లో (వెదురుతో చేసిన గుడిసెలు) రాత్రి బసను ఏర్పాటు చేస్తారు. సందర్శకులకు ఆటవిడుపుగా వాలీబాల్, కబడ్డీ, ట్రెక్కింగ్, జంగిల్ వాక్ సౌకర్యాలను మెరుగుపరిచారు. బోట్ల సంఖ్యను పెంచుతున్నాం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక కారణాలతో బోట్లు చాలా కాలంపాటు నిలిచిపోయాయి. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో వాటిని వాడుకలోకి తెచ్చేందుకు మరమ్మతులు చేయిస్తున్నాం. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటు తిప్పేందుకు ఆలోచిస్తున్నాం. పోలవరానికి ప్రత్యేక నైట్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీ టూరిజం కార్పొరేషన్ రాబడి పెంపుపై దృష్టి రాష్ట్రంలో జల పర్యాటకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పర్యాటకుల డిమాండ్‌కు అనుగుణంగా బోట్ల సంఖ్యను పెంచి రాబడి పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బోట్లకు మరమ్మతులు చేపడుతున్నాం. త్వరలోనే పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకుని వాటిని నీటిలోకి ప్రవేశపెడతాం. – ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీ టూరిజం కార్పొరేషన్ -
ఒక్క రోజులో పంచారామాల సందర్శనం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): పరమ శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) విజయవాడ నుంచి ఒక్క రోజు ఆధ్యాత్మిక యాత్ర (వన్ డే టూర్)ను ఏర్పాటు చేసింది. టెంపుల్ టూరిజం కింద ఏర్పాటు చేసిన ఈ ఒక్క రోజు యాత్రలో శైవ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని ఆలయాలను సందర్శించే అవకాశాన్ని ఏపీటీడీసీ కల్పిస్తోంది. కార్తీక సోమవారంతోపాటు ముఖ్యమైన రోజుల్లో తెల్లవారుజామున 3.30 గంటలకు పంచారామాల యాత్ర ప్రారంభమవుతుంది. విజయవాడ బందరు రోడ్‌లోని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా) నుంచి బస్సు (నాన్ ఏసీ) బయలుదేరుతుందని ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒక్క రోజు పంచారామాల యాత్రకుగాను పెద్దలకు రూ.1,305, పిల్లలకు రూ.1,015 చార్జిగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరిన్ని వివరాలకు యాత్రికులు 9848007025, 8499054422 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఈ టూర్‌కు ఆన్లైన్లో https://tourism.ap.gov.in/home వెబ్సైట్ ద్వారా బుకింగ్ సదుపాయంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ 180042545454 కూడా ఉందని వివరించారు. కాగా, ఆయా ఆలయాల్లో దర్శనానికి సంబంధించిన రుసుము, భోజన ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుందని తెలిపారు. -
లాహిరి..లాహిరి..లాహిరిలో..
ఓ వైపు వంపులు తిరుగుతూ సుందరంగా ప్రవహించే గోదావరి.. మరోవైపు అటు కొండ.. ఇటు కొండ.. నట్టనడుమ ఉరకలు పెట్టే గోదావరి.. ఆ వంక గిరిజనుల జీవన సౌందర్యం.. ఈ వంక పచ్చటి ప్రకృతి.. ఇలా భిన్న దృశ్యాలను తిలకిస్తూ సేద తీరాలంటే పాపికొండలను బోటులో చుట్టిరావాల్సిందే. ఈ అద్భుత ప్రయాణానికి నేటి నుంచి బోట్లు బయలుదేరనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత పాపికొండలకు బోట్లు నిలిచిపోయాయి. మళ్లీ రెండేళ్ల తర్వాత బోట్లు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలతో అనుమతులు మంజూరు చేసింది. దీంతో పర్యాటకులు పాపికొండల యాత్రకు ఉవ్విళ్లూరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం ఆన్లైన్ బుకింగ్‌కు అవకాశం.. ఉభయ గోదావరి జిల్లాలకు నడుమ సుమారు 40 కిలోమీటర్ల పొడవునా గోదావరి నదికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. సెలవులు వస్తే చాలు.. పర్యాటకులు జలవిహారం చేస్తూ పాపికొండలను చుట్టేస్తారు. సకుటుంబ సపరివారసమేతంగా వచ్చి పాపికొండల్లోని సుందర ప్రకృతి దృశ్యాలను.. బోటు ప్రయాణంలో ఆహ్లాదాన్ని.. వంపులు తిరుగుతూ హొయలు ఒలకబోసే గోదావరిని చూసి పరవశిస్తారు. బుకింగ్‌కు ఆన్లైన్ సౌకర్యం ( www. aptdc. gov. in) కూడా ఉంది. దీంతో వివిధ రాష్ట్రాల పర్యాటకులు కూడా బోటు షికారు కోసం రెక్కలు కట్టుకుని మరీ వచ్చేస్తున్నారు. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు. పర్యాటకులు రాజమమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో పురుషోత్తపట్నం మీదుగా పోచమ్మగండికి చేరుకోవాలి. ముఖ్యమంత్రి ఆదేశాలతో పటిష్ట భద్రత పాపికొండల జలవిహార యాత్రలో పర్యాటకుల రక్షణ, భద్రత అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా కచ్చులూరు ప్రమాదం తర్వాత ప్రభుత్వం నూతన విధానాలను రూపొందించింది. ప్రమాదం అనంతరం అప్పట్లో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజమహేంద్రవరంలో సమీక్ష నిర్వహించారు. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాకే బోట్లను అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. బోట్ల ఫిట్నెస్ పరిశీలించాకే అనుమతులు పాపికొండల జలవిహార యాత్రకు ప్రైవేట్ బోట్లతోపాటు ఏపీ టూరిజం బోట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన 16 బోట్లకు ఏపీ మారిటైమ్ బోర్డు అనుమతి ఇచ్చింది. పోచమ్మగండి బోట్ పాయింట్ నుంచి 11 బోట్లకు, పోచవరం బోట్ పాయింట్ నుంచి 5 బోట్లకు అనుమతులు లభించాయి. వీటిలో తొలి విడతలో పోచమ్మగండి నుంచి ఆదివారం బోట్లు బయలుదేరనున్నాయి. ట్రయల్ రన్ సక్సెస్.. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ ఆదేశాలతో శనివారం పోచమ్మగండి వద్ద పర్యాటక బోట్లకు ట్రయిల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. పైలెట్ బోటు ముందు రాగా వెనుక లాంచీలు పేరంటాలపల్లి లాంచీల రేవు నుంచి బయలుదేరాయి. ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవే.. ► పర్యాటకుల రక్షణ, భద్రత కోసం రెవెన్యూ, పోలీసు, పర్యాటక, జలవనరుల శాఖలతో ఐదు చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు ► కంట్రోల్ రూమ్ మేనేజర్‌గా డిప్యూటీ తహసీల్దార్. ► పర్యాటక, జలవనరులు, పోలీసు అధికారులు కంట్రోల్ రూముల వద్ద పర్యాటకుల రక్షణ భద్రత అంశాలపై మూడు రకాల చెకప్‌లు చేపడతారు. మేనేజర్ వీటిని పరిగణనలోనికి తీసుకొని బోటు ప్రయాణానికి అనుమతిస్తారు. ► పైలెట్ స్పీడ్ బోటు గజ ఈతగాళ్లతో కూడిన రెస్క్యూ టీమ్‌తో బయలుదేరాలి. దీని వెనుక మరో 3 లేదా 5 బోట్లు ప్రయాణించాలి. ► చివర ఎస్కార్ట్ బోటులో శాటిలైట్ ఫోన్ అందుబాటులో ఉంచారు. ► ప్రతి పాయింట్ దాటాక శాటిలైట్ ఫోన్లో కంట్రోల్ రూమ్‌కు సమాచారాన్ని అందించాలి. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు తెలపాలి. ► పైలెట్ బోటు లేనిదే జలవిహార యాత్ర నిర్వహించరాదు. ► ప్రయాణించే లాంచీని లైసెన్స్ ఉన్న డ్రైవర్ మాత్రమే నడపాలి. ► జలవనరుల శాఖ ధవళేశ్వరం వద్ద 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న సమయంలోనే విహార యాత్రకు అనుమతి ► నిర్వాహకుల నుంచి అఫిడవిట్లపై సంతకాలు తీసుకున్నాకే బోట్లకు అనుమతి ► నిర్దేశిత సామర్థ్యాన్ని మించి పర్యాటకులను ఎక్కించరాదు. జాగ్రత్తలు తీసుకునే అనుమతి గోదావరిలో పాపికొండల పర్యాటకానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. గత ఘటనలు పునరావృతం కానివ్వకుండా పర్యాటకుల భద్రతే ప్రథమ లక్ష్యంగా ఏర్పాట్లు చేశాం. బోటులో పరిమితిని బట్టి 70 నుంచి 90 మంది పర్యాటకులకు మాత్రమే అనుమతిస్తున్నాం. –జి.రాఘవరావు, కాకినాడ పోర్టు అధికారి నిర్వాహకులకు మంచి రోజులు గోదావరిలో జలవిహారం ప్రారంభమవ్వడంతో బోటు నిర్వాహకులతోపాటు దానిపై ఆధారపడేవారికి మంచి రోజులు వచ్చినట్టే. బోటు షికారు నిలిచిపోవడంతో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడతాం. –మాదిరెడ్డి సత్తిబాబు, బోట్ యజమాని పర్యాటకులు ఇలా చేరుకోవాలి.. తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల నుంచి బోట్లు బయలుదేరతాయి. అవి.. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు. పర్యాటకులు ముందుగా రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్‌కు చేరుకోవాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కార్యాలయానికి చేరుకుని టికెట్లు కొనుగోలు చేయాలి.. లేదా ఏపీటీడీసీ వెబ్సైట్లోనూ బుక్ చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి రూ.1,250 చెల్లించాలి. ఏపీటీడీసీనే పర్యాటకులను రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం నుంచి పురుషోత్తపట్నం మీదుగా పోచమ్మగండికి చేరుస్తుంది. రాజమహేంద్రవరం నుంచి పోచమ్మగండికి దాదాపు 42 కి.మీ. దూరం. పోచమ్మగండిలో ఉదయం 10 గంటలకు బోటు బయలుదేరుతుంది. బోటులో పర్యాటకులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాకాహార భోజనం), సాయంత్రం స్నాక్స్, టీ అందిస్తారు. ఇవన్నీ రూ.1,250 లోనే కలిపి ఉంటాయి. పర్యాటకులు నేరుగా పోచమ్మగండికి కూడా చేరుకుని కూడా టికెట్లు కొనుగోలు చేసి బోటు ఎక్కొచ్చు. పోచమ్మగండి నుంచి ఒక్కో వ్యక్తికి రూ.1,000. తెలంగాణ నుంచి వచ్చే పర్యాటకులు తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం పోచవరం చేరుకోవాలి. అయితే ఇక్కడ నుంచి బోట్లు బయలుదేరడానికి మరో నాలుగైదు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి ఇంకా టికెట్ రేట్లు కూడా నిర్ణయించలేదు. -
పర్యాటకానికి 'జల'సత్వం
సాక్షి, అమరావతి: మరికొద్ది రోజుల్లో పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల్లో జలవిహారాన్ని పునఃప్రారంభించేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆగస్టులో ఈ రెండు నదుల్లో వరద ఉధృతి పెరగడంతో ముందస్తు చర్యల్లో భాగంగా బోటింగ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండడంతోపాటు కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో నవంబర్ 7 నుంచి గోదావరిలో పాపికొండలుకు బోట్లను తిప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పోశమ్మగండి నుంచే బోట్లు బయల్దేరుతాయి. కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని సింగనపల్లి బోటు పాయింట్ నీటిలో మునిగిపోయింది. దీంతో ఇక్కడ ప్రత్యామ్నాయ బోటింగ్ పాయింట్‌ను అన్వేషిస్తున్నారు. మరోవైపు.. కృష్ణానదిలో నీటి మట్టం తగ్గిన వెంటనే ఇక్కడా బోట్లు తిప్పనున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతులు రాష్ట్రంలో 300లకు పైగా బోట్లు ఉండగా.. ఇందులో పర్యాటక శాఖకు చెందినవి 48 ఉన్నాయి. వీటిలో మూడు మినహా మిగిలినవి అన్ని అనుమతులతో ప్రయాణికులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు.. ప్రభుత్వ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం.. ప్రైవేటు బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అధికారులు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీచేస్తున్నారు. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, విజయవాడ బెరం పార్కులలో జల విహారానికి 50 సీట్ల సామర్థ్యం ఉన్న బోట్లను తిప్పుతున్నారు. అలాగే, రిషికొండ, రాజమండ్రి, దిండి ప్రాంతాల్లో చిన్నబోట్లు, జెట్ స్కీలను అందుబాటులో ఉంచారు. వాస్తవానికి పాపికొండలు మార్గంలో ఏపీ టూరిజం బోట్లతో పాటు దాదాపు 80 వరకు ప్రైవేటు బోట్లు రాకపోకలు సాగించేవి. ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడంతో కేవలం 23 బోట్లకు మాత్రమే అనుమతులు లభించాయి. నిరంతరం బోటింగ్ పర్యవేక్షణ రెండేళ్ల కిందట పాపికొండలు మార్గంలో కచ్చులూరు వద్ద సంభవించిన బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వ సూచనలతో బోట్ల రక్షణ, మార్పుల విషయంలో కాకినాడ పోర్టు అధికారులు ప్రత్యేక నివేదికను సమర్పించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఓపీని రూపొందించింది. దీని ప్రకారం.. ► బోట్ల రూట్ పర్మిట్, పర్యాటక, జలవనరుల శాఖ నుంచి లైసెన్సులు పొందితేనే బోటును నడుపుకునేందుకు ఎన్ఓసీ జారీచేస్తున్నారు. ► గండిపోచమ్మ, పేరంటాలపల్లి, పోచవరం, రాజమండ్రి, రుషికొండ, నాగార్జునసాగర్, శ్రీశైలం, విజయవాడ బెరం పార్కులలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేశారు. ► పోలీసు, రెవెన్యూ, జలవనరులు, పర్యాటక శాఖాధికారులు సమన్వయంతో వీటి ద్వారా బోటింగ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారు. ► లైఫ్ జాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు బోట్లను తనిఖీ చేస్తున్నారు. ► బోటు బయలుదేరే ప్రదేశంతోపాటు గమ్యస్థానం వద్ద కూడా సీసీ కెమెరాలు, అలారంలను ఏర్పాటుచేశారు. ► ప్రైవేటు బోట్లలో సీటింగ్ సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించకుండా చర్యలు చేపడుతున్నారు. భద్రతా ప్రమాణాలతో సేవలు ఇక పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని బోట్లను సముద్ర యానానికి కూడా అనువైనవిగా తీర్చిదిద్దారు. 8 ఎంఎం స్టీల్ బాడీతో, ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) నిర్దేశిత భద్రతా ప్రమాణాలతో ఇవి సేవలందిస్తున్నాయి. ఈ బోట్లలో సమాచారాన్ని వేగంగా అందించేలా శాటిలైట్ ఫోన్లను ప్రవేశపెట్టారు. పాపికొండల మార్గంలో వీటిని వినియోగిస్తారు. ప్రయాణించే బోటుతోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్, పేరంటాలపల్లిలోని రిమోట్ కంట్రోల్ రూమ్‌లో వీటిని అందుబాటులో ఉంచారు. పాపికొండలుకు వెళ్లే బోట్లకు రక్షణగా ప్రత్యేక పైలట్ బోటుతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. నావిగేషన్ వ్యవస్థతోపాటు కమ్యూనికేషన్ కోసం వెరీ హై ఫ్రీక్వెన్సీ (వీహెచ్ఎఫ్) రేడియోలతో బోట్లను నడపనున్నారు. పాపికొండలుకు విహారయాత్ర గోదావరి, కృష్ణాలో బోటు షికారుకు ఏర్పాట్లుచేస్తున్నాం. పర్యాటక శాఖకు చెందిన 45 బోట్లకు పోర్టు అనుమతులున్నాయి. కార్తీక మాసంలో పర్యాటకుల సందడిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 7 నుంచి పాపికొండల విహార యాత్రను అన్ని జాగ్రత్తలతో ప్రారంభిస్తున్నాం. అదే రోజున కృష్ణాలో కూడా బోట్లు తిప్పేందుకు జలవనరుల శాఖ అధికారులతో చర్చిస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ -
పర్యాటకానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్.. ప్రపంచాన్ని పిలుద్దాం
రాష్ట్రానికి ఈ చివర అనంతపురం జిల్లాలో లేపాక్షి మొదలు.. ఆ చివర శ్రీకాకుళం జిల్లాలోని మహేంద్రగిరుల వరకు కనువిందు చేసే అందాలు ఎన్నెన్నో. నల్లమల సౌందర్యం మధ్య కొలువైన శ్రీశైల మల్లన్న, శేషాచలంపై వెలసిన వెంకన్న, కనుచూపు తిప్పుకోలేనంతగా కట్టిపడేసే పాపి కొండలు, కేరళను కనుల ముందు సాక్షాత్కరింపచేసే కోనసీమ, ఊటీని తలదన్నేలా అరకు.. కృష్ణమ్మ, గోదారమ్మ పరవళ్ల సవ్వడి చెంత వెలసిన ఎన్నో క్షేత్రాలు, అపురూప దృశ్యాలకు నిలయం మన ఆంధ్రప్రదేశ్. ఈ అందాలను కనులారా వీక్షించాలే తప్ప వర్ణించలేం.. సాక్షి, అమరావతి: చారిత్రక సంపద, ప్రకృతి రమణీయత, అతి పొడవైన సముద్ర తీరానికి నెలవైన ఆంధ్రప్రదేశ్.. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మార్పులు సంతరించుకుంటోంది. రాష్ట్రంలో రూ.2,868.60 కోట్ల మేర పెట్టుబడులతో పలు భారీ పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం లభించింది. తద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులతో ఒక్కో ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే హోటళ్లలో కొత్తగా 1,564 గదులు అందుబాటులోకి రానున్నాయి. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్లు ఆయా కంపెనీలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆధునిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్ర స్థాయి పెరుగుతుందని చెప్పారు. పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెరుగుతారని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా దీనిపై ఆధారపడే వారికి మెరుగైన అవకాశాలు వస్తాయని అన్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో లండన్ ఐ తరహా ప్రాజెక్టును తీసుకు రావడంపై దృష్టి పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొత్త ప్రాజెక్టులు ఇలా.. ► విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్, పిచ్చుకలంకలో విఖ్యాత కంపెనీ ఓబెరాయ్ విలాస్ బ్రాండ్‌తో రిసార్టులు. ► విశాఖపట్నం శిల్పారామంలో హయత్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్. ► తాజ్ వరుణ్ బీచ్ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీసు అపార్ట్మెంట్. ► విశాఖపట్నంలో టన్నెల్ ఆక్వేరియం, స్కై టవర్ నిర్మాణం. ► విజయవాడలో హయత్ ప్యాలెస్ హోటల్. ► అనంతపురం జిల్లా పెనుగొండలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద ఇస్కాన్ ఛారిటీస్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. -
ఇక తనివి తీరా... పాపికొండల అందాల వీక్షణ
రాజమహేంద్రవరం సిటీ: దాదాపు పద్దెనిమిది నెలల విరామం అనంతరం గోదావరి నది పాపికొండల అందాలను వీక్షించే అవకాశం లభించనుండడంతో పర్యాటక ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 2019 సెప్టెంబర్ 15న తూర్పు గోదావరిజిల్లా కచ్చులూరు వద్ద ఘోర లాంచీ ప్రమాదం చోటు చేసుకుని ప్రాణనష్టం సంభవించడంతో.. గోదావరి నదిలో తిరిగే అన్ని రకాల మోటార్ బోట్లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. అయితే పర్యాటక ప్రేమికుల కోరిక మేరకు పాపికొండల అందాలను వీక్షించే భాగ్యాన్ని కల్పిస్తూ.. ఇటీవల ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏసీ లగ్జరీ బోటు నడపనున్నారు. కాగా, రాజమహేంద్ర వరానికి చెందిన 23 ఏసీ లగ్జరీ బోట్లు, 5 లాంచీలు గతంలో నడిచేవి. అలాగే భధ్రాచలం వైపు నుంచి 32 లాంచీలు, 4 ఏసీ లగ్జరీ బోట్లు పర్యాటకులను పాపికొండల విహారానికి తీసుకొచ్చేవి. అయితే కచ్చులూరు ప్రమాద ఘటన జరిగిన వెంటనే గోదావరిలో నడిచే అన్ని రకాల బోట్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని కాకినాడ పోర్ట్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తగిన ప్రమాణాలు పాటించిన ఏసీ లగ్జరీ బోట్లను మాత్రమే.. అదికూడా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన అనంతరమే విహారానికి అనుమతించాలని సూచించింది. అయితే పోర్టు అధికారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రైవేటు లగ్జరీ బోట్లు లేకపోవడంతో ఇప్పటి వరకు ఒక్కదానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తాజాగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరిత ఏసీ లగ్జరీ బోటుకు పూర్తిస్థాయి అనుమతులు లభించాయి. దీంతో 18 నెలల విరామం అనంతరం పటిష్టమైన ప్రణాళిక, రక్షణ చర్యల మధ్య పాపికొండల విహారానికి పర్యాటక అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి పాపికొండల విహారానికి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలోని సింగన్నపల్లి రేవు నుంచి లగ్జరీ బోటు నడిపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయని టూరిజం శాఖ అధికారి టి.వీరనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.750 చార్జీగా నిర్ణయించాలని యోచిస్తున్నామన్నారు. కేవలం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాత్రమే ఒక బోటు నడుస్తుందని, ప్రైవేట్ ఆపరేటర్ల బోట్లకు ఇంకా అనుమతులు మంజూరు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఏపీటీడీసీ’ వెబ్సైట్లోకెళ్లి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. -
వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతి
సాక్షి, అమరావతి: అన్ని జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల్లో వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతిస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. పర్యాటక ప్రాంతాలన్నిటినీ మళ్ళీ అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. టూరిజం హోటళ్లను కూడా తెరుస్తున్నామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సచివాలయం నుంచి మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి అన్ని చోట్ల నుంచి బోట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. టూరిస్ట్ బస్సులను కూడా వారం రోజుల్లో సిద్ధం చేస్తామని తెలిపారు. త్వరలోనే జిమ్‌లను సైతం రాష్ట్రంలో ప్రారంభిస్తామన్నారు. టెంపుల్ టూరిజంను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. (రాష్ట్రంలో పెట్టుబడులపై అమెజాన్‌తో చర్చలు) 'ప్రసాద్' స్కీం ద్వారా సింహాచలం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే శ్రీశైలంలో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. త్వరలోనే 4 క్రీడా వికాస కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. ప్రతిభ గల పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగా గతేడాది 3 కోట్లు పేద క్రీడాకారులకు అందించగా, ఈ ఏడాది మరో 3 కోట్లను కేటాయించారని తెలిపారు. పీవీ సింధు అకాడమీకి విశాఖపట్నంలో భూములు కేటాయిస్తామని అవంతి శ్రీనివాస్ తెలిపారు. (వైఎస్ జగన్ భిక్షతోనే మీరు ఎంపీ అయ్యారు..) -
ఏపీలో తెరుచుకోనున్న పర్యాటక ప్రాంతాలు
-
పర్యాటకంలో ‘పచ్చ’దొంగలు
సాక్షి,విజయవాడ : ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ(ఏపీటీఏ) ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో నిర్వహించి అనేక ఉత్సవాల్లో కోట్లు నిధులు దుర్వినియోగమయ్యాయి. అప్పట్లో గుంటూరు జిల్లా కలెక్టర్ బ్లాక్ లిస్టులో పెట్టిన ఒక కాంట్రాక్టర్‌కు రూ.1.40 కోట్లు సొమ్ము చెల్లించిన కేసులో గుంటూరు జిల్లాలో పర్యాటక అధికారి హీరాపఠాన్ అరెస్టు అయిన విషయం విదితమే. వాస్తవంగా అప్పట్లో జరిగిన ఉత్సవాల వ్యయం పైనా సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్వహించిన ఉత్సవాలు ఇవే... విభజన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అయినా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటంలో పెడతానంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చలివిడిగా పర్యాటక ఉత్సవాలు నిర్వహించారు. ఏపీటీఏను చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది. ఇందులో పనిచేసే అధికారులంతా టీడీపీ సానుభూతిపరులే. కాంట్రాక్టు పద్ధతిలో కీలకపదవుల్ని అదిష్టించి నిధులు పర్యాటకాభివృద్ధి పేరుతో తమ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టారు. గత ఐదేళ్లలో నావిషో, ఎయిర్‌షో, సంక్రాంతి సంబరాలు, ఇంటర్నేషనల్ మెగా ఫెస్టివల్, బుద్ద జయంతి, దీపావళి ఉత్సవాలు, నాగాయలంక బీచ్ ఫెస్టివల్, సోషల్‌మీడియా సమిట్, అమరావతి ధియేటర్ పెస్టివల్, పెలికాన్ బర్ట్స్, గోబెల్శాంతి, మసూలబీచ్ పెస్టివల్, ఎఫ్1హెచ్2ఓ, కొండపల్లి ఉత్సవాలు, కొటప్పకొండ ఉత్సవాలు, కొండవీడు ఉత్సవాలు, సూర్యలంక బీచ్ ఫెస్టివల్ తదితర ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలన్నీ 2017 తరువాతనే జరిగాయి. ఉత్సవానికి రూ.2 నుంచి రూ.3 కోట్లు ఖర్చు ఒకొక్క ఉత్సవానికి రూ.2 నుంచి రూ.3 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఈవెంట్స్ నిర్వహించే సంస్థలన్నీ అధికారుల జేబు సంస్థలే. ఏలూరులోని ఒక సంస్థ ఎక్కువ కాంట్రాక్టులు దక్కించుకున్నారు. ఈ సంస్థ ఏపీటీఏలోని ఆర్డీ అండ్ ఈడీలోని కీలక అధికారికి చెందినదిగా ఆ సంస్థలోనే సిబ్బందే చెబుతున్నారు. కనీసం వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వకుండానే ఈ సంస్థలు ఉత్సవాలు నిర్వహించారు. టీడీపీకు చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, స్పీకర్లకు ఈ సంస్థ ప్రతినిధులకు సన్నిహిత సంబధాలు ఉండటం వల్ల వర్క్ ఆర్డర్ లేకపోయినా ఉత్సవాలు నిర్వహించారని ఏపీటీఏలో చర్చ జరుగుతోంది. రికవరీ చేస్తారా? గత ప్రభుత్వ హయాంలో నిధులు లేకపోయినా ఉత్సవాలు నిర్వహించేశారు. ఇప్పుడు ఆయా బిల్లులను ఏపీటీఏ అధికారులు అప్లోడ్ చేసి సొమ్ము చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగానే 2019 మార్చిలో నిర్వహించిన కొండవీటి ఉత్సవాల బిల్లులు మంజూరు చేయించారు. ఈ ఉత్సవాల్లోనూ ఏలూరుకు చెందిన సంస్థ కొంత పనిచేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు అడ్డగోలుగా చెల్లించిన రూ.1.40 కోట్లు ఏవిధంగా కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ కాంట్రాక్టర్‌కు టీడీపీ నేతల పెద్దల ఆశీస్సులు ఉండటం గమనార్హం. పర్యాటకాభివృద్ధి తక్కువే... సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేసినా రాష్ట్రానికి వచ్చిన పర్యాటకుల సంఖ్య తక్కువే. ఉత్సవాల్లో ఎక్కువగా అధికారులు, ఈ జిల్లా ప్రాంత వారే కనపడేవారు. వాస్తవంగా అప్పట్లో జరిగిన పర్యాటక ఉత్సవాలను ప్రజలు కూడా మరిచిపోయారు. ఇదే సొమ్ముతో భవానీద్వీపం లేదా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధిచేసి ఉంటే స్థానిక ప్రజలకు ఉపయుక్తంగా వుండేది. -
వైజాగ్‌లో సినీ పరిశ్రమ నెలకొల్పాలి
‘‘సినిమా పరిశ్రమను నెలకొల్పడానికి అనుకూలమైన వాతావరణం ఉన్న నగరం వైజాగ్. నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబుగార్లు విశాఖపట్నంలో ఫిల్మ్ ఇండస్ట్రీని నెలకొల్పడంలో ముందడుగు వెయ్యాలని కోరుతున్నా. అరవింద్‌గారు తన అదృష్టాన్ని విశాఖ నగరానికి కూడా అందించాలి’’ అన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ వైజాగ్‌లో జరిగాయి. ఈ వేడుకలో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘బాహుబలి’ తర్వాత బిగ్గెస్ట్ హిట్ సాధించిన చినబాబుగారు తన పేరును పెదబాబుగా మార్చుకోవాలి. మా గురువు, బావ అల్లు అరవింద్‌గారు బన్నీ (అల్లు అర్జున్) కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. మెగా ఫ్యాన్స్‌కు చిరంజీవిగారు దేవుడైతే, అరవింద్‌గారు క్షేత్ర పాలకుడు లాంటివారు. చిరంజీవిగారి ప్రయాణంలో అరవింద్‌గారి పాత్ర ఎంతో కొంత ఉంది. ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో ఇదివరకు దాసరి నారాయణరావుగారిని చూశాం.. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్గారిని చూస్తున్నాం’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘మా నాన్న అల్లు రామలింగయ్యగారిని తలుచుకొని మాట్లాడుతున్నా. సినిమా అనేది అందరికంటే గొప్పది. ఇప్పుడు 2020లోనే కాదు.. 2060లోనూ ‘అల.. వైకుంఠపురములో..’ పాటలు పాడతారని ఒట్టేసి చెబుతున్నాను.. ‘శంకరాభరణం’ చిత్రం పాటలను ఇప్పటికీ పాడుకుంటున్నారు. ఒక గొప్ప సినిమాకు గొప్ప సంగీతం తోడైతే అది వందేళ్లు నిలిచిపోతుంది.. అలాగే మా సినిమాని కూడా వందేళ్లు ఉంచుతారు. త్రివిక్రమ్ సెల్యులాయిడ్ తాంత్రికుడు. ప్రేక్షకులు లేకపోతే మేము లేము, ఈ సినిమా లేదు, ఈ పండగ లేదు’’ అన్నారు. ‘‘విలువలతో సినిమా తియ్యండి.. మేమెందుకు ఆదరించమో చూపిస్తామని మీరంతా చెప్పారు.. అది మాకే కాదు, తెలుగు సినిమాకే నమ్మకాన్నిచ్చింది. తెలుగు సినిమాని బన్నీ ఎక్కడికో తీసుకెళ్లగలడు’’ అన్నారు త్రివిక్రమ్. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సినిమాలు ఫోన్లో, టీవీలో వచ్చేస్తున్నాయ్.. థియేటర్లకు జనం రావట్లేదు అనే పరిస్థితిలో.. మీరు మంచి సినిమా ఇవ్వండి, తెలుగువాళ్లం థియేటర్లకు వచ్చి చూస్తాం అని చెప్పిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా నాన్నగారు (అల్లు అరవింద్) చిరంజీవి, రజనీకాంత్‌గార్లతో, రామ్‌చరణ్, హిందీలో ఆమిర్ ఖాన్‌లతో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. ఎప్పటికైనా మా నాన్నగారితో ఇండస్ట్రీ రికార్డ్ సినిమా కొట్టాలి అనుకొనేవాణ్ణి. ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొడుతున్నా. మా నాన్నతో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడమనే ఆనందాన్ని త్రివిక్రమ్గారిచ్చారు’’ అన్నారు. ‘‘త్రివిక్రమ్‌గారితో పనిచేయడానికి నాకు పదేళ్లు పట్టింది. అందుకే పదేళ్లు మించిపోయే పాట ఇచ్చాను’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. ‘‘తెలుగు అభిమానుల్లా ఏ భాషలోనూ ఉండరు’’ అన్నారు పూజా హెగ్డే. టైటిల్ ఫిక్స్ కాలేదు ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కలసి ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా టైటిల్ ‘సింహాచలం’ అంటూ పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ‘మా సినిమాకు ఇంకా ఏ టైటిల్ నిర్ణయించలేదు. ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదు’ అని చిత్రబృందం ప్రకటించింది. -
ఎన్నెన్నో.. అందాలు
గలగల పారే గోదావరి..కిలకిలరావాల కొల్లేరు..పాపికొండల సోయగం..ఏజెన్సీలోని కొండకోనల్లోసవ్వడి చేసే సెలయేళ్లు..ఆహ్లాదపరిచే అడవులు.. మరో పక్క ఆధ్యాత్మిక సాగరంలోఓలలాడించే ఆలయాలు.. ఇలా ఆనందంలో ముంచెత్తే ప్రకృతి అందాలకు.. ఆధ్యాత్మిక దేవాలయాలకు జిల్లాలో కొదవ లేదు.. పర్యాటకులను సేదతీర్చే టూరిజం స్పాట్లకు కొరత లేదు.. నేడు వరల్డ్ టూరిజం డేసందర్భంగా అలాఅలా.. ఆ వివరాలు ఇలాఇలా.. బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం ఆహ్లాదానికి నెలవు. ఇక్కడ చెట్టు, చేమ, నీరు, రాయి, కొండ ప్రతీది ఆకర్షణీయమే.. ప్రత్యేకమైనవే.. ఈ ప్రాంతంలోని జలపాతాలు.. కొలువైన వన దేవతలు.. ప్రసిద్ధ పర్యాట ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. గోదావరిలో కొనసాగే పాపికొండల యాత్ర అత్యంత మధురమైన అనుభూతిని ఇస్తుంది. పోలవరం మండలం సింగన్నపల్లి నుంచి పాపికొండల యాత్ర మొదలవుతుంది. ప్రకృతి ఒడిలో ప్రయాణించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడకు తరలివస్తుంటారు. గతంలో పట్టిసీమ, పోలవరం, రాజమండ్రి నుంచి బోట్లలో ప్రయాణం సాగించేవారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సింగన్నపల్లి నుంచి బోటు ప్రయాణం ఏర్పాట్లు ఉన్నాయి. అయితే ఈ ఏడాది గోదావరి విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ప్రయాణ సమయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటే పాపికొండల విహారయాత్రలో అనుభూతి మరువలేనిదని పర్యాటకులు అంటున్నారు. పాపికొండల యాత్రలో పట్టిసీమ, వీరభద్రస్వామి, మహానందీశ్వరస్వామి ఆలయాలు, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ గుడి, బ్రిటీష్ కాలం నాటి పోలీస్‌స్టేషన్, 11వ దశాబ్దం నాటి ఉమా చోడేశ్వరస్వామి ఆలయం, కొరుటూరు రిసార్ట్స్‌ను సందర్శించవచ్చు. గోదావరి వెంబడి గట్లపై గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులకు ఆనందాన్ని, అనుభూతిని కలిగిస్తాయి. పేరంటపల్లి శివునిగుడి ఆధ్యాత్మిక విశ్రాంతినిస్తుంది. కొండల్లోకొలువైనగుబ్బలమంగమ్మ దట్టమైన అటవీప్రాంతం ఎత్తైన కొండలు మధ్య గుహలో కొలువైన తల్లి గుబ్బల మంగమ్మ. గిరిజన ఆరా«ధ్య దేవతగా పూజలందుకుంటున్న ఈమెకు వరాలిచ్చే దేవతగా పేరు. ప్రతి ఆది, మంగళవారం అమ్మ దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుంటారు. బుట్టాయగూడెం మండలం కామవరం దాటిన తరవాత దట్టమైన అడవిలో కొంత దూరం వెళ్లిన తరవాత అమ్మ గుడి వస్తుంది. బుట్టాయగూడెం మండలంలోని మారుమూల కొండరెడ్డి గ్రామమైన ముంజులూరు సమీపంలో ఏనుగుల తోగు జలపాతం చూపరులను ఆకర్షిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా మారనున్న పోలవరం ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ప్రాజెక్టు పూర్తి అయ్యి టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి పరిస్తే ప్రపంచ స్థాయి పర్యాటకుల్ని ఆకర్షిస్తాయని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు. కనువిందు చేసే కొల్లేరు అందాలు ఆకివీడు: పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దులో సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సు 340 చ.మైళ్ల విస్తీర్ణంలో ఉంది. సరస్సు పరీవాహక ప్రాంతంలో సుమారు 280 రకాల పక్షులు సంచరిస్తున్నాయి. కొల్లేరు ప్రాంతంలో పడవలు, దోనెలు, లాంచీలలో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. కొల్లేరులో పక్షి ఆవాస కేంద్రాలు ఆటపాక, గుడివానిలంక ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాలకు విదేశీ పక్షులు ఏటా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెలవరకూ వలస వచ్చి విడిది చేస్తుంటాయి. మరికొన్ని విదేశీ పక్షులు ఈ ప్రాంతాల్లోనే జీవిస్తున్నాయి. కొల్లేటి అందాల్ని మరింతగా తిలకించేందుకు కొల్లేరు నడిబొడ్డున ఉన్న పెద్దింటి అమ్మవారి ఆలయంకు చేరుకుంటే ఆ ప్రాంతం నుంచి కూడా కొల్లేరు అందాలు తిలకించవచ్చు. చారిత్రక ప్రసిద్ధి గుంటుపల్లి బౌద్దాలయాలు కామవరపుకోట: జిల్లాలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన గుంటుపల్లి బౌద్దాలయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇవి క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందినవిగా చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.పూ 10వ శతాబ్దం వరకు ప్రముఖ బౌద్దారామాలుగా విరాజిల్లాయి. ఈ గుహలను క్రీ,శ 4వ శతాబ్దంలో చైనా నుంచి షాహియాన్, 7వ శతాబ్దంలో హుయాన్సాంగ్ సందర్శించారు. నేటికి ఈ గుహలను సందర్శించటానికి విదేశాల నుంచి సయితం ప్రతీ ఏడాది విదేశాల నుంచి పర్యాటకులు రావడం విశేషం. ఈ గుహలలో వర్తులాకారములో ఉన్న స్థూపంను «ప్రస్తుతం దర్మలింగేశ్వరస్వామిగా స్థానికులు కొలుస్తున్నారు. ఇసుక రాతి కొండ అంచున వేరు వేరు పరిణామాలలో తొలిచిన గదులు కూడా ఇచట కలవు. ఉప్పలపాడు నుంచి జీలకర్రగూడెం వరకు పది కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ కొండలు సర్పం ఆకారంలో మెలికలు తిరిగి ఉండటంతో మహానాగపర్వతముగా వర్ణిస్తుంటారు. అనేక ప్రత్యేకతలతో ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. పర్యాటక కేంద్రంగా పెనుగొండ దివ్యక్షేత్రం పెనుగొండ : వాసవీ కన్యకాపరమేశ్వరి పుట్టినిల్లైన పెనుగొండ దివ్యక్షేత్రం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం రికార్డు స్థాయిలో పెనుగొండను రెండు లక్షలకు పైగా పర్యాటకులు అమ్మవారిని సందర్శించారని అంచనా. దేశంలోనే నలుమూలల నుంచి నిత్యం భక్తులు వచ్చి వాసవీ శాంతి థాంలోని వాసవీ మాతను, మూలవిరాట్ నగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఏపీ టూరిజం సైతం పెనుగొండను పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వాసవీ శాంతి థాం, మూలవిరాట్ ఆలయాలకు విస్త్రత ప్రచారం కల్పిస్తోంది. -
ఓ ట్రిప్పు వేసొద్దాం
ప్రపంచంలో ఏ ప్రాంతాన కాలుమోపినా... కొత్తగా మనల్ని మనం ఆవిష్కరించుకోవచ్చు. ఉత్సాహాన్ని, ఉల్లాసాన్నిమూటగట్టుకోవచ్చు. కొత్త శక్తిని పుంజుకోవచ్చు. అందుకే పర్యటనలపై ప్రజలకు మక్కువ పెరిగింది. కాలం మారిందిఅని చెప్పడానికి ఆ దేశ పర్యాటక రంగంలో వచ్చిన అభివృద్ధినే ప్రామాణికంగా తీసుకోవచ్చు అనేదినిపుణుల అభిప్రాయం. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం.. సెప్టెంబరు 27... పర్యాటకరంగాన్ని అభిమానించి, ఆదరించి, ప్రోత్సహించే వారందరికీ పండగరోజు. ప్రస్తుతం పర్యాటకరంగం ప్రపంచ రూపురేఖల్నే మార్చేసింది. ప్రపంచంలో ఎన్నో దేశాలు పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ తమ దేశ అభివృద్ధికి పర్యాటక రంగమే ప్రథమావధిగా పనిచేస్తున్నాయి. ఎంతో మందికి జీవనాధారం కల్పిస్తూ, కోటానుకోట్ల మందికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తున్న ఈ పర్యాటకర రంగం మరింత విస్తృతపరుస్తూ, మరింత అభివృద్ధి సాధించాలని ‘సాక్షి’ మనసారా కోరుకుంటోంది. భారతదేశ జీవన విధానంలో పర్యాటక రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. దేశ సాంస్కృతిక జీవనంలోనే అనాది కాలం నుండి తీర్థయాత్రలు చేయడం ఒక భాగంగా ఉన్న దేశం మనది. మన దేశంలో ప్రతి యేటా కోటానుకోట్ల మంది చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను విహారయాత్రా ప్రదేశాలను సందర్శిస్తూ రావటం, ఆనందం పొందుతూ మరింత మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నది. పర్యాటక రంగానికి ఇంతటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టే సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం తమ ప్రాధాన్యతాంశాలలో పర్యాటక రంగం చాలా విశిష్టమైనదని చెప్పడం జరిగింది. ఒత్తిడి నుంచి దూరంగా.. నిత్యం పనులతో మానసిక ఒత్తిడికి లోనయ్యేవారికి విహారయాత్రలు ఉల్లాసాన్ని, నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా తెలిసిన వారి ద్వారా లేదా ఇంటర్నెట్లో తగిన సమాచారాన్ని తీసుకుని సొంతంగానో లేదా ట్రావెల్ ఏజెంట్స్ ద్వారానో విదేశాలకో లేక స్వదేశంలోనో యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. విపరీతమైన పోటీతత్వం వల్ల కూడా టూరిజం ఇండస్ట్రీ పెరిగిపోయింది. మంచి ధరలకు టూర్ పాకేజీలు తయారు చేసుకొని యాత్రలకు వెళుతున్నారు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ భౌగోళిక చరిత్రలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు సహజసిద్ధంగా ఏర్పడ్డ బీచ్‌లు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, చారిత్రాత్మక కట్టడాలు ఎన్నో అంశాలు దేశీయ పర్యాటకులను మాత్రమే కాకుండా ప్రపంచ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అందులో ప్రముఖంగా ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్‌మహల్, రాజస్థాన్‌లో రాజపుత్రుల కోటలు, ఇలా ఎన్నో చారిత్రాత్మక అంశాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆధ్యాత్మిక టూరిజం భక్తిసాగరంలో మునిగి తేలేవారికి టూరిజం ఒక వరంగా మారిపోయింది. ఇదివరకు రోజులలో యాత్రలకు వెళ్లాలంటే కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే వెళ్లే అవకాశం ఉండేది. కారణం వారు తిరిగి వచ్చే నమ్మకం చాలా తక్కువగా ఉండేది. కానీ, నేటి పరిస్థితులు దానికి భిన్నంగా, అనుకూలంగా మారిపోయాయి. కుటుంబం అంతా కలిసి వెళ్లే దిశగా టూరిజం పరిశ్రమ మార్చేసింది. యాత్రలకు వెళ్లాలి అనే ఆలోచన రావడం మొదలు చక్కటి అనుకూలమైన ప్రదేశాలు ఎంచుకొని దానికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తెలుసుకొని మరీ ప్రయాణమవుతున్నారు. కాలం మారింది అనడానికి సాక్ష్యంగా టూరిజం పరిశ్రమను చూపించవచ్చు. అనాది కాలం నుండి మనదేశంలో ఆధ్యాత్మిక ఆధ్యాతిక టూరిజం పై మక్కువ ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు,లక్షలాది శైవ, వైష్ణవే దివ్య క్షేత్రాలు.. ఇలా ఎన్నో ఆలయాలు. వాటి ప్రాచీన చరిత్ర, శిల్పకళారీతులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రోజుల్లో ఏ దేశ పౌరుడిని పలకరించినా టూరిజం గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి విషయ పరిజ్ఞానం పెరిగిపోయింది. ప్రతివారూ తమ తమ జీవన విధానంలో భాగంగా పర్యటనల కోసం తప్పక సమయాన్ని, డబ్బును వెచ్చిస్తున్నారు. ఏ దేశంలో పర్యటించినా ఆ దేశంలో ప్రతి వందవ వ్యక్తిని ఒక పరదేశీయునిగా గుర్తించవచ్చు. ముఖ్యంగా భారతీయులు ఏ దేశానికి వెళ్లినా అక్కడ తప్పక కనిపిస్తారు. నాగరికత ప్రజలలో సరికొత్త దిశగా పరుగులు తీస్తోంది. భారతీయులు కొత్తదనానికి త్వరగా ఆకర్షితులవుతారు అనడానికి ఇది ప్రామాణికంగా చెప్పుకోవచ్చు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ప్రదేశ్ అర్థికాభివృద్ధిలో కూడా పర్యాటకరంగ ప్రభావం ఎంతో విశిష్టమైనది. రాష్ట్ర పునఃనిర్మాణంలో పర్యాటకరంగం కూడా కీల పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రపంచంలోనే అతిగొప్ప వైష్ణవ దివ్యక్షేత్రం తిరుమల, శ్రీశైలంలోని మల్లికార్జున ఆలయం దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పవచ్చు. పంచారామాలు, శక్తిపీఠాలు.. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు ఎంతో విశాలమైన తీర ప్రాంతం కలిగిన ఈ రాష్ట్రానికి సహజసిద్ధంగా ఏర్పడిన బీచ్‌లు, కోనసీమలోని ప్రకృతి అందాలు... ఇలా ఎన్నో అంశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యతను గుర్తించి రాష్రప్రభుత్వం కూడా పర్యాటక రంగానికి పెద్ద పీట వేయడం జరుగుతుంది. పర్యాటక రంగంలో తెలంగాణ కోటి రతనాల వీణ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనునిత్యం వేలాది, లక్షలాది పర్యాటకులు సందర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరం. ఈ నగరంలో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు సుందరమైన పార్కులు, ఎన్నో రకాల ఎమ్యూజ్మెంట్ పార్కులు, దేశీయ పర్యాటకులను మాత్రమే కాకుండా ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర పర్యాటక సంస్థ తెలంగాణ టూరిజం కూడా తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో రకాల ప్యాకేజీలను అందిస్తూ, పర్యాటక సంక్షేమానికి, పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ సందర్శనకు కూడా వేలాది భక్తులు తరలివస్తున్నారు. ఇటీవల కాలంలో దేశీయ పర్యాటక రంగం మాత్రమే కాకుండా అంతర్జాతీయ పర్యాటక రంగం కూడా విశేషంగా అభివృద్ధి సాధిస్తున్నది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులు విదేశీ టూర్స్ పైన కూడా మక్కువ పెరగడం మూలంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన విమానాశ్రయాలనుండి ఇతర దేశాల విమాన సర్వీసులు పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. పర్యాటకరంగం ప్రజల జీవనవిధానాలను మారుస్తుంది. ప్రజల ఆలోచనలను మారుస్తుంది. మొత్తంగా ప్రపంచ గమనాన్నే మార్చే అద్భుత శక్తి పర్యాటకరంగానికి ఉంది. -
బోటును వెలికి తీసేందుకు ముమ్మర చర్యలు
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద రాయల్ వశిష్ట పున్నమి ప్రైవేట్ బోటు బోల్తా ఘటనలో మంగళవారం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా వైపు పోలవరం మండలం వాడపల్లి వద్ద పురుషుడి మృతదేహాన్ని, అదే జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలోని పంతులు గారి లంక వద్ద రాత్రి పొద్దుపోయాక మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. పురుషుడి మృతదేహాన్ని రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించగా.. మహిళ మృతదేహాన్ని తరలించాల్సి ఉంది. రెండు మృతదేహాలు పూర్తిగా పాడైపోయి గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతులెవరనేది గుర్తిస్తామని వైద్యులు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం బోటులో ప్రయాణించిన 77 మందిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. మంగళవారం దొరికిన మృతదేహంతో కలిపి ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే.. మునిగిపోయిన బోటును వెలికి తీసేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి. భారీ క్రేన్, రోప్‌లు రప్పిస్తున్నాం బోటును వెలికి తీసేందుకు విశాఖ పోర్టు నుంచి యంత్ర సామగ్రి రప్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై.సత్యనారాయణ మంగళవారం తెలిపారు. బోటు జాడను గుర్తించిన ప్రాంతంలో గోదావరి ప్రవాహ తీరును, అక్కడి పరిస్థితులను ఆయన బోటులో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి కొంతమేర తగ్గిందన్నారు. అయినప్పటికీ అక్కడ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. బోటును వెలికితీసేందుకు భారీ పొక్లెయిన్, 800 మీటర్ల పొడవైన ఐరన్ రోప్‌లను విశాఖ పోర్టు నుంచి రప్పిస్తున్నట్లు తెలిపారు. పోర్టు, జల వనరుల శాఖ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో చర్చించిన ఆయన భారీ యంత్రాన్ని ప్రమాద స్థలానికి తరలించేందుకు మంటూరు వైపు నుంచి గల రహదారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బోటు మునిగిన ప్రాంతాన్ని పలుమార్లు పరిశీలించామని, సాంకేతికతకు తోడు సంప్రదాయ పద్ధతిలో బోటు వెలికితీసే ఏర్పాట్లు చేస్తున్నామని పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ తెలిపారు. -
మొరాయిస్తున్నా.. మారరా?
ఏళ్లు గడుస్తున్నాయి.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రమాదం జరిగినప్పుడల్లా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.. అయినా పరిస్థితి మారదు.. ప్రమాద సమయంలోనే అంతా హడావుడి.. ఆ తర్వాత యథావిధి తంతు.. ఇదీ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ తీరు.. ముఖ్యంగా సంస్థకు అధికంగా ఆదాయం తెచ్చిపెట్టే బోటింగ్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. కాలం చెల్లిన బోట్లకే రూ. లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించి తిప్పుతున్నారు తప్ప కొత్తవి కొనే ఆలోచన చేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. భవానీపురం(విజయవాడ పశ్చిమం): కాలం చెల్లిన బోట్లతో కాలక్షేపం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఉన్నతాధికారుల వైఖరి ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చుతోంది. టూరిజం అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పుకునే అధికారులు ఆదాయాన్ని తెచ్చిపెట్టే బోట్ల కొనుగోలుపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఏపీటీడీసీ నడుపుతున్న బోట్లన్నీ దాదాపు 15 నుంచి 20 ఏళ్లకు పూర్వం కొనుగోలు చేసినవే. విజయవాడలో బోటింగ్ ఇలా.. విజయవాడ బరంపార్కు నుంచి భవానీ ద్వీపానికి రోజూ బోట్ సర్వీసులు నడుస్తున్నాయి. గతంలో బరంపార్క్ నుంచి ఇబ్రహీంపట్నం ఫెర్రీలోగల పవిత్ర సంగమం వరకు బోట్లు నడిచేవి. వాటికి జలవనరుల శాఖ కూడా అనుమతించింది. 2017లో పవిత్ర సంగమం దగ్గర ఒక ప్రైవేట్ బోటు బోల్తాపడి 22 మంది మృత్యువాత పడటంతో ఆ మార్గంలో బోట్లు నడిపేం దుకు జలవనరుల శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో పవిత్ర సంగమానికి బోట్లు నిలిపివేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానంతరం దిగువనున్న దుర్గాఘాట్ దగ్గర ఏపీటీడీసీ ఏర్పాటు చేసిన బోట్ల ద్వారా భవానీ ద్వీపం వెళ్లేవారు. ఇక్కడి నుంచి రోజూ నాలుగైదు సర్వీసులు నడిచేవి. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో కొంత కాలంగా సర్వీసులు నిలిచాయి. అన్నీ కాలం చెల్లిన బోట్లే ♦ ఏపీటీడీసీ విజయవాడ డివిజన్లోని భవానీపురం బెరంపార్క్‌లోగల బోటింగ్ పాయింట్లో ఉన్న 17 బోట్లలో ఒకటీ రెండు మినహా అన్నీ కాలం చెల్లినవే. ♦ బరంపార్క్ నుంచి భవానీ ద్వీపానికి రెగ్యులర్‌గా తిరిగే బోట్లలో భవానీ బోటు ఒకటి. దీనిని 2006లో వైజాగ్‌లోని సీకాన్ సంస్థ నుంచి కొనుగోలు చేశారు. దీనిని కొని 13 ఏళ్లు కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతోంది. ♦ ముంబై పోర్ట్‌లో తయారైన కృష్ణవేణి, ఆమ్రపాలి బోట్లను 1998లో కొన్నారు. ఇవి కూడా మరమ్మతులకు గురవుతూనే ఉంటాయి. డీజిల్ ఇంజిన్‌తో నడిచే ఈ బోట్లన్నీ 50 మంది కెపాసిటీ కలిగినవే. ♦ అడపాదడపా బయటకుతీసే (పార్టీలు, ఫంక్షన్ల కోసం) బోధిసిరి బోటుకూ మరమ్మతులు షరా మామూలే. ఇదీ డీజిల్ ఇంజిన్‌తోనే నడుస్తుంది. దీనికి సిబ్బంది పెట్టిన ముద్దు పేరు వైట్ ఎలిఫెంట్. దీని కెపాసిటీ 100 మంది. ఏసీ సౌకర్యం ఉన్న దీనిని 2004లో కొన్నారు. రూ.1.20కోట్ల ఏసీ బోటు నిరుపయోగం గత ఏడాది మార్చిలో రూ.1.20 కోట్లతో కొనుగోలు చేసిన ఏసీ (పలనాడు) బోటు నిరుపయోగంగా ఉంది. 36 సీటింగ్ కలిగిన ఈ బోటుకు చార్జిని రూ.120గా నిర్ణయించడంతో సందర్శకులు ఆసక్తి చూపడం లేదు. ఈ బోటు ఖర్చుతో మూడు మంచి సాధారణ బోట్లు వస్తాయని సిబ్బంది చెబుతున్నారు. ♦ ధరణి అనే బోటును రూ.25లక్షలతో కొనుగోలు చేశారు. దీని సీటింగ్ కెపాసిటీ 10 మంది మాత్రమే. దీనికి కూడా రూ.120లు చార్జీ వసూలు చేస్తున్నారు (15 నిముషాలపాటు రౌండ్ ట్రిప్) పర్యాటకులు ఆసక్తి చూపకపోవడంతో దీనినీ పక్కన పడేశారు. ఈ రెండు లగ్జరీ బోట్లను గంట సేపు అద్దె తీసుకుంటే రూ.5,900లు చార్జిగా నిర్ణయించారు. ప్రైవేటు సంస్థలు ఇలా.. ద్వీపంలో మూడు ప్రైవేట్ సంస్థలు (అమరావతి బోటింగ్ క్లబ్, చాంపియన్ యాచెట్ క్లబ్, సింపుల్ వాటర్ స్పోర్ట్స్) వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నాయి. ద్వీపానికి వచ్చిన సందర్శకులను వివిధ రకాల బోట్ల ద్వారా నదిలో తిప్పుతారు. ఇవి బరంపార్క్ వరకు వచ్చి సందర్శకులను ద్వీపంకు తీసుకువెళ్లవు. ఈ మేరకు ఆయా సంస్థలతో ఏపీటీడీసీ ఒప్పందం చేసుకుంది. నెలకు రూ.30 లక్షల ఆదాయం.. 4 పోలీక్రాప్స్ స్పీడ్ బోట్లు, మూడు జెట్స్కీ బోట్లు తరచూ రిపేర్లకు గురవుతూనే ఉన్నాయి. ఇవన్నీ పెట్రోలు ఇంజిన్లతో నడిచేవే. వీటి మరమ్మతుల కోసం రూ.లక్షలు వెచ్చించే ఏపీటీడీసీ ఉన్నతాధికారులు కొత్త బోట్లు కొనుగోలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. మొత్తానికి బోట్ల ద్వారా ఏపీటీడీసీకి నెలకు సుమారు రూ.20 నుంచి రూ.30లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. అంత ఆదాయం లభించే బోటింగ్ వ్యవస్థపై నిర్లక్ష్యం వహించడంపై అటు ప్రజలు, ఇటు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అమరావతి అదోగతి..!
సాక్షి, అమరావతి : ప్రఖ్యాత పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమైన అమరావతి అభివృద్ధి పనులు ఐదేళ్లుగా మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాలానే.. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి నగర పంచాయతీ హోదా కూడా తీరని కలగానే మిగిలిపోయింది. పురాణాలు, ఇతిహాసాల కాలం నుంచి అమరావతి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రసిద్ధిని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండగా ఐదేళ్లుగా ఆ దిశగా చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో ఇచ్చిన నగర పంచాయతీ హామీ మళ్లీ ఎన్నికలు వచ్చినా అమలు కాలేదు. పనుల్లో అయోమయం..నాణ్యతపై అనుమానం అమరావతి వారసత్వ నగర అభివృద్ధి పనులు ఎంత వరకు వచ్చాయంటే ఎవ్వరూ చెప్పలేని అయోమయం నెలకొంది. ఈ పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం సాగుతోంది. 2015 జనవరిలో కేంద్రప్రభుత్వం అమరావతిని వారసత్వ నగరంగా గుర్తించి రూ.99కోట్లు కేటాయించి, తొలి విడతగా రూ.22.74 కోట్లు మంజూరు చేసింది. ఈ పనుల కోసం జాతీయస్థాయి కంపెనీలు అంచనాలు రూపొందించినా ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పింది. అధికారులు చెప్పే మాటలకు, జరిగే పనులకు పొంతన ఉండటంలేదు. ఈ పనుల పరిశీలనకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వ అధికారులు పనుల పురోగతి, నిధుల వినియోగం, నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. 2018 జనవరి 31వ తేదీన కేంద్ర హోం శాఖ అఫైర్స్ కార్యదర్శి సుమిత్ గరకర్ పనులను పరిశీలించి నాణ్యత, పనుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారంటే పనులు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. నిలిచిపోయిన పనులు అమరేశ్వరాలయానికి ఉత్తరంగా కృష్ణానదిలో ధ్యానబుద్ధ ఘాట్ నుంచి అమరేశ్వర ఘాట్ వరకు చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ధరణికోట నూనెగుండం చెరువు పనులు కంచె వేయడానికే పరిమితమయ్యాయి. అమరావతి, ధరణికోట గ్రామాల్లో చారిత్రక ప్రదేశాలను కలుపుతూ చేపట్టిన హెరిటేజ్ వాక్ పనులు పూర్తికాలేదు. ధ్యానబుద్ధ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తిస్థాయిలో పూర్తికాలేదు. నందనవనం కోసం 16 ఎకరాల భూసేకరణ పూర్తయినా పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. పురావస్తు మ్యూజియంలో అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. సీసీ కెమెరాలు, లైట్లు మాత్రం ఏర్పాటు చేశారు. కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఫుష్కరఘాట్లు నేడు వ్యర్థాలతో నిండిపోయాయి. రాత్రిళ్లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది గ్రామాలకు నాలుగు వైపుల అర్చీల నిర్మాణం పూర్తయినా బౌద్ధ సంస్కృతి, శైవ సంప్రదాయాలు ప్రతిబింబించక కళా విహీనంగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన ప్రతిపాదిత పనులను అసలు మొదలుపెట్టనే లేదు. -
తిరుపతిలో మత్స్యదర్శిని
► జిల్లాకు మరో అరుదైన టూరిజం కేంద్రం ఏర్పాటుకు స్థల సేకరణ ► నిర్మాణ పనులకు రూ.80 లక్షలు మంజూరు తిరుపతి సెంట్రల్: ఆధ్యాత్మిక నగరవైున తిరుపతికి ఏపీ టూరిజం మరింత వన్నె తీసుకురానుంది. మొదటిసారిగా లక్షల రూపాయల వ్యయంతో అరుదైన మత్స్యదర్శినిని జిల్లా వాసులకు పరిచయం చేయనుంది. వైజాగ్ తరహాలో తిరుపతి నడిబొడు్డన వందల రకాల చేపల తో మత్స్యదర్శిని (రంగు రంగుల చేపలతో నిండిన ఆక్వేరియం) నిర్మించనుంది. సముద్రగర్భంలో మా త్రమే కనిపించే అరుదైన, అందవైున రంగురంగుల చేపలతో కూడిన సందర్శన కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఏపీ టూరిజం నుంచి రూ.80 లక్షల నిధులను మంజూరు చేసింది. ఈ ఆక్వేరి యం నిర్మాణ పనుల బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ఎడు్యకేషన్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఈడబ్ల్యూఐడీసీ)కు అప్పగిస్తూ, అగ్రిమెంట్ కూడా చేసుకుంది. దీనికి సంబంధించి టెండర్లు కూడా పిలిచారు. చేపలను ఏర్పాటు చేసే బాధ్యతను మత్స్య శాఖ అధికారులకు అప్పగించారు. అంతా సవ్యంగా జరిగితే మరో ఆరు నెలల్లో తిరుపతికి వచ్చే యాత్రికులు, శ్రీవారి భకు్తలతో పాటు జిల్లా వాసులకు రంగురంగుల చేపలను సందర్శించే భాగ్యం కలుగుతుంది. విజయదశమిలోగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా టూరిజం అధికారులు కృషి చేస్తున్నారు. -
బరం పార్కు చేజారేనా!
ఇప్పటికే భవానీద్వీపం ప్రై‘వేటు’కు యత్నాలు మంత్రులకు, ఉన్నతాధికారులకు బరం పార్కు గదుల కేటాయింపు యోచనలో పాలకులు పర్యాటకులకు కేటాయిస్తేనే ఉపయుక్తం విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస ్థ(ఏపీటీడీసీ) ఆధ్వర్యంలోని బరం పార్కును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భవానీద్వీపాన్ని, బరం పార్కు స్థలాన్ని ఏపీటీడీసీకి ఇచ్చారు. 2002లో బరం పార్కులో రెస్టారెంట్లు, గదులను, 2004లో భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేశారు. భవానీద్వీపంలో నేటికీ పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు. అయినా ద్వీపం, బరం పార్కులు ఏపీటీడీసీకి లక్షల ఆదాయం సమకూర్చి పెడుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో భవానీద్వీపాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని అందరూ భావించారు. ఏడాదిన్నర అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టలేదు. భవానీద్వీపం ప్రై’వేటు’కు యత్నాలు ఇటీవల వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించినప్పుడు 133 ఎకరాల్లోని భవానీద్వీపం అభివృద్ధి గురించి చర్చకు వచ్చింది. ద్వీపం ఒకటే కాదని, నదిలోని చిన్నచిన్న ద్వీపాలతో కలిసి మొత్తం ఐదువేల ఎకరాలను ఏమీ చేయాలనే అంశంపై తనకు ప్రత్యేక ఆలోచన ఉందని సీఎం తెలిపారు. ఇటీవల సింగపూర్, జపాన్ బృదాలు వచ్చినప్పుడు వారికి బరం పార్కును, భవానీద్వీపాన్ని కలెక్టర్ వ్యక్తిగతంగా చూపించారు. దీన్నిబట్టి భవానీద్వీపాన్ని ప్రై‘వేటు’ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బరం పార్కును పరిశీలించిన మంత్రి నారాయణ బుధవారం మున్సిపల్ మంత్రి నారాయణ ఆకస్మికంగా బరం పార్కును పరిశీలించారు. గదులు ఎన్ని ఉన్నాయి. సమావేశాలు పెట్టుకునే అవకాశం ఉందా తదితర సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఈ గదులను మంత్రులకు గాని, ఉన్నతాధికారులకు గాని కేటాయిస్తే ఏ విధంగా ఉంటుందని కూడా ఆరా తీసినట్లు సమాచారం. దీంతో ఏపీటీడీసీ అధికారులు, సిబ్బందిలో కలకలం మొదలైంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని విజయవాడకు తరలించేందుకు మున్సిపల్ మంత్రి నారాయణ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బరం పార్కులోని గదులను కూడా పరిశీలించినట్లు తెలిసింది. వీటిని మంత్రులకు కాని, ఉన్నతాధికారులకు కాని, ఏదైనా ప్రభుత్వ శాఖకు కేటాయిస్తే.. పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడతారని ఏపీటీడీసీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కేవలం సమావేశాలు నిర్వహించుకునేందుకే దీన్ని ఉపయోగించుకోవాలి తప్ప పూర్తిగా స్వాధీనం చేసుకోకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. రూ.కోటిన్నరతో అభివృద్ధి బరం పార్కు, భవానీద్వీపంలోని గదుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇటీవలే ఏపీటీడీసీ అధికారులు రూ.కోటిన్నరతో మరమ్మతులు చేయించారు. పాడైపోయిన ఏసీలు బాగు చేయించడం, ఫ్లోరింగ్, రంగులు వేయించి, అవసరమైన గదుల్లో సౌకర్యాలు కూడా ఏర్పాటుచేశారు. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా రాత్రులందూ క్యాండిల్ డిన్నర్, ఉదయం బోట్లో బ్రేక్ఫాస్టులు ఏర్పాటు చేసి పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు దీనిపై ప్రభుత్వం కన్నేయడం అధికారులకు మింగుడు పడటం లేదు. అద్దెకు తీసుకుంటారని అనుకుంటున్నా బరంపార్కులోని గదులను, రెస్టారెంట్‌ను ఇటీవల కోటిన్నరతో అభివృద్ధి చేశాం. ఇతర పర్యాటకుల లాగానే ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ వీటిని తీసుకుని అద్దె చెల్లిస్తారని భావిస్తున్నాం. పర్యాటక కేంద్రంగానే దీన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది. బరం పార్కును మంత్రులకు కేటాయించడంపై ఉన్నతాధికారుల నుంచి ఏ విధమైన ఆదేశాలూ అందలేదు. - డీవీఎం వి.వి.ఎస్.గంగరాజు