వైజాగ్‌లో సినీ పరిశ్రమ నెలకొల్పాలి | AP Minister Avanthi Srinivas Speech At AlaVaikunthapurramuloo Success Celebrations | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో సినీ పరిశ్రమ నెలకొల్పాలి

Published Tue, Jan 21 2020 12:19 AM | Last Updated on Tue, Jan 21 2020 5:03 AM

AP Minister Avanthi Srinivas Speech At AlaVaikunthapurramuloo Success Celebrations - Sakshi

అజయ్, అల్లు అరవింద్, త్రివిక్రమ్, రాధాకృష్ణ, అల్లు అర్జున్, పూజా హెగ్డే, ఎస్‌.ఎస్‌.తమన్‌, ఇన్‌సెట్లో.. అవంతి శ్రీనివాస్‌

‘‘సినిమా పరిశ్రమను నెలకొల్పడానికి అనుకూలమైన వాతావరణం ఉన్న నగరం వైజాగ్‌. నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబుగార్లు విశాఖపట్నంలో ఫిల్మ్‌ ఇండస్ట్రీని నెలకొల్పడంలో ముందడుగు వెయ్యాలని కోరుతున్నా. అరవింద్‌గారు తన అదృష్టాన్ని విశాఖ నగరానికి కూడా అందించాలి’’ అన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రం గ్రాండ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ వైజాగ్‌లో జరిగాయి.

ఈ వేడుకలో అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘బాహుబలి’ తర్వాత బిగ్గెస్ట్‌ హిట్‌ సాధించిన చినబాబుగారు తన పేరును పెదబాబుగా మార్చుకోవాలి. మా గురువు, బావ అల్లు అరవింద్‌గారు బన్నీ (అల్లు అర్జున్‌) కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చారు. మెగా ఫ్యాన్స్‌కు చిరంజీవిగారు దేవుడైతే, అరవింద్‌గారు క్షేత్ర పాలకుడు లాంటివారు. చిరంజీవిగారి ప్రయాణంలో అరవింద్‌గారి పాత్ర ఎంతో కొంత ఉంది. ఒక రైటర్‌ డైరెక్టర్‌ అయితే ఎలా ఉంటుందో ఇదివరకు దాసరి నారాయణరావుగారిని చూశాం.. ఇప్పుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌గారిని చూస్తున్నాం’’ అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘మా నాన్న అల్లు రామలింగయ్యగారిని తలుచుకొని మాట్లాడుతున్నా. సినిమా అనేది అందరికంటే గొప్పది. ఇప్పుడు 2020లోనే కాదు.. 2060లోనూ ‘అల.. వైకుంఠపురములో..’ పాటలు పాడతారని ఒట్టేసి చెబుతున్నాను.. ‘శంకరాభరణం’ చిత్రం పాటలను ఇప్పటికీ పాడుకుంటున్నారు. ఒక గొప్ప సినిమాకు గొప్ప సంగీతం తోడైతే అది వందేళ్లు నిలిచిపోతుంది.. అలాగే మా సినిమాని కూడా వందేళ్లు ఉంచుతారు. త్రివిక్రమ్‌ సెల్యులాయిడ్‌ తాంత్రికుడు. ప్రేక్షకులు లేకపోతే మేము లేము, ఈ సినిమా లేదు, ఈ పండగ లేదు’’ అన్నారు. ‘‘విలువలతో సినిమా తియ్యండి..  మేమెందుకు ఆదరించమో చూపిస్తామని మీరంతా చెప్పారు.. అది మాకే కాదు, తెలుగు సినిమాకే నమ్మకాన్నిచ్చింది. తెలుగు సినిమాని బన్నీ ఎక్కడికో తీసుకెళ్లగలడు’’ అన్నారు త్రివిక్రమ్‌.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సినిమాలు ఫోన్లో, టీవీలో వచ్చేస్తున్నాయ్‌.. థియేటర్లకు జనం రావట్లేదు అనే పరిస్థితిలో.. మీరు మంచి సినిమా ఇవ్వండి, తెలుగువాళ్లం థియేటర్లకు వచ్చి చూస్తాం అని చెప్పిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా నాన్నగారు (అల్లు అరవింద్‌) చిరంజీవి, రజనీకాంత్‌గార్లతో, రామ్‌చరణ్, హిందీలో ఆమిర్‌ ఖాన్‌లతో ఇండస్ట్రీ రికార్డ్‌ కొట్టారు. ఎప్పటికైనా మా నాన్నగారితో ఇండస్ట్రీ రికార్డ్‌ సినిమా కొట్టాలి అనుకొనేవాణ్ణి. ఈ సినిమాతో ఫస్ట్‌ టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌ కొడుతున్నా. మా నాన్నతో ఇండస్ట్రీ రికార్డ్‌ కొట్టడమనే ఆనందాన్ని త్రివిక్రమ్‌గారిచ్చారు’’ అన్నారు. ‘‘త్రివిక్రమ్‌గారితో పనిచేయడానికి నాకు పదేళ్లు పట్టింది. అందుకే పదేళ్లు మించిపోయే పాట ఇచ్చాను’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్‌. ‘‘తెలుగు అభిమానుల్లా ఏ భాషలోనూ ఉండరు’’ అన్నారు పూజా హెగ్డే.

టైటిల్‌ ఫిక్స్‌ కాలేదు
‘ఆర్య, ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కలసి ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా టైటిల్‌ ‘సింహాచలం’ అంటూ పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ‘మా సినిమాకు ఇంకా ఏ టైటిల్‌ నిర్ణయించలేదు. ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదు’ అని చిత్రబృందం ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement