ప్రపంచంలో ఏ ప్రాంతాన కాలుమోపినా... కొత్తగా మనల్ని మనం ఆవిష్కరించుకోవచ్చు. ఉత్సాహాన్ని, ఉల్లాసాన్నిమూటగట్టుకోవచ్చు. కొత్త శక్తిని పుంజుకోవచ్చు. అందుకే పర్యటనలపై ప్రజలకు మక్కువ పెరిగింది. కాలం మారిందిఅని చెప్పడానికి ఆ దేశ పర్యాటక రంగంలో వచ్చిన అభివృద్ధినే ప్రామాణికంగా తీసుకోవచ్చు అనేదినిపుణుల అభిప్రాయం. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం..
సెప్టెంబరు 27...
పర్యాటకరంగాన్ని అభిమానించి, ఆదరించి, ప్రోత్సహించే వారందరికీ పండగరోజు. ప్రస్తుతం పర్యాటకరంగం ప్రపంచ రూపురేఖల్నే మార్చేసింది. ప్రపంచంలో ఎన్నో దేశాలు పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ తమ దేశ అభివృద్ధికి పర్యాటక రంగమే ప్రథమావధిగా పనిచేస్తున్నాయి. ఎంతో మందికి జీవనాధారం కల్పిస్తూ, కోటానుకోట్ల మందికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తున్న ఈ పర్యాటకర రంగం మరింత విస్తృతపరుస్తూ, మరింత అభివృద్ధి సాధించాలని ‘సాక్షి’ మనసారా కోరుకుంటోంది.
భారతదేశ జీవన విధానంలో పర్యాటక రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. దేశ సాంస్కృతిక జీవనంలోనే అనాది కాలం నుండి తీర్థయాత్రలు చేయడం ఒక భాగంగా ఉన్న దేశం మనది. మన దేశంలో ప్రతి యేటా కోటానుకోట్ల మంది చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను విహారయాత్రా ప్రదేశాలను సందర్శిస్తూ రావటం, ఆనందం పొందుతూ మరింత మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నది. పర్యాటక రంగానికి ఇంతటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టే సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం తమ ప్రాధాన్యతాంశాలలో పర్యాటక రంగం చాలా విశిష్టమైనదని చెప్పడం జరిగింది.
ఒత్తిడి నుంచి దూరంగా..
నిత్యం పనులతో మానసిక ఒత్తిడికి లోనయ్యేవారికి విహారయాత్రలు ఉల్లాసాన్ని, నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా తెలిసిన వారి ద్వారా లేదా ఇంటర్‌నెట్‌లో తగిన సమాచారాన్ని తీసుకుని సొంతంగానో లేదా ట్రావెల్ ఏజెంట్స్ ద్వారానో విదేశాలకో లేక స్వదేశంలోనో యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. విపరీతమైన పోటీతత్వం వల్ల కూడా టూరిజం ఇండస్ట్రీ పెరిగిపోయింది. మంచి ధరలకు టూర్ పాకేజీలు తయారు చేసుకొని యాత్రలకు వెళుతున్నారు.
కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు
భారతదేశ భౌగోళిక చరిత్రలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు సహజసిద్ధంగా ఏర్పడ్డ బీచ్‌లు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, చారిత్రాత్మక కట్టడాలు ఎన్నో అంశాలు దేశీయ పర్యాటకులను మాత్రమే కాకుండా ప్రపంచ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అందులో ప్రముఖంగా ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్‌మహల్, రాజస్థాన్‌లో రాజపుత్రుల కోటలు, ఇలా ఎన్నో చారిత్రాత్మక అంశాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
ఆధ్యాత్మిక టూరిజం
భక్తిసాగరంలో మునిగి తేలేవారికి టూరిజం ఒక వరంగా మారిపోయింది. ఇదివరకు రోజులలో యాత్రలకు వెళ్లాలంటే కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే వెళ్లే అవకాశం ఉండేది. కారణం వారు తిరిగి వచ్చే నమ్మకం చాలా తక్కువగా ఉండేది. కానీ, నేటి పరిస్థితులు దానికి భిన్నంగా, అనుకూలంగా మారిపోయాయి. కుటుంబం అంతా కలిసి వెళ్లే దిశగా టూరిజం పరిశ్రమ మార్చేసింది. యాత్రలకు వెళ్లాలి అనే ఆలోచన రావడం మొదలు చక్కటి అనుకూలమైన ప్రదేశాలు ఎంచుకొని దానికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తెలుసుకొని మరీ ప్రయాణమవుతున్నారు.
కాలం మారింది అనడానికి సాక్ష్యంగా టూరిజం పరిశ్రమను చూపించవచ్చు. అనాది కాలం నుండి మనదేశంలో ఆధ్యాత్మిక ఆధ్యాతిక టూరిజం పై మక్కువ ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు,లక్షలాది శైవ, వైష్ణవే దివ్య క్షేత్రాలు.. ఇలా ఎన్నో ఆలయాలు. వాటి ప్రాచీన చరిత్ర, శిల్పకళారీతులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ఈ రోజుల్లో ఏ దేశ పౌరుడిని పలకరించినా టూరిజం గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి విషయ పరిజ్ఞానం పెరిగిపోయింది. ప్రతివారూ తమ తమ జీవన విధానంలో భాగంగా పర్యటనల కోసం తప్పక సమయాన్ని, డబ్బును వెచ్చిస్తున్నారు. ఏ దేశంలో పర్యటించినా ఆ దేశంలో ప్రతి వందవ వ్యక్తిని ఒక పరదేశీయునిగా గుర్తించవచ్చు. ముఖ్యంగా భారతీయులు ఏ దేశానికి వెళ్లినా అక్కడ తప్పక కనిపిస్తారు. నాగరికత ప్రజలలో సరికొత్త దిశగా పరుగులు తీస్తోంది. భారతీయులు కొత్తదనానికి త్వరగా ఆకర్షితులవుతారు అనడానికి ఇది ప్రామాణికంగా చెప్పుకోవచ్చు.
పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్
నవ్యాంధ్ర ప్రదేశ్ అర్థికాభివృద్ధిలో కూడా పర్యాటకరంగ ప్రభావం ఎంతో విశిష్టమైనది. రాష్ట్ర పునఃనిర్మాణంలో పర్యాటకరంగం కూడా కీల పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రపంచంలోనే అతిగొప్ప వైష్ణవ దివ్యక్షేత్రం తిరుమల, శ్రీశైలంలోని మల్లికార్జున ఆలయం దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పవచ్చు. పంచారామాలు, శక్తిపీఠాలు.. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు ఎంతో విశాలమైన తీర ప్రాంతం కలిగిన ఈ రాష్ట్రానికి సహజసిద్ధంగా ఏర్పడిన బీచ్‌లు, కోనసీమలోని ప్రకృతి అందాలు... ఇలా ఎన్నో అంశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యతను గుర్తించి రాష్రప్రభుత్వం కూడా పర్యాటక రంగానికి పెద్ద పీట వేయడం జరుగుతుంది.
పర్యాటక రంగంలో తెలంగాణ
కోటి రతనాల వీణ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనునిత్యం వేలాది, లక్షలాది పర్యాటకులు సందర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరం. ఈ నగరంలో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు సుందరమైన పార్కులు, ఎన్నో రకాల ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, దేశీయ పర్యాటకులను మాత్రమే కాకుండా ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర పర్యాటక సంస్థ తెలంగాణ టూరిజం కూడా తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో రకాల ప్యాకేజీలను అందిస్తూ, పర్యాటక సంక్షేమానికి, పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ సందర్శనకు కూడా వేలాది భక్తులు తరలివస్తున్నారు. ఇటీవల కాలంలో దేశీయ పర్యాటక రంగం మాత్రమే కాకుండా అంతర్జాతీయ పర్యాటక రంగం కూడా విశేషంగా అభివృద్ధి సాధిస్తున్నది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులు విదేశీ టూర్స్ పైన కూడా మక్కువ పెరగడం మూలంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన విమానాశ్రయాలనుండి ఇతర దేశాల విమాన సర్వీసులు పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. పర్యాటకరంగం ప్రజల జీవనవిధానాలను మారుస్తుంది. ప్రజల ఆలోచనలను మారుస్తుంది. మొత్తంగా ప్రపంచ గమనాన్నే మార్చే అద్భుత శక్తి పర్యాటకరంగానికి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment