మొరాయిస్తున్నా.. మారరా? | Andhra Pradesh Tourism Department Running Damaged Boats | Sakshi
Sakshi News home page

మొరాయిస్తున్నా.. మారరా?

Published Tue, Sep 17 2019 12:00 PM | Last Updated on Tue, Sep 17 2019 12:00 PM

Andhra Pradesh Tourism Department Running Damaged Boats - Sakshi

ఏళ్లు గడుస్తున్నాయి.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రమాదం జరిగినప్పుడల్లా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.. అయినా పరిస్థితి మారదు.. ప్రమాద సమయంలోనే అంతా హడావుడి.. ఆ తర్వాత యథావిధి తంతు.. ఇదీ ఆంధ్రప్రదేశ్‌  పర్యాటక అభివృద్ధి సంస్థ తీరు.. ముఖ్యంగా సంస్థకు అధికంగా ఆదాయం తెచ్చిపెట్టే బోటింగ్‌ విషయంలో అధికారులు నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. కాలం చెల్లిన బోట్లకే రూ. లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించి తిప్పుతున్నారు తప్ప కొత్తవి కొనే ఆలోచన చేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది.

భవానీపురం(విజయవాడ పశ్చిమం): కాలం చెల్లిన బోట్లతో కాలక్షేపం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఉన్నతాధికారుల వైఖరి ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చుతోంది. టూరిజం అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పుకునే అధికారులు ఆదాయాన్ని తెచ్చిపెట్టే బోట్ల కొనుగోలుపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఏపీటీడీసీ నడుపుతున్న బోట్లన్నీ దాదాపు 15 నుంచి 20 ఏళ్లకు పూర్వం కొనుగోలు చేసినవే.

విజయవాడలో బోటింగ్‌ ఇలా..
విజయవాడ బరంపార్కు నుంచి భవానీ ద్వీపానికి రోజూ బోట్‌ సర్వీసులు నడుస్తున్నాయి. గతంలో బరంపార్క్‌ నుంచి ఇబ్రహీంపట్నం ఫెర్రీలోగల పవిత్ర సంగమం వరకు బోట్లు నడిచేవి. వాటికి జలవనరుల శాఖ కూడా అనుమతించింది. 2017లో పవిత్ర సంగమం దగ్గర ఒక ప్రైవేట్‌ బోటు బోల్తాపడి 22 మంది మృత్యువాత పడటంతో ఆ మార్గంలో బోట్లు నడిపేం దుకు జలవనరుల శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో పవిత్ర సంగమానికి బోట్లు నిలిపివేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానంతరం దిగువనున్న దుర్గాఘాట్‌ దగ్గర ఏపీటీడీసీ ఏర్పాటు చేసిన బోట్ల ద్వారా భవానీ ద్వీపం వెళ్లేవారు. ఇక్కడి నుంచి రోజూ నాలుగైదు సర్వీసులు నడిచేవి. కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో కొంత కాలంగా సర్వీసులు నిలిచాయి.

అన్నీ కాలం చెల్లిన బోట్లే
ఏపీటీడీసీ విజయవాడ డివిజన్‌లోని భవానీపురం బెరంపార్క్‌లోగల బోటింగ్‌ పాయింట్‌లో ఉన్న 17 బోట్లలో ఒకటీ రెండు మినహా అన్నీ కాలం చెల్లినవే.
బరంపార్క్‌ నుంచి భవానీ ద్వీపానికి రెగ్యులర్‌గా తిరిగే బోట్లలో భవానీ బోటు ఒకటి. దీనిని 2006లో వైజాగ్‌లోని సీకాన్‌ సంస్థ నుంచి కొనుగోలు చేశారు. దీనిని కొని 13 ఏళ్లు కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతోంది.
ముంబై పోర్ట్‌లో తయారైన కృష్ణవేణి, ఆమ్రపాలి బోట్లను 1998లో కొన్నారు. ఇవి కూడా మరమ్మతులకు గురవుతూనే ఉంటాయి. డీజిల్‌ ఇంజిన్‌తో నడిచే ఈ బోట్లన్నీ 50 మంది కెపాసిటీ కలిగినవే.
అడపాదడపా బయటకుతీసే (పార్టీలు, ఫంక్షన్ల కోసం) బోధిసిరి బోటుకూ మరమ్మతులు షరా మామూలే. ఇదీ డీజిల్‌ ఇంజిన్‌తోనే నడుస్తుంది. దీనికి సిబ్బంది పెట్టిన ముద్దు పేరు వైట్‌ ఎలిఫెంట్‌. దీని కెపాసిటీ 100 మంది.  ఏసీ సౌకర్యం ఉన్న దీనిని 2004లో కొన్నారు.

రూ.1.20కోట్ల ఏసీ బోటు నిరుపయోగం
గత ఏడాది మార్చిలో రూ.1.20 కోట్లతో కొనుగోలు చేసిన ఏసీ (పలనాడు) బోటు నిరుపయోగంగా ఉంది. 36 సీటింగ్‌ కలిగిన ఈ బోటుకు చార్జిని రూ.120గా నిర్ణయించడంతో సందర్శకులు ఆసక్తి చూపడం లేదు.  ఈ బోటు ఖర్చుతో మూడు మంచి సాధారణ బోట్లు వస్తాయని సిబ్బంది చెబుతున్నారు.
ధరణి అనే బోటును రూ.25లక్షలతో కొనుగోలు చేశారు. దీని సీటింగ్‌ కెపాసిటీ 10 మంది మాత్రమే. దీనికి కూడా రూ.120లు చార్జీ వసూలు చేస్తున్నారు (15 నిముషాలపాటు రౌండ్‌ ట్రిప్‌) పర్యాటకులు ఆసక్తి చూపకపోవడంతో దీనినీ పక్కన పడేశారు. ఈ రెండు లగ్జరీ బోట్లను గంట సేపు అద్దె తీసుకుంటే రూ.5,900లు చార్జిగా నిర్ణయించారు.

ప్రైవేటు సంస్థలు ఇలా..
ద్వీపంలో మూడు ప్రైవేట్‌ సంస్థలు (అమరావతి బోటింగ్‌ క్లబ్, చాంపియన్‌ యాచెట్‌ క్లబ్, సింపుల్‌ వాటర్‌ స్పోర్ట్స్‌) వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహిస్తున్నాయి. ద్వీపానికి వచ్చిన సందర్శకులను వివిధ రకాల బోట్ల ద్వారా నదిలో తిప్పుతారు. ఇవి బరంపార్క్‌ వరకు వచ్చి సందర్శకులను ద్వీపంకు తీసుకువెళ్లవు. ఈ మేరకు ఆయా సంస్థలతో ఏపీటీడీసీ ఒప్పందం చేసుకుంది.

నెలకు రూ.30 లక్షల ఆదాయం..
4 పోలీక్రాప్స్‌ స్పీడ్‌ బోట్లు, మూడు జెట్‌స్కీ బోట్లు తరచూ రిపేర్లకు గురవుతూనే ఉన్నాయి. ఇవన్నీ పెట్రోలు ఇంజిన్లతో నడిచేవే. వీటి మరమ్మతుల కోసం రూ.లక్షలు వెచ్చించే ఏపీటీడీసీ ఉన్నతాధికారులు కొత్త బోట్లు కొనుగోలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. మొత్తానికి బోట్ల ద్వారా ఏపీటీడీసీకి నెలకు సుమారు రూ.20 నుంచి రూ.30లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. అంత ఆదాయం లభించే బోటింగ్‌ వ్యవస్థపై నిర్లక్ష్యం వహించడంపై అటు ప్రజలు, ఇటు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement