ప్రకృతి సోయగాల నెలవు
సూర్యలంక
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని నేను. వారాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. హాయిగా గడపాలనుకున్నాం మా మిత్రబృందం. అంత చక్కని ప్రాంతం ఎక్కడా అని వెతికితే మన రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాలో ఉన్న ఓ అద్భుతమైన ప్రాంతం గురించి తెలిసింది. అదే సూర్యలంక. ఐదుగురం స్నేహితులం కలిసి కారులో బయల్దేరాం. ఉదయాన్నే ఐదు గంటల ప్రాంతంలో బయల్దేరి, మరో ఐదున్నర గంటల్లోగా సూర్యలంకకు చేరుకున్నాం.
గుంటూరు జిల్లాలోని బాపట్ల నుంచి 9 కి.మీ దూరంలో ఉన్న పల్లె అది. ఇక్కడ ఓడరేవు కూడా ఉంది. విశాలంగా, ప్రకృతి రమణీయంగా కనువిందుచేసే ఈ ప్రాంతం గురించి ఇంత ఆలస్యంగా తెలుసుకున్నందుకు విచారించినా, ఇప్పటికైనా చూడగలిగినందుకు తెగ సంతోషించాం. ఇక్కడికి దగ్గరలోనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వారి ఎయిర్ బేస్ ఉంది. కాని లోపలికి ప్రవేశం నిషిద్ధం.
ఆంద్రప్రదేశ్ పర్యాటక శాఖ వారి రిసార్ట్‌లు ఉన్నాయి. అలలు మరీ ఎత్తుగా కాకుండా చిన్నవిగా రావడం వల్ల ఇక్కడి తీరం సముద్రస్నానానికి అనువుగా ఉంటుంది. సూర్యలంకకి దాదాపు 16 కి.మీ దూరంలో ఓడరేవు బీచ్ ఉంది. సముద్రతీరానికి దగ్గర్లో ఉన్న చిన్న ఈ పల్లెటూరు ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో ఒక వెలుగు వెలిగిందని విన్నాం. ఇక్కడ నుంచే సుమత్రా, జావా ద్వీపాలకు సరుకులు రవాణా చేసేవారట. సుమారు రెండు వేల కుటుంబాలు ఇక్కడ చేపల వేట మీద ఆధారపడి జీవిస్తున్నాయి.
ఇక్కడే ఇండియన్ టుబాకో కంపెనీ వారిది ఓ అతిథి గృహం కూడా ఉంది. అందులో ఓ ప్రైవేటు బీచ్, విదేశాలను తలపించే సకల సౌకర్యాలు ఉన్నాయని తెలుసుకున్నాం. వేసవిలో ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడే వాటర్ స్కూటర్స్‌లో షికార్ చేశాం. అలలమీద ప్రయాణం మహా అద్భుతంగా అనిపించింది. సూరాస్తమయం అందాలను తిలకించడంతో రాత్రి ఇక్కడి ప్రాంతీయ వంటకాలతో చేసిన విందుభోజనాన్ని ఆస్వాదించాం. ఆ రాత్రి సూర్యలంకలోనే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయాన్ని తిలకించి, తిరుగు ప్రయాణం అయ్యాం.
- రితేష్, ఇ-మెయిల్
- హైదరాబాద్ నుంచి 320కి.మీ. ఇక్కడకు బాపట్ల రైల్వే స్టేషన్ 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
- సూర్యలంకకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. గుంటూరు నుంచి బస్సులు ఉన్నాయి.
-
బస చేయడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ వారి హరితా రిసార్ట్స్ ఉన్నాయి.