వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ స్రవంతిరాయ్, పక్కన సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు
సాక్షి, తెనాలి రూరల్(గుంటూరు): కోర్టు వాయిదాకు వచ్చి వెళ్తున్న సమయంలో అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కేసును పోలీసులు ఛేదించారు. భార్య కుటుంబీకులే అతడిని హతమార్చారని తేల్చారు. దీంతో హతుడి మామ, ఇద్దరు బావమరుదులు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. స్థానిక వన్‌టౌన్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ కె.స్రవంతిరాయ్ కేసు వివరాలను వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం..
కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడని..
వేమూరు మండలం చావలి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నలుకుర్తి సుబ్బయ్యకు తెనాలి మండలం మల్లెపాడుకు చెందిన జయశ్రీతో 2011లో పెళ్లైంది. భార్యపై అనుమానంతో సుబ్బయ్య ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తుండేవాడు. దీంతో జయశ్రీ 2018లో భర్త, అత్త, మరిదిపై తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టింది. కేసు వాయిదాలు నడుస్తున్న క్రమంలో 2019లో కోర్టు ప్రాంగణం సమీపంలో జయశ్రీ కుటుంబసభ్యులు, సుబ్బయ్య కుటుంబసభ్యులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.
చదవండి: వైరల్ వీడియో: అందరూ చూస్తుండగానే రోడ్డుపై కర్రలతో హల్‌చల్
దీనిపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఈ కేసులు కోర్టులో నడుస్తున్నాయి. ఈ క్రమంలో తన భార్య ప్రవర్తన మంచిది కాదని సుబ్బయ్య కోర్టులో బహిరంగంగా చెప్పాడు. మరోవైపు పెద్ద బావమరిది జయచంద్ర కాపురాన్ని లేనిపోనివి చెప్పి సుబ్బయ్య చెడగొట్టాడు. ఇటీవల వివాహమైన రెండో బావమరిది సుధాకర్ కాపురాన్నీ చెడగొట్టే యత్నం చేస్తున్నాడని తెలుసుకున్న జయశ్రీ కుటుంబ సభ్యులు ఎలాగైనా సుబ్బయ్యను అంతమొందించాలని పథకం రచించారు.
చంపి.. పెట్రోల్ పోసి తగలబెట్టారు
ఈ నేపథ్యంలో గత డిసెంబర్ 31న కోర్టు వాయిదాకు తెనాలి వచ్చి వెళ్తున్న సుబ్బయ్యను బావమరుదులు జయచంద్ర, సుధాకర్, మామ రవి కారులో వెంబడించారు. తెనాలి–చందోలు రహదారిలో కూచిపూడి లాకులు దాటాక యలవర్రు వంతెన సమీపంలో కారుతో అడ్డగించి ఒక్కసారిగా హెల్మెట్‌తో దాడి చేశారు. షాక్‌లో ఉన్న సుబ్బయ్యను కారులో ఎక్కించి, కండువాను మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం కారు డిక్కీలోకి మృతదేహాన్ని మార్చి కొల్లిపర మండలం అన్నవరపులంకకు తీసుకెళ్లారు. అక్కడ తమ బంధువులైన కాకాని రమేష్, అతని కుమారుడు సతీష్‌బాబుతో కలసి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం అయిలూరు పంచాయతి ములకలపల్లి లంక గ్రామానికి వెలుపల కృష్ణా నది ఒడ్డున పిచ్చి తుమ్మ చెట్లలో మృతదేహాన్ని తీసుకెళ్లి పడేశారు. అనంతరం పెట్రోలు పోసి తగులబెట్టారు.
చదవండి: మైనర్‌ను గర్భవతిని చేసిన ఘనుడు.. పెళ్లి చేసుకోవాలని కోరితే..
వీఆర్వో వద్ద లొంగుబాటు
కోర్టు వాయిదాకు వచ్చిన తన సోదరుడు కనిపించటం లేదంటూ సుబ్బయ్య తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు జనవరి 2న అదృశ్యం కేసు నమోదు చేశారు. సుబ్బయ్య మామ, బావమరుదులు, భార్య, అత్త, చిన మామపై నిఘా ఉంచారు. మృతుడి కాల్ డేటా, నిందితుల కాల్ డేటాను లోతుగా పరిశీలించారు. 31న అనేకసార్లు ఫోన్లు చేసిన నిందితులు అనంతరం వాటిని స్విచాఫ్ చేసినట్టు గుర్తించారు. సతీష్‌బాబు కొత్త సిమ్ వాడుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు అన్నవరపులంక వెళ్లి అతని కదలికలపైనా నిఘా పెట్టారు.దీంతో పోలీసులకు తెలిసిపోయిందనే భయంతో నిందితులు మల్లెపాడు వీఆర్వో వద్దకు వెళ్లి లొంగిపోయారు. వీరిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. నిందితులు వినియోగించిన కారు, రెండు మోటారుసైకిళ్లు, మృతుడి మోటారుసైకిల్‌తోపాటు అతని ఎముకలు, బూడిదను గుర్తించి స్వాధీనపర్చుకున్నట్టు డీఎస్పీ వివరించారు. ప్రాథమిక ఆధారాల్లేకున్నా నిందితులను గుర్తించి, సాక్ష్యాలనూ సేకరించిన వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావును డీఎస్పీ అభినందించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment