నిందితుడు వెంకటకోటయ్య, స్వాతి (ఫైల్)
తెనాలిరూరల్: ఓ వ్యక్తి తన భార్యను బతికున్నంతకాలం అనుమానంతో వేధించాడు. చివరికి ఆమెను కత్తితో నరికి చంపేశాడు. రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహంపై మాత్రం పూలు, పూలమాలలు ఉంచి నివాళి అర్పించాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ ఘటన గురువారం జరిగింది. తెనాలికి చెందిన స్వాతి (38)కి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన లారీ డ్రైవర్ కాకర్ల వెంకట కోటయ్యతో సుమారు 17 ఏళ్ల కిందట వివాహమైంది.
తెనాలిలో నివాసం ఉంటున్న వీరికి ఇంటర్, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో స్వాతి పట్టణంలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తూ అక్కడే బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంది. తొలుత తెనాలిలోని పాండురంగపేటలో ఉన్న వీరు ఇటీవల నాజరుపేటలో మరో అద్దె ఇంట్లో చేరారు. ప్రస్తుతం స్వాతి నందులపేట ఘంటావారివీధిలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో స్వాతికి మరో యువకుడితో అక్రమ సంబంధం ఉందని వెంకట కోటయ్యకు అనుమానం ఏర్పడింది.
భార్యతో తరచూ గొడవపడేవాడు. ఇటీవల ఇద్దరికీ ఘర్షణ జరగగా, స్వాతి పుట్టింటికి వెళ్లి పోయింది. కొద్దిరోజుల కిందట ఆమెను మళ్లీ తన వద్దకు తీసుకువచ్చిన వెంకట కోటయ్య తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. భార్యపై మరింత అనుమానం పెంచుకుని వేధిస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో గురువారం స్వాతి బ్యూటీ పార్లర్‌లో ఉండగా, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెంకట కోటయ్య వెళ్లి గొడవపడి కత్తితో ఆమె ముఖం, మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. స్వాతి అక్కడికక్కడే మృతిచెందింది.
వెంకట కోటయ్య ముందుగానే తెచ్చుకుని బయట ఉంచిన పూలు, పూలమాలలను రక్తపు మడుగులో పడి ఉన్న స్వాతి మృతదేహంపై వేసి నివాళి అర్పించాడు. అనంతరం తాము అద్దెకు ఉండే ఇంటి సమీపంలోని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్యను హత్య చేసినట్లు చెప్పి లొంగిపోయాడు. రూరల్ పోలీసులు ఈ విషయాన్ని టూ టౌన్ పోలీసులకు తెలియజేయడంతో సీఐ ఎస్.వెంకట్రావు, ఎస్‌ఐ శివరామయ్య తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
వివాహేతర సంబంధం నేపథ్యంలోనే స్వాతి హత్య జరిగినట్లు తెలుస్తోందని సీఐ తెలిపారు. తన కుమార్తె స్వాతిపై అనుమానంతోనే భర్త కోటయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె తండ్రి వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ విషయమై ఇద్దరూ తరచూ గొడవపడేవారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment