లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమేథీలో కుటుంబమంతా తుపాకీ కాల్పుల్లో మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలను ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. మృతులను టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సునీల్ కుమార్, ఆయన భార్య పూనమ్ భారతి, ఆరేళ్లు-ఏడాది వయసున్న ఇద్దరు కూతుర్లుగా గుర్తించారు. ఈ ఘటన గురువారం వెలుగుచూడగా.. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నిందితుడు చందన్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.
నిందితుడు విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించినట్లు అమేథీ ఎస్పీ అనూప్ సింగ్ వెల్లడించారు. ఈ హత్యల వెనక వివాహేతర సంబంధమే కారణమని తేలిందన్నారు. నిందితుడికి, మహిళకు గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఒకటిన్నర సంవత్సరంగా పూనమ్‌తో అక్రమంగా సంబంధం కలిగి ఉన్నాడని అయితే ఇటీవల ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ దెబ్బతినడంతో అతడు ఒత్తిడికి గురైనట్లు తెలిపారు.
ఆ కారణంగానే ఆవేశంలో.. ఇంట్లోకి చొరబడి నలుగురిని కాల్చిచంపినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. అతడు ఒక్కడే ఈ ఘోరాలకు పాల్పడ్డాడని, ఘటనాస్థలంలో లభించిన బుల్లెట్లన్నీ ఒకే పిస్టల్ నుంచి రావడం వల్లే తాము ఆ అంచనాకు వచ్చినట్లు తెలిపారు.
కాగా సునీల్ కుమార్, అతని భార్య పూనమ్, వారి ఇద్దరు కుమార్తెలు గురువారం అమేథీలోని భవానీ నగర్‌లోని వారి ఇంటిలో కాల్పుల్లో హత్యకు గురయ్యారు. నిందితుడు చందన్ వర్మ తుపాకీతో 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. కుటుంబంలోని అందరినీ చంపిన తర్వాత తనను తాను కాల్చుకోవాలని ప్రయత్నించాడు. కానీ బుల్లెట్ మిస్ అయింది. మళ్లీ కాల్చుకునే ధైర్యం చేయలేక అక్కడి నుంచి పారిపోయాడు. ఇక తీవ్రగాయాలైన బాధితులను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఢిల్లీకి పారిపోతున్న నిందితుడిని నోయిడాలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పోలీస్ అధికారి తుపాకీని లాక్కొని తప్పించుకునే ప్రయత్నంలో అతను కాల్పుల్లో గాయపడ్డాడు. తాజాగా ఆ ఘటన సమయంలో వాడిన ద్విచక్ర వాహనం, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ హత్యల నేపథ్యంలో కొన్ని నెలల క్రితం పూనమ్ పెట్టిన పోలీసు కేసు విషయం వెలుగులోకి వచ్చింది. వర్మ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆమె అందులో ఫిర్యాదు చేశారు. దీని గురించి ఫిర్యాదు చేస్తే.. చంపేస్తానని బెదిరించాడని, తమ కుటుంబానికి ఏదైనా హాని తలపెడితే అందుకు అతడే కారణమని పేర్కొంది. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment