సాక్షి, అమరావతి : ప్రఖ్యాత పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమైన అమరావతి అభివృద్ధి పనులు ఐదేళ్లుగా మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాలానే.. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి నగర పంచాయతీ హోదా కూడా తీరని కలగానే మిగిలిపోయింది. పురాణాలు, ఇతిహాసాల కాలం నుంచి అమరావతి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రసిద్ధిని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండగా ఐదేళ్లుగా ఆ దిశగా చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో ఇచ్చిన నగర పంచాయతీ హామీ మళ్లీ ఎన్నికలు వచ్చినా అమలు కాలేదు.
పనుల్లో అయోమయం..నాణ్యతపై అనుమానం
అమరావతి వారసత్వ నగర అభివృద్ధి పనులు ఎంత వరకు వచ్చాయంటే ఎవ్వరూ చెప్పలేని అయోమయం నెలకొంది. ఈ పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం సాగుతోంది. 2015 జనవరిలో కేంద్రప్రభుత్వం అమరావతిని వారసత్వ నగరంగా గుర్తించి రూ.99కోట్లు కేటాయించి, తొలి విడతగా రూ.22.74 కోట్లు మంజూరు చేసింది. ఈ పనుల కోసం జాతీయస్థాయి కంపెనీలు అంచనాలు రూపొందించినా ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పింది.
అధికారులు చెప్పే మాటలకు, జరిగే పనులకు పొంతన ఉండటంలేదు. ఈ పనుల పరిశీలనకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వ అధికారులు పనుల పురోగతి, నిధుల వినియోగం, నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. 2018 జనవరి 31వ తేదీన కేంద్ర హోం శాఖ అఫైర్స్ కార్యదర్శి సుమిత్ గరకర్ పనులను పరిశీలించి నాణ్యత, పనుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారంటే పనులు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
నిలిచిపోయిన పనులు
- అమరేశ్వరాలయానికి ఉత్తరంగా కృష్ణానదిలో ధ్యానబుద్ధ ఘాట్ నుంచి అమరేశ్వర ఘాట్ వరకు చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.
- ధరణికోట నూనెగుండం చెరువు పనులు కంచె వేయడానికే పరిమితమయ్యాయి.
- అమరావతి, ధరణికోట గ్రామాల్లో చారిత్రక ప్రదేశాలను కలుపుతూ చేపట్టిన హెరిటేజ్ వాక్ పనులు పూర్తికాలేదు.
- ధ్యానబుద్ధ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తిస్థాయిలో పూర్తికాలేదు.
- నందనవనం కోసం 16 ఎకరాల భూసేకరణ పూర్తయినా పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి.
- పురావస్తు మ్యూజియంలో అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. సీసీ కెమెరాలు, లైట్లు మాత్రం ఏర్పాటు చేశారు.
- కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఫుష్కరఘాట్‌లు నేడు వ్యర్థాలతో నిండిపోయాయి. రాత్రిళ్లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది
- గ్రామాలకు నాలుగు వైపుల అర్చీల నిర్మాణం పూర్తయినా బౌద్ధ సంస్కృతి, శైవ సంప్రదాయాలు ప్రతిబింబించక కళా విహీనంగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన ప్రతిపాదిత పనులను అసలు మొదలుపెట్టనే లేదు.
Comments
Please login to add a commentAdd a comment