no development
-
కిలోమీటర్లు కాలినడక.. ‘డోలీ’ ప్రయాణమే దిక్కు
రాళ్లల్లో..ముళ్ల దారుల్లో అడవి బిడ్డలు అవస్థలు పడుతున్నారు. పురుటి నొప్పులు వస్తే నిండు గర్భిణిని డోలి కట్టి కొండలు, గుట్టలపై కాలినడకన మోసుకుపోవడం తప్ప వేరే మార్గం లేక నరకం చూస్తున్నారు. నిధులున్నా.. ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నా, నిబంధనల బంధనాల వల్ల నేటికి దారులు ఏర్పడలేదు. దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతూ అభివృద్ధికి దూరమవుతున్నారు. వారి పిల్లలు, యువత చదువు కోవడానికి వెళ్లలేక నిరక్షరాస్యులుగానే మిగిలిపోతున్నారు. దీంతో గిరిజనులు తమను తామే బాగుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రహదారులు లేని గ్రామాలకు తామే చందాలు వేసుకుని రోడ్లు వేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రోడ్డు వేసిన తర్వాతే ఓటు అడగడానికి మీ ఊరు వస్తామని టీడీపీ హయాంలో సాలూరు మాజీ ఎమ్మెల్యే బంజ్‌దేవ్ అప్పట్లో కొదమ పంచాయతీ చింతామల గిరిశిఖర గ్రామ ప్రజలకు మాటిచ్చారు. 15 రోజుల్లోనే రోడ్డు ప్రారంభిస్తామన్నారు. రోడ్డు పనుల కోసం తుప్పలు కొట్టిస్తున్నట్లు చెప్పి సమావేశానికి రమ్మన్నారు. తీరా అక్కడికి వెళితే చెప్పులతో కొట్టారని పోలీసు కేసు పెడతానంటూ గిరిజనులను బెదిరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా అనేకసార్లు మోసపోయిన 125 గిరిజన కుటుంబాలు కలిసి..ఉన్న బంగారం, భూమి తాకట్టు పెట్టి, ఆవులు, గేదెలు, మేకలను అమ్మి, అదీ చాలక షావుకారు వద్ద అప్పుచేసి, ఇంటికి రూ.7 వేలు చొప్పున చందాలు పోగుచేసుకున్నారు. మరికొంత రుణాలు తీసుకున్నారు. ఆ సొమ్ముతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా బారి జంక్షన్ వరకూ సొంతంగా రహదారి వేసుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం కార్యాలయం జిల్లా అధికారులను వివరాలు కోరింది. మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గిరిజనులను అభినందిస్తూ, త్వరలోనే వచ్చి కలుస్తానన్నారు. అయితే ఇది ఆ ఒక్క ఊరి సమస్య మాత్రమే కాదు. ఇలాంటి ఎన్నో పల్లెలకు అడవిలో రహదారులు లేవు. సాలూరు మండలంలో కొదమ పంచాయితీలో కొదమ, చినచోర, ఎం.చింతలవలస, అడ్డుగుడ, కోనంగివలస, చింతామల, లొద్ద, బందపాయి, చిలకమెండంగి, సిరివర, కోయిమల, కానుపాక, గుంజేరి, పట్టుచెన్నేరు పంచాయితీ శిఖపరువు, పగులుచెన్నేరు పంచాయితీ ఎగువమెండంగి, గంజాయిభద్ర పంచాయతీ పనికిలోవ, రణసింగి, సిమ్మగెడ్డ, ఎగువపనికి, డెన్సరాయి పంచాయితీలో డెన్సరాయి, జిల్లేడువలస, సంపంగిపాడు పంచాయతీలని ఎగువరూడి, దిగువరూడి, సుల్లారి, సంపంగిపాడు, పువ్వలవలస, జిల్లేడువలస పంచాయతీలో నారింజపాడు, బెల్లపాకలు, బొడ్డపాడు తదితర గిరిశిఖర గ్రామాలకు నేటికీ సరైన రహదారి లేక అక్కడి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గిరిశిఖర, అటవీ, మైదాన ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తున్నారు. గిరిశిఖర గ్రామాల్లో సవర, కోదులు, జాతాపు తెగలకు చెందిన గిరిజనులున్నారు. అడవుల్లో జాతాపు, గదబ, సవర, కొండదొర తెగల వారున్నారు. మైదాన ప్రాంతాల్లో ఎరుకులు, లంబాడిలు (సుబాగి/నాయికిలు), యానాదు, గదబ తెగలు ఉన్నాయి. వీరంతా రహదారులు లేక కష్టపడుతున్నారు. గిరిశిఖర గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉంది. అక్కడి ప్రజలు చెలమలు, ఊటనీరు తాగుతున్నారు. పూరిళ్లు, రేకుల ఇళ్లలోనే నివసిస్తున్నారు. వివాదం ఊబిలో కోటియా.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్ ఈ రెండు జిల్లాల పరిధిలో కొఠియా పంచాయతీలో ఉన్న 34 గ్రామాలనే కొఠియా గ్రూపు గ్రామాలుగా పిలుస్తున్నారు. కొఠియా గిరిశిఖర గ్రామాల్లో దాదాపు 15 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో 3,813 మంది ఓటర్లు ఆంధ్రాలోనూ, ఒడిశాలోనూ ఓటు వేస్తున్నారు. 1936లో ఒడిశా ఏర్పడినప్పుడు గానీ ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు గానీ ఈ గ్రామాల్లో సర్వే జరగలేదు. ఏ రాష్ట్రంలోనూ వీటిని కలుపలేదు. ఈ గ్రామాలను తమవంటే తమవేనని ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీంతో 1968లో ఇరు రాష్ట్రాలూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాల్సిందిగా 2006లో న్యాయస్థానం సూచించింది. అయినా పరిష్కారం లభించలేదు. వైఎస్ హయాంలో.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రత్యేక కృషితో కొటియా పల్లెల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యేవి. దండిగాం నుంచి కొఠియాకు తారు రోడ్డు మంజూరు చేయించారు. ఎగువశెంబి వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. రాజశేఖరరెడ్డి హఠాన్మరణం, తదితర కారణాల వలన రోడ్డు ఫార్మేషన్ జరిగినా నిర్మాణం పూర్తికాలేదు. రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాంత గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొటియా గ్రామాలను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ కొటియా గ్రూప్ గ్రామాల్లో ఏ రోడ్డు నిర్మాణం చేపట్టినా రిజర్వ్‌ఫారెస్ట్ నిబంధనలు అడ్డుపడుతున్నాయి. ఇదే ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం రోడ్లు వేస్తుంటే మాత్రం అటవీశాఖ అభ్యంతరం తెలపకపోవడాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజలు తప్పుబడుతున్నారు. అయితే జిల్లా స్థాయిలో తాము ఏదీ ఆపడం లేదని జిల్లా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సీఎం దృష్టి సారించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాత మా ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. గిరిశిఖర గర్భిణులకు సాలూరులోని వైటీసీలో ఏర్పాటు చేసిన గిరిశిఖర గర్భిణుల వసతి గృహం ఎంతగానో ఉపయోగపడుతోంది. 2019 అక్టోబర్ 31న సాలూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌హరిచందన్ దృష్టికి మా ప్రాంత సమస్యలను, కొటియా వివాదాలను తీసుకువెళ్లాం. ఇక్కడి సమస్యలపై నటుడు సోనూసూద్ స్పందించి మా ప్రాంతానికి వస్తాననడం శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వం అటవీ చట్టాలతో అడ్డుపడకుంటే మా ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. –పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే చట్టప్రకారమే నడుచుకుంటున్నాం గిరిజన గ్రామాలకు రహదారులు వేయకుండా అటవీశాఖ అడ్డుకుంటోందనే ఆరోపణలు సరికాదు. నేను ఈ జిల్లాకు వచ్చి రెండు నెలలైంది. ఈ కొద్ది సమయంలోనే పెండింగ్ ఫైళ్లు అన్నీ క్లియర్ చేశాం. ప్రస్తుతం ఏ ఒక్క ఫైలు కూడా మా స్థాయిలో పెండింగ్ లేదు. ప్రాంతీయ కార్యాలయానికి, రాష్ట్ర అధికారులకు, కేంద్రానికి పంపించినవి కొన్ని అక్కడ పెండింగ్ ఉంటే ఉండవచ్చు. గిరిజనులకు మంచి చేయాలనే మాకూ ఉంటుంది. కానీ అటవీ చట్టానికి లోబడే మేము పనిచేయాలి.ఎక్కడైనా మా వల్ల అభివృద్ధి ఆగిందని మా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా విచారణ జరుపుతాం. –సచిన్ గుప్తా, అటవీశాఖ జిల్లా అధికారి -
మల్లన్నను కేసీఆర్ మోసం చేశారు : కోమటిరెడ్డి
సాక్షి, సిద్దిపేట : కొమురవెల్లిలో డబుల్ రోడ్లు వేస్తానని, రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతానని ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్ ప్రజలతో పాటు కొమురవెల్లి మల్లన్నను మోసం చేశారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొన్న వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మల్లన్న ఆశీస్సులతో రైతులు, ఇక్కడికి వచ్చే భక్తులు సుఖసంతోషాలతో ఉండాలని తాను మల్లన్న స్వామిని కోరినట్లు కోమటిరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పాలన చేపట్టి 6 సంవత్సరాలు గడుస్తున్నా కొమురవెల్లిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని వెల్లడించారు. కమీషన్ల ప్రాజెక్టులకు రూ.200 కోట్లు కేటాయించే కేసీఆర్ దేవాలయానికి కేటాయించడా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చైనా సరే కొమురవెల్లిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కొందరు రాజకీయాలు చేసి మల్లన్న శైవక్షేత్రం పక్కనే శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, దేవాలయం పక్కన శ్మశానవాటికను నిర్మించొద్దని తాను కలెక్టర్‌ను కలిసి కోరినట్లు తెలిపారు. అందుకు కలెక్టర్ వెంటనే స్పందిస్తూ అక్కడ శ్మశాన వాటికను ఏర్పాటు చేయమని తనకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అడిషనల్ డిసిపి నర్సింహారెడ్డి అక్రమ అరెస్టును తాను తీవ్రంగా ఖండిసున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. హరీశ్‌రావు వెంటనే డిసిపి అరెస్టుపై స్పందించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. -
గుట్టు రట్టవుతుందనే బయటపెట్టట్లేదు..
సాక్షి, సిటీబ్యూరో : ఆరోగ్య రాజధాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో దూసుకుపోతుంటే మన ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రం ఇంకా పాత పద్ధతులనే అనుసరిస్తున్నాయి. మందులు, వైద్య పరికరాల కొనుగోలు, ఇతర అభివృద్ధి పనుల్లో పారదర్శంగా వ్యవహరించాల్సిన ఆస్పత్రులు ఆయా అంశాల్లో ఎంతో గోప్యత పాటిస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం కనీసం ఆస్పత్రి పేరుతో ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయలేని దుస్థితి. వైద్య విభాగాలు, నిపుణులు, సేవల వేళలు, ఓపీ, ఐపీ రిజిస్ట్రేషన్లు కంప్యూటర్లో పొందుపర్చేందుకు చర్యలు చేపట్టక పోవడం హాస్యస్పదం. ఫలితంగా మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లు మాత్రమే కాదు..వివిధ సేవలు, అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపుల్లోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ విభాగంలో ఎంత మంది వైద్యులు పని చేస్తున్నారు. ఎన్ని పడకలు ఉన్నాయి. ఏఏ వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. తదితర వివరాలు బయటికి తెలియడం లేదు. నగరంలో ఒక్క నిమ్స్ మినహా మరే ఇతర ఆస్పత్రికి ప్రత్యేక వెబ్సైట్ లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. లోపించిన పారదర్శకత... ప్రతిష్టాత్మాక ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా ఉస్మానియా సహా సుల్తాన్‌బజార్ ప్రభుత్వం ప్రసూతి వైద్యశాల, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల, ఫీవర్ ఆస్పత్రి, ఈఎన్టీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం, సనత్‌నగర్‌లోని ఛాతి ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. గాంధీ వైద్య కళాశాలకు అనుబంధంగా గాంధీ జనరల్ ఆస్పత్రి కొనసాగుతోంది. వీటిలో ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి మినహా ఇతర ఆస్ప త్రులేవీ ఇప్పటి వరకు ఆన్లైన్లో ఖాతా తెరవలేదు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు ఇటీవల వెబ్సైట్ ఓపెన్ చేసినప్పటికీ..ఆస్పత్రి చరిత్ర వంటి సాధారణ అంశాలు మినహా ఓపీ, ఐపీ, సర్జరీలు, టెండర్లు, ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చలేదు. ఆస్పత్రుల్లో ఆన్లైన్ వ్యవస్థ లేక పోవడంతో అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు మొదలు విలువైన వైద్యపరికరాలు, మందుల కొనుగోలు, ఉద్యోగుల నియామకాలు, శానిటేషన్, క్యాంటిన్, పార్కింగ్ వగైరా కాంట్రాక్టులు, చివరకు అత్యవసర పరిస్థితుల్లో కొనుగోలు చేసే మందులు తదితర అంశాల్లో పారదర్శకత లోపించి, అక్రమాలకు తావిస్తోంది. నిలోఫర్‌ను వీడని నిర్లక్ష్యపు జబ్బు... నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రుల పేరుతో వెబ్సైట్ ఓపెన్ చేసినా..ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లేదు. నిలోఫర్ వెబ్సైట్లో ఇప్పటికీ మాజీ సూపరింటెండెంట్ పేరు, ఫొటోలు, పాత సమాచారమే కన్పిస్తుంది. ఒక్క వైద్య సేవలకు సంబంధించిన వివరాలు మాత్రమే కాదు ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర పరిపాలనాధికారుల పేర్లు, ఫొటోలు సైతం పాతవే దర్శనమిస్తుండటం గమనార్హం. మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లు కూడా ఆఫ్‌లైన్‌లో చేపడుతుండటం విశేషం. ఆరోగ్యశ్రీ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధుల్లో భారీగా గోల్మాల్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి, వైద్య సేవలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు అందులో పొందుపర్చి, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన ఉన్నతాధికారులే అక్రమా లకు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా ?
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : ఏలూరు కార్పొరేషన్లో గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఏమాత్రం నాణ్యత లేదని, పనుల వ్యయాన్ని పెంచుకుంటూ పోవడంతో పాటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని నగరపాలకసంస్థ అధికారులపై ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయంలో బుధవారం ఆళ్లనాని, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ ముత్యాలరాజులు సమీక్షించారు. డివిజన్లలో పర్యటించిన సమయంలో ప్రజలు అనేక విషయాల్ని తన దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిఫార్సులు చేస్తామని నాని అన్నారు. కాగితాలపై కాకి లెక్కలు తప్ప సరైన సమాచారం ఇచ్చే స్థితిలో అధికారులు లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అంశాన్ని ప్రస్తావించినా అవగాహనలేని మాటలే తప్ప వాస్తవ పరిస్థితులపై అధికారులకు అవగాహన లేదని అన్నారు. 14వ ఆర్ధిక సంఘం నిధుల వినియోగంపై పొంతన లేకుండా లెక్కలు చెబుతున్నారని, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహించారని, నిబంధనలకు విరుద్ధంగా నిధులు వెచ్చించారని విమర్శించారు. పనులు చేయకుండానే చేసినట్లు లెక్కలు చూపారని, కార్పొరేషన్లో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్దితి నెలకొందని అన్నారు. రోడ్లు వేసిన నెల రోజులకే దెబ్బతిన్న తీరు చూస్తుంటే నాణ్యతను పట్టించుకోలేదని, తనిఖీ చేయాల్సిన అధికారులు కూడా ఎక్కడ ఏ పని జరిగిందో చెప్పలేని స్థితిలో ఉండటాన్ని మంత్రి తప్పుపట్టారు.టూటౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విధానం లేనప్పుడు తంగెళ్లమూడిలో పనులకు ప్రతిపాదన ఎలా చేశారని, వన్‌టౌన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా సరిదిద్దకుండా ప్రజాధనాన్ని వృథా చేశారని అన్నారు. రాబోయే మూడు రోజుల్లో పనుల వివరాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం వచ్చినా డ్రెయిన్ల పూడికతీత పనులు ఎందుకు పూర్తి కాలేదని మంత్రి ప్రశ్నించారు. నగరంలో ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో నాణ్యత కరువైందని, వెంటనే పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పైపులైన మరమ్మతుల నిమిత్తం రూ.6 కోట్ల వరకు నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నారని, చాలా చోట్ల పనులు జరగకుండానే జరిగినట్లు బిల్లు డ్రా చేసినట్లు తనకు ఫిర్యాదులు అందాయని మంత్రి అన్నారు. తనకు తెలియకుండా ఏ ఒక్క అధికారిని రిలీవ్ చేయవద్దని ఈ సందర్భంగా నగరపాలకసంస్థ కమిషనర్ ఏ.మోహన్‌రావును కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశించారు. తెల్లముఖం వేసిన అధికారులు దేనికి అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశాలకు స్పష్టమైన వాస్తవ వివరాలతో రావాలని, ఏమాత్రం సమాచారం లేకుండా టైంపాస్‌కు వస్తే ఇక మీద సహించేది లేదని హెచ్చరించారు. గత ఏడాది రూ. 27 కోట్లు ఆస్తి పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకుని కేవలం రూ. 15 కోట్లు మాత్రమే వసూలు చేశారని, ఈ ఆర్థిక సంవత్సరం మళ్ళీ రూ.28 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారని.. గత బకాయిలతో కలిపి రూ. 40 కోట్లు ఎలా వసూలు చేయగలరని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ నిధులతో ఎస్ఎంఆర్ నగర్లో ఓ కుల కల్యాణమండపాన్ని ఎలా నిర్మిస్తున్నారని, అలా నిర్మించేందుకు ఏమైనా అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించగా.. ఎలాంటి అనుమతులు లేవని, గత పాలకులు ఆదేశాలతో చేపట్టామని అధికారులు వివరణ ఇచ్చారు. సమావేశంలో కమిషనర్ ఎ.మోహనరావు, హెల్త్ ఆఫీసర్ సూర్యారావు, ఏసీపీలు వి.శ్రీనివాస్, అప్పారావు, ఆర్వోలు పాల్గొన్నారు. -
కల నెరవేరేనా?
సాక్షి, పలాస(శ్రీకాకుళం) : నియోజకవర్గంలోని పలు గిరిజన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో కనీస సదుపాయాలు లేవు. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు మొరాయించడంతో ఎండమావిగానే మిగిలిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగంతో యువకులు నిర్వీర్యం చెందుతున్నారు. పలాస, మందస మండలాల్లో గిరిజన గ్రామాలు ఉన్నాయి. తర్లాకోట, లొత్తూరు తదితర గిరిజన గ్రామాలన్నీ పలాస మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కొఠారింగ్ తాళభద్ర, పెదగంతరు, చినగంతరు, చింతగట్టువూరు తదితర గ్రామాలకు సరైన రహదారి సదుపాయాలు లేవు. దీంతో ప్రభుత్వ పథకాలకు సక్రమంగా నోచుకోలేకపోతున్నారు. ఆయా గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలని ఈ ప్రాంత గిరిజనులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అభివృద్ధి జరగకపోవడానికి ఇదే ఆటంకమని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అటవీ ఉత్పత్తులు సేకరించి పట్టణానికి తీసుకురావడానికి రవాణా సదుపాయాలు లేవు. మందస మండలంలోని కొండలోగాం, టంగరిపుట్టుగ, రాయికోల, నర్సింగపురం, కుశమాలి, బౌంసుగాం, రామరాయి, అడవికొత్తూరు, మొగిలిపాడు తదితర గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. మందస మండలంలో మొత్తం 189 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు వైద్య, విద్య, మంచినీరు, విద్యుత్తు సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా రహదారి సమస్య వీరిని వెంటాడుతుంది. గిరిజన గ్రామాల్లోని ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు నామమాత్రంగానే పనిచేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలం గ్రామాలు జనాభా పలాస 26 6 వేలు మందస 189 35 వేలు ఈ గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించి విద్య, వైద్యం అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నా గత పాలకులు పట్టించుకోలేదు. ఈ గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు వందల సంఖ్యలో ఉన్నారు. క్షయ, మలేరియా వంటి వ్యాధులు కూడా వీరిని పట్టిపీడుస్తున్నాయి. కొండల మీద, లోయల వద్ద గుడిసెల్లోనే ఇంకా జీవనం సాగిస్తున్నారు. సరైనా గృహాలు కూడా లేవు. గత ప్రభుత్వం మంజూరు చేసిన చోట గృహాలు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైన తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు షెడ్యూల్డ్ ఏరియాలోకి విలీనం చేయాలని గిరిజనులు కోరుతున్నారు. షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలి పలాస నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలి. నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం. బీఈడీ, డీఈడీ చదివి పేర్లు నమోదు చేసుకున్న వారు 1800 మంది ఉన్నారు. వారికి ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం లేదు. – సవర జగన్నాయకులు, టీచరు, కొంకడాపుట్టి, మందస మండలం రోడ్డు సదుపాయాలు కావాలి గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయాలు కావాలి. రోడ్లు లేకపోవడం వల్ల అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. వ్యాధుల బారిన పడుతున్నా బయటకు వెళ్లలేక సంచి వైద్యుల చేత వైద్యం చేయించుకుంటున్నాం. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. – సవర చిన్నారావు, కొఠారింగ్ తాళభద్ర, పలాస మండలం -
సాహిత్య పీఠానికి చంద్రగ్రహణం
సాక్షి, రాజమహేంద్రవరం : ‘తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరాన్ని ప్రధానకేంద్రంచేస్తాం.’ అంటూ గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. దాంతో ఎందరో భాషాభిమానులు బొమ్మూరులోని తెలుగు సాహిత్యపీఠానికి మంచి రోజులు వస్తాయని ఆశించారు. అయితే వారి ఆశ అడియాసే అయింది. అన్ని హామీల్లాగే దీన్ని కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. దాంతో నానాటికీ సాహిత్యపీఠం కునారిల్లిపోతోంది. ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగువారికి గుర్తింపు తీసుకువచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు తెలుగు భాషా సాహిత్యాల పట్ల అభిమానం ఉండేది. 1985 డిసెంబర్ రెండో తేదీన హైదరాబాద్ కేంద్రంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వరంగల్‌లో జానపదపీఠం, కూచిపూడిలో కూచిపూడి నాట్యవిభాగం, శ్రీశైలంలో పురావస్తు పరిశోధన విభాగం, ఆదికవి నన్నయ నడయాడిన, ఆంధ్రమహాభారతం అవతరించిన గడ్డ రాజమహేంద్రవరం శివారునగల బొమ్మూరులో తెలుగు సాహిత్యపీఠం ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ఈ సాహిత్య పీఠం ఎంఏ తెలుగు చదువుకునే వారికి, తెలు గు భాషాసాహిత్యాలపై పరిశోధనలు చేసేవారికి కల్పవృక్షంగా భాసించింది. రాష్ట్ర విభజనానంతరం చంద్రగ్రహణంతో పురాతన వైభవం కోల్పోయింది. శిథిలమవుతున్న వసతి గృహాలు అంతా భ్రాంతియేనా? తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రం చేస్తానని పుష్కరాల సాక్షిగా వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఆతర్వాత ఆ ఊసు మళ్లీ ఎత్తలేదు. తెరమీదకు కొత్తవాదనలు వచ్చాయి. విభజన చట్టం, షెడ్యూల్ 10లో సాహిత్యపీఠం ఉండటం వలన ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని మొసలి కన్నీరు మొదలయింది. రాజమహేంద్రవరాన్ని ప్రధాన కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసే సమయానికే సాహిత్యపీఠం ఉమ్మడి ఆస్తుల జాబితాలో ఉంది. ఇదేదో ముఖ్యమంత్రి ప్రకటన తరువాత ఉత్పన్నమైన సమస్య కాదు. అన్నీ తెలిసే ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయవిశ్వవిద్యాలయం,హైదరాబాద్‌లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఉమ్మడి ఆస్తుల జాబితాలో ఉన్నవే. అవి మన రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోనే ఉన్నాయి. ఈ సంస్థలకు లేని అడ్డంకి సాహిత్యపీఠం విషయంలో ఎందుకు ఉత్పన్నమవుతోందని పద్మవిభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటివారు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే దానికి నేతలనుంచి సమాధానం లేదు. కాంచవోయి నేటి దుస్థితి ఒకప్పుడు సుమారు 80మందికి పైగా ఎంఏ (తెలుగు) చదువుకునే విద్యార్థులతో, పరిశోధకులతో కళకళలాడిన సాహిత్యపీఠం నేడు బావురుమంటోంది. ఎంఏ మొదటి సంవత్సరంలో ఐదుగురు, రెండో సంవత్సరంలో ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. పూర్తి స్థాయిబోధన సిబ్బంది లేరు. అడపాతడపా, కన్సాలిడేటెడ్ పారితోషికం మీద ఒక అధ్యాపకుడు వచ్చి, పాఠాలు చెబుతున్నారు. సాహిత్యపీఠంలో పూర్తిస్థాయి పర్యవేక్షకులు లేరు. గుంటూరులో ఇన్చార్జి వైస్ చాన్సలర్ ఉన్నారు. తలలేని మొండెంలా సాహిత్యపీఠం మిగిలింది. సుమారు 50,000 అరుదైన పుస్తకాలు ఉన్న గ్రంథాలయాన్ని వినియోగించుకుంటున్నవారు దాదాపు లేరు. బోధనేతర సిబ్బందికి రెండునెలలకో, మూడు నెలలకో జీతాలు విదిలిస్తున్నారు. హాస్టల్ భవనం శి«థిలావస్థకు చేరుకుంది. ఎందుకీ దుస్థితి? రాష్ట్ర విభజన అనంతరం సాహిత్యపీఠం అస్తిత్వంపై, భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముతున్న తరుణంలో, ప్రభుత్వం ప్రేక్షకపాత్రను ధరించింది. సాహిత్యపీఠం క్షీణదశ ప్రారంభం కావడానికి ఇది ప్రధాన కారణం. విద్యార్థులకు భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడు. అదనపు భవనాల నిర్మాణం కాలేదు కనుక, సాహిత్యపీఠానికి ఇచ్చిన భూమిలో కొంతభాగాన్ని తిరిగి ఇవ్వాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టురని సాహిత్యపీఠం సిబ్బంది తెలిపారు. ప్రాంగణంలోని కొంత ప్రాంతానికి ప్రత్యేకంగా ఫెన్సింగ్ వేశారు. కొంత భాగం ఆక్రమణలకు గురి అయింది. ఏది ఏమైనా, జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే, ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించక తప్పడం లేదు. కనీసం భాషాసాహిత్యాలను, కళలను రాజకీయ పరిధి దాటి ఆదరిస్తే బాగుంటుందని సాంస్కృతిక రాజధాని ప్రజలు కోరుకుంటున్నారు. -
శిలాఫలకాల్లోనే అభివృద్ధి
సాక్షి, గరిశపూడి(కృష్ణా) : పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు గాంధీజీ. అటువంటి గ్రామాల్లోని ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కృత్తివెన్ను మండలంలోని గరిశపూడి గ్రామంలో కాగిత వెంకట్రావు (కేవీఆర్) కాలనీని 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయినా నేటికీ కాలనీలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1986వ సంవత్సరంలో కృత్తివెన్ను మండలం గరిశపూడి పంచాయితీలో దాదాపు 5.60 ఎకరాల విస్తీర్ణంలో అప్పటి శాసన సభ్యులు కాగిత వెంకట్రావు కాలనీ ఏర్పాటు చే శారు. దీనిలో సుమారు 76 ప్లాట్లు కేటాయించి దీనికి కాగిత వెంకట్రావు పేరుతో కేవీఆర్ కాలనీగా నామకరణం జరిగింది. ఇది జరిగి దాదాపు 33 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ కాలనీలో అంతర్గత రహదారుల సౌకర్యం లేదు. అధ్వానంగా వీధి కుళాయిలు, ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోక ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు కాలనీ వాసులు. 2014 ఎన్నికల తరువాత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులతో మారుమూల గ్రామాలకు సైతం అంతర్గత రహదారులను అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ మాత్రం కనీసం ఒక్కరోడ్డు కూడా నిర్మించలేదు. చిన్నపాటి చినుకు పడితే కాలనీ మొత్తం మడుగును తలపిస్తుంది. వర్షం నీరు వారాలపాటు నిల్వ ఉండి దోమలు, పాముల భయంతో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అంతే కాలనీలో మేము పడుతున్న బాధలు భగవంతుడికే తెలియాలి. సరైన రహదారులు లేక నరకం చూస్తున్నాం. వర్షం వస్తే మా బాధలు చెప్పనలవికావు. వీధి దీపాలు కూడా సక్రమంగా వెలగవు. రోడ్లు లేక చాలా మంది ఇళ్లు నిర్మించుకోవడానికి కూడా భయపడుతున్నారు. కాలనీ కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకోవాలి. -బొర్రా పోతురాజు, కాలనీవాసి -
ఎందుకింత నిర్లక్ష్యం?
సాక్షి, నిజామాబాద్ : జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం మార్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు నెలలు గడుస్తున్నా కార్యాలయం తరలింపు ప్రక్రియ కొలిక్కి రాలేదు. జిల్లా కేంద్రంలోని బాలుర ఐటీఐ ప్రాంగణంలో శిథిలావస్థలో ఉన్న ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ఉండేది. అయితే, సమీపంలోనే నూతనంగా నిర్మించిన భవనంలోకి కార్యాలయాన్ని మార్చడానికి అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నిర్లక్ష్యం.. అలసత్వం.. ఎంప్లాయ్మెంట్ కార్యాలయానికి కొత్త భవనం అందుబాటులో ఉంది. పాత కార్యాలయంలోంచి, కొత్త కార్యాలయంలోకి సామగ్రి తరలించడానికి నెల రోజులు పట్టింది. తరలింపు పనులు ఇప్పటికీ సాగదీస్తూనే ఉన్నారు. కరెంట్ కనెక్షన్ ఉన్నా, కంప్యూటర్లు ఉన్నా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇక్కడ సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం లేదు. నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ కార్డు కో సం దరఖాస్తు చేసుకోవడానికి, ఇతర పనుల నిమి త్తం వస్తే సమాధానం చెప్పే వారే ఇక్కడ కరువయ్యారు. నిరుద్యోగులు కార్డుల రెన్యూవల్‌తో పాటు కొత్త కార్డులు తీసుకోవాలంటే మీ సేవకు వెళ్లాల్సిందే. సమస్యలు వస్తే కార్యాలయానికి వస్తే సమాధానాలు చెప్పే వారే ఉండడం లేదు. ఎప్పుడు ఖాళీ కుర్చీలే.. కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నా కూర్చీలు మాత్రం ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. అధికారి ఉన్నంత సేపు మాత్రమే ఉద్యోగులు ఉంటున్నారు. అధికారి ఇలా వెళ్లగానే, సిబ్బంది అలా బయటకు వెళ్లిపోతున్నారు. ఇది రోజు జరుగుతున్న తంతు. పూర్తిస్థాయి అధికారి లేకపోవడం, ఇన్చార్జి అధికారి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో సిబ్బంది ఇష్టారాజ్యమై పోయింది. దీంతో రెండు నెలలు గడుస్తున్నా సామగ్రి తరలింపు పూర్తి కాకపోవడం, కార్యాలయం ఇంకా సిద్ధం కాకపోవడం గమనార్హం. సిబ్బంది లేక ఆలస్యం మా కార్యాలయంలో సరైన సిబ్బంది లేరు. అందుకే ఆలస్యం అవుతోంది. కంప్యూటర్ ఏర్పాటు చేశాం. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం యత్నిస్తున్నాం. పనులన్నీ ఒక్కడినే చేయాల్సి వస్తోంది. అందువల్ల కొంత ఆలస్యం జరుగుతోంది. – మోహన్‌లాల్, ఇన్చార్జి అధికారి -
‘కోండ్రు’పై.. జనం గాండ్రింపు
సాక్షి, శ్రీకాకుళం: కోండ్రు మురళీమోహన్..ఈ పేరు వినగానే అందరి మదిలోనూ ఒక్కటే మెదులుతుంది. అడ్డూ, అదుపూ లేని నోటి దురుసుతనం, నిర్లక్ష్యం, అహంకార వైఖరే గుర్తుకొస్తుంది. అభివృద్ధి పేరిట అవినీతికి పాల్పడిన తీరే జ్ఞాపకం వస్తుంది. అలాంటి వ్యక్తి పొరుగు నియోజకవర్గం నుంచి వచ్చి రాజాం ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలిచారు. 2004లో ఎచ్చెర్ల నుంచి, 2009లో రాజాం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన కోండ్రు ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును దుమ్మెత్తిపోసిన కోండ్రును టీడీపీలో ఎలా చేర్చుకుంటారని ఆ పార్టీ నేతలు ససేమిరా అన్నారు. సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నా అతి కష్టమ్మీద టికెట్ దక్కించుకున్నారు. గతంలో ఆయన వ్యవహార శైలిని చూసిన వారు, విన్న వారూ ఇప్పుడు అమ్మో.. కోండ్రు అంటూ గాండ్రిస్తున్నారు..! 2009లో ఎన్నికైన కోండ్రు మురళీమోహన్ మంత్రి అయ్యాక మరింతగా దూకుడు పెంచి నోటికి పని చెప్పారు. అధికారులపైనా దుందుడుకుగా వ్యవహరించే వారు. తన వ్యతిరేకులపై కేసులు పెట్టించడం, జైలుకు పంపడం, వర్గాలను ప్రోత్సహిస్తూ అశాంతికి కారకులయ్యారని నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో కోండ్రు మురళి మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన సోదరుడు జగదీష్ కూడా అధికారులపై జులుం ప్రదర్శించే వారని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కోండ్రును గెలిపిస్తే మళ్లీ అలాంటి రోజులే పునరావృతమవుతాయన్న ఆందోళన నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది. అభివృద్ధి పేరిట అవినీతి కోండ్రు మురళి మంత్రిగా పనిచేసిన సమయంలో అభివృద్ధి పేరిట అవినీతికి పాల్ప డ్డారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో మంజూరైన అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. వాటిలో మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే.. రాజాంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు రోడ్డు విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం జరగలేదు. ♦ వమ్మి–రుషింగి మధ్య నాగావళి నదిపై వంతెన నిర్మాణం పూర్తి చేయలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఈ వంతెనకు రూ.27 కోట్లు విడుదల చేశారు. ♦ రేగిడి, వంగర మండలాల్లో రూ.49 కోట్లతో 135 గ్రామాలకు అందించాల్సిన భారీ రక్షిత మంచినీటి పథకాలు పూర్తి కాలేదు. ♦ రూ.40 కోట్లతో నిర్మించాల్సిన రాజాం–రణస్థలం రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ♦ రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి, వంగర మండలాల్లో రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదు. రక్షిత మంచినీరు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ♦ మడ్డువలస రిజర్వాయరు పునరావాస బాధిత గ్రామాల ప్రజలను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికీ ఏడు గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయిలో ప్యాకేజీ ఇవ్వలేదు. ♦ ఈ నిర్వాసితులు ఇంకా తమ గ్రామాలను ఖాళీ చేయలేదు. రికార్డుల్లో తరలింపు గ్రామాలుగా చేర్చడంతో ఎలాంటి సదుపాయాలకూ నోచుకోవడం లేదు. ఈ బాధితులంతా ఏళ్ల తరబడి అక్కడే శిథిల ఇళ్లలోనే మగ్గుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు ఆయనను నిలదీస్తున్నారు. సొంతూరినే పట్టించుకోలేదు.. కోండ్రు మురళి సొంతూరు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండలం లావేటిపాలెం. అమాత్యునిగా అందలమెక్కినా తన సొంతూరినే ఆయన పట్టించుకోలేదు. లావేటిపాలెంలో ఇప్పటికీ పారిశుద్ధ్య లోపం తాండవిస్తోంది. ఊళ్లో బోర్లన్నీ ఉప్పునీటినే ఇస్తాయి. రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీరిప్పించండి మహాప్రభో..! అని గ్రామస్తులు ఏళ్ల తరబడి వేడుకున్నా మంత్రి హోదాలో ఉండి కూడా మనసు కరగలేదు. సొంతూరికి మంచినీళ్లే ఇవ్వలేని నాయకుడు తమ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేస్తారని రాజాం నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
టీడీపీ అసమర్థ పాలనకు ఇదే సాక్ష్యం
సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుల అసమర్థ పాలనపై గ్రామీణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పాలకులు చొరవ చూపకుండా విఫలమయ్యారనే అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది. మూలుగుతున్న ఇంటింటికి కుళాయి నిధులు గ్రామాల్లోని తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మండలానికి రూ.37 కోట్లు కేటాయించింది. కేవలం నెల రోజుల్లో పథకాన్ని పూర్తి చేసి తాగునీటిని అందిస్తామని కొల్లు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పథకం ఎక్కడా ప్రారంభం కాకపోవడం అసమర్థ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. మంగినపూడికి మంగళం అరిసేపల్లి, బొర్రపోతుపాలెం, బుద్దాలపాలెం, పోతేపల్లి, పోతిరెడ్డిపాలెం, పొట్లపాలెం, మంగినపూడి, చిరివెళ్లపాలెం, గోకవరం, తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం గ్రామ పంచాయతీలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు మంగినపూడి తాగునీటి పథకాన్ని2012లో అప్పటి ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2015 వరకు ఈ పథకం ద్వారా గ్రామాలకు తాగునీరు పుష్కలంగా చేరింది. టీడీపీ నాయకులు పథకం నిర్వహణ కాంట్రాక్ట్ పనులు చేజిక్కించుకుని పైప్‌లైన్‌కు ఏర్పడుతున్న లీకులకు మరమ్మతులు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ప్రస్తుతం ఏ గ్రామానికి తాగునీరు సక్రమంగా చేరకపోవడంతో ప్రజలు బిందె నీటిని రూ.20 కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఏడాది జరుగుతున్న జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. డంపింగ్ యార్డు తరలింపులోనూ నిర్లక్ష్యమే.. స్థానిక రాజుపేట శివారులో శివగంగ మేజర్ డ్రెయిన్‌కు ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డును తరలించడంలోనూ పాలకులు విఫలమయ్యారు. రాజుపేట, కరెంటుకాలనీ ప్రజలతోపాటు మండలంలోని ఎస్ఎన్ గొల్లపాలెం, సీతారామపురం, సుల్తానగరం గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ఈ యార్డు ప్రభావం చూపుతోంది. దీన్ని అక్కడి నుంచి తరలించాలని గత పాలకవర్గం హయాంలోనే రూ.2.75 కోట్ల మునిసిపల్ నిధులను సమకూర్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా యార్డు తరలింపు అంగుళం ముందుకు కదలకపోవడం పాలనాతీరును ఎద్దేవా చేస్తోంది. తాగునీటి పథకాన్ని వీడని గ్రహణం చిన్నాపురం గ్రామంలో తాగునీటి పథకం ఏర్పాటు చేసి శివారు పంచాయతీలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. పథకం నిర్మాణానికి భూమి కొలుగోలు ప్రక్రియ అప్పట్లోనే పూర్తయింది. ఈ ప్రాంతాన్ని రెండుసార్లు అప్పటి జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ పరిశీలించారు. పాలకుల చొరవ లేకపోవడంతో పథకం పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదు. పాలకుల అసమర్థత కారణంగా చిన్నాపురం గ్రామ పంచాయతీతోపాటు ఎన్‌గొల్లపాలెం, పెదయాదర, తుమ్మలచెరువు, వాడపాలెం, కొత్తపల్లెతుమ్మలపాలెం గ్రామ పంచాయతీల ప్రజలు ఐదేళ్లుగా ఉప్పునీరు తాగుతున్నారు. అప్రోచ్ నిర్మించ లేకపోయారు పల్లెతాళ్లపాలెం గ్రామం వద్ద తాళ్లపాలెం మేజర్ డ్రెయిన్‌పై నిర్మాణం చేసిన వంతెనకు అప్రోచ్‌ను నిర్మాణం చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేశారు. గత పాలకవర్గం హయాంలోనే రూ.60 లక్షలతో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. సత్తెనపాలెం ఎస్సీకాలనీ, బోట్లవానిపాలెం గ్రామాలను కలుపుతూ పల్లెతాళ్లపాలెం గ్రామం మీదుగా కానూరు, పెదపట్నం సులువుగా చేరుకునేందుకు అప్పట్లో పేర్ని నాని ఈ వంతెన నిర్మాణం చేశారు. వంతెనకు ఒక వైపున అప్రోచ్ రోడ్డును నిర్మాణం చేసేందుకు ఓ రైతు వద్ద కొంత భూమిని కొనుగోలు చేయాల్సి ఉంది. సదరు రైతుకు పరిహారం మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. -
అమరావతి అదోగతి..!
సాక్షి, అమరావతి : ప్రఖ్యాత పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమైన అమరావతి అభివృద్ధి పనులు ఐదేళ్లుగా మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాలానే.. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి నగర పంచాయతీ హోదా కూడా తీరని కలగానే మిగిలిపోయింది. పురాణాలు, ఇతిహాసాల కాలం నుంచి అమరావతి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రసిద్ధిని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండగా ఐదేళ్లుగా ఆ దిశగా చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో ఇచ్చిన నగర పంచాయతీ హామీ మళ్లీ ఎన్నికలు వచ్చినా అమలు కాలేదు. పనుల్లో అయోమయం..నాణ్యతపై అనుమానం అమరావతి వారసత్వ నగర అభివృద్ధి పనులు ఎంత వరకు వచ్చాయంటే ఎవ్వరూ చెప్పలేని అయోమయం నెలకొంది. ఈ పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం సాగుతోంది. 2015 జనవరిలో కేంద్రప్రభుత్వం అమరావతిని వారసత్వ నగరంగా గుర్తించి రూ.99కోట్లు కేటాయించి, తొలి విడతగా రూ.22.74 కోట్లు మంజూరు చేసింది. ఈ పనుల కోసం జాతీయస్థాయి కంపెనీలు అంచనాలు రూపొందించినా ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పింది. అధికారులు చెప్పే మాటలకు, జరిగే పనులకు పొంతన ఉండటంలేదు. ఈ పనుల పరిశీలనకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వ అధికారులు పనుల పురోగతి, నిధుల వినియోగం, నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. 2018 జనవరి 31వ తేదీన కేంద్ర హోం శాఖ అఫైర్స్ కార్యదర్శి సుమిత్ గరకర్ పనులను పరిశీలించి నాణ్యత, పనుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారంటే పనులు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. నిలిచిపోయిన పనులు అమరేశ్వరాలయానికి ఉత్తరంగా కృష్ణానదిలో ధ్యానబుద్ధ ఘాట్ నుంచి అమరేశ్వర ఘాట్ వరకు చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ధరణికోట నూనెగుండం చెరువు పనులు కంచె వేయడానికే పరిమితమయ్యాయి. అమరావతి, ధరణికోట గ్రామాల్లో చారిత్రక ప్రదేశాలను కలుపుతూ చేపట్టిన హెరిటేజ్ వాక్ పనులు పూర్తికాలేదు. ధ్యానబుద్ధ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తిస్థాయిలో పూర్తికాలేదు. నందనవనం కోసం 16 ఎకరాల భూసేకరణ పూర్తయినా పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. పురావస్తు మ్యూజియంలో అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. సీసీ కెమెరాలు, లైట్లు మాత్రం ఏర్పాటు చేశారు. కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఫుష్కరఘాట్లు నేడు వ్యర్థాలతో నిండిపోయాయి. రాత్రిళ్లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది గ్రామాలకు నాలుగు వైపుల అర్చీల నిర్మాణం పూర్తయినా బౌద్ధ సంస్కృతి, శైవ సంప్రదాయాలు ప్రతిబింబించక కళా విహీనంగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన ప్రతిపాదిత పనులను అసలు మొదలుపెట్టనే లేదు. -
‘వన’గూరిందేమీ లేదు
సాక్షి, అమరావతి : టీడీపీ నేతల బురిడీ మాటలకు శిలాఫలకాలు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అభివృద్ధి పేరిట వారు చెప్పిన మాటలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. ప్రచార ఆర్భాటం కోసం అనేక హామీలు గుప్పించి ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలను బుట్టలో వేసుకొన్నారు. అభివృద్ధి మంత్రం అని చెప్పి మాయ మాటలతో నమ్మించి వారు చేసిన అభివృద్ధి పనులు శిలాఫలకాల్లో మాత్రమే దర్శనమిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పేరేచర్లలో 531 ఎకరాల్లో విస్తరించి ఉన్న నగరవనంలో పర్యాటకుల కోసం అనేక వసతులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినా అడుగు ముందుకు పడలేదు. పర్యాటకులను ఆకర్షించటానికి మాత్రం ముఖ ద్వారాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. లోపలకు వెళ్లితే మాత్రం కొండలు, రహదారులు, ఎండిపోయిన మొక్కలు పర్యాటకులను వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. కుటుంబాలతోపాటు వనాన్ని వీక్షించటానికి వచ్చిన వారు ఇక్కడ పరిస్థితిని చూసి నోరెళ్ల బెడుతున్నారు. అనవసరంగా వచ్చామని బాధ పడుతున్నారు. కేవలం ప్రచార ఆర్భాటానికి మాత్రమే నిధులు ప్రకటించారా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక రకరకాల ఔషధ మొక్కలు పెంపకం అని చెప్పారేగానీ అక్కడ అలాంటివేమీ కనిపించకపోగా ఉన్న మొక్కలు కూడా నీరులేక ఎండిపోయాయి. మరుగుదొడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. సైక్లింగ్ చేయటానికి అక్కడ సైకిళ్లు, ట్రెక్కింగ్, స్విమ్మింగ్‌పూల్ లాంటివి ఏమీ లేవు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నగరవనం గుంటూరు కేంద్రానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ జంటల విడిది ఎక్కువగా కనిపిస్తుంది. వారు తప్పితే వనంలో ఎక్కడా పర్యాటకులు కనిపించకపోవటం గమనార్హం. చుట్టూ ఎత్తయిన కొండలు, పొదలు ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. అనుకున్నంత ఏమీ లేదు నగరవనం అని అనేక మంది చెబితే వారాంతంలో సేద తీరటానికి బాగుంటుందని వెళ్లాను. కనీస వసతులు కూడా అక్కడ కనిపించలేదు. అభివృద్ధి చేస్తే పర్యాటకులు దూరం నుంచైనా వస్తారు కానీ ఇలా ఉంటే ఎవరూ రారు. ఇక్కడ కాలుష్యం మినహా ఏమీ లేదు. ప్రచార ఆర్భాటానికి నిధులు కేటాయించామని చెప్పడమేగానీ వాటితో ఏమి అభివృద్ధి చేశారో ఇక్కడ మాత్రం కనిపించడం లేదు. – షేక్ఇమామ్వలి, మేడికొండూరు అభివృద్ధి ఆనవాళ్లేవీ ? నగరవనం అని ఇక్కడకు వచ్చాం. పిల్లలను కూడా తీసుకొచ్చాం. కానీ వనం లోపలకు వెళితే చెట్లు, కొండలు తప్పితే ఏమీ లేవు. కనీసం పిల్లలు ఆసక్తిగా తిలకించటానికి, వారు ఆడుకోవటానికి ఎలాంటి సదుపాయాలు లేవు. ప్రభుత్వం చెప్పిన మాటలకు, ఇక్కడ వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు. -
ఆడపడుచులకు చేయూత
సాక్షి, బాపట్ల : తరాలు మారినా.. తలరాతలు మారని పరిస్థితి వారిది. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సుమారు 1.20 లక్షల మంది ఉన్నారు. వీరంతా రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు తెల్లవారుజామున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయేంతవరకు ఆయా కులవృత్తుల్లో నిమగ్నమైన జీవనాన్ని గడుపుతూ జీవిస్తుంటారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. పాలకులు ఎందరొచ్చినా వీరి జీవనస్థితిలో మాత్రం ఎదుగుబొదుగు లేకుండా పోతుంది. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు నిజజీవితంలో మాత్రం వాటిని ఎక్కడా కూడా అమలు చేస్తున్న దాఖలాలు కనుచూపుమేరల్లో కనిపించడం లేదు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను కేవలం ఓటు బ్యాంకింగ్ కోసమే ఉపయోగించుకునే టీడీపీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పేదల అభ్యున్నతి కోసం మేము కట్టుబడి ఉన్నాం.. పేదలకు అన్నివిధాల అండగా ఉంటామంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఐదేళ్లు గడిచేంతవరకు ఏ నాడు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఆలోచించలేదు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద 45 ఏళ్లకే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని, నాలుగేళ్లలో మహిళలకు రూ.75 వేలు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తానని ప్రకటించడంతో మహిళాలోకం ఆనందంగా ఉంది. కష్టపడినా ఫలితం శూన్యం ఏళ్ల తరబడి బుట్టల అల్లికే ప్రధాన వృత్తిగా చేసుకుంటూ జీవిస్తున్న నిరుపేదలు ప్రస్తుతం మార్కెట్లో విరివిగా ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల విక్రయాల వల్ల పూట గడవని స్థితిలో ఆకలి కేకలతో ఆలమటిస్తున్నారు. ఇలాంటి సమయంలో వాళ్లను ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు కనీసం ఆదిశగా ఆలోచించకపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్డాడుతున్నారు. బాపట్ల మండలంలోని కనకాద్రినగర్, కర్లపాలెం మండలంలోని ఎస్టీకాలనీ, పిట్టలవానిపాలెం మండలంలోని కాలువకట్టపై జీవనం సాగించే ఎస్టీలు పదేళ్లుగా జీవనం సాగిస్తున్న ఎస్టీలకు వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి బుట్టల అల్లిక. వీరంతా సూర్యలంక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈత చెట్లను పాడుకొని ఈత సువ్వలను కోస్తారు. కోసిన ఈత సువ్వలను 15 రోజులు ఎండిన తర్వాత వాటిని ఇంటికి చేర్చుకుని బుట్టల అల్లిక ప్రారంభిస్తారు. రోజంతా భార్య, భర్త కలిసి 4 బుట్టలు మాత్రమే అల్లుతారు. వాటిని మార్కెట్లో విక్రయిస్తే రూ. 120 నుంచి 150 వరకు వస్తాయి. వాటితోనే కుటుంబం మొత్తం పోషించుకోవాలి. గతంలో ఏ గ్రామానికి బుట్టలు తీసుకెళ్లినా వెంటనే కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం ప్లాస్టిక్ వస్తువులు విరివిగా వాడుకలోకి రావడంతో ఈత సువ్వలతో తయారుచేసిన బుట్టలను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకురావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదుగు బొదుగు లేని బీసీ బతుకులు ఇదిలా ఉండగా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తాం. ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామంటూ ఇచ్చిన హామీలను మరిచారు. కనీసం 120 పైగా కులాలు ఉన్న బీసీల అభ్యున్నతి గురించి ఏనాడు ఆలోచించిన దాఖలాలు లేవు. బీసీల్లో ప్రధాన కులాలు అయిన యాదవులు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రేంతవరకు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కనీసం వారికి సబ్సిడీపై గొర్రెలను అందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా గౌడ కులస్తులకు ఏళ్ల తరబడి కల్లుగీతనే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. వారి జీవితాల్లో కూడా అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగానే మారింది. నాయీబ్రహ్మణులు, రజకులు, వడ్డెర, పద్మశాలీలు, విశ్వబ్రహ్మణులు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు ఏం చేయని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆదరణ పథకం అంటూ మరోసారి బీసీలను మోసగించే ప్రయత్నానికి తెరలేపారు. పేదలకు మేలు చేసే పథకం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పేదలు ఆర్థికంగా చేయూత అందుతుంది. కనీసం పూటగడవని నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని నిరుపేదలకు 45 సంవత్సరాలకే పింఛన్ సౌకర్యం కల్పించేవిధంగా హామీ ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయం. దేశ చరిత్రలో మరెవ్వరూ ఇవ్వనటువంటి హామిను ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేశారు. ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడనే నమ్మకం ఉంది. -నర్రా ధనలక్ష్మి, మంతెనవారిపాలెం మహిళలకు ఆర్థిక భరోసా వైఎస్సార్ చేయూత పథకం మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చే పథకం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. పేద, బడుగు, బలహీన వర్గాల్లోని మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. -మద్దికర ఝాన్సీలక్ష్మి, భవనంవారిపాలెం -
మూడు హామీలు..ముక్కచెక్కలు
సాక్షి, గుంటూరు : రాష్ట్ర రాజధాని ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు సార్లు వచ్చి ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మారాయి. 2–10–2015న ఆస్పత్రికి వచ్చిన సీఎం మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ వార్డు(ఎంసీహెచ్ వార్డు) నిర్మాణానికి శిలాఫలకం వేశారు. మూడేళ్లపాటు ఎంసీహెచ్ వార్డు నిర్మాణం ప్రారంభం కాలేదు. మళ్లీ 2018 డిసెంబర్ 19న చంద్రబాబు రెండోసారి ఎంసీహెచ్ వార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పుడు కూడా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. భవనాల కోసం తవ్విన గోతులు మాత్రం పెద్ద అగాధంలా ప్రభుత్వ అసమర్థతను వెక్కిరిస్తున్నారు. మరో వైపు సీఎం ప్రారంభించిన శిలాఫలకాలు సైతం అదృశ్యమయ్యాయి. ఎంసీహెచ్ వార్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో బాలింతలు, గర్భిణులు నాలుగేళ్లుగా ఆస్పత్రిలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇలా సీఎం చేతుల మీదుగా రెండుసార్లు శంకుస్థాపనలు అయిన భవన నిర్మాణాలే నేటికీ ప్రారంభం కాకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం రూ. 20 కోట్లు 2014లో విడుదల చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు, గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో రూ.30 కోట్లు ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం ఇచ్చారు. సుమారు రూ.65 కోట్లు ఎంసీహెచ్ వార్డు నిర్మాణానికి సమకూరాయి. కానీ వార్డు పనుల్లో మాత్రం పురోగతి లేదు. పెద్దాస్పత్రికి కాన్పు కోసం వచ్చే గర్భిణులు, బాలింతలు మాత్రం మంచాలు చాలక అల్లాడిపోతున్నారు. మూడు హామీలు.. ఒక్కటీ నెరవేరలేదు... గుంటూరులోని జీజీహెచ్‌లో మాతాశిశు వార్డు నిర్మాణానికి 2015లో సీఎం చంద్రబాబు తొలిసారి శంకుస్థాపన చేశారు. వార్డు నిర్మాణం కోసం అప్పుడు తీసిన అగాధాలు.. మూడేళ్లపాటు సీఎం సారూ.. ఎక్కడ నిర్మాణమంటూ ప్రశ్నిస్తూనే ఉన్నాయి. మళ్లీ 2018లో శంకుస్థాపన చేశారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాదిలోపు భవనాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నడిబొడ్డున ఖాళీ స్థలంలో పెద్ద పెద్ద అగాధాలు చేశారు. అనంతరం నిర్మాణ పనులను మాత్రం అలాగే వదిలేశారు. వార్డు నిర్మాణానికి దాతలు ముందుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం అందింది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం దాటి ఎంసీహెచ్ వార్డు నిర్మాణానికి ఒక్క ఇటుకా పడలేదు. మాతా శిశు వార్డు కథ మారలేదు. గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే సహృదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా నాలుగు గుండె మార్పిడి ఆపరేషన్లను జీజీహెచ్‌లో నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబు ఆస్పత్రికి వచ్చి గుండె మార్పిడి ఆపరేషన్లను ఎన్టీఆర్ వైద్యసేవలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇది నమ్మిన గుండె జబ్బుల రోగులు జీజీహెచ్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం గుండె మార్పిడి ఆపరేషన్లకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు. దీంతో సహృదయ ట్రస్ట్‌కు కూడా తాము ఆపరేషన్లు చేయలేమని ప్రకటించింది. ఆపరేషన్లకు బ్రేక్ పడింది. జీజీహెచ్‌లో పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా నూతన భవన నిర్మాణాల కోసం గుంటూరులోని బొంగరాల బీడులో స్థలం కేటాయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తీరా చూస్తే ఆ స్థలాన్ని కార్మిక శాఖకు కేటాయిస్తున్నట్లు జీవో ఇచ్చారు. దీంతో నూతన వార్డుల నిర్మాణం అటకెక్కింది. ఇలా సవాలక్ష మెలికలు పెట్టి.. ఈ హామీకీ ఘోరీ కట్టారు. పేదల ఆస్పత్రి అభివృద్ధికి చంద్రబాబు ఇచ్చిన మూడు హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. రోగుల కష్టాలు ఒక్కటీ తీరలేదు. సీఎం తీరుపై జిల్లా వాసులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బొంగరాలబీడులో జీజీహెచ్ వార్డుల నిర్మాణానికి సీఎం ప్రకటించిన స్థలం గుండె మార్పిడి ఆపరేషన్లకు నిధులు లేవు గుంటూరు జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు నిధులు ఇస్తామని చంద్రబాబు 2015లో హామీ ఇచ్చారు. ఆస్పత్రికి వచ్చి గుండె జబ్బు రోగులను పరామర్శించి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా గుండె మార్పిడి ఆపరేషన్లు జీజీహెచ్‌లో ఉచితంగా చేస్తున్నారని, ప్రజలు వినియోగించుకోవాలని చెప్పారు. ఆయన మాటలు నమ్మి సుమారు 25 మంది గుండె జబ్బు రోగులు ఆపరేషన్ల కోసం గుంటూరు జీజీహెచ్‌లో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. సహృదయ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా 2016 నుంచి 2018 వరకు నలుగురికి గుండె మార్పిడి ఆపరేషన్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఆయన ఆపరేషన్లను నిలిపివేశారు. గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం పేర్లు నమోదు చేయించుకున్న వారు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో గుండె మార్పిడి ఆపరేషన్లకు రూ.15 లక్షలు ఇస్తున్నామని పోస్టర్లు ముద్రించి ప్రచారం చేసుకుంటున్నారు. జీజీహెచ్‌కు ప్రతి రోజూ ఓపీ : 4 వేలు ప్రస్తుతం ఉన్న పడకలు : 1177 కావాల్సిన పడకలు :560 జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు : 4 గుండె మార్పిడికి ఎదురు చూస్తున్న వారు : 25 మంది -
సమస్యలు కో‘కొల్లు’లు..
సాక్షి, మచిలీపట్నం : ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసినా ఈ ప్రాంత అభివృద్ధికి కొల్లు రవీంద్ర చేసింది శూన్యమని ప్రజలు విమర్శిస్తున్నారు. కొల్లు స్వగ్రామంగా చెప్పుకునే ‘గరాల దిబ్బ’ సమస్యలతో సతమతమవుతోంది. ‘మంత్రి మనోడే’ నని సమస్యలు తీరకపోతాయా...? అని ఐదేళ్లు పాటు ప్రజలు ఆశగా ఎదురుచూసినప్పటకీ, మౌలిక వసతులు మెరుగపడలేదు. గ్రామంలో అంతా మత్స్యకారులే. నిరుపేదలైన వీరికి ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు కూడా సవ్యంగా అందలేదు. తాగునీటికి తీవ్రమైన ఇక్కట్లు పడుతున్నారు. తమ ఇబ్బందులు చెబితే ఎక్కడ తమకు వచ్చే సంక్షేమ పథకాలకు అడ్డం పడతారేమోననే ఆందోళన ఇక్కడి ప్రజానీకంలో ఉంది. అర్హులకు అందని పథకాలు గ్రామంలో అర్హులకు రేషన్ కార్డులు లేవు. చదువులపై మంచి ఆసక్తి చూపే యువత ఉన్న గ్రామంలో ఒకప్పుడు 72 మంది ఉద్యోగులు ఇక్కడ ఉండేవారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇక్కడి వారు ఉద్యోగాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. గ్రామం చుట్టూ అసైన్డ్ భూములున్నా తాతలు, తండ్రులు నాడు ఇచ్చిన హక్కు పత్రాలే దిక్కయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి పత్రాలు ఇవ్వకపోవటంతో ఒకే ఇంట్లో మూడేసి కుటుంబాలు నివసిస్తున్నారు. సీసీ రోడ్లు నిర్మించినా.. మురుగు వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు ఇళ్లవద్దనే నిల్వ ఉంటున్నాయి. విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు అలంకార ప్రాయంగా మారాయి. దీంతో ప్రజలు గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ప్రతీ రోజూ‘పానీ’ పాట్లే! గరాలదిబ్బ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలో చేతిపంపులు ఉన్నప్పటకీ, ఉప్పునీరు కావటంతో మునిసిపాలిటీ వారు సరఫరా చేసే తాగునీరే ఆధారం. ఇవి కూడా రోజు విడిచి రోజు వస్తుంటాయి. దీంతో నల్లాల నుంచి వచ్చే సన్నటి ధార కోసం బిందెలు పట్టుకొని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. తాగునీటికి కష్టాలు బిందెడు మంచినీళ్లు పట్టుకునేందుకు పైపుల వద్ద గంటల తరబడి ఉండాలి. వీధుల్లో ఉన్న నల్లాల వద్ద మంచినీళ్లు పట్టుకునేందుకు బిందెలు ముందుగానే వరుసుగా పట్టాలి. రోజులో ఒక్కసారి అది కూడా ఒక గంట మాత్రమే నీళ్లు వస్తుంటాయి. చేతి పంపులు ఉన్నప్పటకీ, ఉప్పు నీరు కావడంతో తాగలేం. నల్లాల నుంచి వచ్చే నీరు రెండు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. – కె.జయంతి ఆర్భాటపు ప్రచారం నిరుద్యోగ భృతి మంజూరు చేయాలంటూ అధికారులకు అర్జీ ఇచ్చాను. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. డిగ్రీ చదివి కుటుంబం గడువడానికి కూలి పనులకు వెళ్తున్నాను. ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలే తప్ప నాలాంటి అర్హులైన వారికి న్యాయం చేయటం లేదు. – ఒడుగు దుర్గారావు -
దత్తత మాట గుర్తేలేదు
సాక్షి, శ్రీకాకుళం : మాట్లాడితే అక్కడ అభివృద్ధి చేశాం. ఇక్కడ అభివృద్ధి చేశామని బీరాలు పలికే ప్రభుత్వ విప్ కూన రవికుమార్ వారి సొంత గ్రామం, దత్తత గ్రామాలనే గాలికొదిలేశారు. దీంతో తల్లికి తిండి పెట్టనోడు పిన తల్లికి గాజులు పెడతాడా అంటూ ఆయా గ్రామాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు కనీసం మౌలిక వసతులు కల్పించండి మహా ప్రభో అంటూ వేడుకుంటున్నారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సొంత గ్రామం పెనుబర్తి. ఈ గ్రామాన్ని సందర్శించిన వారెవరైనా అయ్యోపాపం అనే అంటారు. ఎందుకంటే ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రామాన్ని కూన రవికుమార్ కుటుంబమే గత 15 ఏళ్లుగా పాలిస్తున్నారు. అయినప్పటికీ అభివృద్ధి మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. అన్నీ అవస్థలే పెనుబర్తి గ్రామాన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. గ్రామానికి కనీసం పంచాయతీ భవనం లేకపోవడం దారుణం. కొన్ని వీధుల్లో మురికి కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్డు మీదనే నిలిచిపోతోంది. అంగన్వాడీ భవనాలు లేకపోవడంతో ఒకటో నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని పెనుబర్తి ప్రాథమిక పాఠశాలలో, రెండో నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఐఆర్‌పురం ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఇకపోతే గ్రామంలోకి ప్రవేశించే రహదారి పూర్తిగా రాళ్లు తేలి అధ్వానంగా ఉంది. అలాగే ఆరేళ్ల క్రితం నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. పశువుల ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుంది. శ్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల బిల్లులు అందలేదని స్థానికులు వాపోతున్నారు. బిల్లులు అందించడంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్హులకు పింఛన్లు అందడం లేదని, ఎరువులను ఎక్కువ ధరకే కొనాల్సి వస్తోందని వాపోతున్నారు. కబ్జాల్లో మాత్రం ముందంజ దత్తత గ్రామం అభివృద్ధికి నోచుకోపోయినా భూకబ్జాలకు నిలయంగా మారిందని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చిట్టివలస గ్రామం సంగమేశ్వర కొండ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో వందల ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో పట్టాలు మంజూరు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిళ్లకు, మామూళ్లకు తలొగ్గిన రెవిన్యూ అధికారులు సుమారు 10 ఎకరాల కొండ భూమిలో టీడీపీ కార్యకర్తలకు పట్టాలు మంజూరు చేశారు. దీంతో భూమిని కబ్జా చేసుకుని దత్తత గ్రామాన్ని కబ్జా పర్వంలో ముందంజలో ఉంచారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటను అమ్ముకోలేక పోయాం ఈ ఏడాది వరి పంటను పండించినప్పటికీ అమ్ముకోలేకపోయాం. ధాన్యం కొనుగోలుకు కూడా ఎమ్మెల్యే ఎటువంటి సాయం చేయలేదు. సొసైటీలు ద్వారా యూరియా రూ.320లకు కొనుగోలు చేశాం కానీ అదే యూరియా బయట రూ.300లకే దొరికింది. విత్తనాలను కూడా అధిక ధరలకే అమ్మారు. గ్రామాన్ని, రైతులను ఆదుకోవడానకి ఆయన దృష్టి సారించలేదు. – కూన రాజ్‌కుమార్, రైతు, పెనుబర్తి -
ఇదేనా అభివృద్ధి..?
-
అభివృద్ధికి నోచని ఆలయం
సదాశివనగర్(ఎల్లారెడ్డి) : అదో పురాతన ఆలయం.. 256 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రభుస్వా మి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దగ్గి గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే స్వామి గా భక్తుల విశ్వాసం పొందిన ప్రభుస్వామి ఆలయం ఇప్పటివరకూ అభివృద్ధికి నోచలేదు. గుట్టపై కొలువదీరిన స్వామి వారిని దర్శించు కోవడానికి ఉమ్మడి జిల్లాల నుంచే కర్ణాటక, మ హారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వస్తారు. ప్రతి మాఘ అమావాస్య రోజున నిర్వహించే జాతర ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తు లు మొక్కులు చెల్లించుకుంటారు. తుక్కోజివాడి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన దగ్గి.. ప్రస్తుతం గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు కావడంతో ఇప్పటికైనా ఆలయం అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయానికి కనీస వసతులు లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. శివుని 101 అవతారాల్లో ప్రభుస్వామి అవతారం ఒకటని, ఏకనాథ అవతారమని.. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆల యం ఈ ప్రాంతంలో ఎక్కడా లేదని భక్తులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆలయ అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ముప్పై ఏళ్ల నుంచి నిత్య పూజలు.. ప్రభుస్వామి ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. భక్తుల కోర్కెలు తీర్చే భగవంతుడిగా ప్రభుస్వామి పేరొందారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ముప్పై ఏళ్ల నాటి నుంచి ఈ గుట్ట మీదికి వచ్చి నిత్య పూజలు చేస్తున్నా. – పాపయ్య, ఆలయ అర్చకుడు -
అభివృద్ధికి ఆమడ దూరంలో పల్లెలు
తమ నాలుగేళ్ల పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందనీ, గ్రామాలు సకల సదుపాయాలతో అలరారుతున్నాయని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని ఇండియా స్పెండ్ అనే సంస్థ తెలిపింది. అభివృద్ధికి చాలా పల్లెలు ఇంకా ఆమడదూరంలో ఉన్నట్లు స్వయంగా ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయని పేర్కొంది. విద్యుత్ ఏదీ? దేశంలోని 5,97,608 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం ద్వారా 100 శాతం విద్యుదీకరణ సాధించామని కేంద్రం ప్రకటించింది. కానీ వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 2.3 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం లేదు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 89 శాతం మాత్రమే విద్యుదీకరణ జరిగింది. మొబైల్ సేవలు మొబైల్ ఫోన్ సేవలు ప్రారంభమై ఇప్పటికి 23 ఏళ్లు గడిచినా ఇంకా 43,000 గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి రాదు. నెట్వర్క్ ఉన్నచోట్ల సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు దేశంలోని 2.89 లక్షల గ్రామాల్లో స్వచ్ఛమైన తాగు నీరు పాక్షికంగానే అందుబాటులో ఉందని ఇటీవల కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ప్రస్తుతం 62,582 గ్రామాల్లోని ప్రజలు కలుషిత నీటినే తాగుతున్నట్లు చెప్పింది. గ్రామీణ రహదార్లు కేంద్రం 2000లో ప్రారంభించిన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 1,78,184 గ్రామాల రహదార్లను అనుసంధానించాలన్నది లక్ష్యం. వీటిలో 31,022 గ్రామాలకు రహదారులనే వేయలేదు. విద్య గ్రామీణ ప్రాంతాల్లో 14–18 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థుల్లో 25% (8 కోట్ల మంది) మాతృభాషలోని పాఠ్య పుస్తకాలనే చదవలేకపోతున్నారు. సగం మందికిపైగా లెక్కలు (మూడంకెల సంఖ్యను ఒక అంకెతో గుణించడం) కూడా రాదు. ఆస్పత్రులు 2017 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఆరోగ్య ఉప కేంద్రాల్లో 19 శాతం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ)22 శాతం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో(సీహెచ్‌సీ) 30 శాతం సిబ్బంది కొరత ఉంది. 30 వేల మందికి ఒక పీహెచ్సీ, 1.20 లక్షల మందికి ఒక సీహెచ్‌సీ ఉన్నాయి. పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత 12% ఉంది. నర్సుల కొరత 60% దాకా ఉంది. 73% ఉప ఆరోగ్య కేంద్రాలు శివారు గ్రామాలకు 3 కి.మీ. పైగా దూరంలో ఉన్నాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గ్రామాల్లో 99 లక్షల ఇళ్లు లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 45 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. -
చేపాచేపా ఎందుకు ఎదగలేదు?
కమ్మర్పల్లి(బాల్కొండ) : చేపలు పట్టే వృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారులకు ఈయేడు నిరాశే మిగిలింది. చెరువుల్లో పెంచిన చేపల దిగుబడి రాక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేపపిల్లలు చెరువుల్లో ఎదగలేదు. చెరువు ల్లో చేపలు పెరగకపోవడంతో ఆదాయం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సారి సరఫరా చేసిన చేప పిల్లలు తగిన పరిమాణంలో పెరగలేవని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో ఎదగని చేప కమ్మర్పల్లి మండలంలోని ఆయా గ్రామాల్లోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను ఆర్థికంగా ప్రోత్సహించడానికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసింది. చెరువు విస్తీర్ణం ఆధారంగా చేప పిల్లలను సరఫరా చేయగా చెరువుల్లో వదిలారు. నవంబర్ నెలాఖరులో చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. నాగాపూర్ మంజీరా చెరువులో 26,500, కమ్మర్పల్లి గుండ్లకుంట చెరువులో 41,500, కుడికుంట చెరువులో 15,600, పల్లె చెరువులో 6700, హాసాకొత్తూర్ గోనె చెరువులో 69 వేలు, కొత్త చెరువులో 70 వేలు, బషీరాబాద్ కాడి చెరువులో లక్షా 10 వేలు, చింతల చెరువులో 80 వేలు, అమీర్‌నగర్ ఊర కుంటలో 25 వేలు, నర్సాపూర్ ఊర చెరువులో 38 వేలు, కోనాసముందర్ పెద్ద చెరువులో 65 వేలు, కోనాపూర్ రాళ్లవాగు రిజర్వాయర్‌లో లక్షా 50 వేల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు వదిలారు. ప్రస్తుతం చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో మత్స్యకారులు చేప వేట మొదలుపెట్టారు. వేటకు చిక్కిన చేపలు ఇంకా చిన్న పిల్లలు గానే ఉండడంతో అయోమయానికి గురవుతున్నారు. ఒక్కో చేప 50 గ్రాముల నుంచి 300 గ్రాములకు మించి పరిమాణం లేకపోవడంతో మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. చెరువులో వదిలిన చేప పిల్లలు ఆరు నెలలు గడిచినా తగిన పరిమాణంలో పెరగలేదు. సాధారణంగా చేప పిల్లలు ఆరు నెలల్లో సుమారు 750 గ్రాముల నుంచి 1250 గ్రాముల వరకు పెరుగుతుందని, ప్రభుత్వం సరఫరా చేసిన చేప పిల్లలు 300 గ్రాములకు మించి పెరగలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చెరువుల్లోనైతే 100 గ్రాములకు మించి పెరగలేదు. మరికొన్ని చెరువుల్లో చేపలు మృత్యువాత పడ్డాయి. నాసిరకం చేప పిల్లలను సరఫరా చేయడం వల్లే చేపలు పెరగలేదని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో ఈయేడు ఆదాయం కోల్పోయామన్నారు. కమ్మర్పల్లి గుండ్లకుంట చెరువులో వదిలిన చేప పిల్లల జాడే లేకుండా పోయిందని స్థానిక మత్స్యకారులు వాపోయారు. కొంతమంది మత్స్యకారులు సొంతంగా కొనుగోలు చేసి చెరువుల్లో వదిలిన చేప పిల్లలు ఒక్కోటి కిలో పరిమాణం వరకు పెరిగాయని చెబుతున్నారు. ఆలస్యంగా సరఫరా వర్షాకాలంలో చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరిన తర్వాత చేప పిల్లలు వదులుతారు. కానీ గత సంవత్సరం నవంబర్ నెలాఖరులో చేప పిల్లలను వదిలారు. సాధారణంగా జూన్, జూలై నెలలో వర్షాలు పడితే ఆగస్టు లేదా, సెపెంబర్ నెలలో చేపపిల్లలను వదులుతారు. కానీ నవంబర్ నెలలో వదలడంతో అప్పటికే చెరువుల్లో నీరు నీటిమట్టం తగ్గిపోయింది. నీటి మట్టం తగ్గిన చెరువుల్లో చేప పిల్లలు ఎదగకపోవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు. చేపలు తగిన పరిమాణంలో పెరగక ఆదాయం కోల్పోయిన మత్స్యకారులు ప్రభుత్వం రాయితీపై అందించే యూనిట్లపై ప్రభావం చూపనుంది. ఆదాయం లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వం అందించే వాహనాలు, తెప్ప లు, వలలు, ఐస్ బాక్స్‌లు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. చేపలు పెరగలేదు.. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేప పిల్లలు చెరువుల్లో వృద్ధి చెందలేదు. 300 గ్రాములకు మించి చేపలు పెరగలేదు. నాసిరకమైన చేప పిల్లలు సరఫరా చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఈయేడు పూర్తిగా ఆదాయం కోల్పోయాం. ఉపాధిపై దెబ్బ పడింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి. – ఆల్గోట్ రమేశ్, మత్స్యకారుడు,హాసాకొత్తూర్ చేపల దాణా అందించాలి ప్రభుత్వం ఉచితంగా అందించిన చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోయాక వదిలారు. చేప పిల్లలకు పోషకాలు లభించక(ఫీడింగ్) పెరగలేవు. ప్రభుత్వం ఉచితంగా చేపల దాణా సరఫరా చేయడంతో పాటు, ఇతర సదుపాయాలు కల్పించాలి. – ఎర్ర ఆశన్న, అధ్యక్షుడు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, కోనాసముందర్ పావు కిలో కూడా లేవు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేప పిల్లలు పావు కిలో కూడా పెరగలేదు. కాడి చెరువు పెద్ద చెరువు. చేపలు పట్టుకొనే వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. చేపలు పెరగకపోవడం వల్ల ఆదా యం నష్టపోయాం. సొంతంగా కొనుగోలు చేసిన పిల్లలు వేరే చెరువుల్లో పెంచాం. మంచి దిగుబడి వచ్చింది. – తోపారం శ్రీనివాస్, మత్స్యకారుడు, బషీరాబాద్ పెట్టుబడి సాయం అందించాలి ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న విధంగానే మత్స్యకారులకు చేపల పెంపకానికి పెట్టుబడి సాయం అందించాలి. సాయంతో మత్స్యకారులు తమకు నచ్చిన చేప పిల్లల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేస్తారు. చేపల పెంపకంతో ఆదాయంపై భరోసా కలుగుతుంది. – ఊట్నూర్ రాజేశ్, మత్స్యకారుడు, కమ్మర్పల్లి -
చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చారు
సాక్షి, ప్రకాశం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వంద్వ విధానాలతో ప్రజలను మోసం చేస్తూ.. రాజకీయాలను వ్యాపార సంస్థలుగా మార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసిన టీడీపీ.. ఇంకా బీజేపీతో చాటుమాటుగా కాపురం చేస్తుందని.. అలాంటి చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదని అన్నారు. నీతివంతమైన రాజకీయాలు చేయడం వైఎస్ జగన్‌కు అలవాటయితే.. వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ తన పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు అలవాటని బత్తుల ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమిలేదని మండిపడ్డారు. రామాయపట్నం పోర్టు మొదలు వెలుగొండ ప్రాజెక్టు వరకు జిల్లాలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. -
ఎన్ఎంసీతో వైద్యరంగాభివృద్ధి ప్రశ్నార్థకమే
ఐఏఎస్‌లకు ఆ బాధ్యతలు బరువే ఐఎంఏలో అవినీతి ఉంటే ప్రక్షాళన చేయాల్సిందే నూతన కౌన్సిల్‌పై విభేదిస్తున్న వైద్యులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ఐఏఎస్‌లతో నిర్వహించే నేషనల్ మెడికల్ కౌన్సిల్‌తో వైద్యరంగం మరిన్ని సమస్యల్లో చిక్కుకోనుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రులు, వైద్యవిధానంలోని సాధకబాధకాలు ఐఏఎస్‌లకు ఏం తెలుస్తాయని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌ను ప్రభుత్వం రద్దుచేస్తున్న నేపథ్యంలో జిల్లాలోని వైద్యులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు వైద్యులు ‘సాక్షి’తో వారి ఆవేదన పంచుకున్నారు. ఐఎంసీలో అవినీతి పెరిగిపోయిం దంటూ ప్రభుత్వం ఎన్ఎంసీని ఏర్పాటు చేస్తున్నది. వైద్యులు సభ్యులుగా ఉన్న ఐఎంసీ వల్ల కాకుండా కలెక్టర్లు నిర్వహించే ఎన్ఎంసీ వల్ల సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవని వైద్యులు అంటున్నారు. అవినీతిని ప్రభుత్వం ప్రక్షాళన చేయాలికానీ, ఎవరి లబ్ధి కోసమో ఎన్ఎంసీ ఏర్పాటు, ఆ కార్యవర్గంలో ఐఏఎస్‌లతో పాటు ఖాళీగా ఉన్న కొందరు రాజకీయనాయకులతో దీన్ని ఏర్పాటుచేయడం మరిన్ని సమస్యలు పెంచుతుందన్నారు. వైద్యరంగంలో అవకతవకల నిరోధానికి ఎన్ఎంసీ ఏర్పాటు మంచిదే అయినా జిల్లా సమస్యలతో సతమతమయ్యే ఐఏఎస్‌ల వల్ల వైద్య రంగంలో అభివృద్ధి అంతంత మాత్రమే ఉంటుందన్నది వైద్యుల వాదన. ఇటీవలి కాలంలో ఆస్పత్రులపై పెరిగిన దాడుల వల్ల వైద్యులు, రోగులూ సైతం నష్టపోతున్నారన్నారు. వైద్యులకు, ఆస్ప త్రులకు రక్షణ కల్పించే విధానం రావాలని, దీనికి ప్రభుత్వం కఠినచట్టం తేవాలని, అలాగే వినియోగదారుల హక్కుల చట్టంలో కొంత వెసులు బాటు కల్పించాలని, పలు తప్పిదాల వల్ల వేసే జరిమానాలు రూ.కోట్లలో ఉంటాయని, జీవిత కాలం వైద్యం చేసినా వైద్యుడు అంత సంపాదించలేడని వారు పేర్కొన్నారు. పీసీపీఎన్డీ చట్టంలో విధించే శిక్షణలను రద్దుచేయాలని, ఒకోసారి చిన్నచిన్న అక్షర దోషాల వల్ల వైద్యులు బలవుతున్నారని, రిసెప్షన్ కౌంటర్లో సిబ్బంది అక్షరదోషం రాస్తే దానికి వైద్యులు బాధ్యులవు తున్నారన్నారు. ఆరు నెలల శిక్షణ పూర్తిచేసిన వ్యక్తి వైద్యుడెలా అవుతాడు, పదేళ్లపాటు ఎన్నో కష్టాలకోర్చి వైద్య విద్యనభ్యసిస్తే కేవలం ఆరునెలల వ్యవధిలో శిక్షణ పూర్తిచేసిన వారికి వైద్యునిగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనివల్ల పలు నష్టాలకు దారితీస్తుందన్నారు. ఐఏఎస్‌లకు ఏం తెలుసు మా కష్టాలు వైద్యవృత్తి కత్తిమీద సాములా తయారైంది. మా వృత్తిలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నాయి. ఐఎంసీని రద్దుచేసి ఎన్ఎంసీని ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఏర్పాటుచేస్తోంది? మా కష్టాలు ప్రభుత్వానికి పట్టవా. ప్రభుత్వం చేపట్టిన విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా దీనిపై పోరాడతాం. – డాక్టర్ గురుప్రసాద్, ఐఎంఏ కార్యదర్శి, శ్రీహిత ఆస్పత్రి. రాజకీయనాయకులకు పనికొస్తుంది కొత్తగా పెట్టే ఎన్ఎంసీలో వైద్యుల స్థానంలో ఐఏఎస్‌లు, ఖాళీగా ఉన్న రాజకీయనాయకులు భర్తీ అవుతారు. దీంతో ఉన్న సమస్య తీరకపోగా కొత్త సమస్య వస్తుంది. ఏౖదైనా అవినీతి జరిగితే ప్రక్షాళన చేయాలికాని ఈ విధానం సరికాదు. – డాక్టర్ కర్రి రామారెడ్డి. ప్రముఖ మానసిక వైద్యులు. -
పల్లె కన్నీరు పెడుతోంది
– తూర్పు మండలాల్లో – గిట్టుబాటు కాని ధర – పశ్చిమాన్ని పీడిస్తున్న కరువు – పల్లెలకు చాలీచాలని నిధులు – కనుచూపు మేరలో కనిపించని ప్రగతి చిత్తూరు జిల్లాలోని గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. పంటకు గిట్టుబాటు ధర లేక తూర్పు మండలాల్లో.. పంట పండక పడమరలో రైతులు విలవిల్లాడుతున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు తప్పితే, ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులేవీ విదల్చడం లేదు. దీంతో పల్లెలు చితికిపోతున్నాయి. గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సంఘాల ద్వారా ఇచ్చే నిధులు ఏమాత్రం సరిపోవడం లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 56 కోట్లు విడుదల అయ్యాయి. 1,350కి పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామానికి చేరేవి రూ.4 లక్షలు మాత్రమే! ఈ నిధులతో ఒక నెల మంచి నీటిని కూడా అందించే పరిస్థితి లేదని విమర్శలు వస్తున్నాయి. సాక్షి, చిత్తూరు: జిల్లాలోని ఏ పల్లె చూసినా దిగాలుగా కనిపిస్తోంది. అభివృద్ధి ఛాయలు కనుచూపుమేరలో కనిపించడంలేదు. ముఖ్యంగా పాలకులకు దూరదృష్టి లేకపోవడంతో పశ్చిమ మండలాల ప్రజలు సురక్షిత నీరు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతితో పల్లెలకు సురక్షిత తాగునీరు అందిస్తామనే మాటలు నీటి మూటలవడంతో బోర్లలో వచ్చే ఫ్లోరైడ్ నీటినే తాగుతూ జబ్బుల బారిన పడుతున్నారు. ఈ ప్రాంతంలో వర్షపాతం కూడా తక్కువ నమోదవుతుండటంతో భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. ఈ మండలాలను కృష్ణ నీటితో తడిపేస్తామనే మాట ఎండమావిగా మిగిలింది. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం ఇచ్చే స్పెషల్ డెవలప్ ఫండ్ రూ.50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే వాడుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 1.21 లక్షల హెక్టార్లలో పంట నష్టం జిల్లాలో సుమారు 1.92 వేల ఎకరాల్లో రైతులు వేరుశనగ సాగుచేశారు. వర్షాభావంతో సుమారు 1.21 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. దీనివల్ల సుమారు రూ.130 కోట్లు రైతులు నష్టపోయారు. గత మూడేళ్లుగా ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు చెల్లించకపోవడంతో వారు ఆర్థికంగా చితికిపోయారు. ఏటేటా పెరుగుతున్న వలసలు జిల్లాలో ప్రతి ఏటా వలసలు పెరుగుతున్నాయి. వ్యవసాయం లాభసాటిగా లేక, వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లా ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లుతున్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గం నుంచే ప్రతి రోజూ 10 వేల మంది వలసలు వెళ్లుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రైతులు, వ్యవసాయ కూలీలు బెంగళూరు, చెన్నై, కొచ్చి లాంటి ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా వెళుతున్నారు. అరకొర కూలీతో బతుకుపోరాటం చేస్తున్నారు. పదెకరాలున్న రైతు కూడా దుర్భర జీవితం గడుపుతున్నాడు. వలసలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తూర్పు.. నిట్టూర్పు జిల్లాలోని తూర్పు మండలాల్లో ప్రధానంగా పారిశుద్ధ్య లోపంతో గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో అక్కడ రోగాలు ప్రబలుతున్నాయి. దేశం మొత్తం స్వచ్ఛ భారత్ నినాదం మార్మొగుతున్నా జిల్లాలోని గ్రామాలు అపరిశుభ్రంగా మురుగునీటితో ఉన్నాయి. సర్పంచ్‌లు ఆదాయం తెచ్చిపెట్టే సిమెంట్ రోడ్లు పనులే చేస్తుండటంతో పారిశుద్ధ్య సమస్యలపై దృష్టిపెట్టే నాథుడే కరువయ్యారు. దీనికితోడు రైతులకు చెరకుపై గిట్టుబాటు ధర లేకపోవడంతో విలవిల్లాడుతున్నారు. నిధుల్లేక అభివృద్ధి కుంటుపడుతోంది గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నిధుల్లేవు. కాలువలు సరిగాలేక మురుగునీరు మొత్తం రోడ్లపైకి వస్తోంది. దీన్ని అనేక సార్లు అధికారులు తెలిపారు. 14 ఆర్థికసంఘం నిధులు వస్తే కేటాయిస్తాం అన్నారు. ఆ నిధులు ఏమూలకు సరిపోతాయి. పంచాయతీలోని ప్రతి ఇంటికి వురుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛ పంచాయితీ చేద్దావునుకున్నా. వురుగుదొడ్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేÄýæులేదు. దీంతో వురుగుదొడ్ల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. –జి.తొప్పÄýæ్యు, సర్పంచ్, నీరువాయి గ్రావుం, పిచ్చాటూరు ఇలా ఎన్నాళ్లు ? సర్పంచ్‌గా ఎన్నికయ్యి దాదాపు మూడేళ్లవుతోంది. ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా లేదు. ప్రజల్లోకి వెళ్లాలంటే మొహం చాలట్లేదు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. బ్లీచింగ్ చల్లిద్దామన్నా నిధుల్లేవు. –ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ ఎం.బయపల్లి.ఐరాల మండలం -
నిరంకుశ పాలనను అడ్డుకుందాం
– అభివృద్ధి మరిచి ఫిరాయింపులు – కేసీఆర్ నిరంకుశ పాలనను అడ్డుకుందాం – జలసాధన సమితి బహిరంగ సభలో విపక్ష నేతలు ధ్వజం – ముగిసిన పాదయాత్ర పాలమూరు : కేసీఆర్ నిరంకుశ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి.. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు.. తెలంగాణను అభివృద్ధి చేస్తామంటూ పార్టీ ఫిరాయింపులెందుకే ప్రాధాన్యమిస్తున్నారు.. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం దోచుకోవడానికి, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాజెక్టులు తెచ్చి రైతులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు.. అంటూ వివిధ పార్టీల నేతలు ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధనకై జలసాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 22న చేపట్టిన మహా పాదయాత్ర సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ యాత్రకు అధికార పార్టీ మినహా అన్ని పార్టీల నాయకులు మద్ధతు తెలిపి కదం తొక్కారు. జిల్లా కళాకారుల డప్పుదరువుల మధ్య పాదయాత్ర ఉత్సాహంగా ముందుకు సాగింది. అడ్డుకున్న పోలీసులు పాదయాత్రగా ప్రధాన రహదారి వెంట వస్తుండగా కలెక్టరేట్ ఎదుట పోలీసులు అడ్డగించారు. ప్రధాన రోడ్డుపై వెళ్లేందుకు అనుమతి లేదని, తెలంగాణ చౌరస్తా మీదుగా వెళ్లాలని టూటౌన్ సీఐ రాజు నాయకులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పాదయాత్రగా వెళ్తే తప్పేందని, తాము ఈ దారినే వెళ్తామని పోలీసులను తోసుకుంటూ ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ముగింపు సభలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) అధ్యక్షులు, జేఏసీ, ప్రజాసంఘాల నేతలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పాల్గొని ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సభ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పటì కీ తడుస్తూనే ప్రసంగించారు. జలసాధన సమితి అధ్యక్షుడు అనంతరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, డీసీసీ అ«ధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, జేఏసీ ఛైర్మన్ రాజేందర్‌రెడ్డి, పాలమూరు అధ్యయన వేధిక కన్వీనర్ రాఘవాచారి, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, సీపీఐఎంల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, వెంకటేష్, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్, ఎస్సీసెల్ అధ్యక్షుడు మిట్టమీది నాగరాజు, జలసాధన సమితి నాయకులు అంబదాస్, బోయిన్పల్లి రాము, నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రాజెక్టు సాధించేవరకు పోరాడండి : కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మక్తల్, నారాయణపేట– కొడంగల్ ప్రాజెక్టు సాధించేవరకు పోరాటం సాగించాలి. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడా ఎప్పుడు అధికారంలో ఉండదు. తెలంగాణ ఉద్యమంలో రైతుల పాత్ర గొప్పది. కానీ ప్రభుత్వం రైతులనే విస్మరిస్తోంది. రుణ మాఫీ చేస్తానని ఇప్పటికి నాన్చుతోంది. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నా నిధులు కేటాయించకుండా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు వేలకోట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం. ప్రజలే బుద్ధిచెప్పాలి ప్రాజెక్టు కోసం అన్ని పార్టీలు ఏకమై ఉద్యమిస్తుంటే ముఖ్యమంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణం. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లోని ఐదున్నరకోట్ల కుటుంబాలకు తాగునీరు, లక్ష ఎకరాలకు సాగునీరందించే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని విస్మరిస్తే భవిష్యత్‌లో ప్రజలే కేసీఆర్‌కు బుద్ధి చెబుతారు. – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రజలు కదలిరావాలి గవర్నర్ పాలనలో పార్టీలకతీతంగా తీసుకొచ్చిన జీఓ నెం.69ను ప్రభుత్వం విస్మరిస్తోంది. కేసీఆర్ దయ ఉంటేనే పనులు అవుతున్నాయి. రాష్ట్రంలోని మంత్రులు కేసీఆర్ బానిసలుగా మారారు. రాజకీయాల కోసం పాదయాత్రలో పాల్గొనడం లేదు. దగ్గరనుంచి నీళ్లొచ్చే అవకాశమున్నా చుట్టూ తిప్పాల్సిన అవసరం ఏముంది. హరీష్‌రావు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నరు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన రైతులకు పరిహారం అందేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రజలు కదలిరావాలి. – సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మెడలు వంచి ప్రాజెక్టు సాధిస్తాం ప్రభుత్వం మెడలు వంచైనా నారాయణపేట– కొడంగల్ ప్రాజెక్టును సాధిద్దాం. లక్ష ఎకరాలకు సాగునీరందించే ఎత్తిపోతల పథకాన్ని ఆపి ప్రజల పొట్టకొట్టేందుకు టీఆర్ఎస్ కుట్రపన్నింది. ప్రాజెక్టుల కోసం పాటుపడకుండా పార్టీ ఫిరాయింపులకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరికి పవర్ శాశ్వతం కాదు. కేసీఆర్ పాలన నిజాంను తలపిస్తోంది. – టీ–టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మెడమీద తలకాయ లేదు : కేసీఆర్‌కు మెడ మీద తలకాయ లేదు. ఉంటే కూతవేటు దూరంలో ఉన్న జూరాల నుంచి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీరందించేవారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి నీరు తీసుకురావాలంటే నార్లాపూర్ వద్ద 100 మీటర్లు, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ వద్ద మొత్తం నాలుగుసార్లు లిఫ్టు చేయాల్సి ఉంటుంది. చివరలో ఉన్న ఈ మూడు నియోజకవర్గాలకు సాగునీరందించడం సాధ్యంకాదు. డబ్బుల కోసమే పెద్దపెద్ద రిజర్వాయర్లు చేపడుతున్నారు. ఏ ప్రజలు ఎంపీగా గెలిపించి రాజకీయ జీవితమిచ్చారో ఆ ప్రజలను విస్మరిస్తే పతనం తప్పదు. – బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి దోచుకోవడానికే ప్రాజెక్టులు ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడానికే ప్రాజెక్టులు కడుతున్నట్టుంది. వెనకబడ్డ మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజక వర్గాలకు భీమా ప్రాజెక్టు ద్వారా నారాయణపేట జయమ్మ చెరువుకు నీళ్లు ఇవ్వాలని దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి విన్నవించారు. అందులో భాగంగానే జీఓ నెం.69 ఏర్పడింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రెండు భాగాలుగా చేసి నారాయణపేట, మక్తల్, కొడంగల్ ప్రజలకు ప్రత్యేక ఎత్తిపోతల పథకం నిర్మించాలి. కేసీఆర్ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రాజెక్టు కడితే ఎక్కువ పైసలు వస్తాయని అవసరం లేకున్నా వ్యయాన్ని పెంచుతున్నారు. సొంత ప్రయోజనాలకోసం పార్టీ మారిన వారిని ప్రజలు క్షమించరు. – డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే అన్నీ మాయమాటలే రాష్ట్ర ప్రభుత్వం రైతులను, ప్రజలను మభ్యపెడుతుంది. ప్రాజెక్టుకోసం అన్ని పార్టీలు ఏకమైనా కనువిప్పు కలగడంలేదు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి స్వలాభం చూసుకుంటున్నారు. భూ నిర్వాసితులకు చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించకుండా ప్రభుత్వ జీఓ ప్రకారం చెల్లించడం దుర్మార్గం. జీఓ 69కోసం పోరాడుతున్న ప్రజలకు అండగా ఉంటాం. – చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే -
అక్కడికి వెళితే ప్రేమలో పడతారు!
'ప్రేమలో పడలాంటే ఒకచోటికి వెళ్లాలా? చాలాచోట్ల చాలారకాలుగా ప్రేమలో పడొచ్చు తెల్సా..' అంటారేమో! అయితే ఫొటోలో కనిపిస్తున్న చోటికి వెళితే మాత్రం తప్పక విశ్వప్రేమ పుట్టుకొస్తుంది. అది ఎలాగంటే.. ఆ ఊరిపేరు ముబారక్. దాదాపు 40 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించిన అరేబియా సముద్రంలో.. ప్రత్యేకమైన తీరగ్రాం అది. మూడొంతుల భూగోళాన్ని ఆక్రమించిన జలరాశుల్లో భూతద్దం పెట్టివెదికితేగానీ దొరకని ఆకుపచ్చ సముద్రపు తాబేళ్లకు ముబారక్ తీరం శాశ్వత చిరునామా. అరుదైన బల్లిజాతులకూ ఆవాలం. ఇక సాయంసంధ్యల్లోనైతే ప్రకృతికాంత తన అందమంతటినీ కట్టకట్టుకొచ్చి ఇక్కడ కుమ్మరించిందా! అన్నంత రమణీయంగా ఉంటుంది. ఆ అందాలతో ప్రేమలోపడి, ముచ్చట్లుపెట్టి, విరహంతో తిరిగిస్తుంటే.. అదిగో, అప్పుడు కనిపిస్తారు మనుషులు. అంతటి ప్రాకృతిక సౌందర్యాన్ని ప్రపంచానికి పంచే ముబారక్ లో మనుషుల పరిస్థితి.. 'నాంపల్లి స్టేషన్ కాడి రాజలింగు' లాంటిది. కడు దయనీయం. ఉందామంటే ఇల్లూలేదు, తిందామంటే తిండీ లేదు, దాహం వేస్తే నీళ్లూ లేవు, రోగం వస్తే మందూ లేదు. అంతెందుకు ఆ ఊరికిపోయే దారి కూడా అంతా మట్టిమయం. అప్పుడు మళ్లీ మనలో ప్రేమ మొదలవుతుంది. ఈ సారిమాత్రం ప్రకృతిమీదకాదు సాటి మనిషి మీద. ఇంకా చెప్పాలంటే మన దాయాది మీద! ముబారక్.. కరాచీ మెట్రోపాలిటన్ లో భాగం. కరాచీ నగరం నడిబొడ్డునుంచి కేవలం 30 కిలోమీటర్ల ప్రయాణం. అభివృద్ధికి మాత్రం 200 ఏళ్ల దూరం! అక్కడ నివసించేవాళ్లంతా బెలూచీ గిరిజనులే. వందల ఏళ్ల నుంచే సముద్రంలో చేపలుపట్టే జాలర్లుగా స్థిరపడిపోయారు. దేశవిభజన తర్వాత రెండు మూడు దశాబద్ధాలవరకూ అక్కడి జీవనం సాఫిగానే సాగేది. చేపల మార్కెట్ బాగా నడిచేది. అయితే పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆధునిక వేటపద్ధతులు నేర్చుకోలేకపోయారు ముబారక్ జాలర్లు. విదేశీ పెట్టుబడులుగానీ, బడాబాబులకుగానీ.. ముబారక్ ను బాగా ఆదాయమిచ్చే ప్రాంతంగా గుర్తించలేదు. ఇలా తమ రేవులోకి పెద్ద కంపెనీలు రాకపోవడం బడుగు జీవులైన జాలర్లకు పైకి మంచిచేసినట్లనిపించినా, వాస్తవానికి తీవ్రనష్టం చేసింది. కరాచీ నుంచి వారానికి రెండు సార్లోచ్చే మంచినీళ్ల ట్యాంకర్లు, వారానికి ఒకసారొచ్చే కూరగాయల బండితోనే సరిపెట్టుకోవాలి ఆ 10 వేల జనాబా. ఒక ట్యాంకర్ నీళ్ల ఖరీదు రూ. 1500. పేరుకు ఒక గుడిసెలో వైద్యశాల ఉంది. కానీ అందులో కాటన్ కు కూడా దిక్కుండదు. జలుబొచ్చినా, జబ్బుచేసినా కరాచీ నగరానికి పరుగెత్తాల్సిందే. కరెంటు పోల్స్, వాటిమధ్య తీగలూ ఉంటాయి కానీ కరెంటే ఉండదు. ఇప్పటివరకు ఆ గ్రామానికి విద్యుత్ సరఫరాలేదు. వంట చేసుకునేందుకు కట్టెలపొయ్యే దిక్కు. అదికూడా మోపు కట్టెలు రూ. 150కి తక్కువ దొరకదు. 'ఇంత దరిద్రపుగొట్టు జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నారయ్యా?' అని అడిగితే ముబారక్ వాసులు చెప్పేది ఒకటే మాట.. 'మేం మా గ్రామాన్ని ప్రేమిస్తాం. సౌకర్యాలు ఉన్నా, లేకున్నా ఇక్కడే చస్తాం. ఇక్కడికొస్తే మీక్కూడా మాపై ప్రేమ కలుగుతుంది. కానీ మా పాలకులకే అది కలగట్లేదు. చూద్దాం.. అల్లా ఎప్పటికైనా కరుణించకపోడా..' అని.