తమ నాలుగేళ్ల పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందనీ, గ్రామాలు సకల సదుపాయాలతో అలరారుతున్నాయని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని ఇండియా స్పెండ్ అనే సంస్థ తెలిపింది. అభివృద్ధికి చాలా పల్లెలు ఇంకా ఆమడదూరంలో ఉన్నట్లు స్వయంగా ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయని పేర్కొంది.
విద్యుత్ ఏదీ?
దేశంలోని 5,97,608 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం ద్వారా 100 శాతం విద్యుదీకరణ సాధించామని కేంద్రం ప్రకటించింది. కానీ వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 2.3 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం లేదు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 89 శాతం మాత్రమే విద్యుదీకరణ జరిగింది.
మొబైల్ సేవలు
మొబైల్ ఫోన్ సేవలు ప్రారంభమై ఇప్పటికి 23 ఏళ్లు గడిచినా ఇంకా 43,000 గ్రామాలకు మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి రాదు. నెట్‌వర్క్ ఉన్నచోట్ల సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తాగునీరు
దేశంలోని 2.89 లక్షల గ్రామాల్లో స్వచ్ఛమైన తాగు నీరు పాక్షికంగానే అందుబాటులో ఉందని ఇటీవల కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ప్రస్తుతం 62,582 గ్రామాల్లోని ప్రజలు కలుషిత నీటినే తాగుతున్నట్లు చెప్పింది.
గ్రామీణ రహదార్లు
కేంద్రం 2000లో ప్రారంభించిన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 1,78,184 గ్రామాల రహదార్లను అనుసంధానించాలన్నది లక్ష్యం. వీటిలో 31,022 గ్రామాలకు రహదారులనే వేయలేదు.
విద్య
గ్రామీణ ప్రాంతాల్లో 14–18 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థుల్లో 25% (8 కోట్ల మంది) మాతృభాషలోని పాఠ్య పుస్తకాలనే చదవలేకపోతున్నారు. సగం మందికిపైగా లెక్కలు (మూడంకెల సంఖ్యను ఒక అంకెతో గుణించడం) కూడా రాదు.
ఆస్పత్రులు
2017 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఆరోగ్య ఉప కేంద్రాల్లో 19 శాతం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ)22 శాతం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో(సీహెచ్‌సీ) 30 శాతం సిబ్బంది కొరత ఉంది. 30 వేల మందికి ఒక పీహెచ్‌సీ, 1.20 లక్షల మందికి ఒక సీహెచ్‌సీ ఉన్నాయి. పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత 12% ఉంది. నర్సుల కొరత 60% దాకా ఉంది. 73% ఉప ఆరోగ్య కేంద్రాలు శివారు గ్రామాలకు 3 కి.మీ. పైగా దూరంలో ఉన్నాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గ్రామాల్లో 99 లక్షల ఇళ్లు లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 45 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
అభివృద్ధికి ఆమడ దూరంలో పల్లెలు
Published Mon, Sep 3 2018 3:55 AM | Last Updated on Mon, Sep 3 2018 3:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment