చిన్న పట్టణాలకు ఔట్‌లెట్లు
కస్టమర్లకు మరింత చేరువ
రూరల్ వాటా 33 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో 38,90,114 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 42 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా. 2024–25లో ఈ విభాగం 3–5% వృద్ధి చెందుతుందని పరిశ్రమ భావిస్తోంది. అయితే మొ త్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం పీవీ సేల్స్‌లో గ్రామీణ ప్రాంతాల వాటా 33% గా ఉంది. మహమ్మారి కాలంలో పట్టణ ప్రాంతాల్లో పీవీ విక్రయాల్లో తిరోగమన వృద్ధి ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలు దూసుకుపోవడం గమనార్హం. కలిసి వ చ్చే అంశం ఏమంటే రూరల్ ఏరియాల్లో రోడ్ నెట్ వర్క్ చాలా మెరుగైంది. వృద్ధి పరంగా పట్టణ ప్రాంతా లను కొన్నేళ్లుగా గ్రామీణ మార్కెట్లు వెనక్కి నెట్టాయి. ఈ అంశమే ఇప్పుడు తయారీ కంపెనీలకు రిటైల్ విషయంలో వ్యూహం మార్చుకోక తప్పడం లేదు.
వృద్ధిలోనూ రూరల్ మార్కెట్లే..
అమ్మకాల వృద్ధిరేటు 2023–24 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 11.7, పట్టణ ప్రాంతాల్లో 8% ఉండొచ్చని అంచనా. 2022–23లో గ్రామీణ భారతం 20 % దూసుకెళితే, పట్టణ మార్కెట్లు 16 శాతం వృద్ధి సాధించాయి. 2021–22లో అర్బన్ మార్కెట్లు 9% తిరోగమన వృద్ధి చెందితే, రూరల్ మార్కెట్లు 1.5% ఎగశాయి. 2018–19 నుంచి 2023–24 వరకు చూస్తే ఒక్క 2019–20లో మాత్రమే గ్రామీణ భారతం తిరోగమన వృద్ధి చెందింది. అర్బన్ మార్కెట్లు మాత్రం 2021–22 వరకు వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు తిరోగమన బాట పట్టాయి.
విస్మరించలేని గ్రామీణం..
గ్రామీణ ప్రాంతాలు విస్మరించలేని మార్కెట్లుగా అభివృద్ధి చెందాయని మారుతీ సుజుకీ చెబుతోంది. ఈ సంస్థకు 2018–19లో గ్రామీణ ప్రాంతాల వాటా 38 శాతం. ఇప్పుడు ఇది 45 శాతానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా 6,50,000 గ్రామాలు ఉన్నాయని, ఇందులో 4,10,000 గ్రామాల్లో కనీసం ఒక్క మారుతీ సుజుకీ కారైనా పరుగు తీస్తోందని కంపెనీ ధీమాగా చెబుతోంది. మిగిలిన గ్రామాలు వ్యాపార అవకాశాలు ఉన్నవేనని కంపెనీ అంటోంది.
2019–20తో పోలిస్తే టాటా మోటార్స్ గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు అయిదు రెట్లు అధికం అయ్యాయి. మొత్తం విక్రయాల్లో రూరల్ వాటా ఇప్పుడు ఏకంగా 40 శాతానికి చేరిందని కంపెనీ వెల్లడించింది. వినియోగదార్లకు చేరువ అయ్యేందుకు సేల్స్, సరీ్వస్ వర్క్‌షాప్స్‌ను విస్తరించినట్టు తెలిపింది. పట్టణాలకు సమీపంలో 800 ఔట్‌లెట్లు నెలకొన్నాయని, ప్రత్యేకంగా ఇవి గ్రామీణ కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా 135 అనుభవ్ వ్యాన్స్ (మొబైల్ షోరూమ్స్) పరిచయం చేశామని తెలిపింది.
గ్రామాల్లో చిన్న కార్లు..
హ్యాచ్‌బ్యాక్స్‌కు గ్రామీణ మార్కెట్లలో విపరీత డిమాండ్ ఉంది. తొలిసారిగా కారు కొనే కస్టమర్లు ఇక్కడ అత్యధికం కూడా. ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ విక్రయాల్లో రూరల్ ఏరియాల వాటాయే అధికం. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్స్ అధికంగా అర్బన్ ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్నాయి. సెడాన్స్ విషయంలో ఇరు మార్కెట్లు చెరి సగం పంచుకున్నాయి. ఎస్‌యూవీల్లో అయితే అర్బన్‌దే హవా. ఇక గ్రామీణ మార్కెట్లకు విక్రయశాలలు, సర్వీసింగ్ కేంద్రాలను విస్తరించే విషయంలో కంపెనీలు డీలర్ పార్ట్‌నర్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి.
మానవ వనరుల సంఖ్య పెంచేందుకు సాయం చేస్తున్నాయి. టెస్ట్ డ్రైవ్ కోసం వాహనాలను సమకూరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ నెట్‌వర్క్ మెరుగుపడింది. దీంతో వినియోగదార్లకు చేరువ కావడంలో భాగంగా సేల్స్ నెట్‌వర్క్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు మహీంద్రా తెలిపింది. రూరల్ మార్కెట్లలోనూ తమ ఎస్‌యూవీలకు డిమాండ్ కొనసాగుతోందని వెల్లడించింది. ప్రజలను ప్రభావితం చేసే సర్పంచ్‌ల వంటి ముఖ్యులతో కలిసి కంపెనీలు విభిన్న కార్యక్రమాలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment