india spend
-
అభివృద్ధికి ఆమడ దూరంలో పల్లెలు
తమ నాలుగేళ్ల పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందనీ, గ్రామాలు సకల సదుపాయాలతో అలరారుతున్నాయని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని ఇండియా స్పెండ్ అనే సంస్థ తెలిపింది. అభివృద్ధికి చాలా పల్లెలు ఇంకా ఆమడదూరంలో ఉన్నట్లు స్వయంగా ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయని పేర్కొంది. విద్యుత్ ఏదీ? దేశంలోని 5,97,608 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం ద్వారా 100 శాతం విద్యుదీకరణ సాధించామని కేంద్రం ప్రకటించింది. కానీ వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 2.3 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం లేదు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 89 శాతం మాత్రమే విద్యుదీకరణ జరిగింది. మొబైల్ సేవలు మొబైల్ ఫోన్ సేవలు ప్రారంభమై ఇప్పటికి 23 ఏళ్లు గడిచినా ఇంకా 43,000 గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి రాదు. నెట్వర్క్ ఉన్నచోట్ల సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు దేశంలోని 2.89 లక్షల గ్రామాల్లో స్వచ్ఛమైన తాగు నీరు పాక్షికంగానే అందుబాటులో ఉందని ఇటీవల కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ప్రస్తుతం 62,582 గ్రామాల్లోని ప్రజలు కలుషిత నీటినే తాగుతున్నట్లు చెప్పింది. గ్రామీణ రహదార్లు కేంద్రం 2000లో ప్రారంభించిన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 1,78,184 గ్రామాల రహదార్లను అనుసంధానించాలన్నది లక్ష్యం. వీటిలో 31,022 గ్రామాలకు రహదారులనే వేయలేదు. విద్య గ్రామీణ ప్రాంతాల్లో 14–18 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థుల్లో 25% (8 కోట్ల మంది) మాతృభాషలోని పాఠ్య పుస్తకాలనే చదవలేకపోతున్నారు. సగం మందికిపైగా లెక్కలు (మూడంకెల సంఖ్యను ఒక అంకెతో గుణించడం) కూడా రాదు. ఆస్పత్రులు 2017 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఆరోగ్య ఉప కేంద్రాల్లో 19 శాతం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ)22 శాతం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో(సీహెచ్‌సీ) 30 శాతం సిబ్బంది కొరత ఉంది. 30 వేల మందికి ఒక పీహెచ్సీ, 1.20 లక్షల మందికి ఒక సీహెచ్‌సీ ఉన్నాయి. పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత 12% ఉంది. నర్సుల కొరత 60% దాకా ఉంది. 73% ఉప ఆరోగ్య కేంద్రాలు శివారు గ్రామాలకు 3 కి.మీ. పైగా దూరంలో ఉన్నాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గ్రామాల్లో 99 లక్షల ఇళ్లు లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 45 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. -
దళితులపై నేరాలు ఎనిమిదింతలు
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం–1989 కింద నిందితుల్ని తక్షణ అరెస్ట్ చేయరాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 2006తో పోల్చుకుంటే 2016 నాటికి దళితుల(ఎస్సీ)పై నేరాలు 746 శాతం (8 రెట్లు) పెరిగాయని ఇండియా స్పెండ్ అనే సంస్థ తెలిపింది. ఇక ఆదివాసీల(ఎస్టీ)పై నేరాల సంఖ్య ఈ పదేళ్లలో 1,160 శాతం(12 రెట్లు) పెరిగాయని వెల్లడించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) 2016లో విడుదల చేసిన గణాంకాలను విశ్లేషించిన అనంతరం ఈ నివేదికను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశజనాభాలో 20.1 కోట్ల మంది(16.6 శాతం) దళితులు, 10.4 కోట్ల మంది(8.6 శాతం) ఆదివాసీలు ఉన్నారు. మధ్యప్రదేశ్ టాప్ 2006–16 మధ్య దేశవ్యాప్తంగా దళితులపై 4,22,799 నేరాలు జరిగాయి. గోవా, కేరళ, ఢిల్లీ, గుజరాత్, బిహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ నేరాల సంఖ్య 10 రెట్లు పెరిగిందని ఆ సంస్థ వెల్లడించింది. దళితులపై జరిగిన నేరాల్లో మధ్యప్రదేశ్(43.4%), గోవా (43.2%), రాజస్తాన్(42%) రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయంది. ఇక ఆదివాసీలపై 37.5% నేరాలతో కేరళ తొలిస్థానంలో నిలవగా, అండమాన్–నికోబార్ దీవులు (21%), ఆంధ్రప్రదేశ్ (15.4%) తర్వాతి స్థానాల్లో నిలిచాయంది. దేశవ్యాప్తంగా ఈ పదేళ్లలో ఆదివాసీలపై 81,322 నేరాలు జరగగా.. వాటిలో అత్యధికం కేరళ, కర్ణాటక, బిహార్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయంది. పోలీస్స్టేషన్లలో ఆదివాసీలకు సంబంధించి 405 పెండింగ్ కేసులతో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న నేరాల్లో దోషుల సంఖ్య 10 శాతానికి మించడం లేదని తెలిపింది. కొండలా పేరుకుపోతున్న కేసులు దళితులు, ఆదివాసీలపై ఈ పదేళ్లలో నేరాలు పెరిగినప్పటికీ.. పోలీస్స్టేషన్లు, కోర్టుల్లో అదే స్థాయిలో కేసుల పరిష్కారం జరగడంలేదని నివేదిక స్పష్టం చేసింది. దళితుల ఫిర్యాదులపై పోలీస్స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులు ఈ పదేళ్లలో 99 శాతం పెరిగాయని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు 50 శాతం పెరిగాయని తెలిపింది. 4,311 పెండింగ్ కేసులతో బిహార్ దేశంలోనే తొలిస్థానంలో ఉంది. తప్పుడు కేసులు అంతంతే: దళితులు నిందితులపై పెట్టిన తప్పుడు కేసు ల సంఖ్యలో ఈ పదేళ్లలో ఎలాంటి పెరుగుదల లేదని ఆ నివేదిక తెలిపింది. 2006–16 మధ్య దళితులు పెట్టిన కేసుల్లో 5,347 తప్పుడు కేసులుగా తేలాయంది. వీటిలో రాజస్తాన్ 2,632 కేసులతో ముందుంది. శిక్షపడుతున్న సందర్భాలు చాలా తక్కువ దేశవ్యాప్తంగా దళితులు, ఆదివాసీలపై నేరాలకు పాల్పడిన ఘటనల్లో దోషులుగా తేలుతున్నవారి సంఖ్య 30 శాతానికి మించడం లేదు. దళితులపై జరిగిన నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 2006లో 28 శాతం ఉండగా, 2016 నాటికి 26 శాతానికి పడిపోయిందని ఆ నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, గుజరాత్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 10 శాతానికి మించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే 2006లో ఆదివాసీలపై నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 28 శాతం ఉండగా, 2016 నాటికి ఇది 21 శాతానికి పడిపోయిందని పేర్కొంది. పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం, విచారణలో జాప్యం, బాధితులకు రక్షణ లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ చట్టంలో సరైన సెక్షన్ల కింద కేసు నమోదుచేయకపోవడం కారణంగానే చాలామంది నేరస్తులు శిక్షపడకుండా తప్పించుకుంటున్నారంది. –సాక్షి నేషనల్ డెస్క్ -
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
న్యూఢిల్లీ: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడేళ్ల కాలంలో నిరుద్యోగుల సంఖ్య తగ్గాల్సింది పోయి కొంచెం పెరిగిందని ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి రాకముందు, అంటే 2013-–2014 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నిరుద్యోగుల సంఖ్య కార్మిక శక్తితో 4.9 శాతం ఉండగా, 2015-16 ఆర్థిక సంవత్సరానికి 5 శాతానికి చేరుకుంది. నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామని, రోడ్లు, విద్యుత్‌ను అందరికి అందుబాటులోకి తీసుకొస్తామని, దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా తీర్చి దిద్దుతామని, టెర్రరిజాన్ని తుదముట్టిస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో ప్రధానంగా హామీ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ వారంతో మూడేళ్లవుతున్న సందర్భంగా ఈ ప్రధాన అంశాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ‘ఇండియా స్పెండ్’ సంస్థ విశ్లేషించింది. పదేళ్ల యూపీఏ పాలనలో అదుపుతప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామని, కొత్త ఉద్యోగాల సృష్టికి, వ్యాపారాల అభివద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ ప్రభుత్వం తెలిపింది. బీజేపీ అధికారంలోకి వస్తే కోటీ ఉద్యోగాలను కొత్తగా తీసుకొస్తామని ఆగ్రాలో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా హామీ ఇచ్చారు. 2014 జూలై నుంచి 2016 డిసెంబర్ మధ్య కాలంలో ఉత్పత్తులు, వాణిజ్యం, భవన నిర్మాణం, విద్యా, ఆరోగ్య, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, రవాణా, వసతి, రెస్టారెంట్ రంగాల్లో 6,41,000 కొత్తగా ఉద్యోగాలు పెరిగాయని, మొత్తంగా నిరుద్యోగ సమస్య ఐదు శాతానికి చేరుకుందని 2015–16 ఆర్థిక సంవత్సరంలో వార్షిక నిరుద్యోగంపై జరిపిన ఐదవ ఆర్థిక సర్వే వెల్లడించింది. ఆ తర్వాత 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు తెలియనప్పటికీ, ఉద్యోగ పురోగతి సవ్యంగా లేదని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీ అధికారంలోకి రాకముందు, అంటే యూపీఏ అధికారంలోవున్న 2011 జూలై నుంచి 2013 డిసెంబర్ నాటికి, రెండేళ్ల కాలంలో 12 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్ల కాలంలో అందులో సగం ఉద్యోగాలకే కొత్తగా సష్టించగలిగింది.