గ్రామాల అభివృద్ధితోనే ‘వికసిత్‌ భారత్‌’ | Centre giving priority to villages, focusing on improving lives of small farmers | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధితోనే ‘వికసిత్‌ భారత్‌’

Published Fri, Feb 23 2024 5:22 AM | Last Updated on Fri, Feb 23 2024 5:22 AM

Centre giving priority to villages, focusing on improving lives of small farmers - Sakshi

అహ్మదాబాద్‌: గ్రామాలకు సంబంధించిన ప్రతి అంశానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా సన్నకారు రైతుల జీవితాలను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధితోనే ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని అన్నారు.

గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుజరాత్‌ కో–ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌(జీసీఎంఎంఎఫ్‌) 50వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. లక్ష మందికిపైగా రైతులు, పాడి పశువుల పెంపకందారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రఖ్యాత అమూల్‌ కంపెనీని నిర్వహిస్తున్న జీసీఎంఎంఎఫ్‌ని ప్రపంచంలో నంబర్‌ వన్‌ డెయిరీగా మార్చడానికి కృషి చేయాలని పాడి రైతులకు, భాగస్వామ్యపక్షాలకు మోదీ పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ఈ సహకార సంఘం(అమూల్‌) ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద డెయిరీ కంపెనీగా స్థానం దక్కించుకుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డెయిరీ రంగం ఏటా 2 శాతం వృద్ధి సాధిస్తుండగా, మన దేశంలో మాత్రం 6 శాతం వృద్ధిని సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా 10 వేల రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మోదీ చెప్పారు. ఇప్పటికే 8 వేల ఎఫ్‌పీఓలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సన్నకారు రైతులను వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా, ఎగుమతిదారులుగా మార్చాలని సంకలి్పంచామని అన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకొచి్చన పథకాలను ప్రస్తావించారు. రైతుల కోసం మైక్రో ఏటీఎంలు, గోబర్దన్‌ పథకం, ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రాలు తీసుకొచ్చామని గుర్తుచేశారు.

ఇంధన దాతగా, ఎరువుల దాతగా రైతులు  
జంతు సంపదను వ్యాధుల బారి నుంచి కాపాడానికి రూ.15,000 కోట్లతో ఉచిత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించామని, ఇప్పటికే 60 కోట్ల టీకా డోసుల ఇచ్చామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

గ్రామాల్లో కిసాన్‌ సమృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇక్కడ పంటలకు సంబంధించి రైతుల సమస్యలకు శాస్త్రీయ పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని వివరించారు. సేంద్రీయ ఎరువుల తయారీలో రైతులకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. బయో గ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సైతం తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులను ‘అన్నదాత’ నుంచి ఇంధన దాతగా, ఎరువుల దాతగా మార్చాలన్నదే ప్రభుత్వ అకాంక్ష అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
రైతుల సంక్షేమం విషయంలో తమ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రైతన్నల బాగు కోసం ఇప్పటిదాకా ఎన్నో చర్యలు చేపట్టామని, చెరకు ధర పెంచడం కూడా అందులో ఒకటి అని తెలిపారు. దీనివల్ల కోట్లాది మంది చెరకు రైతులు ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు.

కేంద్ర కేబినెట్‌ తాజాగా తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ మోదీ గురువారం ‘ఎక్స్‌’లో పలు పోస్టు చేశారు. క్వింటాల్‌ చెరకు కనీస ధర(ఎఫ్‌ఆర్‌పీ)ను మరో రూ.25 చొప్పున పెంచుతూ మోదీ నేతృత్వంలో కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్వింటాల్‌ చెరకు కనీస ధర రూ.350కు చేరుకుంది.

ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని మోదీ అభివరి్ణంచారు. అంతరిక్ష రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేబినెట్‌ మరో నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. గుర్రాలు, గాడిదలు, కంచర గాడిదలు ఒంటెలు వంటి జంతువుల సంతతి వృద్ధికి  సంబంధించిన పరిశ్రమలు, వ్యక్తులకు 50 శాతం పెట్టుబడి రాయితీ మంజూరు చేస్తూ కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.    

నన్ను అవమానించడమే వారి ఎజెండా
నవ్‌సారీ: సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కాంగ్రెస్‌ పారీ్టపై విమర్శల బాణాలు వదిలారు. దక్షిణ గుజరాత్‌లోని నవ్‌సారీ పట్టణంలో ఒక ప్రజా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ మోదీ కులాన్ని ఎంత మంది కాంగ్రెస్‌ నేతలు దూషించారో మీరందరూ చూసే ఉంటారు. కానీ కాంగ్రెస్‌ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్లెంతగా నన్ను తిడతారో 400 లోక్‌సభ సీట్లు గెలవాలన్న మా సంకల్పం అంతగా బలపడుతుంది.

దేశం కోసం కాంగ్రెస్‌కు ఎలాంటి ఎజెండా లేదు. నన్ను తిట్టడమే వారి ఎజెండా. దేశ భవిష్యత్తుపై వాళ్లకు ఎలాంటి చింతా లేదు. ఎంతగా మాపై బురద జల్లుతారో అంతగా ఆ బురదలో 370(సీట్లు) కమల పుష్పాలు విరబూస్తాయి’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 370 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ‘‘వారసత్వ రాజకీయాల మాటకొస్తే కాంగ్రెస్‌ను మించినది మరోటి లేదు’ అని విమర్శించారు. ‘బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారికి దేశ ఘన వారసత్వ పరిరక్షణ చేతకాదు’ అని వ్యాఖ్యానించారు.

2 అణు విద్యుత్‌ రియాక్టర్లు జాతికి అంకితం
సూరత్‌: నవ్‌సారిలో సభ అనంతరం ఆయన పొరుగునే సూరత్‌ జిల్లాలో ఉన్న కక్రాపర్‌కు చేరుకున్నారు. కక్రాపర్‌ అణు విద్యుత్‌ స్టేషన్‌ వద్ద ప్రధాని మోదీ రెండు అణు విద్యుత్‌ రియాక్టర్లను జాతికి అంకితం చేశారు. కక్రాపర్‌ ఆటమిక్‌ పవర్‌ స్టేషన్‌లో 700 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 3, 4 యూనిట్లను న్యూక్టియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌) రూ.22,500 కోట్లతో ఏర్పాటు చేసింది. దేశీయంగా రూపుదిద్దుకున్న అతిపెద్ద ప్రెస్సరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియా క్టర్లు ఇవే కావడం విశేషం. ప్రధాని ఇక్కడి సీనియర్‌ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇక్కడ తయారైన విద్యుత్‌ గుజరాత్‌తోపాటు మహా రాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రా నాగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూలకు సరఫరా అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement