కొఠారింగ్ తాళభద్ర గ్రామానికి వెళ్లేందుకు ఇదే రోడ్డు
సాక్షి, పలాస(శ్రీకాకుళం) : నియోజకవర్గంలోని పలు గిరిజన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో కనీస సదుపాయాలు లేవు. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు మొరాయించడంతో ఎండమావిగానే మిగిలిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగంతో యువకులు నిర్వీర్యం చెందుతున్నారు. పలాస, మందస మండలాల్లో గిరిజన గ్రామాలు ఉన్నాయి. తర్లాకోట, లొత్తూరు తదితర గిరిజన గ్రామాలన్నీ పలాస మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కొఠారింగ్ తాళభద్ర, పెదగంతరు, చినగంతరు, చింతగట్టువూరు తదితర గ్రామాలకు సరైన రహదారి సదుపాయాలు లేవు. దీంతో ప్రభుత్వ పథకాలకు సక్రమంగా నోచుకోలేకపోతున్నారు.
ఆయా గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలని ఈ ప్రాంత గిరిజనులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అభివృద్ధి జరగకపోవడానికి ఇదే ఆటంకమని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అటవీ ఉత్పత్తులు సేకరించి పట్టణానికి తీసుకురావడానికి రవాణా సదుపాయాలు లేవు. మందస మండలంలోని కొండలోగాం, టంగరిపుట్టుగ, రాయికోల, నర్సింగపురం, కుశమాలి, బౌంసుగాం, రామరాయి, అడవికొత్తూరు, మొగిలిపాడు తదితర గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. మందస మండలంలో మొత్తం 189 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు వైద్య, విద్య, మంచినీరు, విద్యుత్తు సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా రహదారి సమస్య వీరిని వెంటాడుతుంది. గిరిజన గ్రామాల్లోని ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు నామమాత్రంగానే పనిచేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండలం | గ్రామాలు | జనాభా |
పలాస | 26 | 6 వేలు |
మందస | 189 | 35 వేలు |
ఈ గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించి విద్య, వైద్యం అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నా గత పాలకులు పట్టించుకోలేదు. ఈ గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు వందల సంఖ్యలో ఉన్నారు. క్షయ, మలేరియా వంటి వ్యాధులు కూడా వీరిని పట్టిపీడుస్తున్నాయి. కొండల మీద, లోయల వద్ద గుడిసెల్లోనే ఇంకా జీవనం సాగిస్తున్నారు. సరైనా గృహాలు కూడా లేవు. గత ప్రభుత్వం మంజూరు చేసిన చోట గృహాలు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైన తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు షెడ్యూల్డ్ ఏరియాలోకి విలీనం చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలి
పలాస నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలి. నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం. బీఈడీ, డీఈడీ చదివి పేర్లు నమోదు చేసుకున్న వారు 1800 మంది ఉన్నారు. వారికి ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం లేదు.
– సవర జగన్నాయకులు, టీచరు, కొంకడాపుట్టి, మందస మండలం
రోడ్డు సదుపాయాలు కావాలి
గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయాలు కావాలి. రోడ్లు లేకపోవడం వల్ల అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. వ్యాధుల బారిన పడుతున్నా బయటకు వెళ్లలేక సంచి వైద్యుల చేత వైద్యం చేయించుకుంటున్నాం. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి.
– సవర చిన్నారావు, కొఠారింగ్ తాళభద్ర, పలాస మండలం
Comments
Please login to add a commentAdd a comment