![lack of road access in tribal pregnant villages - Sakshi](/styles/webp/s3/article_images/2017/10/30/baby_reuters.jpg.webp?itok=SyqAxBp4)
కనబోయే బిడ్డ గురించి కలలు లేవు. కడుపులో కదులుతున్న చిరుప్రాణం గురించి ఊహలు లేవు. ఉన్నదంతా భయమే. శిశువు చిట్టి కాలితో తంతూ ఉంటే భయం.. బిడ్డ ఎలా బయటకు వస్తుందోనని. బుజ్జాయి కడుపు చుట్టూరా కదులుతూ ఉంటే తెలీని ఆందోళన.. ప్రసవ సమయం ఎలా గడుస్తుందోనని. గడప దాటి బయటకు చూసిన ప్రతిసారీ కంగారు.. ఈ రోడ్డు మీద నుంచే ప్రసవానికి వెళ్లాలి కదా అని. గిరిజన గూడల్లో కాబోయే అమ్మ శిశువు జన్మను తలచుకుని కన్నీరు పెడుతోంది. ఆనందంగా గడపాల్సిన సమయంలో ఆందోళన చెందుతోంది. ఆస్పత్రికి వెళ్లేందుకు దారులు లేక, బర్త్ వెయిటింగ్ రూముల్లో చేరే దారి తెలీక గిరిజన గర్భిణులు నరక యాతన అనుభవిస్తున్నారు. మందస నుంచి సీతంపేట శివార్ల వరకు వందలాది గ్రామాల్లో ఈ విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
సీతంపేట: కొద్ది నెలల కిందట జగ్గడుగూడ గ్రామానికి చెందిన ఓ గర్భిణిని ప్రసవం కోసం డోలీలో మోసుకువెళ్లాల్సి వచ్చింది. కొంత దూరం మోసుకుంటూ వెళ్లాక 108 వచ్చింది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె అక్కడే ప్రసవించింది. వాహనంలో సిబ్బంది చొరవ చూసి సపర్యలు చేయడంతో తల్లీబిడ్డా బతకగలిగారు. అంతకుముందు వెలగాపురం గ్రామానికి చెందిన మరో గర్భిణి సకాలంలో అంబులెన్స్ రాక చనిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు గతంలో గాల్లో కలిసిపోయాయి. అయినా ఇప్పటికీ డోలీ పట్టనిదే గిరిజ న గర్భిణి గ్రామం దాటలేకపోతోంది. గిరి శిఖర గ్రామాల్లో రహదారి సదుపాయం లేకపోవడంతో వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 108తో పాటు ఐటీడీఏ ఏర్పాటు చే సిన అంబులెన్స్‌లు కూడా కొండలపైకి వెళ్లలేకపోవడంతో బిడ్డకు జన్మనివ్వాల్సిన సమయంలోనే తల్లులు తనువు చాలిస్తున్నారు.
ప్రగతి ‘దారులు’ కరువు
ట్రైబుల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో రహదారులు లేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పని చేయడం లేదు. గ్రామాలకు రహదారులు మంజూరు కాకపోవడం, మం జూరైన రహదారుల పనులు పూర్తి కాకపోవడం, కొన్ని గ్రామాలు పూర్తిగా సర్వేకు నోచుకోకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు తప్ప డం లేదు. సీతంపేట మండలంలోని సన్నంనాయుడుగూడ, ఈతమానుగూడ, ఎగువబుడగరాయి, జన్నోడుగూడ, పెద్దగూడ, జోగైనాయుడుగూడ, గాం«ధీగూడ, చాకలిగూడ, బొమ్మిక, పాతచాకలి గూడ, చీపురుగూడ, సరిహద్దుగూడ ఇలా చాలా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు.ఐటీడీఏ పరిధిలో 1200ల గ్రామాలుండగా వీటిలో 400ల గ్రామాల వరకు రహదారులు లేవని అధికారిక అంచనా. కొండలపై గల గ్రా మాలు వీటిలో 50 వరకు ఉంటాయి. వీటితోనే గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అలాగే సుమారు 2500 మంది గర్భిణులు ఉండగా వీరిలో దాదాపు 700 మంది వరకు కొండ శిఖర గ్రామాల్లో ఉన్నట్లు సమాచారం.
బర్త్ వెయిటింగ్‌కు ససేమిరా
సీతంపేట, కొత్తూరు, మెళియాపుట్టి, పాతపట్నం, మందస పీహెచ్‌సీల పరిధిలో గర్భిణులు ప్రసవానికి పది రోజుల ముందు బర్త్ వెయిటింగ్ రూముల్లో ఉండాలి. వారిని భోజనం, ఇతర సౌకర్యాలను ఆరోగ్య శాఖే కల్పిస్తుంది. రహదారి సౌకర్యం లేని గ్రామాల ప్రజలకు ఇక్కడ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దీనిపై గిరిజనులు నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు. పలు చోట్ల అవగాహన లేక, ఇంకొన్ని చోట్ల అర్థం కాక అమాయక గిరిజన ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పురుటి నొప్పులు వచ్చినప్పుడే మోసుకుని రోడ్డు ప్రాంతం వరకు తీసుకువచ్చి అక్కడ నుంచి అంబులెన్స్ ఎక్కిస్తున్నారు. ఈ లోగా ప్రాణాలు దక్కితే ఫర్వాలేదు. లేకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిన పరి స్థితి ఉంది. ఈ విషయమై డీఈఈ సింహాచలం వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా రహదారుల నిర్మాణానికి సర్వే చేయడం జరిగిందన్నారు. మూడు, నాలుగు కుటుంబాలు కూడా కొండలపై ఆవాసమేర్పరుచుకొనడంతో రహదారుల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
రహదారులు పూర్తయితేనే సమస్య పరిష్కారం
రహదారులు అన్ని గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి. గతంలో ఈ రహదారుల విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అలాగే ఐటీడీఏ దర్బార్‌లో కూడా వినతులు సమర్పించాం. వీలైనంత త్వరగా మంజూరైన రోడ్ల పనులు పూర్తి చేయాలి. మరమ్మతులకు గురైన రోడ్లను కూడా బాగుచేయాలి.
– విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే
రూముల్లో చేరడం లేదు
గర్భిణులకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా బర్త్ వెయిటింగ్ రూముల్లో ఉంచి వారికి వైద్య సేవలు అందించేలా పీహెచ్‌సీల్లో ఏర్పాట్లు చేశాం. ఎంత చైతన్యం చేసినా వారు ఇక్కడకు రావడం లేదు. ఇక్కడకు వచ్చేస్తే కూలి గిట్టుబాటుకాదని, ఇంటి వద్ద మిగతా వారిని ఎవరు చూస్తారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.
– ఈఎన్‌వీ నరేష్‌కుమార్,
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, సీతంపేట
Comments
Please login to add a commentAdd a comment