సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుల అసమర్థ పాలనపై గ్రామీణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పాలకులు చొరవ చూపకుండా విఫలమయ్యారనే అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది.
మూలుగుతున్న ఇంటింటికి కుళాయి నిధులు
గ్రామాల్లోని తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మండలానికి రూ.37 కోట్లు కేటాయించింది. కేవలం నెల రోజుల్లో పథకాన్ని పూర్తి చేసి తాగునీటిని అందిస్తామని కొల్లు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పథకం ఎక్కడా ప్రారంభం కాకపోవడం అసమర్థ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.
మంగినపూడికి మంగళం
అరిసేపల్లి, బొర్రపోతుపాలెం, బుద్దాలపాలెం, పోతేపల్లి, పోతిరెడ్డిపాలెం, పొట్లపాలెం, మంగినపూడి, చిరివెళ్లపాలెం, గోకవరం, తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం గ్రామ పంచాయతీలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు మంగినపూడి తాగునీటి పథకాన్ని2012లో అప్పటి ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేశారు.
అప్పటి నుంచి 2015 వరకు ఈ పథకం ద్వారా గ్రామాలకు తాగునీరు పుష్కలంగా చేరింది. టీడీపీ నాయకులు పథకం నిర్వహణ కాంట్రాక్ట్ పనులు చేజిక్కించుకుని పైప్‌లైన్‌కు ఏర్పడుతున్న లీకులకు మరమ్మతులు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ప్రస్తుతం ఏ గ్రామానికి తాగునీరు సక్రమంగా చేరకపోవడంతో ప్రజలు బిందె నీటిని రూ.20 కొనుగోలు చేస్తున్నారు.
ఈ విషయాన్ని ప్రతి ఏడాది జరుగుతున్న జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
డంపింగ్ యార్డు తరలింపులోనూ నిర్లక్ష్యమే..
స్థానిక రాజుపేట శివారులో శివగంగ మేజర్ డ్రెయిన్‌కు ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డును తరలించడంలోనూ పాలకులు విఫలమయ్యారు. రాజుపేట, కరెంటుకాలనీ ప్రజలతోపాటు మండలంలోని ఎస్‌ఎన్ గొల్లపాలెం, సీతారామపురం, సుల్తానగరం గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ఈ యార్డు ప్రభావం చూపుతోంది. దీన్ని అక్కడి నుంచి తరలించాలని గత పాలకవర్గం హయాంలోనే రూ.2.75 కోట్ల మునిసిపల్ నిధులను సమకూర్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా యార్డు తరలింపు అంగుళం ముందుకు కదలకపోవడం పాలనాతీరును ఎద్దేవా చేస్తోంది.
తాగునీటి పథకాన్ని వీడని గ్రహణం
చిన్నాపురం గ్రామంలో తాగునీటి పథకం ఏర్పాటు చేసి శివారు పంచాయతీలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. పథకం నిర్మాణానికి భూమి కొలుగోలు ప్రక్రియ అప్పట్లోనే పూర్తయింది. ఈ ప్రాంతాన్ని రెండుసార్లు అప్పటి జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ పరిశీలించారు.
పాలకుల చొరవ లేకపోవడంతో పథకం పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదు. పాలకుల అసమర్థత కారణంగా చిన్నాపురం గ్రామ పంచాయతీతోపాటు ఎన్‌గొల్లపాలెం, పెదయాదర, తుమ్మలచెరువు, వాడపాలెం, కొత్తపల్లెతుమ్మలపాలెం గ్రామ పంచాయతీల ప్రజలు ఐదేళ్లుగా ఉప్పునీరు తాగుతున్నారు.
అప్రోచ్ నిర్మించ లేకపోయారు
పల్లెతాళ్లపాలెం గ్రామం వద్ద తాళ్లపాలెం మేజర్ డ్రెయిన్‌పై నిర్మాణం చేసిన వంతెనకు అప్రోచ్‌ను నిర్మాణం చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేశారు. గత పాలకవర్గం హయాంలోనే రూ.60 లక్షలతో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. సత్తెనపాలెం ఎస్సీకాలనీ, బోట్లవానిపాలెం గ్రామాలను కలుపుతూ పల్లెతాళ్లపాలెం గ్రామం మీదుగా కానూరు, పెదపట్నం సులువుగా చేరుకునేందుకు అప్పట్లో పేర్ని నాని ఈ వంతెన నిర్మాణం చేశారు. వంతెనకు ఒక వైపున అప్రోచ్ రోడ్డును నిర్మాణం చేసేందుకు ఓ రైతు వద్ద కొంత భూమిని కొనుగోలు చేయాల్సి ఉంది. సదరు రైతుకు పరిహారం మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు.
Comments
Please login to add a commentAdd a comment