పచ్చ పార్టీ అధికారంలో ఉన్నపుడు మంత్రిగా ఉన్న ఆ నేత నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే సముద్ర తీరాన ఉన్న ఆ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. కాని ఈసారి మేమే గెలుస్తాం అంటూ టీడీపీ అభ్యర్థి పోలింగ్ రోజు డప్పు వేసుకున్నారు. అయితే సునామీలా పోటెత్తిన ఓటర్లు వచ్చింది ఎవరికోసం అన్నవిషయం పోలింగ్ ముగిసాక కాని ఆయనకు అర్థం కాలేదట. దీంతో ఆశల మేడలన్నీ కుప్పకూలి నిరాశలో కూరుకుపోయారట ఆ పసుపు పార్టీ అభ్యర్థి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉందో..? ఆ నేత ఎవరో చూద్దాం.
ఎన్నికల్లో గెలిచే నాయకులు పోలింగ్‌కు ముందు..తర్వాత ఒకేలా ఉంటారు. మరింత జోష్‌గా ఉంటారు. కాని ఓడిపోయే అభ్యర్థులు పోలింగ్‌కు ముందు ఎంత హడావుడి చేసినా..పోలింగ్ పూర్తయ్యాక పరిస్థితులు అర్థం కావడంతో నిరాశకు లోను కావడం మామూలే. ఇప్పుడు మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పరిస్థితి అలాగే తయారైందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు మాటలు నమ్మిన కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు మచిలీపట్నంలో ఈసారి కచ్చితంగా పసుపు జెండా ఎగరేయడం ఖాయమనుకున్నారట. అయితే పోలింగ్ రోజున ఓట్ల సునామీని చూశాక టీడీపీ వారికి కళ్ళు బైర్లు కమ్మాయట. ప్రారంభంలో ఆ ఓట్లన్నీ ప్రబుత్వానికి వ్యతిరేకమే అని సంబరపడ్డాక...సమయం గడిచే కొద్దీ వాస్తవం బోధపడింది. వైఎస్ జగన్‌ను గెలిపించేందుకే ప్రజలు తరలివచ్చారనే విషయం వారికి ఆలస్యంగా అర్థమైంది.
మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం 1,96,680 ఓటర్లు ఉండగా.. వీరిలో 1,61,109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో పురుషుల కంటే 4,898 మంది మహిళలు అధికంగా ఉండటంతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రను ఆందోళనకు గురిచేస్తోందట. వాస్తవానికి గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి కేవలం ఈ ఐదేళ్లలో మచిలీపట్నం ప్రజలు చూశారు. దశాబ్ధాల కల బందరు పోర్టు నిర్మాణం పనులు ప్రారంభమై శరవేగంగా జరుగుతున్నాయి. పోర్టు నిర్మాణం పూర్తయితే బందరు పరిసరాలు పరిశ్రమలతో కళకళలాడతాయి. అలాగే ఉమ్మడి జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇప్పటివరకు బందరులో మెడికల్ కాలేజ్ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక తొలివిడతలోనే బందరు మెడికల్ కాలేజీని నిర్మించి ప్రారంభోత్సవం కూడా చేశారు. కాలేజ్‌తో పాటు అద్భుతమైన ఆస్పత్రి కూడా కృష్ణా జిల్లా వాసులకు అందుబాటులోకి వచ్చింది.
ఇవే కాకుండా ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు..భారీ ఎత్తున సంక్షేమ ఫలాలు కూడా అందుకున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల కారణంగానే మచిలీపట్నం ప్రజలు ఓటేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా క్యూ కట్టారు. రాత్రి వరకూ వేచిఉండి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంత భారీగా ఓటర్లు రావడంతో టీడీపీ నేతలు ఆ ఓట్లన్నీ తమకే పడ్డాయని ఆశపడ్డారట. కానీ పోలింగ్ అనంతరం వేసుకున్న లెక్కలతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రలో కలవరం మొదలైందట. ఓటింగ్ లో భారీగా పాల్గొన్న వారిలో అధికంగా మహిళలే ఉండటంతో ఆందోళన మరీ ఎక్కువైందట.
చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం ... టీడీపీ సూపర్ సిక్స్ హామీలు తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించేస్తాయని కలలు కన్న కొల్లు రవీంద్రకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదట. 2019లో 80.78 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ ఎన్నికల్లో 1.13 శాతం అధికంగా నమోదైంది. పోలింగ్ జరిగిన తీరు గమనించాక కొల్లు రవీంద్ర బందరు సీటుపై ఆశలు వదిలేసుకున్నారన్న చర్చ టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment