సాక్షి, గరిశపూడి(కృష్ణా) : పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు గాంధీజీ. అటువంటి గ్రామాల్లోని ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కృత్తివెన్ను మండలంలోని గరిశపూడి గ్రామంలో కాగిత వెంకట్రావు (కేవీఆర్) కాలనీని 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయినా నేటికీ కాలనీలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1986వ సంవత్సరంలో కృత్తివెన్ను మండలం గరిశపూడి పంచాయితీలో దాదాపు 5.60 ఎకరాల విస్తీర్ణంలో అప్పటి శాసన సభ్యులు కాగిత వెంకట్రావు కాలనీ ఏర్పాటు చే శారు.
దీనిలో సుమారు 76 ప్లాట్లు కేటాయించి దీనికి కాగిత వెంకట్రావు పేరుతో కేవీఆర్ కాలనీగా నామకరణం జరిగింది. ఇది జరిగి దాదాపు 33 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ కాలనీలో అంతర్గత రహదారుల సౌకర్యం లేదు. అధ్వానంగా వీధి కుళాయిలు, ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోక ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు కాలనీ వాసులు. 2014 ఎన్నికల తరువాత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులతో మారుమూల గ్రామాలకు సైతం అంతర్గత రహదారులను అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు
కానీ ఇక్కడ మాత్రం కనీసం ఒక్కరోడ్డు కూడా నిర్మించలేదు. చిన్నపాటి చినుకు పడితే కాలనీ మొత్తం మడుగును తలపిస్తుంది. వర్షం నీరు వారాలపాటు నిల్వ ఉండి దోమలు, పాముల భయంతో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
ఎన్నిసార్లు చెప్పినా అంతే
కాలనీలో మేము పడుతున్న బాధలు భగవంతుడికే తెలియాలి. సరైన రహదారులు లేక నరకం చూస్తున్నాం. వర్షం వస్తే మా బాధలు చెప్పనలవికావు. వీధి దీపాలు కూడా సక్రమంగా వెలగవు. రోడ్లు లేక చాలా మంది ఇళ్లు నిర్మించుకోవడానికి కూడా భయపడుతున్నారు. కాలనీ కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకోవాలి.
-బొర్రా పోతురాజు, కాలనీవాసి
Comments
Please login to add a commentAdd a comment