ప్రజాధనాన్ని ‘కొల్లు’గొట్టి | Leaders Of Telugu Desam Party Said That Not Only Development But To Commit Corruption | Sakshi
Sakshi News home page

ప్రజాధనాన్ని ‘కొల్లు’గొట్టి

Published Sat, Apr 6 2019 10:42 AM | Last Updated on Sat, Apr 6 2019 10:44 AM

Leaders Of Telugu Desam Party Said That Not Only Development But To Commit Corruption - Sakshi

సాక్షి, కృష్షా : అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి కాదు అవినీతికి పాల్పడటానికి అని తెలుగుదేశం పార్టీ నాయకులు నిజం చేసి చూపారు. గడిచిన ఐదేళ్లలో మచిలీపట్నం నియోజకవర్గానికి చేసింది ఏమీ లేకపోయినా.. అవినీతి సామ్రాజ్యాన్ని మంత్రి కొల్లు రవీంద్ర  నిర్మించారు. కాంట్రాక్టు పనైనా, ఉద్యోగమైనా, మట్టి, ఇసుక, ఇలా సొంత లాభం లేకుండా ఏ పనీ చేయలేదు.

పర్సంటేజీలు ముట్టచెబితే చాలు ఎలాంటి వ్యవహారమైనా క్షణాల్లో  పరిష్క రిస్తారు. అంతేనా సహజ వనరులను దోచేస్తారు.. అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యం చేస్తారు.. సహజ వనరులకు రక్షణగా ఉండాల్సిన పాలకులే భక్షకులుగా మారారు. ప్రజాధనాన్ని సంరక్షించాల్సిన వారే.. అక్రమంగా బొక్కేశారు. ఇలా ఐదేళ్లలో వందల కోట్ల రూపాయలు లూటీ చేశారు.

కరకట్ట నిర్మాణం నాసిరకంగా  చేపట్టడంతో జారిపోతున్న కట్టమట్టి 

మంత్రి కొల్లు రవీంద్ర అనుంగ అనుచరులైన కుర్రా నరేంద్ర, కొల్లూరి శివలు సైతం ఐదేళ్లుగా కోట్లకు పడగలెత్తినట్లు సమాచారం. గతంలో ఏమీ లేని నరేంద్ర ప్రస్తుతం విజయవాడ నగరంలో రూ.5 కోట్ల విలువ చేసే 5 ఫ్లోర్ల అపార్ట్‌మెంట్, మరో రూ.కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతే కాకుండా బందరు పోర్టు పరిధిలోని ల్యాండ్‌ పూలింగ్‌లో ఉన్న భూములను తక్కువ ధరకు 15 ఎకరాల మేరకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని విలువ ఎకరం రూ.15 లక్షలుండగా రూ.2.25 కోట్లు పలుకుతున్నాయి.  

  • రాజధాని అమరావతి పరిధిలో సైతం రూ.6 కోట్లు విలువ చేసే భూములు కొనుగోలు చేశారంటే ఏ మేరకు దండుకున్నారో అర్థం అవుతోంది. ఇందులో మంత్రికి సైతం వాటాలు ఉన్నట్లు తెలిసింది. 
  • మరో అనుచరుడు కొల్లూరి శివ మాత్రం తానేమీ తీసిపోని విధంగా అక్రమాలకు తెగడబ్డారు. విజయవాడలోని గురునానక్‌ కాలనీలో రూ.4 కోట్లు విలువ చేసే కమర్షియల్‌ బిల్డింగ్‌ ఉంది. మచిలీపట్నంలో సైతం రూ.కోట్లు విలువ చేసే ఇళ్లు సైతం కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే మంత్రి, మంత్రి అనుచరులు ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎలాంటి దోపిడీలకు తెగబడ్డారో అవగతం అవుతోంది.

ఎక్సైజ్‌లో కుమ్మేశారు
ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భారీగా దండుకున్నారు. ఒక్కో బదిలీకి రూ.20 నుంచి రూ.40 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఇలా మంత్రిగా ఉన్న రెండేళ్లలో రూ. 60 నుంచి రూ.100 కోట్ల వరకు దోపిడీకి తెర లేపారు. 

  • బార్లు, బ్రాందీ షాపులపై ఎక్సైజ్‌ అధికారులతో దాడులు చేయిస్తారు. దాడుల్లో షాపుల లైసెన్స్‌ రద్దు చేయిస్తానని బెదిరింపులకు దిగుతారు. అనంతరం మంత్రి అనుచరులైన కుర్రా నరేంద్ర, కొల్లూరి శివలు రంగంలోకి దిగుతారు. షాపు లైసెన్స్‌ తిరిగి పునరుద్ధరిస్తామని షాపు యజమానుల వద్ద నమ్మబలుకుతారు. ఇలా కొల్లు రవీంద్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారంతో సుమారు రూ.15 కోట్లకు పైగా దండుకున్నట్లు సమాచారం. 
  • ఎక్సైజ్‌ శాఖలో డిజిటలైజేషన్‌ నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఓ కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. సదరు కాంట్రాక్టర్‌ టెండర్ల అనంతరమే ప్రభుత్వ పెద్దలకు రూ.5 కోట్ల కమీషన్‌ చెల్లించాడు. అది చాలదన్నట్లు తాను సంతకం పెట్టానని, తనకేమైనా చూడాలని సదరు కాంట్రాక్టర్‌ వద్ద మంత్రి రూ.2 కోట్లు దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. 
  • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్‌ స్టేషన్ల నుంచి ప్రతి నెలా మామూళ్లు వసూలు చేసేవారు. ఈ తంతు మొత్తం తన పీఏ స్వయంగా చూసుకునే వాడని ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి జిల్లా నుంచి నెలకు రూ.2 లక్షలు చొప్పున రెండేళ్లకు రూ.52 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. 

గుట్టుగా గుట్కా దందా
నిషేధిత గుట్కా వ్యాపారం మంత్రి అనుచరులు, ఓ పీఏ కనుసన్నల్లో యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులను పావులుగా వాడుకుని మిగిలిన విక్రయదారులపై పోలీసులతో దాడులు చేయించి వ్యాపారాన్ని మూయించేశారు. స్వయంగా మంత్రి అనుచరులే భీమవరం నుంచి ప్రతి రోజూ రూ.3 లక్షలు విలువ చేసే సరుకు దిగుమతి చేసుకోవడం.. బందరు, పెడన నియోజకవర్గాల పరిధిలోని 150 బడ్డీ కొట్లకు సరుకు సరఫరా చేస్తుంటారు. ప్యాకెట్‌ రూ.5కు కొనుగోలు చేయడం.. బడ్డీ కొట్లకు రూ.10కి విక్రయించి రూ.లక్షలు గడిస్తున్నారు.

ఇది చాలదన్నట్లు గుట్కా విక్రయించే బడ్డీ కొట్లకు సరఫరా చేయడం.. తిరిగి ఏ కొట్టుకు సరుకు అందించామన్న సమాచారం పోలీసులకు చెప్పడం.. వారిపై దాడులు చేయిస్తున్నారు. ఇదే అదునుగా సెటిల్‌ మెంట్లకు దిగుతున్నారు. ఒక్కో బట్టీ నిర్వాహకుడి వద్ద పోలీసులకు ఇవ్వాలని రూ.లక్ష వసూలు చేయడం అందులో రూ.40 వేలు దిగమింగుతున్నారు. గత రెండేళ్లలో ఒక్కో బట్టీ నిర్వాహకుడిపై మూడు సార్లు పోలీసు దాడులు చేయించారు. దాడుల్లో పోలీసులకు ముట్టజెప్పిన మొత్తం పోగా.. మంత్రి అనుచరులు, ఓ పీఏ రూ.1.20 కోట్ల వరకు దండుకున్నారు. 

తాజాగా ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో గుట్కాను ఆర్‌పేట పోలిస్‌ స్టేషన్‌ పరిధిలో గుట్కా విక్రయిస్తున్న వారి నుంచి నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన మంత్రి పీఏ స్టేషన్‌కు వెళ్లి సరకు తీసుకెళ్లేలా చేశారంటే గుట్కా వ్యాపారానికి అండదండలు ఎలా ఉన్నాయో అర్థం అవుతోంది. 

రైస్‌ మిల్లులోనూ అంతే..

కొల్లు రవీంద్రకు చెందిన రైస్‌మిల్‌

ధాన్యం కొనుగోలు అనంతరం ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్లు వాటిని ఆడించి నిర్దేశించిన సమయంలో ప్రభుత్వానికి బియ్యం అప్పజెప్పాలి. నిబంధనల మేరకు కమీషన్‌ తీసుకోవాలని. కానీ మంత్రి ఇలాఖాలో మాత్రం అలాంటి పప్పులు ఉడకడం లేదు. మంత్రి తన సొంత రైస్‌ మిల్లును అడ్డాగా పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్నారు.

ఏటా ధాన్యం కొనుగోలు సమయంలో రైతుల నుంచి పాసు పుస్తకాలు బలవంతంగా తీసుకోవడం.. రూ.3 కోట్లు విలువైన ధాన్యం కొన్నట్లు దొంగ లెక్కలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వానికి ధాన్యం అప్పజెప్పాల్సిన నిర్ణీత సమయం కంటే అదనంగా తీసుకుంటున్నారు. ఈ వ్యవధిలో బహిరంగ విపణిలో స్టోర్‌ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు.

అంతే కాకుండా ధాన్యం సరఫరా పేరిట రవాణా చార్జీలు సైతం పొందుతున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఇదే తంతు నడుపుతూ సుమారు రూ.3 కోట్ల వరకు దిగమించినట్లు తెలిసింది. దీనిపై సీబీఐ అధికారులు లోతైన విచారణ జరిపితే నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంది.

భారీగా ఆస్తులు

గోపాల్‌నగర్‌ శ్మశానాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు 

నాలుగేళ్లు దండుకున్న అక్రమ సంపాదనతో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఇవన్నీ బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. 

  • విజయవాడ బెంజ్‌ సర్కిల్, బందరులో రూ.6 కోట్ల విలువ చేసే స్థలాలు  కొనుగోలు చేశారు. 
  • కృత్తివెన్ను మండలంలో రాంబాబు, రంగా, పవన్,     గుప్తాలను బినామీలుగా పెట్టి 38 ఎకరాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ భూమి రిజిస్ట్రేషన్‌ విలువ రూ.2.80 కోట్లు ఉండగా.. బహిరంగ మార్కెట్లో రూ.6.84 కోట్లు పలుకుతోంది. 
  • బందరు మండలంలోని రాడార్‌ కేంద్రం వద్ద పల్లపాటి సుబ్రహ్మణ్యంను బినామీగా పెట్టి 40 ఎకరాల స్థలం(22–ఏ) తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఎకరం రూ.15 లక్షలు చొప్పున రూ.6 కోట్లు విలువ చేసే స్థలం కొనుగోలు చేశారు. 
  • హైదరాబాద్‌లో సైతం రూ.కోట్లు విలువ చేసే స్థలాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. 
  • అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి ప్రాంతంలో సైతం రూ.కోట్లు విలువ చేసే పొలాలు  కొనుగోలు చేసినట్లు తెలిసింది.  

అక్రమాల్లో మరికొన్ని..  

  • రూ.లక్ష విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుకు రూ.4 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా నాలుగేళ్లుగా రూ.కోటి వరకు స్వాహా చేశారు.
  • ఒక్కో రైతు రథం ట్రాక్టర్‌ మంజూరుకు లబ్ధిదారుడి నుంచి రూ.30 వేలు, ట్రాక్టర్‌ కంపెనీ నుంచి రూ.30 వేలు గుంజుతున్నారు. 112 రైతు రథాలకు సంబంధించి రూ.62 లక్షలు దండుకున్నారు. 
  • అదనపు తరగతి నిర్మాణాల్లో ఒక్కో గదికి రూ.40 వేలు చోప్పున నాలుగున్నరేళ్లుగా 25 గదులకు సంబంధించి రూ.10 లక్షలు దండుకున్నారు. 
  • రూ.1.50 కోట్లు బీనామీ పేర్లతో కాల్‌మనీకి తిప్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. 
  • రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని మరో అభ్యర్థి వద్ద రూ.5 లక్షలు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చి ఏళ్లయినా ఉద్యోగం ఇవ్వకపోవడంతో ప్రశ్నించిన సదరు అభ్యర్థికి రూ.3 లక్షలు బీసీ కార్పొరేషన్‌లో లోన్‌ ఇప్పిస్తానని చెప్పారు. 
  • మంత్రి అనుచరుడు కన్నా ప్రసాద్‌ బినామీగా బందరు పట్టణంలో చేపట్టిన డివైడర్‌ గ్రిల్‌ వర్క్‌లో రూ.లక్షలు స్వాహా చేశారు. అంతేగాక బీచ్‌ఫెస్టివల్, పోర్టు పనులు ప్రారంభం విషయంలో సీఎం పర్యటనలో సైతం భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement