నూజీవీడులో అవినీతి ముద్దర | Muddaraboina Venkateshwar Rao Did Many Illegal Activities In Nuziveedu Constituency For Five Years | Sakshi
Sakshi News home page

నూజీవీడులో అవినీతి ముద్దర

Published Sun, Apr 7 2019 1:21 PM | Last Updated on Sun, Apr 7 2019 1:21 PM

Muddaraboina Venkateshwar Rao Did Many Illegal Activities In Nuziveedu Constituency For Five Years - Sakshi

సాక్షి, కృష్ణా : అధికారంలో ఉన్నది తమ పార్టీయే కదా అనే ధీమాతో తన అనుచరులతో కలిసి అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగిపోయాడు.. ‘నీరు–చెట్టు’లో మట్టి దోపిడీకి తెరతీశారు.. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క మట్టి అక్రమ తరలింపులోనే  ఈయన, అనుచరులు  రూ.100 కోట్లు వెనకేశారంటే ఈయన నడిపిన దందా ఏమిటో అర్థమవుతోంది..

ఈయన వెంట ఉన్న చోటామోటా నాయకులకు ఒకప్పుడు ఏమీ లేకపోగా నేడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.. ఒక్క మట్టిదోపిడే కాకుండా ఇసుక అక్రమ రవాణా, రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంలో కమీషన్లు, పేదలకు ఇచ్చే కార్పొరేషన్‌ రుణాల్లో వసూళ్ల దందా, చివరకు మరుగుదొడ్ల కేటాయింపు, నిర్మాణంలోనూ అవినీతి కంపు.. ఇలా కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా అన్నిరంగాల్లో తన దందా కొనసాగించారు.

ఆయనే నూజివీడు టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. అగ్నికి ఆజ్యం తోడైనట్లు పక్క జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని ఇక్కడ తమ్మిలేరులోనూ తన హవా కొనసాగించడంతో ఇసుక దోపిడీ భారీ స్థాయిలో జరిగి ఏరులు, చెరువులు తమ రూపునే కోల్పోయిన దుస్థితి ఏర్పడింది.

చింతమనేని హవా..
ముసునూరు మండలాన్ని ఆనుకొని ఉన్న తమ్మిలేరులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇసుకదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రోజుకు 100 నుంచి 200 ట్రాక్టర్‌ల వరకు ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ వందల కోట్లు ఆర్జిస్తున్నారు. ట్రక్కు ఇసుక రూ.3వేల నుంచి రూ.4వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

సాధారణ ప్రజలు ఎవరైనా ఇంటివద్ద అవసరం కోసం ఒక ట్రక్కు ఇసుకను తెచ్చుకుంటుంటే  ట్రాక్టర్లను సీజ్‌చేసి జరిమానాలు విధించే అధికారులు, ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడరు. బలివే సమీపంలోని రంగంపేట వద్ద చింతమనేని ఇసుక దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నేపధ్యంలోనే అప్పటి ముసునూరు తహసీల్దార్‌ దోనవల్లి వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

అలాగే లోపూడి, గుళ్లపూడి, వలసపల్లి, యల్లాపురం, రంగంపేట,  బలివేల వద్ద నుంచి ముసునూరు మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు చిలుకూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొల్లిగంగారామ్, చిల్లబోయినపల్లి బుజ్జి తదితరులు ట్రాక్టర్లలో ఇసుకను విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జించారు. ఈ అక్రమార్జనలోనూ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు రూ. కోట్లు కప్పం కట్టినట్లు సమాచారం. 

నీరు– చెట్టు పనుల్లో రూ.100కోట్లు లూటీ

నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో చేపట్టిన నీరు చెట్టు పనుల్లో మట్టిని విచ్చలవిడిగా విక్రయించి అధికారపార్టీ నాయకులు  రూ.100 కోట్ల పైన లూఠీ చేశారు. నాలుగున్నరేళ్లలో నూజివీడు మండలంలో రూ.28 కోట్లు, ముసునూరు మండలంలో రూ.24 కోట్లు, చాట్రాయి మండలంలో రూ.6 కోట్లు, ఆగిరిపల్లి మండలంలో రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.63కోట్లు విలువైన పనులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

దీనిలో పొక్లెయిన్‌కు లోడింగ్‌ ఖర్చు కింద క్యూబిక్‌ మీటర్‌కు రూ.29 చొప్పున ప్రభుత్వం చెల్లించగా, టీడీపీ నాయకులు చెరువులలో మట్టిని ట్రక్కు రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయించుకున్నారు. దాదాపు వేలాది ట్రిప్పుల మట్టిని విక్రయించి రూ.100కోట్ల పైనే దోచుకున్నారు. ప్రభుత్వమే నీరు–చెట్టు కింద లోడింగ్‌కు రూ.60కోట్ల వరకు చెల్లించిందంటే మట్టిని అమ్ముకోవడం ద్వారా ఎంత విక్రయించారో అర్ధమవుతోంది.

నూజివీడు మండలంలోని చెరువుల్లోని మట్టి అంతా రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు వెంచర్‌ల నిర్వాహకులకు, పట్టణంలోని నివేశన స్థలాలకు తోలి విక్రయించుకున్నారు. అంతేగాకుండా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులను సైతం నీరు చెట్టు పనుల్లో చేపట్టినట్టుగా చూపించి దోచుకున్నారు. టీడీపీ నాయకులు చేసిన మట్టి దందాతో కొన్ని చెరువులు తమ రూపురేఖలనే కోల్పోవడం గమనార్హం.  చాట్రాయి పెద్దచెరువు, దీప చెరువుల్లో రూ.30లక్షలతో చేసిన పనులను తూతూమంత్రంగా చేసి లక్షలు దోచుకున్నారు.

పోలవరం మట్టి మాఫియా

పోలవరం కుడికాలువపైన ఉన్న మట్టిని అధికార టీడీపీకి చెందిన మట్టిమాఫియా లక్షలాది క్యూబిక్‌ మీటర్లు అమ్ముకుని కోట్లాది రూపాయలు ఆర్జించారు. రాత్రి,పగలు అనే తేడా లేకుండా తరలించారు. తవ్విన మట్టిని తవ్వినట్టే విక్రయించేసి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడి మట్టి పల్లెర్లమూడి పరిధిలో ఉన్న క్వారీ గోతులకు, పలువురు రైతుల తోటలకు,హనుమాన్‌జంక్షన్, గుడివాడ వంటి దూరప్రాంతాలకు తరలిపోయింది.

ఈ గ్రామ పరిధిలో ఎర్రచెరువుకు ఎగువభాగాన ఉన్న దాదాపు 15 ఎకరాల క్వారీ గోతులను పూడ్చివేశారు. ఈ గోతులు 20 నుంచి 25 అడుగుల లోతులో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి.  పల్లెర్లమూడి వద్ద నుంచి మర్రిబంధం వరకు పోలవరం కాలువను తవ్వతే  8.30లక్షల క్యూబిక్‌మీటర్ల మట్టి రాగా  అందులో  దాదాపు 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని అమ్మేసుకున్నారు.

క్యూబిక్‌మీటరు మట్టికి ప్రభుత్వం రూ.30 ఇస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే  తరలిపోయిన  మట్టి విలువ రూ.1.50కోట్లు ఉంది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఇంత పెద్దమొత్తంలో  మట్టిని అమ్ముకున్నారు.  ఏలూరు ఎంపీకి అనుచరుడిగా చెప్పుకునే టీడీపీకి చెందిన పల్లెర్లమూడికి చెందిన  గ్రామనాయకుడు మట్టిని అమ్ముకోవడంలో కీలకపాత్ర పోషించాడు.  

పనుల్లో వాటా ఇవ్వాల్సిందే.. 
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో కమీషన్ల దందా సాగించి రూ. కోట్లు పోగేశారు. సర్పంచుల పదవీకాలం పూర్తయిన నాటి నుంచి ఈ దందా మరింత పెరిగి ప్రతి పనిలో 10శాతం వరకు కమీషన్‌ రూపంలో వసూలు చేస్తున్నట్లు సొంతపార్టీలోనే ప్రచారం జరిగింది.

ఈ కమీషన్ల దందా కోసం కావాలనే వేరే డివిజన్‌లో పనిచేసే పంచాయతీరాజ్‌ డీఈని నూజివీడు డివిజన్‌కు ఇన్‌చార్జి ఈఈగా నియమించినట్లు సమాచారం. ఉపాధిహామీ, జడ్పీ, ఎంపీ నిధులు, ఇతర గ్రాంట్లు ద్వారా వచ్చే నిధులు కలిపి నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్ల కాలంలో రూ.42కోట్లు పనులు జరగగా, ఈ ఏడాదికి రూ.33కోట్లు మంజూరయ్యాయి.

ఈ పనుల్లో 10 శాతం కమీషన్‌ రూపంలో ముద్దరబోయినకు దక్కినట్లు సమాచారం. ఇదే కాకుండా తన బినామీలతో నీరు–చెట్టు పనుల్లో భాగంగా చెరువుల్లో తవ్విన మట్టిని విక్రయించి పోగేసిన సొమ్ములోనూ ఆయనకు పెద్ద ఎత్తున వాటా ఉన్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement