కిలోమీటర్లు కాలినడక.. ‘డోలీ’ ప్రయాణమే దిక్కు  | Tribals Are Suffering Due To Lack Of Facilities In Agency Villages | Sakshi
Sakshi News home page

అరణ్య రోదన! 

Published Tue, Aug 25 2020 11:53 AM | Last Updated on Tue, Aug 25 2020 11:55 AM

Tribals Are Suffering Due To Lack Of Facilities In Agency Villages - Sakshi

చింతామల గిరిజనులు సొంతంగా వేసుకున్న రహదారి- రోడ్డు సౌకర్యం లేక గర్భిణీని డోలిలో మోసుకుపోతున్న గిరిజనులు (ఫైల్‌ఫొటో)- గ్రామానికి రహదారి నిర్మించుకుంటున్న గిరిజనులు

రాళ్లల్లో..ముళ్ల దారుల్లో అడవి బిడ్డలు అవస్థలు పడుతున్నారు. పురుటి నొప్పులు వస్తే నిండు గర్భిణిని డోలి కట్టి కొండలు, గుట్టలపై కాలినడకన మోసుకుపోవడం తప్ప వేరే మార్గం లేక నరకం చూస్తున్నారు. నిధులున్నా.. ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నా, నిబంధనల బంధనాల వల్ల నేటికి దారులు ఏర్పడలేదు. దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతూ అభివృద్ధికి దూరమవుతున్నారు. వారి పిల్లలు, యువత చదువు కోవడానికి వెళ్లలేక నిరక్షరాస్యులుగానే మిగిలిపోతున్నారు. దీంతో గిరిజనులు తమను తామే బాగుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రహదారులు లేని గ్రామాలకు తామే చందాలు వేసుకుని రోడ్లు వేసుకుంటున్నారు. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: రోడ్డు వేసిన తర్వాతే ఓటు అడగడానికి మీ ఊరు వస్తామని టీడీపీ హయాంలో సాలూరు మాజీ ఎమ్మెల్యే బంజ్‌దేవ్‌ అప్పట్లో కొదమ పంచాయతీ చింతామల గిరిశిఖర గ్రామ ప్రజలకు మాటిచ్చారు. 15 రోజుల్లోనే రోడ్డు ప్రారంభిస్తామన్నారు. రోడ్డు పనుల కోసం తుప్పలు కొట్టిస్తున్నట్లు చెప్పి సమావేశానికి రమ్మన్నారు. తీరా అక్కడికి వెళితే చెప్పులతో కొట్టారని పోలీసు కేసు పెడతానంటూ గిరిజనులను బెదిరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా అనేకసార్లు మోసపోయిన 125 గిరిజన కుటుంబాలు కలిసి..ఉన్న బంగారం, భూమి తాకట్టు పెట్టి, ఆవులు, గేదెలు, మేకలను అమ్మి, అదీ చాలక షావుకారు వద్ద అప్పుచేసి, ఇంటికి రూ.7 వేలు చొప్పున చందాలు పోగుచేసుకున్నారు. మరికొంత రుణాలు తీసుకున్నారు. ఆ సొమ్ముతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా బారి జంక్షన్‌ వరకూ సొంతంగా రహదారి వేసుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం కార్యాలయం జిల్లా అధికారులను వివరాలు కోరింది. మరోవైపు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. గిరిజనులను అభినందిస్తూ, త్వరలోనే వచ్చి కలుస్తానన్నారు. అయితే ఇది ఆ ఒక్క ఊరి సమస్య మాత్రమే కాదు. ఇలాంటి ఎన్నో పల్లెలకు అడవిలో రహదారులు లేవు.

సాలూరు మండలంలో కొదమ పంచాయితీలో కొదమ, చినచోర, ఎం.చింతలవలస, అడ్డుగుడ, కోనంగివలస, చింతామల, లొద్ద, బందపాయి, చిలకమెండంగి, సిరివర, కోయిమల, కానుపాక, గుంజేరి, పట్టుచెన్నేరు పంచాయితీ శిఖపరువు, పగులుచెన్నేరు పంచాయితీ ఎగువమెండంగి, గంజాయిభద్ర పంచాయతీ పనికిలోవ, రణసింగి, సిమ్మగెడ్డ, ఎగువపనికి, డెన్సరాయి పంచాయితీలో డెన్సరాయి, జిల్లేడువలస, సంపంగిపాడు పంచాయతీలని ఎగువరూడి, దిగువరూడి, సుల్లారి, సంపంగిపాడు, పువ్వలవలస, జిల్లేడువలస పంచాయతీలో   నారింజపాడు, బెల్లపాకలు, బొడ్డపాడు తదితర గిరిశిఖర గ్రామాలకు నేటికీ సరైన రహదారి లేక అక్కడి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.  

గిరిశిఖర, అటవీ, మైదాన ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తున్నారు. గిరిశిఖర గ్రామాల్లో  సవర, కోదులు, జాతాపు తెగలకు చెందిన గిరిజనులున్నారు. అడవుల్లో జాతాపు, గదబ, సవర, కొండదొర తెగల వారున్నారు. మైదాన ప్రాంతాల్లో  ఎరుకులు, లంబాడిలు (సుబాగి/నాయికిలు), యానాదు, గదబ తెగలు ఉన్నాయి. వీరంతా రహదారులు లేక కష్టపడుతున్నారు. గిరిశిఖర గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉంది. అక్కడి ప్రజలు చెలమలు, ఊటనీరు తాగుతున్నారు. పూరిళ్లు, రేకుల ఇళ్లలోనే నివసిస్తున్నారు. 

వివాదం ఊబిలో కోటియా.. 
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్‌  ఈ  రెండు జిల్లాల పరిధిలో కొఠియా పంచాయతీలో ఉన్న 34 గ్రామాలనే కొఠియా గ్రూపు గ్రామాలుగా పిలుస్తున్నారు. కొఠియా గిరిశిఖర గ్రామాల్లో దాదాపు 15 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో 3,813 మంది ఓటర్లు ఆంధ్రాలోనూ, ఒడిశాలోనూ ఓటు వేస్తున్నారు. 1936లో ఒడిశా ఏర్పడినప్పుడు గానీ ఆంధ్రప్రదేశ్‌ అవతరించినప్పుడు గానీ ఈ గ్రామాల్లో సర్వే జరగలేదు. ఏ రాష్ట్రంలోనూ వీటిని కలుపలేదు. ఈ గ్రామాలను తమవంటే తమవేనని ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీంతో 1968లో ఇరు రాష్ట్రాలూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.  ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాల్సిందిగా 2006లో న్యాయస్థానం సూచించింది. అయినా పరిష్కారం లభించలేదు.  

వైఎస్‌ హయాంలో.. 
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రత్యేక కృషితో   కొటియా పల్లెల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యేవి. దండిగాం నుంచి కొఠియాకు తారు రోడ్డు  మంజూరు చేయించారు. ఎగువశెంబి వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. రాజశేఖరరెడ్డి హఠాన్మరణం, తదితర కారణాల వలన  రోడ్డు ఫార్మేషన్‌ జరిగినా నిర్మాణం పూర్తికాలేదు. రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాంత గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొటియా గ్రామాలను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ కొటియా గ్రూప్‌ గ్రామాల్లో ఏ రోడ్డు నిర్మాణం చేపట్టినా రిజర్వ్‌ఫారెస్ట్‌  నిబంధనలు అడ్డుపడుతున్నాయి. ఇదే ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం రోడ్లు వేస్తుంటే మాత్రం అటవీశాఖ అభ్యంతరం తెలపకపోవడాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజలు తప్పుబడుతున్నారు. అయితే జిల్లా స్థాయిలో తాము ఏదీ ఆపడం లేదని జిల్లా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 

సీఎం దృష్టి సారించారు  
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తరువాత మా ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. గిరిశిఖర గర్భిణులకు సాలూరులోని వైటీసీలో ఏర్పాటు చేసిన గిరిశిఖర గర్భిణుల వసతి గృహం ఎంతగానో ఉపయోగపడుతోంది. 2019 అక్టోబర్‌ 31న సాలూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌హరిచందన్‌ దృష్టికి మా ప్రాంత సమస్యలను, కొటియా వివాదాలను తీసుకువెళ్లాం. ఇక్కడి సమస్యలపై నటుడు సోనూసూద్‌ స్పందించి మా ప్రాంతానికి వస్తాననడం శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వం అటవీ చట్టాలతో అడ్డుపడకుంటే మా ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  
–పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే      

చట్టప్రకారమే నడుచుకుంటున్నాం  
గిరిజన గ్రామాలకు రహదారులు వేయకుండా అటవీశాఖ అడ్డుకుంటోందనే ఆరోపణలు సరికాదు. నేను ఈ జిల్లాకు వచ్చి రెండు నెలలైంది. ఈ కొద్ది సమయంలోనే పెండింగ్‌ ఫైళ్లు అన్నీ క్లియర్‌ చేశాం. ప్రస్తుతం ఏ ఒక్క ఫైలు కూడా మా స్థాయిలో పెండింగ్‌ లేదు. ప్రాంతీయ కార్యాలయానికి, రాష్ట్ర అధికారులకు, కేంద్రానికి పంపించినవి కొన్ని అక్కడ పెండింగ్‌ ఉంటే ఉండవచ్చు. గిరిజనులకు మంచి చేయాలనే మాకూ ఉంటుంది. కానీ అటవీ చట్టానికి లోబడే మేము పనిచేయాలి.ఎక్కడైనా మా వల్ల అభివృద్ధి ఆగిందని మా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా విచారణ జరుపుతాం. 
 –సచిన్‌ గుప్తా, అటవీశాఖ జిల్లా అధికారి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement