చేపాచేపా ఎందుకు ఎదగలేదు? | No Use Of Fish Distribution Programme In Nizamabad | Sakshi
Sakshi News home page

Published Tue, May 29 2018 8:23 AM | Last Updated on Tue, May 29 2018 8:23 AM

No Use Of Fish Distribution Programme In Nizamabad - Sakshi

కమ్మర్‌పల్లి(బాల్కొండ) : చేపలు పట్టే వృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారులకు ఈయేడు నిరాశే మిగిలింది. చెరువుల్లో పెంచిన చేపల దిగుబడి రాక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేపపిల్లలు చెరువుల్లో ఎదగలేదు. చెరువు ల్లో చేపలు పెరగకపోవడంతో ఆదాయం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సారి సరఫరా చేసిన చేప పిల్లలు తగిన పరిమాణంలో పెరగలేవని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. 

చెరువుల్లో ఎదగని చేప 
కమ్మర్‌పల్లి మండలంలోని ఆయా గ్రామాల్లోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను ఆర్థికంగా ప్రోత్సహించడానికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసింది. చెరువు విస్తీర్ణం ఆధారంగా చేప పిల్లలను సరఫరా చేయగా చెరువుల్లో వదిలారు. నవంబర్‌ నెలాఖరులో చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. నాగాపూర్‌ మంజీరా చెరువులో 26,500, కమ్మర్‌పల్లి గుండ్లకుంట చెరువులో 41,500, కుడికుంట చెరువులో 15,600, పల్లె చెరువులో 6700, హాసాకొత్తూర్‌ గోనె చెరువులో 69 వేలు, కొత్త చెరువులో 70 వేలు, బషీరాబాద్‌ కాడి చెరువులో లక్షా 10 వేలు, చింతల చెరువులో 80 వేలు, అమీర్‌నగర్‌ ఊర కుంటలో 25 వేలు, నర్సాపూర్‌ ఊర చెరువులో 38 వేలు, కోనాసముందర్‌ పెద్ద చెరువులో 65 వేలు, కోనాపూర్‌ రాళ్లవాగు రిజర్వాయర్‌లో లక్షా 50 వేల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు వదిలారు.

ప్రస్తుతం చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో మత్స్యకారులు చేప వేట మొదలుపెట్టారు. వేటకు చిక్కిన చేపలు ఇంకా చిన్న పిల్లలు గానే ఉండడంతో అయోమయానికి గురవుతున్నారు. ఒక్కో చేప 50 గ్రాముల నుంచి 300 గ్రాములకు మించి పరిమాణం లేకపోవడంతో మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. చెరువులో వదిలిన చేప పిల్లలు ఆరు నెలలు గడిచినా తగిన పరిమాణంలో పెరగలేదు. సాధారణంగా చేప పిల్లలు ఆరు నెలల్లో సుమారు 750 గ్రాముల నుంచి 1250 గ్రాముల వరకు పెరుగుతుందని, ప్రభుత్వం సరఫరా చేసిన చేప పిల్లలు 300 గ్రాములకు మించి పెరగలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని చెరువుల్లోనైతే 100 గ్రాములకు మించి పెరగలేదు. మరికొన్ని చెరువుల్లో చేపలు మృత్యువాత పడ్డాయి. నాసిరకం చేప పిల్లలను సరఫరా చేయడం వల్లే చేపలు పెరగలేదని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో ఈయేడు ఆదాయం కోల్పోయామన్నారు. కమ్మర్‌పల్లి గుండ్లకుంట చెరువులో వదిలిన చేప పిల్లల జాడే లేకుండా పోయిందని స్థానిక మత్స్యకారులు వాపోయారు. కొంతమంది మత్స్యకారులు సొంతంగా కొనుగోలు చేసి చెరువుల్లో వదిలిన చేప పిల్లలు ఒక్కోటి కిలో పరిమాణం వరకు పెరిగాయని చెబుతున్నారు.  
ఆలస్యంగా సరఫరా 
వర్షాకాలంలో చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరిన తర్వాత చేప పిల్లలు వదులుతారు. కానీ గత సంవత్సరం నవంబర్‌ నెలాఖరులో చేప పిల్లలను వదిలారు. సాధారణంగా జూన్, జూలై నెలలో వర్షాలు పడితే ఆగస్టు లేదా, సెపెంబర్‌ నెలలో చేపపిల్లలను వదులుతారు. కానీ నవంబర్‌ నెలలో వదలడంతో అప్పటికే చెరువుల్లో నీరు నీటిమట్టం తగ్గిపోయింది. నీటి మట్టం తగ్గిన చెరువుల్లో చేప పిల్లలు ఎదగకపోవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు. చేపలు తగిన పరిమాణంలో పెరగక ఆదాయం కోల్పోయిన మత్స్యకారులు ప్రభుత్వం రాయితీపై అందించే యూనిట్లపై ప్రభావం చూపనుంది. ఆదాయం లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వం అందించే వాహనాలు, తెప్ప లు, వలలు, ఐస్‌ బాక్స్‌లు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

చేపలు పెరగలేదు..
ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేప పిల్లలు చెరువుల్లో వృద్ధి చెందలేదు. 300 గ్రాములకు మించి చేపలు పెరగలేదు. నాసిరకమైన చేప పిల్లలు సరఫరా చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఈయేడు పూర్తిగా ఆదాయం కోల్పోయాం. ఉపాధిపై దెబ్బ పడింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి. 
ఆల్గోట్‌ రమేశ్, మత్స్యకారుడు,హాసాకొత్తూర్‌ 

చేపల దాణా అందించాలి 
ప్రభుత్వం ఉచితంగా అందించిన చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోయాక వదిలారు. చేప పిల్లలకు పోషకాలు లభించక(ఫీడింగ్‌) పెరగలేవు. ప్రభుత్వం ఉచితంగా చేపల దాణా సరఫరా చేయడంతో పాటు, ఇతర సదుపాయాలు కల్పించాలి.
ఎర్ర ఆశన్న, అధ్యక్షుడు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, కోనాసముందర్‌

పావు కిలో కూడా లేవు 
ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేప పిల్లలు పావు కిలో కూడా పెరగలేదు. కాడి చెరువు పెద్ద చెరువు. చేపలు పట్టుకొనే వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. చేపలు పెరగకపోవడం వల్ల ఆదా యం నష్టపోయాం. సొంతంగా కొనుగోలు చేసిన పిల్లలు వేరే చెరువుల్లో పెంచాం. మంచి దిగుబడి వచ్చింది. 
తోపారం శ్రీనివాస్, మత్స్యకారుడు, బషీరాబాద్‌ 

పెట్టుబడి సాయం అందించాలి 
ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న విధంగానే మత్స్యకారులకు చేపల పెంపకానికి పెట్టుబడి సాయం అందించాలి. సాయంతో మత్స్యకారులు తమకు నచ్చిన చేప పిల్లల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేస్తారు. చేపల పెంపకంతో ఆదాయంపై భరోసా కలుగుతుంది. 
ఊట్నూర్‌ రాజేశ్, మత్స్యకారుడు, కమ్మర్‌పల్లి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement