సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : ఏలూరు కార్పొరేషన్‌లో గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఏమాత్రం నాణ్యత లేదని, పనుల వ్యయాన్ని పెంచుకుంటూ పోవడంతో పాటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని నగరపాలకసంస్థ అధికారులపై ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయంలో బుధవారం ఆళ్లనాని, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ ముత్యాలరాజులు సమీక్షించారు. డివిజన్లలో పర్యటించిన సమయంలో ప్రజలు అనేక విషయాల్ని తన దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిఫార్సులు చేస్తామని నాని అన్నారు.
కాగితాలపై కాకి లెక్కలు తప్ప సరైన సమాచారం ఇచ్చే స్థితిలో అధికారులు లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అంశాన్ని ప్రస్తావించినా అవగాహనలేని మాటలే తప్ప వాస్తవ పరిస్థితులపై అధికారులకు అవగాహన లేదని అన్నారు. 14వ ఆర్ధిక సంఘం నిధుల వినియోగంపై పొంతన లేకుండా లెక్కలు చెబుతున్నారని, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహించారని, నిబంధనలకు విరుద్ధంగా నిధులు వెచ్చించారని విమర్శించారు.
పనులు చేయకుండానే చేసినట్లు లెక్కలు చూపారని, కార్పొరేషన్‌లో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్దితి నెలకొందని అన్నారు. రోడ్లు వేసిన నెల రోజులకే దెబ్బతిన్న తీరు చూస్తుంటే నాణ్యతను పట్టించుకోలేదని, తనిఖీ చేయాల్సిన అధికారులు కూడా ఎక్కడ ఏ పని జరిగిందో చెప్పలేని స్థితిలో ఉండటాన్ని మంత్రి తప్పుపట్టారు.టూటౌన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విధానం లేనప్పుడు తంగెళ్లమూడిలో పనులకు ప్రతిపాదన ఎలా చేశారని, వన్‌టౌన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా సరిదిద్దకుండా ప్రజాధనాన్ని వృథా చేశారని అన్నారు.
రాబోయే మూడు రోజుల్లో పనుల వివరాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం వచ్చినా డ్రెయిన్ల పూడికతీత పనులు ఎందుకు పూర్తి కాలేదని మంత్రి ప్రశ్నించారు. నగరంలో ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో నాణ్యత కరువైందని, వెంటనే పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పైపులైన మరమ్మతుల నిమిత్తం రూ.6 కోట్ల వరకు నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నారని, చాలా చోట్ల పనులు జరగకుండానే జరిగినట్లు బిల్లు డ్రా చేసినట్లు తనకు ఫిర్యాదులు అందాయని మంత్రి అన్నారు. తనకు తెలియకుండా ఏ ఒక్క అధికారిని రిలీవ్ చేయవద్దని ఈ సందర్భంగా నగరపాలకసంస్థ కమిషనర్ ఏ.మోహన్‌రావును కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశించారు.
తెల్లముఖం వేసిన అధికారులు
దేనికి అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశాలకు స్పష్టమైన వాస్తవ వివరాలతో రావాలని, ఏమాత్రం సమాచారం లేకుండా టైంపాస్‌కు వస్తే ఇక మీద సహించేది లేదని హెచ్చరించారు. గత ఏడాది రూ. 27 కోట్లు ఆస్తి పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకుని కేవలం రూ. 15 కోట్లు మాత్రమే వసూలు చేశారని, ఈ ఆర్థిక సంవత్సరం మళ్ళీ రూ.28 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారని.. గత బకాయిలతో కలిపి రూ. 40 కోట్లు ఎలా వసూలు చేయగలరని ప్రశ్నించారు.
నగరపాలక సంస్థ నిధులతో ఎస్‌ఎంఆర్ నగర్‌లో ఓ కుల కల్యాణమండపాన్ని ఎలా నిర్మిస్తున్నారని, అలా నిర్మించేందుకు ఏమైనా అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించగా.. ఎలాంటి అనుమతులు లేవని, గత పాలకులు ఆదేశాలతో చేపట్టామని అధికారులు వివరణ ఇచ్చారు. సమావేశంలో కమిషనర్ ఎ.మోహనరావు, హెల్త్ ఆఫీసర్ సూర్యారావు, ఏసీపీలు వి.శ్రీనివాస్, అప్పారావు, ఆర్వోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment