గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి
సాక్షి, గుంటూరు : రాష్ట్ర రాజధాని ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు సార్లు వచ్చి ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మారాయి. 2–10–2015న ఆస్పత్రికి వచ్చిన సీఎం మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ వార్డు(ఎంసీహెచ్ వార్డు) నిర్మాణానికి శిలాఫలకం వేశారు. మూడేళ్లపాటు ఎంసీహెచ్ వార్డు నిర్మాణం ప్రారంభం కాలేదు. మళ్లీ 2018 డిసెంబర్ 19న చంద్రబాబు రెండోసారి ఎంసీహెచ్ వార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పుడు కూడా నిర్మాణాలు ప్రారంభం కాలేదు.
భవనాల కోసం తవ్విన గోతులు మాత్రం పెద్ద అగాధంలా ప్రభుత్వ అసమర్థతను వెక్కిరిస్తున్నారు. మరో వైపు సీఎం ప్రారంభించిన శిలాఫలకాలు సైతం అదృశ్యమయ్యాయి. ఎంసీహెచ్ వార్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో బాలింతలు, గర్భిణులు నాలుగేళ్లుగా ఆస్పత్రిలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇలా సీఎం చేతుల మీదుగా రెండుసార్లు శంకుస్థాపనలు అయిన భవన నిర్మాణాలే నేటికీ ప్రారంభం కాకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం రూ. 20 కోట్లు 2014లో విడుదల చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు, గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో రూ.30 కోట్లు ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం ఇచ్చారు. సుమారు రూ.65 కోట్లు ఎంసీహెచ్ వార్డు నిర్మాణానికి సమకూరాయి. కానీ వార్డు పనుల్లో మాత్రం పురోగతి లేదు. పెద్దాస్పత్రికి కాన్పు కోసం వచ్చే గర్భిణులు, బాలింతలు మాత్రం మంచాలు చాలక అల్లాడిపోతున్నారు.
మూడు హామీలు.. ఒక్కటీ నెరవేరలేదు...
- గుంటూరులోని జీజీహెచ్‌లో మాతాశిశు వార్డు నిర్మాణానికి 2015లో సీఎం చంద్రబాబు తొలిసారి శంకుస్థాపన చేశారు. వార్డు నిర్మాణం కోసం అప్పుడు తీసిన అగాధాలు.. మూడేళ్లపాటు సీఎం సారూ.. ఎక్కడ నిర్మాణమంటూ ప్రశ్నిస్తూనే ఉన్నాయి. మళ్లీ 2018లో శంకుస్థాపన చేశారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాదిలోపు భవనాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నడిబొడ్డున ఖాళీ స్థలంలో పెద్ద పెద్ద అగాధాలు చేశారు. అనంతరం నిర్మాణ పనులను మాత్రం అలాగే వదిలేశారు. వార్డు నిర్మాణానికి దాతలు ముందుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం అందింది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం దాటి ఎంసీహెచ్ వార్డు నిర్మాణానికి ఒక్క ఇటుకా పడలేదు. మాతా శిశు వార్డు కథ మారలేదు.
- గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే సహృదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా నాలుగు గుండె మార్పిడి ఆపరేషన్లను జీజీహెచ్‌లో నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబు ఆస్పత్రికి వచ్చి గుండె మార్పిడి ఆపరేషన్లను ఎన్‌టీఆర్ వైద్యసేవలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇది నమ్మిన గుండె జబ్బుల రోగులు జీజీహెచ్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం గుండె మార్పిడి ఆపరేషన్లకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు. దీంతో సహృదయ ట్రస్ట్‌కు కూడా తాము ఆపరేషన్లు చేయలేమని ప్రకటించింది. ఆపరేషన్లకు బ్రేక్ పడింది.
- జీజీహెచ్‌లో పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా నూతన భవన నిర్మాణాల కోసం గుంటూరులోని బొంగరాల బీడులో స్థలం కేటాయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తీరా చూస్తే ఆ స్థలాన్ని కార్మిక శాఖకు కేటాయిస్తున్నట్లు జీవో ఇచ్చారు. దీంతో నూతన వార్డుల నిర్మాణం అటకెక్కింది. ఇలా సవాలక్ష మెలికలు పెట్టి.. ఈ హామీకీ ఘోరీ కట్టారు. పేదల ఆస్పత్రి అభివృద్ధికి చంద్రబాబు ఇచ్చిన మూడు హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. రోగుల కష్టాలు ఒక్కటీ తీరలేదు. సీఎం తీరుపై జిల్లా వాసులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
బొంగరాలబీడులో జీజీహెచ్ వార్డుల నిర్మాణానికి సీఎం ప్రకటించిన స్థలం
గుండె మార్పిడి ఆపరేషన్లకు నిధులు లేవు
గుంటూరు జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు నిధులు ఇస్తామని చంద్రబాబు 2015లో హామీ ఇచ్చారు. ఆస్పత్రికి వచ్చి గుండె జబ్బు రోగులను పరామర్శించి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా గుండె మార్పిడి ఆపరేషన్లు జీజీహెచ్‌లో ఉచితంగా చేస్తున్నారని, ప్రజలు వినియోగించుకోవాలని చెప్పారు. ఆయన మాటలు నమ్మి సుమారు 25 మంది గుండె జబ్బు రోగులు ఆపరేషన్ల కోసం గుంటూరు జీజీహెచ్‌లో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు.
సహృదయ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా 2016 నుంచి 2018 వరకు నలుగురికి గుండె మార్పిడి ఆపరేషన్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఆయన ఆపరేషన్లను నిలిపివేశారు. గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం పేర్లు నమోదు చేయించుకున్న వారు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవ పథకంలో గుండె మార్పిడి ఆపరేషన్లకు రూ.15 లక్షలు ఇస్తున్నామని పోస్టర్లు ముద్రించి ప్రచారం చేసుకుంటున్నారు.
జీజీహెచ్‌కు ప్రతి రోజూ ఓపీ : 4 వేలు
ప్రస్తుతం ఉన్న పడకలు : 1177
కావాల్సిన పడకలు :560
జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు : 4
గుండె మార్పిడికి ఎదురు చూస్తున్న వారు : 25 మంది
Comments
Please login to add a commentAdd a comment