Suryalanka
-
మత్స్యకారులకు దొరికిన వాయుసేన మిస్సైల్
వేటపాలెం: మత్స్యకారుల వలకు మిలిటరీ వాయుసేనకు చెందిన చిన్నపాటి మిస్సైల్ దొరికింది. ఈ ఘటన శుక్రవారం బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో చోటుచేసుకుంది. దాన్ని మత్స్యకారులు బోటులో ఒడ్డుకు తీసుకొచ్చారు. మెరైన్ ఎస్ఐ సుబ్బారావు బాపట్ల సూర్యలంకకు చెందిన ఎయిర్‌ఫోర్సు మిలిటరీ అధికారులకు సమాచారం అందించారు. ఏం జరిగిందంటే... సూర్యలంకకు చెందిన మిలటరీ అధికారులు ఏటా ఎయిర్‌ఫోర్సుకు చెందిన రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. ఈనెల 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సముద్ర గగనతలంలో అడ్వాన్స్డ్ మిస్సైల్ సిస్టంపై రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. చిన్నపాటి యుద్ధ మిస్సైల్‌ను ప్రయోగించి అది లక్ష్యం చేరుకోక ముందే సూర్యలంక కేంద్రం నుంచి పేట్రియాట్ మిస్సైల్‌తో దాన్ని పేల్చివేసే రిహార్సల్స్ జరుగుతున్నాయి. దీన్లో భాగంగా ప్రయోగించిన ఈ మిస్సైల్ సముద్రంలో మత్స్యకారులకు దొరికింది. దాన్ని మెరైన్ అధికారుల సమక్షంలో ఎయిర్‌ఫోర్సు అధికారులకు అప్పగించారు. -
అత్తింటికి వెళ్లాల్సిన నవవధువు ప్రియుడితో కలిసి..
బాపట్ల (గుంటూరు): ప్రేమించుకున్నారు... కలిసి జీవించాలి అనుకున్న నేపథ్యంలో అనుకోని విధంగా యువతికి తల్లిదండ్రులు మరొక వివాహం చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మాజీ ప్రేమికుడితో కలసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక గ్రామంలో చోటుచేసుకుంది. బాపట్ల రూరల్ ఎస్ఐ వెంకటప్రసాద్ వివరాల ప్రకారం.. కొండుబొట్లవారిపాలేనికి చెందిన ప్రవల్లిక, శ్రీకాంత్‌లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు నెల రోజుల కిందట ఆమెకు మరో యువకుడితో వివాహం చేశారు. ఆషాఢమాసం కావడంతో ఆమె తల్లిదండ్రుల నివాసంలో ఉంటోంది. శ్రావణమాసం రావడంతో రెండు రోజుల్లో అత్తింటికి వెళ్లాల్సి ఉండగా సోమవారం సూర్యలంక గ్రామంలో మాజీ ప్రేమికుడితో కలసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, యువకుడి కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం పొన్నూరు తరలించారు. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
నవంబర్ 23 నుంచి సూర్యలంకలో మిలిటరీ శిక్షణ
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో వచ్చే నెల 23వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు 12 రోజుల పాటు రక్షణ శాఖ ఆధ్వర్యంలో మిలిటరీ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తున్నట్లు సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యలంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఫైరింగ్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఆరు నుంచి ఎనిమిది ఎయిర్ క్రాఫ్ట్‌లు ఇందులో పాల్గొననున్నాయి. శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే సూర్యలంక చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు ప్రమాదకర ప్రాంతంగా పేర్కొంటూ ప్రవీణ్ ప్రకాశ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
క్రాస్బౌ–18 విజయవంతం
విశాఖ సిటీ: క్రాస్బౌ–2018 పేరుతో భారత వైమానిక దళం నిర్వహించిన క్షిపణి ప్రయోగ విన్యాసాలు గురువారంతో ముగిశాయి. గుంటూరు జిల్లా సూర్యలంకలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఈ నెల 3 నుంచి క్రాస్ బౌ విన్యాసాలు మొదలయ్యాయి. సదరన్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్షిపణి విన్యాసాల్లో ముఖ్య అతిథులుగా భారత వైమానిక దళాధిపతి బీరేందర్ సింగ్ ధనోవా, సదరన్ ఎయిర్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షన్ బి.సురేష్ పాల్గొన్నారు. ఉపరితలంపై నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాష్, స్పైడర్, ఒసా–ఎక్–ఎం, ఐజీఎల్‌ఏ మొదలైన క్షిపణులను విజయవంతంగా విన్యాసాల్లో పరీక్షించారు. భూ ఉపరితలం నుంచి గాలిలో ఉన్న శత్రు లక్ష్యాల్ని ఛేదించే ప్రయోగం విజయవంతమయ్యింది. రాత్రి సమయంలో ప్రత్యక్ష ఫైరింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్.యూ–30 ఫైటర్ జెట్ ఈ విన్యాసాల్లో పాల్గొంది. ఈ విన్యాసాల ద్వారా భారత వాయుదళాల మార్గదర్శక వ్యవస్థలు, అంతర్గత ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ సామర్థ్యాలను పరీక్షించారు. -
కోలాహలం..సూర్యలంక తీరం
బాపట్లటౌన్: సూర్యలంక సముద్ర తీరం ఆదివారం పర్యాటకులతో పోటెత్తింది. కార్తీకమాసంలో సముద్రస్నానం చేసి, తీరం వెంబడి ఉన్న జీడిమామిడి తోటల్లో వన భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సెలవుదినం కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వేకువజామునే తీరానికి చేరుకొని సూర్యనమస్కారాలతో కూడిన పుణ్యస్నానాలను ఆచరించేందుకు పర్యాటకులు పోటీపడ్డారు. సూదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు శనివారం రాత్రే బయల్దేరి ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకే తీరానికి చేరుకున్నారు. మహిళలు తీరం వెంబడి గౌరిదేవి పూజలు నిర్వహించి ఇసుకతో తయారుచేసిన అమ్మవారి ప్రతిమలను సూర్యలంక తీరంలో కలిపి పుణ్యస్నానాలు ఆచరించారు. స్నానాలనంతరం ఇక్కవ ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూజల అనంతరం తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జీడిమామిడి తోటలో వనభోజనాలు చేసి ఆహ్లాదంగా గడిపారు. ప్రత్యేక బందోబస్తు ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యలంక రోడ్డు జనసందోహంగా మారింది. పర్యాటకులు అధికసంఖ్యలో రావడంతో తీరంలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా బాపట్ల తాలుకా ఎస్ఐ సీహెచ్. సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటుచేశారు. కార్తీకమాసం ముగిసేంత వరకు తీరంలో రెండు టీమ్లచే పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. -
సూర్యలంకలో ‘శివ లింగ’ ప్రతిష్ట
బాపట్ల టౌన్: సూర్యలంక సాగర తీరంలోని శివక్షేత్రంలో ఆదివారం శివలింగాన్ని కమిటీ సభ్యులు ప్రతిష్టించారు. ఈ సందర్భంగా శివక్షేత్ర నిర్మాణ సంఘం అధ్యక్షుడు మంతెన దశరథ మహారాజు మాట్లాడుతూ సూర్యలంక తీరానికి పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వీలుగా తీరంలో శివక్షేత్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన సూర్యలంక తీరంలో నిత్యం పూజలు నిర్వహించే విధంగా శివాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి శివలింగాన్ని ప్రతిష్టించారు. కార్యక్రమంలో కమిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అడ్డగడ సుబ్బారావు, సెక్రటరి సంగమేశ్వరశాస్త్రి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి సోయగాల నెలవు
సూర్యలంక హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నేను. వారాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. హాయిగా గడపాలనుకున్నాం మా మిత్రబృందం. అంత చక్కని ప్రాంతం ఎక్కడా అని వెతికితే మన రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాలో ఉన్న ఓ అద్భుతమైన ప్రాంతం గురించి తెలిసింది. అదే సూర్యలంక. ఐదుగురం స్నేహితులం కలిసి కారులో బయల్దేరాం. ఉదయాన్నే ఐదు గంటల ప్రాంతంలో బయల్దేరి, మరో ఐదున్నర గంటల్లోగా సూర్యలంకకు చేరుకున్నాం. గుంటూరు జిల్లాలోని బాపట్ల నుంచి 9 కి.మీ దూరంలో ఉన్న పల్లె అది. ఇక్కడ ఓడరేవు కూడా ఉంది. విశాలంగా, ప్రకృతి రమణీయంగా కనువిందుచేసే ఈ ప్రాంతం గురించి ఇంత ఆలస్యంగా తెలుసుకున్నందుకు విచారించినా, ఇప్పటికైనా చూడగలిగినందుకు తెగ సంతోషించాం. ఇక్కడికి దగ్గరలోనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వారి ఎయిర్ బేస్ ఉంది. కాని లోపలికి ప్రవేశం నిషిద్ధం. ఆంద్రప్రదేశ్ పర్యాటక శాఖ వారి రిసార్ట్లు ఉన్నాయి. అలలు మరీ ఎత్తుగా కాకుండా చిన్నవిగా రావడం వల్ల ఇక్కడి తీరం సముద్రస్నానానికి అనువుగా ఉంటుంది. సూర్యలంకకి దాదాపు 16 కి.మీ దూరంలో ఓడరేవు బీచ్ ఉంది. సముద్రతీరానికి దగ్గర్లో ఉన్న చిన్న ఈ పల్లెటూరు ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో ఒక వెలుగు వెలిగిందని విన్నాం. ఇక్కడ నుంచే సుమత్రా, జావా ద్వీపాలకు సరుకులు రవాణా చేసేవారట. సుమారు రెండు వేల కుటుంబాలు ఇక్కడ చేపల వేట మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడే ఇండియన్ టుబాకో కంపెనీ వారిది ఓ అతిథి గృహం కూడా ఉంది. అందులో ఓ ప్రైవేటు బీచ్, విదేశాలను తలపించే సకల సౌకర్యాలు ఉన్నాయని తెలుసుకున్నాం. వేసవిలో ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడే వాటర్ స్కూటర్స్‌లో షికార్ చేశాం. అలలమీద ప్రయాణం మహా అద్భుతంగా అనిపించింది. సూరాస్తమయం అందాలను తిలకించడంతో రాత్రి ఇక్కడి ప్రాంతీయ వంటకాలతో చేసిన విందుభోజనాన్ని ఆస్వాదించాం. ఆ రాత్రి సూర్యలంకలోనే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయాన్ని తిలకించి, తిరుగు ప్రయాణం అయ్యాం. - రితేష్, ఇ-మెయిల్ హైదరాబాద్ నుంచి 320కి.మీ. ఇక్కడకు బాపట్ల రైల్వే స్టేషన్ 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సూర్యలంకకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. గుంటూరు నుంచి బస్సులు ఉన్నాయి. బస చేయడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ వారి హరితా రిసార్ట్స్ ఉన్నాయి.