కోలాహలం..సూర్యలంక తీరం
కోలాహలం..సూర్యలంక తీరం
Published Sun, Nov 6 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
బాపట్లటౌన్: సూర్యలంక సముద్ర తీరం ఆదివారం పర్యాటకులతో పోటెత్తింది. కార్తీకమాసంలో సముద్రస్నానం చేసి, తీరం వెంబడి ఉన్న జీడిమామిడి తోటల్లో వన భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సెలవుదినం కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వేకువజామునే తీరానికి చేరుకొని సూర్యనమస్కారాలతో కూడిన పుణ్యస్నానాలను ఆచరించేందుకు పర్యాటకులు పోటీపడ్డారు. సూదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు శనివారం రాత్రే బయల్దేరి ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకే తీరానికి చేరుకున్నారు. మహిళలు తీరం వెంబడి గౌరిదేవి పూజలు నిర్వహించి ఇసుకతో తయారుచేసిన అమ్మవారి ప్రతిమలను సూర్యలంక తీరంలో కలిపి పుణ్యస్నానాలు ఆచరించారు. స్నానాలనంతరం ఇక్కవ ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూజల అనంతరం తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జీడిమామిడి తోటలో వనభోజనాలు చేసి ఆహ్లాదంగా గడిపారు.
ప్రత్యేక బందోబస్తు
ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యలంక రోడ్డు జనసందోహంగా మారింది. పర్యాటకులు అధికసంఖ్యలో రావడంతో తీరంలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా బాపట్ల తాలుకా ఎస్‌ఐ సీహెచ్. సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటుచేశారు. కార్తీకమాసం ముగిసేంత వరకు తీరంలో రెండు టీమ్‌లచే పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
Advertisement
Advertisement