
రుచుల రాజ్యంలో ఆయనదిప్రత్యేక స్థానం
ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకూ ప్రస్థానం
ప్రత్యేకమైన రెసిపీల తయారీలో సృజన
ఆధునిక నలభీమునిగా విశేష గుర్తింపు
ఎల్లలు దాటిన ‘చల్లా’ వంటలు
తెనాలి: చల్లా లక్ష్మీనారాయణ– ‘ ఏదో ఒక రోజు పెద్ద చెఫ్‌ని అవుతాను’ అంటూ చిన్నప్పుడు అన్నప్పుడు, అందరూ నవ్వుకున్నారు. అయితే, అమ్మను తొలి గురువుగా తీసుకున్న ఆయన, పాకశాస్త్రంలో అపూర్వ శిఖరాలను అధిరోహించారు. ఆధునిక నలభీమునిగా, ప్రత్యేకమైన రెసిపీల సృష్టిలో తన ప్రతిభను చాటారు. ఆయన వంటల ప్రయాణం.. ‘శ్రమ’కు ‘రుచి’ని మేళవించి, ఆహారప్రియులను ‘ఔరా..’ అనిపించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఆయన ప్రస్థానం, నిజంగా ఈ రంగంలో యువతకు ప్రేరణ. ప్రస్తుతం వీసా రెన్యువల్ కోసం భారత్‌కు వచ్చిన ఆయన స్ఫూర్తిదాయక జీవన ప్రయాణం మీ కోసం..
అదృష్టానికి తొలి మెట్లు..
లక్ష్మీనారాయణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలానికి చెందిన అంగలకుదురు. తెనాలిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, హైదరాబాద్‌లోని ఐఐహెచ్‌ఎంలో హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పొందారు. ఒక హోటల్‌లో ఉద్యోగంతోపాటు హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజంలో పీజీ డిప్లొమా కూడా పూర్తి చేశారు. ఆపై సింగపూర్‌లో ఫుడ్ హైజీన్ కోర్సు అభ్యసించి, ముంబయిలోని బ్రిటిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ద్వారా హోటల్ మేనేజ్‌మెంట్, కేటరింగ్ టెక్నాలజీలో దూరవిద్య ద్వారా కోర్సు పూర్తి చేశారు.
1997లో ఆయన వృత్తి జీవితం ప్రారంభమైంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రముఖ హోటళ్లలో చెఫ్‌గా సేవలందించారు. 2007–09 కాలంలో సింగపూర్‌లోని నయూమి హోటల్స్‌లో చెఫ్‌గా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం మైసూరు, కూర్గ్ ప్రాంతాల్లోని రిసార్ట్స్, తిరుపతిలోని ఐసీటీ హోటల్‌లో సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు కాకినాడ, చెన్నై నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో పనిచేశారు. శ్రమతోపాటు ప్రతిభకు గుర్తింపుగా అదృష్టం తలుపు తట్టినట్లు 2023లో అమెరికా నుంచి ఆహ్వానం లభించింది. అక్కడి కాలిఫోర్నియాలో ప్రసిద్ధ హోటల్‌లో చెఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: ఎండినా... నిమ్మ అమ్మే!
వరించిన అవార్డులు
సింగపూర్‌లోని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ చెఫ్స్ సొసైటీ, సౌత్ ఇండియన్ చెఫ్స్ అసోసియేషన్ (ఎస్‌ఐసీఏ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కలినరీ అసోసియేషన్ (ఐఎఫ్‌సీఏ), అమెరికన్ కలినరీ ఫెడరేషన్ (ఏసీఎఫ్) సభ్యత్వాలు లక్ష్మీనారాయణకు లభించాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ తిరుపతి, విశాఖపట్నం వేదికగా నిర్వహించిన వంటకాల పోటీలతో పాటు అనేక సోలో, గ్రూపు విభాగాల్లో పాల్గొని పలు ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన గెలుచుకున్నారు.
ఎన్నో దేశాల వంటకాల్లో మేటిగా..
పలు దేశాల వంటకాలలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. దక్షిణ భారతీయ వంటకాలకే పరిమితం కాకుండా థాయ్, ఇటాలియన్, మెక్సికన్ వంటి అంతర్జాతీయ వంటకాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నీటిపై పెరిగే మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యేకమైన ‘హనీ చిల్లీ చెస్ట్ నట్స్’ రెసిపీలో లక్ష్మీనారాయణ సిద్ధహస్తులు. ఆయన తయారు చేసే మరో ప్రసిద్ధ వంటకం ‘చిల్లీ తోఫు’ కూడా ఎంతో ఆదరణ పొందింది. నాన్‌వెజిటేరియన్ వంటకాల విషయంలో, మటన్ కర్రీతో దోసెలా స్ట్రీమ్ చేసి వడ్డించే ప్రత్యేకమైన ‘మటన్ మొప్పాస్’, మంగళూరు శైలిలో ‘ఘీ రోస్ట్ ప్రాన్స్’, ఆంధ్ర ప్రత్యేకత అయిన ‘నాటుకోడి–రాగిముద్ద’, అరుదైన ‘జాక్‌ఫ్రూట్ బిర్యానీ’, మసాలా రుచులతో నిండిన ‘గుంటూరు మటన్ ఫ్రై బిట్ బిర్యానీ’లు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.
‘సాఫ్ట్‌వేర్’ ఒక్కటే మార్గం కాదు
నేటి యువతకు ‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగం’ ఒక్కటే మార్గం కాదు. హోటల్, టూరిజం వంటి రంగాలలోనూ అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నా వృత్తి విషయానికి వస్తే, ప్రతి దేశం నాకు ఒక కొత్త పాఠం, ప్రతి వంటకం ఒక కొత్త సవాలు. ఇన్నేళ్ల ప్రయాణంలో అనుభవించిన అవమానాలు, ఒంటరితనం, సుదీర్ఘమైన పనిగంటలు– ఇవన్నీ నా ఎదుగుదలకు బలమైన మూల స్తంభాలయ్యాయి. వంటకాలు తయారు చేయడం మాత్రమే కాదు, వాటిలో మనసు కలపాలి. పదార్థాలకు భావాలను మేళవించినప్పుడే వంటకానికి ప్రాణం వస్తుంది. – చల్లా లక్ష్మీనారాయణ