సాక్షి ప్రతినిధి, కాకినాడ: మనకు అండమాన్ నికోబార్, లక్షదీవుల గురించి తెలుసు. అక్కడ విహరించాలనుకునేవారూ ఎక్కువే. అయితే దూరాభారం, అధిక వ్యయం వల్ల వెనుకడుగు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో మనకు సమీపంలోనే బంగాళాఖాతంలోనే ఉన్న హోప్ ఐలాండ్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కాకినాడ సముద్ర తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం దాదాపు 150 ఏళ్ల క్రితం సహజసిద్ధంగా ఏర్పడింది.
ఈ కాలంలో వచ్చిన ఎన్నో తుపాన్ల నుంచి పెట్టని కోటగా నిలిచి కాకినాడ నగరాన్ని, నౌకాశ్రయాన్ని హోప్ ఐలాండ్ రక్షించింది. 1996లో నవంబర్ 6న తుపాను విజృంభణతో తీరమంతా చిగురుటాకులా వణికిపోయి వందలాది మంది మత్స్యకారులు మృత్యువాతపడ్డారు. అంతటి విలయంలో సైతం హోప్ ఐలాండ్‌ను విడిచి ఒక్క కుటుంబం కూడా బయటకు రాకపోవడం విశేషం.
వృద్ధ గౌతమి, తుల్యభాగ నదీ పాయలతో..
మన రాష్ట్రంలోని సముద్ర జలాల్లో ఉన్న ఏకైక ద్వీపం.. హోప్ ఐలాండ్. ధవళేశ్వరం ఆనకట్ట దిగువన వృద్ధ గౌతమి నదీ పాయ యానాం సమీపంలో సముద్రంలో కలుస్తోంది. అలాగే కోరింగ మడ అడవుల సమీపంలో తుల్యభాగ పాయ సముద్రంలో అంతర్భాగమవుతోంది. ఈ రెండు పాయల నుంచి వచ్చిన ఇసుక కారణంగానే హోప్ ఐలాండ్ ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గోదావరి బంగాళాఖాతంలో కలిసే ప్రాంతానికి 50 కిలోమీటర్ల ఎగువన 1850లో కాటన్ ఆనకట్ట నిర్మాణం జరిగింది. ఈ బ్యారేజ్ నిర్మాణం తర్వాత ఈ హోప్ ఐలాండ్ వేగంగా విస్తరించిందని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. బ్యారేజ్‌తో గోదావరి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట పడ్డాక నదీ ప్రవాహంలో వచ్చిన మార్పులతో ఇసుకమేటలు పేరుకుపోయాయి. ఈ మేటలతోనే ద్వీపం ఏర్పడిందని చెబుతున్నారు. 18 కిలోమీటర్లు పొడవు, 1.8 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ద్వీపం కాకినాడ నగరానికి, పోర్టుకు ఆయువుపట్టుగా నిలుస్తోంది.
వందేళ్ల క్రితమే జనసంచారం..
ఈ ద్వీపంలో జనసంచారం వందేళ్ల క్రితమే మొదలైంది. ఇప్పుడు అక్కడున్నది రెండో తరం. హోప్ ఐలాండ్‌లో నివసిస్తున్న వారి పూర్వీకులంతా సముద్రతీరంలోని వివిధ గ్రామాల నుంచి వలస వచ్చి స్థిరపడ్డవారే. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో ఈ ద్వీపాన్ని గుర్తించి వేటకు అనుకూలమని అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఐలాండ్‌లో తొలి నివాసం ఏర్పాటు చేసుకున్న పుత్రయ్య పేరుతో దాన్ని పుత్రయ్యపాకలుగా పిలుస్తున్నారు.
మొదట్లో సీజన్ సమయంలో ఈ ఐలాండ్‌కి వచ్చి, చేపల వేట పూర్తి అయ్యాక తిరిగి స్వగ్రామాలకు వెళ్లిపోయే వారు. కాలక్రమంలో అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ సోలార్ విద్యుత్ సదుపాయం ఉంది. చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ ఎక్కడ బోరు వేసినా మంచినీరే లభిస్తుండటం విశేషం. సముద్రం నడిబొడ్డున ఉన్న ఆ పల్లెలో 118 కుటుంబాలు నివసిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
మక్కువతో అక్కడే నివాసం..
హోప్ ఐలాండ్‌లో నివసించేవారు ఏ చిన్న సరకులు కావాల్సినా పడవపైన సముద్రం దాటి కాకినాడ రావాల్సిందే. ఐలాండ్‌లో ఉంటున్న పలువురికి కాకినాడ రూరల్ మండలం తూరంగి పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయినా వారంతా అక్కడి వాతావరణంపై మక్కువతో తిరిగి ద్వీపానికి వెళ్లిపోయారు. వీరి ఓట్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగిలో ఉన్నాయి.
హోప్ ఐలాండ్‌కు ఇలా చేరుకోవాలి..
హోప్ ఐలాండ్ పర్యాటకులు ఆస్వాదించేందుకు ఎంతో అనువైన ప్రాంతం. ఇక్కడకు వెళ్లడానికి కాకినాడ నుంచి సూర్యోదయానికి ముందు బయలుదేరితే సముద్ర అలల ఉధృతి తక్కువగా ఉండి ప్రయాణం సాఫీగా సాగుతుంది.
కాకినాడ నుంచి హోప్ ఐలాండ్ చేరుకోవాలంటే సాధారణ ఇంజిన్ బోటులో గంట ప్రయాణం. కాకినాడ హార్బర్ నుంచి లేదా నగరంలోని జగన్నాథపురం నుంచి బోటులో హోప్ ఐలాండ్‌కు చేరుకోవచ్చు. అయితే పర్యాటకులు ముందుగా హార్బర్‌లో అటవీ అధికారుల అనుమతులు తీసుకోవాలి.
గతంలో ఏపీ టూరిజం అధికారులు ద్వీపానికి వెళ్లే పర్యాటకుల కోసం కాకినాడ జగన్నాథపురం బకింగ్‌హామ్ కెనాల్ నుంచి బోట్లు కూడా నడిపారు. ఇరుగు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సముద్ర ప్రయాణం, హోప్‌ఐలాండ్ తీరం ఆస్వాదించేందుకు పర్యాటకులు వచ్చేవారు. ఈ నేపథ్యంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు జరిగాయి.
పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు
హోప్ ఐలాండ్‌కు పర్యాటకులు రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారుచేస్తాం. అక్కడున్న కుటుంబాలకు సదుపాయాలు మెరుగుపరుస్తాం. –కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్, కాకినాడ
ఇక్కడే పుట్టాం.. ఇక్కడే ఉంటాం
ఇక్కడే పుట్టాం.. ఇక్కడే ఉంటాం. మా పూర్వీకులు కూడా ఇక్కడే గంగమ్మతల్లి ఒడిలో జీవించారు. మాకు సముద్రమంటే భయం లేదు. తుపానులతో కూడా మాకేమీ కాదు. హోప్ ఐలాండ్‌లో పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం ఉన్నాయి. ఇంకా సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుతున్నాం. ఇలా చేస్తే పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుంది.– మచ్చా బాగయ్య, స్థానికుడు, హోప్ ఐలాండ్
Comments
Please login to add a commentAdd a comment