ఇదీ ఏపీటీడీసీలో ఔట్‌సోర్సింగ్ కార్మికుల పరిస్థితి
పర్యాటక దినోత్సవ వేడుకలపై కార్మికుల ఆగ్రహం
పీఎఫ్ మింగేసినవారిపై చర్యలేవీ?
మా సొమ్ము మాకిప్పించాలంటున్న కార్మికులు
ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగం.. పేరు ఏదైనా వెట్టిచాకిరీ తప్పదు. పని బారెడైనా.. జీతం మాత్రం మూరెడే. బక్కజీవుల బతుకులు మారవు.. మారేం దుకు అవకాశం ఇవ్వం అన్నట్లు కొనసాగే పాలకుల వ్యవహారం.. అందుకు తగ్గట్టే యాజమాన్యాల నిర్వాకం. ఏపీటీడీసీలో ప్రస్తుతం కొనసాగుతున్న తంతుఇదే. ఈ సంస్థలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్లుగా పనిచేస్తున్నా తక్కువ జీతంతోనే బతుకీడుస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ కార్మికుల పీఎఫ్ సొమ్ము కు ఎసరు పెట్టినా ఎవరికీ పట్టడంలేదు.
విజయవాడ (భవానీపురం) : ‘అతిథులకు ఆతిథ్యమిచ్చి వారి ఆకలి తీరుస్తూ సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాం. అయినా మా కడుపులు కాలుస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వేడుకలు చేసుకుంటారా? అసలే అంతంత మాత్రం వేతనాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాం. పీఎఫ్ సొమ్మును సైతం మింగేసి బోర్డు తిప్పేసిన సంస్థపై ఏం చర్యలు తీసుకున్నారు?. మా పీఎఫ్ డబ్బులు మాకు ఇప్పించేసి మీరు ఏ వేడుకలైనా చేసుకోండి’. ఇదీ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ కార్మికుల ఆవేదన. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డివిజన్లలో ఔట్‌సోర్సింగ్ కార్మికులతో పని చేయించుకుని వారి పీఎఫ్ సొమ్మును దిగమింగేయటంపై కార్మికులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు.
ఏపీటీడీసీ విజయవాడ డివిజన్‌లో ఎస్‌ఎస్‌బీ అనే సంస్థ కింద 51 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులుగా పనిచేశారు. ఆ సంస్థ సుమారు 5 నెలలకుపైగా తమకు చెల్లించాల్సిన పీఎఫ్ సొమ్మును ఆ శాఖకు జమ చేయకుండా మింగేసిందని కార్మికులు చెబుతున్నారు. ఈ మొత్తం దాదాపు రూ.50 లక్షలకుపైగానే ఉన్నట్లు తెలుస్తోంది.
2011లో ఏపీటీడీసీలో హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎస్‌బీ సంస్థ ఔట్‌సోర్సింగ్ విధానంలో కార్మికులతో పని చేయించుకునేందుకు ఒక ఏడాదికి కాంట్రాక్ట్ తీసుకుంది. ప్రతి ఏడాది ఈ సంస్థ కాంట్రాక్ట్‌ను పొడిగిస్తూ వస్తున్నారు. అయితే కొద్ది సంవత్సరాలుగా కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు, ఇతర చెల్లింపులకు సంబంధించి సంస్థ ఇబ్బంది పెడుతున్న కారణంగా 2015 మే నెలలో ఏపీటీడీసీ అధికారులు ఆ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు.
కార్మికులకు షాక్ ఇచ్చిన ఎస్‌ఎస్‌బీ
కనీస వేతనాలకు కూడా నోచుకోని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పీఎఫ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాము పనిచేసే ఎస్‌ఎస్‌బీ సంస్థను రద్దు చేయడంతో పీఎఫ్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు ఆ శాఖ దగ్గరకు వెళ్లిన కార్మికులు షాక్ అయ్యారు. ఐదు నెలల నుంచి పీఎఫ్ సొమ్మును ఆ శాఖకు సంస్థ జమ చేయడం లేదని, పెండింగ్‌లో ఉన్న వాయిదాలు చెల్లిస్తేకానీ క్లియర్ చేయలేమని ఆ శాఖ చెప్పడంతో కార్మికులు ఆవాక్కయ్యారు.
ఒక్కో కార్మికునికి రూ.లక్షకుపైగా పీఎఫ్ సొమ్ము రావల్సి ఉంటుంది. గతంలో వేతనాలు పెంచాలంటూ కార్మికులు 15 రోజులు సమ్మె చేశారు. సమస్యను పరిష్కరిస్తామని ఏపీటీడీసీ యాజమాన్యం హామీ ఇచ్చినా, వేతనాలను మాత్రం పెంచలేదు. చివరికి పీఎఫ్ విషయంలో కూడా తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఏపీటీడీసీ ఈడీ అమరేంద్ర, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. కాంట్రాక్ట్ సంస్థ, ఉన్నతాధికారులు లాలూచీపడి తమ పీఎఫ్ సొమ్మును దిగమింగేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
కాంట్రాక్ట్ సంస్థ మారినా పెరగని వేతనాలు..
ఎస్‌ఎస్‌బీ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన ఏపీటీడీసీ యాజమాన్యం కొత్త కాంట్రాక్ట్‌ను ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పగించింది. గత ఏడాది జూన్ నుంచి ఇది మనుగడలోకి వచ్చింది. సహజంగా కాంట్రాక్ట్ సంస్థ మారితే కార్మికుల వేతనాలు పెరుగుతాయి. అందుకు భిన్నంగా పాత వేతనాలతోనే కొనసాగించేందుకు ఏపీటీడీసీ యాజమాన్యం నిర్ణయించింది.