neerabh kumar prasad
-
ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీకాలం పొడిగింపు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఆరు నెలలు సీఎస్ నీరబ్‌కుమార్ సర్వీస్‌ను పొడగించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. సీఎం చంద్రబాబు అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని కేంద్రం సీఎస్ నీరబ్ పదవీకాలాన్ని పొడిగించినట్లు తెలిపింది. సర్వీస్ పొడిగింపుతో డిసెంబర్ నెలాఖరు వరకు నీరబ్‌కుమార్ సీఎస్‌గా కొనసాగనున్నారు. -
ఏపీ కొత్త సిఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్..
-
నీరబ్ కుమార్ ప్రసాద్‌ను కలిసిన ఏపీఆర్ఎస్ఏ నేతలు
సాక్షి, అమరావతి: 152 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించడంతో ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌ను కలిసి ఏపీఆర్ఎస్ఏ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ‘30-35 ఏళ్లపాటు రెవెన్యూశాఖలో ఉద్యోగులు సుదీర్ఘమైన సేవలందిస్తారని.. తహశీల్దార్‌గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేయడం ఉద్యోగి కల’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అటువంటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని బొప్పరాజు అన్నారు. -
ఇదో ‘ఔట్ సోర్సింగ్’ కథ.. బక్కజీవుల వ్యథ!
ఇదీ ఏపీటీడీసీలో ఔట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి పర్యాటక దినోత్సవ వేడుకలపై కార్మికుల ఆగ్రహం పీఎఫ్ మింగేసినవారిపై చర్యలేవీ? మా సొమ్ము మాకిప్పించాలంటున్న కార్మికులు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగం.. పేరు ఏదైనా వెట్టిచాకిరీ తప్పదు. పని బారెడైనా.. జీతం మాత్రం మూరెడే. బక్కజీవుల బతుకులు మారవు.. మారేం దుకు అవకాశం ఇవ్వం అన్నట్లు కొనసాగే పాలకుల వ్యవహారం.. అందుకు తగ్గట్టే యాజమాన్యాల నిర్వాకం. ఏపీటీడీసీలో ప్రస్తుతం కొనసాగుతున్న తంతుఇదే. ఈ సంస్థలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్లుగా పనిచేస్తున్నా తక్కువ జీతంతోనే బతుకీడుస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ కార్మికుల పీఎఫ్ సొమ్ము కు ఎసరు పెట్టినా ఎవరికీ పట్టడంలేదు. విజయవాడ (భవానీపురం) : ‘అతిథులకు ఆతిథ్యమిచ్చి వారి ఆకలి తీరుస్తూ సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాం. అయినా మా కడుపులు కాలుస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వేడుకలు చేసుకుంటారా? అసలే అంతంత మాత్రం వేతనాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాం. పీఎఫ్ సొమ్మును సైతం మింగేసి బోర్డు తిప్పేసిన సంస్థపై ఏం చర్యలు తీసుకున్నారు?. మా పీఎఫ్ డబ్బులు మాకు ఇప్పించేసి మీరు ఏ వేడుకలైనా చేసుకోండి’. ఇదీ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)లో పనిచేసే ఔట్సోర్సింగ్ కార్మికుల ఆవేదన. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డివిజన్లలో ఔట్సోర్సింగ్ కార్మికులతో పని చేయించుకుని వారి పీఎఫ్ సొమ్మును దిగమింగేయటంపై కార్మికులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఏపీటీడీసీ విజయవాడ డివిజన్లో ఎస్ఎస్బీ అనే సంస్థ కింద 51 మంది ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేశారు. ఆ సంస్థ సుమారు 5 నెలలకుపైగా తమకు చెల్లించాల్సిన పీఎఫ్ సొమ్మును ఆ శాఖకు జమ చేయకుండా మింగేసిందని కార్మికులు చెబుతున్నారు. ఈ మొత్తం దాదాపు రూ.50 లక్షలకుపైగానే ఉన్నట్లు తెలుస్తోంది. 2011లో ఏపీటీడీసీలో హైదరాబాద్‌కు చెందిన ఎస్ఎస్బీ సంస్థ ఔట్సోర్సింగ్ విధానంలో కార్మికులతో పని చేయించుకునేందుకు ఒక ఏడాదికి కాంట్రాక్ట్ తీసుకుంది. ప్రతి ఏడాది ఈ సంస్థ కాంట్రాక్ట్‌ను పొడిగిస్తూ వస్తున్నారు. అయితే కొద్ది సంవత్సరాలుగా కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు, ఇతర చెల్లింపులకు సంబంధించి సంస్థ ఇబ్బంది పెడుతున్న కారణంగా 2015 మే నెలలో ఏపీటీడీసీ అధికారులు ఆ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. కార్మికులకు షాక్ ఇచ్చిన ఎస్ఎస్బీ కనీస వేతనాలకు కూడా నోచుకోని ఔట్సోర్సింగ్ సిబ్బంది పీఎఫ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాము పనిచేసే ఎస్ఎస్బీ సంస్థను రద్దు చేయడంతో పీఎఫ్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు ఆ శాఖ దగ్గరకు వెళ్లిన కార్మికులు షాక్ అయ్యారు. ఐదు నెలల నుంచి పీఎఫ్ సొమ్మును ఆ శాఖకు సంస్థ జమ చేయడం లేదని, పెండింగ్‌లో ఉన్న వాయిదాలు చెల్లిస్తేకానీ క్లియర్ చేయలేమని ఆ శాఖ చెప్పడంతో కార్మికులు ఆవాక్కయ్యారు. ఒక్కో కార్మికునికి రూ.లక్షకుపైగా పీఎఫ్ సొమ్ము రావల్సి ఉంటుంది. గతంలో వేతనాలు పెంచాలంటూ కార్మికులు 15 రోజులు సమ్మె చేశారు. సమస్యను పరిష్కరిస్తామని ఏపీటీడీసీ యాజమాన్యం హామీ ఇచ్చినా, వేతనాలను మాత్రం పెంచలేదు. చివరికి పీఎఫ్ విషయంలో కూడా తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఏపీటీడీసీ ఈడీ అమరేంద్ర, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. కాంట్రాక్ట్ సంస్థ, ఉన్నతాధికారులు లాలూచీపడి తమ పీఎఫ్ సొమ్మును దిగమింగేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ మారినా పెరగని వేతనాలు.. ఎస్ఎస్బీ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన ఏపీటీడీసీ యాజమాన్యం కొత్త కాంట్రాక్ట్‌ను ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పగించింది. గత ఏడాది జూన్ నుంచి ఇది మనుగడలోకి వచ్చింది. సహజంగా కాంట్రాక్ట్ సంస్థ మారితే కార్మికుల వేతనాలు పెరుగుతాయి. అందుకు భిన్నంగా పాత వేతనాలతోనే కొనసాగించేందుకు ఏపీటీడీసీ యాజమాన్యం నిర్ణయించింది. -
నిధులు అడగొద్దు...!
సాక్షి, సిటీబ్యూరో : ‘నగరాభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో నిధులు అడగొద్దు. ఒక్క రూపాయి కూడా సర్దుబాటు చేయలేం. సొంతంగా మీరే ఆర్థిక వనరులు అభివృద్ధి చేసుకోండి... ప్రభుత్వంపై ఆధార పడవద్దు...’ అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్ఎండీఏ అధికారులకు సూచించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1277కోట్లు నిధులు కావాలన్న హెచ్ఎండీఏ కోరికను ఆయన సున్నితంగా తిరస్కరించారు. హెచ్ఎండీఏ బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్రస్తుతం హెచ్ఎండీఏ ఆర్థిక పరిస్థితిని, హడ్కో, ఇతర బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలను, ఐటీ బకాయిల కింద చెల్లించాల్సిన మొత్తాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిష్టాత్మకమైన ఔటర్‌రింగ్‌రోడ్డుకు రూ.794 కోట్లు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు రూ.102 కోట్లు, ఓఆర్ఆర్ యాన్యుటీ పేమెంట్‌కు రూ.415కోట్లు, బాపూఘాట్ వంతెనకు రూ.1 కోటి నిధులు ఈ ఏడాదికి తక్షణావసరమని, ఆ మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయించాలని కమిషనర్ కోరారు. సంస్థ మనుగడను కొనసాగించాలంటే కనీసం రూ.1277కోట్లు అయినా... నిధుల అవసరమవుతాయని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే సర్దుబాటు చేయాలని ఆభ్యర్థించారు. ఐటీ గండం తప్పించండి : అసలే రూ.1100 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన హెచ్ఎండీఏ ఆదాయ పన్ను శాఖ వెంటాడుతోందని, దాన్నుంచి విముక్తి కల్పించాలని కమిషనర్ ఆర్థిక మంత్రిని కోరారు. గతంలో ప్రభుత్వ భూములు అమ్మిపెట్టిన నేరానికి రూ.485 కోట్లు ఆదాయపు పన్ను కింద చెల్లించాల్సి రావడంతో ఇప్పుడు సంస్థ మనుగడకే ప్రమాదం వాటిల్లిన దుస్థితిని ఆయన మంత్రి వద్ద ఏకరువు పెట్టారు. సర్కార్ భూముల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్నంతా ప్రభుత్వ ఖజానాకే జమ చేసినందున దీనికి ఆదాయ పన్ను వర్తించదని, అయినా... ఆ మొత్తానికి ఆదాయ పన్నుచెల్లించాలంటూ ఐటీ శాఖ తెస్తున్న ఒత్తిడిని మంత్రికి వివరించారు. అందుబాటులో ఉన్న భూములను అమ్ముదామంటే... ఆ మొత్తాన్ని కూడా ఐటీ శాఖ తీసుకొనే ప్రమాదం ఉన్నందున ముందడుగు వేయలేకపోతున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్ఎండీఏ ఆర్థికంగా జవసత్వాలు కూడగట్టుకోవాలంటే ప్రభుత్వ ఆసరా తప్పనిసరని... లేదంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని కమిషనర్ మంత్రికి వివరించారు. అన్ని విషయాలను శ్రద్ధగా ఆలకించిన ఆర్థిక మంత్రి ఈటెల ప్రభుత్వ పరంగా ఆర్థిక ఆసరా కల్పించలేమని, మీరే సొంతంగా ఆర్థిక వనరులు అభివృద్ధి చే సుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా బొటాబొటిగానే ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో నగరాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేమని తెలిపారు. ఏవైనా అభివృద్ధి ప్రాజెక్టులు ప్లాన్ చేసి ఉంటే వాటిని పీపీపీ విధానంలో చేపట్టాలని సూచించారు. ఐటీ బకాయీల వ్యవహారం ప్రస్తుతం ట్రిబ్యునల్‌లో ఉన్నందున తీర్పు వచ్చాక దానిపై ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డులో నిలిచిపోయిన కండ్లకోయ జంక్షన్ విషయాన్ని మంత్రి ఆరా తీస్తూ గతంలో అలైన్మెంట్ మార్పు వల్ల తాను కూడా 10 ఎకరాల భూమి కోల్పోయానని గుర్తుచేశారు. అష్ట వంకర్లతో ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించడం వల్లే ఇప్పుడు తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి అధికారులకు చురక అంటించారు. హెచ్ఎండీఏ ఆర్థిక ఆసరా ఇస్తున్నట్లు సమావేశంలో మంత్రి నుంచి ఎలాంటి హామీ రాకపోవడం హెచ్ఎండీఏ అధికారులకు మింగుడు పడకుండా ఉంది. దీన్నిబట్టి చూస్తే రానున్న బడ్జెట్లో ప్రభుత్వం నుంచి హెచ్ఎండీఏకు పెద్దగా నిధుల వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. -
ఔటర్ చుట్టూ అభివృద్ధి వీచిక!
సాక్షి, సిటీబ్యూరో : ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ శరవేగంగా అభివృద్ధిని సాధించేందుకు హెచ్ఎండీఏ దృష్టి సారించింది. నగరం (కోర్ ఏరియా)పై ఒత్తిడిని తగ్గించాలంటే ప్రజలను సిటీ బయటకు పంపాలి. ఇందుకు శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయడమొక్కటే పరిష్కార మార్గంగా అధికారులకు కన్పిస్తోంది. ఇప్పటికే ఔటర్ రింగురోడ్డు అందుబాటులోకి రావడంతో దాని చుట్టుపక్క అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ నిర్ణయించారు. ఔటర్ చుట్టూ ఉన్న ప్రాంతం మాస్టర్‌ప్లాన్‌లో ‘మల్టీపర్పస్ యూజ్ జోన్’ కింద ప్రతిపాదించి ఉండటంతో.. తొలిదశలో ఇక్కడే అభివృద్ధికి బీజం వేయాలని యోచిస్తున్నారు. ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ పరిధిలో ‘ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్స్ (టీఓజీసీ) అభివృద్ధికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించేందుకు నడుంబిగించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ను నియమించేందుకు హెచ్ ఎండీఏ శనివారం టెండర్లు ఆహ్వానించింది. ఈ అధ్యయనానికి ఎంత మొత్తం ఖర్చు చేయాలనేది ఆయా ఏజెన్సీలు ఇచ్చిన బిడ్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. సాధారణంగా తక్కువ మొత్తంలో కోట్ చేసిన సంస్థకే ఈ టెండర్ దక్కే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో శివారు ప్రాంతాలకు మెట్రోరైల్, ఎంఎంటీఎస్, బీఆర్టీఎస్ వంటి సౌకర్యాలు కల్పించే విధంగా హెచ్ఎండీఏ విస్తరిత మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. 2041 నాటికి మెట్రోరైల్‌ను మొత్తం 450 కి.మీ. దూరం మేరకు విస్తరించడంతో పాటు డెడికేటెడ్ బస్ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ యోచన. అందుకే సాంకేతికంగా అన్ని అర్హతలున్న సంస్థకే ఈ అధ్యయన బాధ్యతను అప్పగించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. అభివృద్ధి ఇక్కడే... ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ మొత్తం 13 ‘ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్స్ (టీఓజీసీ)’ను ఇప్పటికే హెచ్ఎండీఏ గుర్తించింది. ప్రధానంగా పటాన్చెరు, తెల్లాపూర్/నాగులపల్లి, కోకాపేట్, తిమ్మాపూర్/శంషాబాద్, తుక్కుగూడ, ఆదిభట్ల, బొంగులూరు, పెద్దఅంబర్‌పేట, ఘట్కేసర్, కోసర, శామీర్‌పేట, గౌడవ ల్లి (మేడ్చల్ వద్ద), గుండ్లపోచంపల్లి ప్రాంతాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్స్, కార్పొరేట్ కార్యాలయాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఐటీ, వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రులు, మాల్స్, పరిశ్రమల అనుబంధ ఆఫీసులు, తదితరాల ఏర్పాటుకు మంచి అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌ను బట్టి ఆయా ప్రాంతాల్లో ఎంతవరకు అభివృద్ధి చేయవచ్చో తెలుసుకొనేందుకు హెచ్ఎండీఏ తాజాగా అధ్యయనానికి శ్రీకారం చుడుతోంది. ఏ సెంటర్లో ఎంత అభివృద్ధికి అవకాశం ఉంది? తొలిదశలో ఎంతమేర అభివృద్ధి చేయవచ్చు, అక్కడ ఉపాధి అవకాశాలెన్ని? ఎన్ని నిధులు అవసరమవుతాయి? ఆ నిధులను ఎలా సమీకరించాలి? వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేయించేందుకు సిద్ధమైంది. ఆ నివేదిక రాగానే దాని అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఆర్థిక ఆసరా తీసుకోవడమా? లేక పీపీపీ విధానంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టడమా అన్నది అధ్యయన నివేదిక వచ్చాకే ఓ నిర్ణయం తీసుకొంటామని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.