నిధులు అడగొద్దు...!
సాక్షి, సిటీబ్యూరో : ‘నగరాభివృద్ధికి సంబంధించి బడ్జెట్‌లో నిధులు అడగొద్దు. ఒక్క రూపాయి కూడా సర్దుబాటు చేయలేం. సొంతంగా మీరే ఆర్థిక వనరులు అభివృద్ధి చేసుకోండి... ప్రభుత్వంపై ఆధార పడవద్దు...’ అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్‌ఎండీఏ అధికారులకు సూచించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1277కోట్లు నిధులు కావాలన్న హెచ్‌ఎండీఏ కోరికను ఆయన సున్నితంగా తిరస్కరించారు. హెచ్‌ఎండీఏ బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం సచివాలయంలో హెచ్‌ఎండీఏ అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ఆర్థిక పరిస్థితిని, హడ్కో, ఇతర బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలను, ఐటీ బకాయిల కింద చెల్లించాల్సిన మొత్తాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిష్టాత్మకమైన ఔటర్‌రింగ్‌రోడ్డుకు రూ.794 కోట్లు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు రూ.102 కోట్లు, ఓఆర్‌ఆర్ యాన్యుటీ పేమెంట్‌కు రూ.415కోట్లు, బాపూఘాట్ వంతెనకు రూ.1 కోటి నిధులు ఈ ఏడాదికి తక్షణావసరమని, ఆ మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయించాలని కమిషనర్ కోరారు. సంస్థ మనుగడను కొనసాగించాలంటే కనీసం రూ.1277కోట్లు అయినా... నిధుల అవసరమవుతాయని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే సర్దుబాటు చేయాలని ఆభ్యర్థించారు.
ఐటీ గండం తప్పించండి :
అసలే రూ.1100 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన హెచ్‌ఎండీఏ ఆదాయ పన్ను శాఖ వెంటాడుతోందని, దాన్నుంచి విముక్తి కల్పించాలని కమిషనర్ ఆర్థిక మంత్రిని కోరారు. గతంలో ప్రభుత్వ భూములు అమ్మిపెట్టిన నేరానికి రూ.485 కోట్లు ఆదాయపు పన్ను కింద చెల్లించాల్సి రావడంతో ఇప్పుడు సంస్థ మనుగడకే ప్రమాదం వాటిల్లిన దుస్థితిని ఆయన మంత్రి వద్ద ఏకరువు పెట్టారు. సర్కార్ భూముల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్నంతా ప్రభుత్వ ఖజానాకే జమ చేసినందున దీనికి ఆదాయ పన్ను వర్తించదని, అయినా... ఆ మొత్తానికి ఆదాయ పన్నుచెల్లించాలంటూ ఐటీ శాఖ తెస్తున్న ఒత్తిడిని మంత్రికి వివరించారు.
అందుబాటులో ఉన్న భూములను అమ్ముదామంటే... ఆ మొత్తాన్ని కూడా ఐటీ శాఖ తీసుకొనే ప్రమాదం ఉన్నందున ముందడుగు వేయలేకపోతున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్‌ఎండీఏ ఆర్థికంగా జవసత్వాలు కూడగట్టుకోవాలంటే ప్రభుత్వ ఆసరా తప్పనిసరని... లేదంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని కమిషనర్ మంత్రికి వివరించారు. అన్ని విషయాలను శ్రద్ధగా ఆలకించిన ఆర్థిక మంత్రి ఈటెల ప్రభుత్వ పరంగా ఆర్థిక ఆసరా కల్పించలేమని, మీరే సొంతంగా ఆర్థిక వనరులు అభివృద్ధి చే సుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా బొటాబొటిగానే ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో నగరాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేమని తెలిపారు.
ఏవైనా అభివృద్ధి ప్రాజెక్టులు ప్లాన్ చేసి ఉంటే వాటిని పీపీపీ విధానంలో చేపట్టాలని సూచించారు. ఐటీ బకాయీల వ్యవహారం ప్రస్తుతం ట్రిబ్యునల్‌లో ఉన్నందున తీర్పు వచ్చాక దానిపై ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డులో నిలిచిపోయిన కండ్లకోయ జంక్షన్ విషయాన్ని మంత్రి ఆరా తీస్తూ గతంలో అలైన్‌మెంట్ మార్పు వల్ల తాను కూడా 10 ఎకరాల భూమి కోల్పోయానని గుర్తుచేశారు. అష్ట వంకర్లతో ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించడం వల్లే ఇప్పుడు తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి అధికారులకు చురక అంటించారు. హెచ్‌ఎండీఏ ఆర్థిక ఆసరా ఇస్తున్నట్లు సమావేశంలో మంత్రి నుంచి ఎలాంటి హామీ రాకపోవడం హెచ్‌ఎండీఏ అధికారులకు మింగుడు పడకుండా ఉంది. దీన్నిబట్టి చూస్తే రానున్న బడ్జెట్లో ప్రభుత్వం నుంచి హెచ్‌ఎండీఏకు పెద్దగా నిధుల వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది.