నిజామాబాద్ జిల్లా: ‘జానెడు పొట్టనింపుకోవడం కోసం ఊరును, తల్లిదండ్రులను విడిచి.. భార్యాబిడ్డలకు దూరమై దూరదేశాలలో దుఃఖం వెళ్లదీస్తున్న తెలంగాణ బిడ్డలు తిరిగి పల్లెకు పయనం కావాలన్నదే మా ఆకాంక్ష. మైగ్రేషన్ నుంచి రివర్స్ మైగ్రేషన్ దిశగా తెలంగాణ ప్రస్థానం సాగేందుకు ఈ బడ్జెట్ దిక్సూచిగా నిలుస్తుందని భావిస్తున్నాను...’ అంటూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గత సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. చితికిన కుల వృత్తులు, కూలిన జీవితాలను నిలబెట్టేందుకు గ్రామీణ ఆర్థిక ప్రగతిని లక్ష్యంగా ఎంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే, గల్ఫ్ కార్మికుల కష్టాలను బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించినప్పటికీ వారి సంక్షేమానికి ప్రత్యేకంగా కేటాయింపులు జరగలేదు.
గత నాలుగు బడ్జెట్లలో తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. ప్రస్తుతం 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్‌ను ఈ నెల 15వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఐదవ బడ్జెట్. ఈ బడ్జెట్‌పై గల్ఫ్ వలస కార్మికులు ఎంతో ఆశతో ఉన్నారు. తమ సంక్షేమానికి నిధుల కేటాయింపు జరుగుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా ‘తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ పాలసీ’పై కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని గల్ఫ్ కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. గత సంవత్సరం ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్గత వలసలపై ప్రస్తావించారు. ‘కొద్దిపాటి చర్యలతోనే పాలమూరు జిల్లాలో ఎంతో మార్పు వచ్చింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుండడంతో అక్కడ రివర్స్ మైగ్రేషన్ వచ్చింది. సింగూరు ఆయకట్టుకు నీరివ్వడం వల్ల కూడా మెదక్ జిల్లాలో పరిస్థితి మెరుగైంది. ఈ రెండు జిల్లాల నుంచి హైదరాబాద్ వలసవచ్చిన వారు తమ రేషన్ కార్డులు వాపస్ ఇచ్చి సొంత జిల్లాలకు పోయారు. ఇది నాకెంతో సంతృప్తినిచ్చింది’ అని అన్నారు. ఆ నేపథ్యంలో ఈసారి కచ్చితంగా గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమంపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని గల్ఫ్ కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. – గల్ఫ్ డెస్క్
మా ద్వారా వచ్చిన ఆదాయాన్ని మా సంక్షేమానికే ఖర్చుచేయాలి
ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న పది లక్షల మంది తెలంగాణ ప్రవాసీలు ప్రతినెలా 1500 కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం మాతృదేశానికి పంపిస్తూ రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఈ విధంగా గల్ఫ్ ఎన్నారైలు తెలంగాణకు ఏటా రూ.18 వేల కోట్లు పంపిస్తున్నారు. పరోక్షంగా స్థానిక పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నది. గల్ఫ్ దేశాల నుంచి వివిధ కారణాలతో వాపస్ వచ్చిన వలస కార్మికుల పునరావాసం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి.– గుల్లె రాజేశ్వర్, కువైట్, (నిజామాబాద్ జిల్లా)
ఎన్నికల హామీలను నెరవేర్చాలి
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ‘ప్రవాసుల సంక్షేమం’ పేరిట ఇచ్చిన పలు హామీలను నెరవేర్చాలి. గల్ఫ్‌లో మృతి చెందిన వలసకార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. గల్ఫ్ వలస కార్మికుల పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించకూడదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి వర్తింపజేయాలి. గల్ఫ్‌కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలి.– పోతుగంటి సాయేందర్, వలస కార్మిక నాయకుడు, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment