సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికలు.. ఓట్లను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం తమకు లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలే లక్ష్యంగా బడ్జెట్ రూపుదిద్దుతామని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో 2018–19 వార్షిక బడ్జెట్ మంత్రి ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈటల వరుసగా 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెడుతుండటం విశేషం. ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త బడ్జెట్ విశేషాలు.. ప్రభుత్వం ఎంచుకున్న ప్రాధాన్యాంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
సాక్షి: ఈసారి బడ్జెట్‌లో ప్రాధాన్యాంశాలు ఏమిటీ?
ఈటల: నాలుగేళ్లు సంక్షేమం, ప్రజల అవసరాలే ఎజెండాగా బడ్జెట్ ప్రవేశపెట్టాం. వ్యవసాయం, అనుబంధ రంగాలకు మొదటి ప్రాధాన్యం, సంక్షేమ రంగానికి రెండో ప్రాధా న్యం, పరిశ్రమలు, ఐటీ రంగానికి మూడో ప్రాధాన్యం ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గతేడాది కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తాం.
సాక్షి: కొత్త పథకాలు అమలు చేసే ప్రణాళిక ఉందా?
ఈటల: రైతులకు రుణమాఫీతో పాటు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపొందించిన వ్యవసాయానికి పెట్టుబడి సాయం పథకానికి ఈసారి బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయిస్తాం. రైతులకు బీమా పథకాన్ని వర్తింపజేస్తాం. రైతులకు సంపూర్ణ ధీమా అందిస్తాం.
సాక్షి: బడ్జెట్ భారీగానే ఉండబోతుందా.. రాష్ట్ర ఆదాయ వ్యయాలు అంచనాలకు తగ్గట్లే ఉన్నాయా?
ఈటల: వృద్ధి రేటు భారీగానే ఉంది. రాష్ట్ర బడ్జెట్ అదే తీరుగా ఉంటుంది. గతేడాది రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాం. అందులో దాదాపు రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేశాం. బడ్జెటేతర నిధులు మరో రూ.25 వేల కోట్లకు వరకు వెచ్చించాం. రెండింటినీ కలిపితే బడ్జెట్ అంచనాలకు చేరువయ్యాయి.
సాక్షి: జీఎస్‌టీ ప్రభావం ఉందా? కేంద్రం నుంచి ఆశించినన్ని నిధులొచ్చాయా?
ఈటల: రెవెన్యూ రాబడిపై జీఎస్‌టీ ప్రభావం పడింది. దీంతో అంచనాలకు అనుగుణంగా ఆదాయ వృద్ధి జరగలేదు. కానీ క్రమంగా స్థిరపడుతోంది. వచ్చే ఏడాది మరింత పుంజుకుంటుందనే ఆశాభావం ఉంది. కేంద్రం నుంచి చెప్పుకోదగ్గ నిధులేమీ రాలేదు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే పన్నుల వాటా, జీఎస్‌టీ వాటా వచ్చాయి. రాష్ట్రం చెల్లించిన పన్నుల నుంచి కేంద్రం రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిన వాటానే ఇచ్చింది. అదనంగా గ్రాంట్లు రాలేదు.
సాక్షి: నిరుడు ఎంబీసీలకు కేటాయించిన రూ. 1,000 కోట్లు ఖర్చవలేదు.. ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధుల్లో ఖర్చవనివి వచ్చే ఏడాదికి బదిలీ చేస్తారా?
ఈటల: ఎంబీసీలకు సంబంధించి పథకాలు, ప్రణాళిక, కార్పొరేషన్ ఏర్పాటులో జాప్యం జరిగింది. ఈసారి బడ్జెట్ తర్వాత నేరుగా పథకాలు అమలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి కేటాయించిన నిధులను వివిధ పథకాల రూపంలో జనాభా శాతానికి మించే ఖర్చు చేశాం.
సాక్షి: భారీగా అప్పులు తెస్తున్నారు.. భవిష్యత్‌లో ఇబ్బందులు రావా?
ఈటల: ఏ రాష్ట్రమైనా నిర్ణీత నిబంధనల మేరకే అప్పులు చేస్తుంది. అప్పులు రాష్ట్ర జీఎస్‌డీపీలో 25 శాతం మించకూడదు. తెలంగాణ జీఎస్‌డీపీ దాదాపు రూ.8 లక్షల కోట్లు. అప్పులు రూ.2 లక్షల కోట్ల లోపే ఉన్నాయి. వాటిని ఆస్తుల కల్పనకు, ప్రాజెక్టులు, రోడ్లు, భవనాల నిర్మాణానికే ఖర్చు చేశాం. అవన్నీ ప్రజల అవసరాలే. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడి అప్పులు తీసుకున్నాం. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రం. అందుకే కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితినీ 3.5 శాతానికి పెంచింది. గ్యారంటీలిచ్చి కొన్ని రుణా లు తీసుకున్నాం. రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 90% మించకుండా గ్యారంటీలు ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. నిబంధనల మేరకే నిధుల సమీకరణ చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించినందుకే రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడింది.
సాక్షి: అయిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.. మీ అనుభూతి ఎలా ఉంది? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఈటల: ఉద్యమ సమయంలో ఉన్న అనుమానాలు, సందేహాలు, సంశయాలన్నీ పటాపంచలయ్యాయి. కొత్త రాష్ట్రం ఏర్పడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరే మంచి రోజులొచ్చాయి. ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, రేషన్ బియ్యం, కేసీఆర్ కిట్లు.. ప్రజలకు ఆపద వచ్చినప్పుడల్లా ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించింది. ఆత్మహత్యలు, కరువు కాటకాల తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ దిశగా.. అసలు సిసలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబెట్టగలిగాం.
Comments
Please login to add a commentAdd a comment