సాక్షి, హైదరాబాద్: ‘‘దేశ జీడీపీలో 49.5 శాతం.. అంటే రూ.82 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇందులో మోదీ సర్కారు రూ.20 లక్షల కోట్ల అప్పు చేసింది. ఈ అప్పును దుబారా అనగలమా’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. బుధవారం శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమాధానం చెబుతుండగా సీఎం జోక్యం చేసుకొని మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్‌ను విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకుని మాట్లాడే పరిణతి రావాలన్నారు.
బడ్జెట్ చప్పగా ఉందని, అంకెల గారడీ అని, రాష్ట్రం అప్పుల పాలైందనడం సరికాదన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న 21 రాష్ట్రాల్లో ఎక్కడా అప్పులు చేయడం లేదా ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి అప్పులు చేస్తే తప్పేంటన్నారు. ‘‘2018–19 కేంద్ర బడ్జెట్ రూ.24 లక్షల కోట్లలో రూ.8.30 లక్షల కోట్లు అప్పుల చెల్లింపులకే పోతుంది. అంటే మూడో వంతు అప్పులు చెల్లించడానికే ఖర్చు చేస్తుంది. 25–30 ఏళ్ల కిందట చైనా జీడీపీ మనకంటే తక్కువ. ప్రస్తుతం చైనా జీడీపీలో మనది నాలుగో వంతు ఉంది.
అమెరికా, చైనా, జపాన్ దేశాల అప్పులు కూడా వాటి జీడీపీలకన్నా ఎక్కువ. అలాంటి దేశాలు ప్రపంచాన్నే శాసించడం లేదా’’అని ప్రశ్నించారు. మన దేశంలో ఏ రైల్వే స్టేషన్, రోడ్డూ సరిగా ఉండదని, జాతీయ రహదారులపై మన లారీల వేగం కేవలం 26 కిలోమీటర్లని చెప్పారు. ఇంత వేగంతో దేశం ఏం అభివృద్ధి చెందుతుంది, ఎప్పుడు బాగుపడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికీ దేశాన్ని ఎలా నడపాలో కేంద్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరాశకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పులు చేస్తోందన్న అపోహ ఎవరికీ అవసరం లేదని, రాష్ట్ర జీడీపీలో 21 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు.
అది కాలం చెల్లిన ఆలోచన: ఈటల
అప్పులు చేయకూడదనేది కాలం చెల్లిన ఆలోచన అని ఆర్థికమంత్రి ఈటల రాజేం దర్ అన్నారు. బడ్జెట్‌పై చర్చకు సమాధానమిస్తూ ఎన్నికల హామీలను నూటికి నూరు శాతం అమలుచేశామన్నారు. చివరగా మం డలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును 35 మంది ఎమ్మెల్సీలు సందర్శించారన్నారు. కళ్లున్న ప్రతివాడూ కాళేశ్వరం ప్రాజెక్టును చూడాలన్నారు.
24 వేల కోట్లకు రూ.24 కూడా రాలేదు
ఏ రాష్ట్రంలో నిధులు ఉంటే ఆ రాష్ట్రంలో ప్రగతి సాధ్యమవుతుందని సీఎం అన్నారు. నిధుల కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్నీ అర్హత లు ఉన్నా పైరవీలు చేస్తే గాని కేంద్రం వద్ద పనులు జరగడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి కేంద్రం వద్దకు చక్కర్లు కొట్టాలని, తాను లేఖల మీద లేఖలు రాయాలని అయినా నిధులు మాత్రం విడుదల కావని వ్యాఖ్యానించారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫారసు చేసినా కేంద్రం రూ.24 కూడా ఇవ్వలేదన్నారు. అయినా కేంద్రం నుంచి రూ.లక్ష కోట్లు వచ్చాయని బీజేపీ వారంటున్నారని విమర్శించారు. వ్యవసాయం, విద్య, పట్టణ, గ్రామీణ అభివృద్ధి శాఖలతోపాటు ఏడెనిమిది శాఖలను కేంద్రం రాష్ట్రాలకే వదిలిపెట్టాలన్నారు. ‘‘మనదేశంలో 70 వేల టీఎంసీల నీరుంది. ప్రతీ ఎకరానికి నీరిచ్చే అవకాశం ఉంది. 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. అయినా 70 ఏళ్లుగా నీటి కోసం రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయన్నారు.
ఉత్తర చైనాలో నీటి సమస్య ఏర్పడితే దక్షిణ చైనా నుంచి 2,400 కి.మీ. 1,600 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటై 14 ఏళ్లయినా ఇప్పటికీ నీటి కేటాయింపులపై ఇంకా తేలలేదు. 70 ఏళ్లయినా దేశంలో ఇప్పటికీ తాగునీటి కటకట ఉండటం దౌర్భాగ్యం’’అని అన్నారు. ఇప్పటికైనా దేశ రాజకీయ వ్యవస్థ ఆలోచించి ఎకానమీ లిబరలైజేషన్ తేవాలని, దేశ రాజకీయ వ్యవస్థ మారాలని స్పష్టం చేశారు. ఆదర్శ రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమేనన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2014 మధ్యకాలంలో 23 జిల్లాలకు ఖర్చు పెట్టింది రూ.1.29 లక్షల కోట్లయితే ఈ నాలుగేళ్లలో తెలంగాణలో తాము ఖర్చు పెట్టింది రూ.1.24 లక్షల కోట్లని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడానికి మండలే స్ఫూర్తి అని, ఎంఏ చదువుతున్నప్పుడు విజిటర్స్ గ్యాలరీకి తరచుగా వచ్చేవాడినని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో రాఘవాచారి, కేకే వంటి వారి ఉపన్యాసాలు ఎంతో బాగుండేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment