కేంద్రం సాయంపై ఆశల్లేవ్..
కేంద్ర పథకాల్లో నిధుల కోత తో రాష్ట్రంపై ప్రభావం
శాసనమండలిలో ఆర్థికమంత్రి ఈటెల స్పష్టీకరణ
సీఎం, మంత్రులు రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారని వెల్లడి
తెలంగాణలో ఉన్న వారంతా తెలంగాణ వారే: హరీశ్‌రావు
మండలికి సీఎం రాకపోవడంపై డీఎస్ అభ్యంతరం
హైదరాబాద్: వివిధ పథకాల నిధుల్లో కోత విధిస్తుండడంతో కేంద్ర సాయంపై ఆశలు సన్నగిల్లాయని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో జరిగిన చర్చకు మంగళవారం ఆయన సమాధానమిచ్చారు. కేంద్రం గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి బడ్జెట్‌లో వివిధ పథకాలకు కోత విధిం చిందని అలా అని రాష్ట్ర సంక్షేమంపై అనుమానాలు వద్దని స్పష్టంచేశారు. తమ మొదటి ప్రాధాన్యం సంక్షేమమని, రెండో ప్రాధాన్యం వ్యవసాయమని, మూడోది ఉపాధి కల్పన అని పేర్కొన్నారు. ఒక్క ఏడాదిలోనే సమస్యలన్నింటినీ పరిష్కరించే సత్తా ఏ ప్రభుత్వానికి ఉండదన్నారు. దళితులకు భూ పంపిణీ స్కీంను ఆపలేదని, ఎక్కడ భూములున్నా తీసుకుని దళితులకు ఇస్తున్నామన్నారు.
కమలనాథన్ కమిటీ ఇంకా ఉద్యోగుల విభజన చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. సీఎం సహా మంత్రులందరూ రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా తాము మానవీయ కోణంలో నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న మాట వాస్తమేనని, అయితే గత జూన్ 2 నుంచి ఆత్మహత్యలు ప్రారంభం కాలేదని, అంతకు ఐదారేళ్లుగా చేసిన అప్పులు ఎక్కువై ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అన్నారు.
సీఎం రాకపోవడంపై డీఎస్ అభ్యంతరం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మండలిలో జరిగిన చర్చకు సమాధానం ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడంపై ప్రతిపక్ష నాయకుడు డి.శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. మండలి పెద్దల సభ అనుకోవడమే కానీ ఆ దాఖలాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనప్పుడల్లా ముఖ్యమంత్రి మండలికి వస్తూ పోతూ ఉండాలని సూచించారు. మంత్రి హరీశ్‌రావు బదులిస్తూ.. డీఎస్‌తో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. సీఎం మండలికి రావాలని అనుకున్నారని... అయితే అసెంబ్లీలో సమాధానం ఇవ్వాల్సి ఉండడంతో రాలేకపోయారని.. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వివరించారు.
తెలంగాణలోని ఆంధ్ర రైతులకు బాబు ఎందుకు రుణమాఫీ చేయలేదు?
హైదరాబాద్‌లో ఉన్నవారంతా తెలంగాణ వారే అని మంత్రి ఈటెల వ్యాఖ్యానించడంపై సభ్యుడు టీడీపీ సభ్యుడు పోట్ల నాగేశ్వర్‌రావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణలో ఉన్నవారంతా కాదా? అని ప్రశ్నిం చారు. దీనికి హరీశ్‌రావు బదులిస్తూ తెలంగాణలో ఉన్నవారంతా మనవారేనని, అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రాంత రైతులకు అక్కడ రుణమాఫీ వర్తించదని అనడం ఏ మేరకు సబబు అని ప్రశ్నించారు.
నిరూపిస్తే రాజీనామా చేస్తా: నాయిని
హైదరాబాద్‌లో శాంతిభద్రతలు సరిగా లేవని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఎస్.ప్రభాకర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వం శాంతిభద్రతలు కాపాడటంలో విఫలమైం దని.. ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేదని అన్నారు. ఇలాంటి నగరాన్ని విశ్వనగరం అంటే ఎలా? అని నిలదీశారు. ఈ సమయం లో సభలోనే ఉన్న హోంమంత్రి నాయిని వెంటనే లేచి ‘మీ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. శాంతిభద్రతలు సరిగ్గా ఉన్నాయని తేలితే నీవు రాజీనామా చేస్తావా’ అంటూ ప్రభాకర్‌కు సవాల్ విసిరారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. మండలి చైర్మన్ స్వామిగౌడ్ సభ్యులను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.