ఔటర్ చుట్టూ అభివృద్ధి వీచిక! | outer ring road sorroundings developed fastly | Sakshi
Sakshi News home page

ఔటర్ చుట్టూ అభివృద్ధి వీచిక!

Published Sun, Oct 6 2013 4:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

outer ring road sorroundings developed fastly

సాక్షి, సిటీబ్యూరో :
 ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ శరవేగంగా అభివృద్ధిని సాధించేందుకు హెచ్‌ఎండీఏ దృష్టి సారించింది. నగరం (కోర్ ఏరియా)పై ఒత్తిడిని తగ్గించాలంటే ప్రజలను సిటీ బయటకు పంపాలి. ఇందుకు శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయడమొక్కటే పరిష్కార మార్గంగా అధికారులకు కన్పిస్తోంది. ఇప్పటికే ఔటర్ రింగురోడ్డు అందుబాటులోకి రావడంతో దాని చుట్టుపక్క అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ నిర్ణయించారు. ఔటర్ చుట్టూ ఉన్న ప్రాంతం మాస్టర్‌ప్లాన్‌లో ‘మల్టీపర్పస్ యూజ్ జోన్’ కింద ప్రతిపాదించి ఉండటంతో.. తొలిదశలో ఇక్కడే అభివృద్ధికి బీజం వేయాలని యోచిస్తున్నారు.
 
  ఓఆర్‌ఆర్ గ్రోత్ కారిడార్ పరిధిలో ‘ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్స్ (టీఓజీసీ) అభివృద్ధికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించేందుకు నడుంబిగించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ను నియమించేందుకు హెచ్ ఎండీఏ శనివారం టెండర్లు ఆహ్వానించింది. ఈ అధ్యయనానికి ఎంత మొత్తం ఖర్చు చేయాలనేది ఆయా ఏజెన్సీలు ఇచ్చిన బిడ్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. సాధారణంగా తక్కువ మొత్తంలో కోట్ చేసిన సంస్థకే ఈ టెండర్ దక్కే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో శివారు ప్రాంతాలకు మెట్రోరైల్, ఎంఎంటీఎస్, బీఆర్‌టీఎస్ వంటి సౌకర్యాలు కల్పించే విధంగా హెచ్‌ఎండీఏ విస్తరిత మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. 2041  నాటికి మెట్రోరైల్‌ను మొత్తం 450 కి.మీ. దూరం మేరకు విస్తరించడంతో పాటు డెడికేటెడ్ బస్ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ యోచన. అందుకే సాంకేతికంగా అన్ని అర్హతలున్న సంస్థకే ఈ అధ్యయన బాధ్యతను అప్పగించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది.
 
 అభివృద్ధి ఇక్కడే...
 ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ మొత్తం 13 ‘ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్స్ (టీఓజీసీ)’ను ఇప్పటికే హెచ్‌ఎండీఏ గుర్తించింది. ప్రధానంగా పటాన్‌చెరు, తెల్లాపూర్/నాగులపల్లి, కోకాపేట్, తిమ్మాపూర్/శంషాబాద్, తుక్కుగూడ, ఆదిభట్ల, బొంగులూరు, పెద్దఅంబర్‌పేట, ఘట్‌కేసర్, కోసర, శామీర్‌పేట, గౌడవ ల్లి (మేడ్చల్ వద్ద), గుండ్లపోచంపల్లి ప్రాంతాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్స్, కార్పొరేట్ కార్యాలయాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఐటీ, వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రులు, మాల్స్, పరిశ్రమల అనుబంధ ఆఫీసులు, తదితరాల ఏర్పాటుకు మంచి అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌ను బట్టి ఆయా ప్రాంతాల్లో ఎంతవరకు అభివృద్ధి చేయవచ్చో తెలుసుకొనేందుకు హెచ్‌ఎండీఏ తాజాగా అధ్యయనానికి శ్రీకారం చుడుతోంది.
 
  ఏ సెంటర్‌లో ఎంత అభివృద్ధికి అవకాశం ఉంది? తొలిదశలో ఎంతమేర అభివృద్ధి చేయవచ్చు, అక్కడ ఉపాధి అవకాశాలెన్ని? ఎన్ని నిధులు అవసరమవుతాయి? ఆ నిధులను ఎలా సమీకరించాలి? వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేయించేందుకు సిద్ధమైంది. ఆ నివేదిక రాగానే దాని అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేయాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఆర్థిక ఆసరా తీసుకోవడమా? లేక పీపీపీ విధానంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టడమా అన్నది అధ్యయన నివేదిక వచ్చాకే ఓ నిర్ణయం తీసుకొంటామని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement