సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్‌ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతలను 30 ఏళ్ల పాటు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిలిడ్ కంపెనీకి అప్పగింత, హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ)కు చెందిన నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం.. తుది ఉత్తర్వుల మేరకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
30 ఏళ్ల పాటు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతల టెండర్‌ను రూ.7,380 కోట్లకు ఓ కంపెనీకి అప్పగించడంలో పారదర్శకత లేదంపిల్ దాఖలైంది. ఈ టెండర్‌ను ఐఆర్‌బీ కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కనుగుల మహేశ్‌కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ప్రాథమిక అంచనా రాయితీ విలువ (ఇనీషియల్ ఎస్టిమేటెడ్ కన్సెషన్ వాల్యూ) ఎంత అనేది వెల్లడించకుండా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, హెచ్‌ఎండీఏ కలసి ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకోవడం అక్రమమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అంచనా విలువను వెల్లడించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఒప్పందం వాస్తవ పరిస్థితిని పరిశీలించేలా కాగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ ఒప్పందం విలువ తక్కువగా ఉందని కాగ్ నిర్ధారిస్తే లీజును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నిధుల బదిలీ చట్టవిరుద్ధమన్న పిటిషనర్ న్యాయవాది
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవా ది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ప్రాథమిక అంచనా విలువను ప్రకటించకుండానే ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిలిడ్, ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌కు ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లు అప్పగించారని చెప్పారు.
ఈ ఒప్పందం ద్వారా వచ్చిన రూ.7,380 కోట్లను హెచ్‌ఎండీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేలా ఏప్రిల్ 27న జీవో తీసుకొచ్చిందని.. ఈ జీవో హెచ్‌ఎండీఏ చట్టంలోని సెక్షన్ 40(1)(సీ)కి విరుద్ధమని వాదించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని అభివృద్ధి పనులకు మాత్రమే ఆఆదాయాన్ని వెచ్చించాల్సి ఉందని వెల్ల డించారు. ఇప్పటికే రూ.7 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు తెలిసిందని, వాటిని ఖర్చు చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం తరఫున బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. సర్కార్ వద్ద డబ్బు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కేసులో వాదనలు వినిపించడానికి సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment