Telangana High court
-
అరెస్టు నోటీసులు భార్యకు ఇవ్వకుండా.. సలీమ్‌కు ఎందుకు ఇచ్చారు?
సాక్షి, హైదరాబాద్: ఇంటి వద్దే అరెస్టు చేస్తే పిటిషనర్ (నరేందర్‌రెడ్డి) భార్యకు నోటీసులు ఇవ్వకుండా, సలీమ్ అనే వ్యక్తికి ఎందుకు ఇచ్చారని హైకో ర్టు పోలీసులను ప్రశ్నించింది. విచారణకు సహకరించని, పరారీలోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అరెస్టు చేయడం సరికాదని చెప్పింది. ఇతర నిందితుల వాంగ్మూలం, కాల్ డేటా ఆధారంగా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. నరేందర్‌రెడ్డి పేరు వెల్లడించినట్లు చెబుతున్న లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాల కాపీలను అనుమతిస్తున్నట్లు పేర్కొంటూ.. తీర్పు రిజర్వు చేసింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. పిటిషన్ విచారణార్హం కాదు.. న్యాయమూర్తికి పెన్‌డ్రైవ్ అందజేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ‘సీఎం రేవంత్‌రెడ్డి, కలెక్టర్ ఎవరొచి్చనా కూడా దాడి చేయాలని పిటిషనర్ (నరేందర్‌రెడ్డి) ప్రేరేపించారు. లగచర్లలో అధికారులపై దాడికి ముందు, తర్వాత ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోల పెన్‌డ్రైవ్ ఉంది. పిటిషనర్ రెచ్చగొట్టకుంటే దాడి జరిగేదే కాదు. పిటిషనర్ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా, చట్టప్రకారం సాగుతోంది. వరుసగా పిటిషన్లు వేస్తూ విచారణను ముందుకు సాగకుండా చేస్తున్నారు. కేసీఆర్ నుంచి రూ.10 కోట్లు పిటిషనర్‌కు అందినట్లు తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ విచారణార్హం కాదు.. కొట్టివేయాలి’అని అన్నారు. అయితే సెక్షన్ 482 కేసులో పెన్‌డ్రైవ్ ఎలా సమరి్పస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందస్తు పథకం ప్రకారం దాడి జరిగిందని చెప్పడానికి అందులోని వివరాలే సాక్ష్యమని పీపీ బదులిచ్చారు.అరెస్టు ఫొటోలను న్యాయమూర్తికి అందజేసిన గండ్ర వాదనలు వినిపిస్తూ.. ‘15 మంది సివిల్ డ్రస్‌లో వచ్చి బలవంతంగా అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో అరెస్టు చేశామన్నారు. పిటిషనర్‌తో పలు పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. అందులో ఏముందో చూసుకునే అవకాశం ఇవ్వలేదు’అని చెప్పారు. సంతకాలు అభ్యంతరకరం వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘చట్టపరమైన అవకాశం ఉన్నప్పుడు పిటిషన్లు వేయకుండా అడ్డుకోవడం సాధ్యం కాదు. నివేదికలపై సంతకాలు కూడా అభ్యంతరకరం’అని అన్నారు. గాయపడిన వారి వివరాల్లో ప్రశ్నార్థకాలు ఎందుకున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ప్రాథమిక సమాచారం తీసుకునే క్రమంలో అలా పేర్కొన్నారని పీపీ బదులిచ్చారు. ఈ సందర్భంగా విచారణ తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేశారు. కాగా, లగచర్ల ఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చటవిరుద్ధమంటూ నరేందర్ రెడ్డి భార్య శ్రుతి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు జస్టిస్ కె.లక్ష్మణ్ ముందు విచారణకు రానుంది. -
అధికారులపై ఆరోపణలు సరికాదు
నల్లగొండ: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గట్టెకే పరి స్థితి లేక.. కౌంటింగ్ హా ల్ నుంచి ఉత్త చేతులతో పోవడం ఎందుకని, అధికారుల మీద మట్టిపోసి పోయే పనులు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. గురువారం నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలు ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై, జిల్లా అధికారులపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ ఎన్నికలో రూ.100 కోట్లు ఖర్చుపెట్టి గెలుపొందాలని చేసిన ప్రయత్నం..బోగస్ ఓట్లతో లబ్ధిపొందాలనే కుతంత్రం బెడిసి కొట్టడంతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
ఓఆర్ఆర్ లీజుపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్‌ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతలను 30 ఏళ్ల పాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిలిడ్ కంపెనీకి అప్పగింత, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కు చెందిన నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం.. తుది ఉత్తర్వుల మేరకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 30 ఏళ్ల పాటు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతల టెండర్‌ను రూ.7,380 కోట్లకు ఓ కంపెనీకి అప్పగించడంలో పారదర్శకత లేదంపిల్ దాఖలైంది. ఈ టెండర్‌ను ఐఆర్బీ కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కనుగుల మహేశ్‌కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రాథమిక అంచనా రాయితీ విలువ (ఇనీషియల్ ఎస్టిమేటెడ్ కన్సెషన్ వాల్యూ) ఎంత అనేది వెల్లడించకుండా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, హెచ్ఎండీఏ కలసి ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకోవడం అక్రమమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అంచనా విలువను వెల్లడించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఒప్పందం వాస్తవ పరిస్థితిని పరిశీలించేలా కాగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ ఒప్పందం విలువ తక్కువగా ఉందని కాగ్ నిర్ధారిస్తే లీజును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిధుల బదిలీ చట్టవిరుద్ధమన్న పిటిషనర్ న్యాయవాది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవా ది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ప్రాథమిక అంచనా విలువను ప్రకటించకుండానే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిలిడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌కు ఓఆర్ఆర్ను 30 ఏళ్లు అప్పగించారని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వచ్చిన రూ.7,380 కోట్లను హెచ్ఎండీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేలా ఏప్రిల్ 27న జీవో తీసుకొచ్చిందని.. ఈ జీవో హెచ్ఎండీఏ చట్టంలోని సెక్షన్ 40(1)(సీ)కి విరుద్ధమని వాదించారు. హెచ్ఎండీఏ పరిధిలోని అభివృద్ధి పనులకు మాత్రమే ఆఆదాయాన్ని వెచ్చించాల్సి ఉందని వెల్ల డించారు. ఇప్పటికే రూ.7 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు తెలిసిందని, వాటిని ఖర్చు చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. సర్కార్ వద్ద డబ్బు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కేసులో వాదనలు వినిపించడానికి సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. -
బఫర్ జోన్లో ఎలా నిర్మిస్తారు?
సాక్షి, హైదరాబాద్: నగ రంలోని రామ్మమ్మ కుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎలాంటి నిర్మా ణం చేపట్టడం లేదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని హైకోర్టు ఆదేశించింది. చట్టబద్ధమైన సంస్థ అయిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసహ నం వ్యక్తం చేసింది. నగరంలోని చెరువులు, కుంటలు ఇతర నీటి వనరుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణకు నోటిఫికేషన్ జారీ చేయాలని, దీన్ని తదుపరి విచారణ రోజున కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో ఎన్ని కుంటలు, చెరువులకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫిక్స్ చేశారు.. ఇంకా ఎన్ని చేయా లి.. పూర్తి వివరాలతో రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని చెప్పింది. రామ్మమ్మ కుంట బఫర్ జోన్ పరిధిలోని 4 ఎకరాల స్థలంలో టూరిజం పేరిట నిర్మిస్తున్న భవనానికి అక్రమంగా ఆడిటోరియం, అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నా పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై తీవ్రంగా మండిపడింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. స్టేటస్ కో ఆదేశాలను ఎత్తివేయాలని కోరిన ప్రభుత్వం రామ్మమ్మ కుంట బఫర్ జోన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం భవనం నిర్మించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం జూన్‌లో స్టేటస్ కో విధించింది.మళ్లీ ఈ పిటిషన్ గురువారం సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం ముందు విచారణకొచ్చింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే భవన నిర్మాణం దాదాపు పూర్తయిందని, భవనాన్ని పెంచడానికి అన్ని అనుమతులున్నందున స్టేటస్ కో ఆదేశాలను ఎత్తివేయాలని కోరారు. అక్కడ విద్యనభ్య సిస్తున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. రామ్మమ్మ కుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మ్యాప్‌ను పరిశీలించిన ధర్మాసనం.. భవనంలో ఎక్కువ భాగం బఫర్ జోన్లో లేదని, కొద్దిభాగం మాత్రమే ఉందంది. స్టేటస్ కో ఆదేశాలను సవరిస్తూ బఫర్ జోన్లోకి రాకుండా భవన నిర్మాణం చేసుకోవచ్చని చెప్పింది. -
ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ
-
సీబీఐకి బదిలీ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని నిందితులు కుట్రపన్నారని అందులో వివరించింది. సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసే నాటికే కేసుకు సంబంధించిన పలు వివరాలు బహిర్గతం అయ్యాయని, ఆయన కొత్తగా వివరించింది ఏమీ లేదని పేర్కొంది. సీఎం వివరాలు వెల్లడించే సమయానికి సిట్ ఏర్పాటుకాలేదని, కేసు మెటీరియల్ చేరవేసే అవకాశమే లేదని, సింగిల్ జడ్జి ఈ విషయంలో పొరపడ్డారని తెలిపింది. ఒక రాజకీయ నేతగా తన ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరిగిందని తెలిసినప్పుడు మీడియాకు వివరాలు వెల్లడించడం తప్పు ఎలా అవుతుందని సింగిల్ జడ్జి ఒప్పుకున్నారని వివరించింది. అందువల్ల సిట్ దర్యాప్తును కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనిపై గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది. కీలక అంశాలను పరిశీలించలేదు.. ప్రభుత్వం తన అప్పీలులో మరిన్ని అంశాలను వివరించింది. ‘‘హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసే నాటికి సీఎం ప్రెస్‌మీట్ నిర్వహించలేదు. సిట్ ఏర్పాటు కాలేదు. మొయినాబాద్ పోలీసులు కేసునమోదు చేసిన కొన్ని గంటల్లోనే దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదంటూ బీజేపీ పిటిషన్ దాఖలు చేయడం ఆమోద యోగ్యం కాదు. నిజానికి ఈ కేసులో నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడాన్ని సింగిల్ జడ్జి ప్రశంసించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పోలీసుల చర్య స్వాగతించదగినదని వ్యాఖ్యానించారు. అయితే గతంలో పీవీ నరసింహారావు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరిగిందనడానికి, ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎర వేసేందుకు ప్రయత్నించారనడానికి అన్ని వీడియో, ఆడియో ఆధారాలు ఉన్నాయి. రిట్ పిటిషన్ పరిధిలో లేని అంశంలోకి సింగిల్ జడ్జి వెళ్లారు. సిట్ దర్యాప్తును అడ్డుకోవడానికి బలమైన కారణాలేమీ లేకపోయినా.. నిందితుల హక్కుల పరిరక్షణ కోసమంటూ సిట్‌ను రద్దు చేసి, కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయడం సరికాదు’’ అని పేర్కొంది. అడుగడుగునా అడ్డుకునే యత్నం.. తొలుత సిట్ దర్యాప్తుపై సింగిల్ జడ్జి స్టే విధించగా.. ద్విసభ్య ధర్మాసనం దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించిందని, సుప్రీంకోర్టుకు కూడా సిట్ దర్యాప్తును అడ్డుకోలేదని ప్రభుత్వం అప్పీలులో వివరించింది. దర్యాప్తును హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షించాలన్న ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసిందని.. సిట్ స్వతంత్రంగా దర్యాప్తు చేయవచ్చని సూచించిందని గుర్తు చేసింది. ఇలా సిట్ దర్యాప్తును అడుగడుగునా అడ్డుకునేందుకు నిందితులు ప్రయత్నించిన విషయాన్ని సింగిల్ జడ్జి గమనంలోకి తీసుకోలేదని పేర్కొంది. అంతేగాకుండా తమపై నమోదైన కేసును ఏ సంస్థ దర్యాప్తు చేయాలో నిందితులే కోరుకోవడం చట్ట విరుద్ధమని.. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను సింగిల్ జడ్జి పరిశీలించలేని వివరించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్లో సీఎంను ప్రతివాదిగా చేయలేదన్న అంశాన్ని సింగిల్ జడ్జి విస్మరించారని.. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా ఇలాంటి ఉత్తర్వులివ్వడం ద్వారా సాక్షులు ప్రభావితం అవుతారని, పోలీసుల నిబద్ధతను తప్పుబట్టినట్టు అవుతుందని పేర్కొంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని.. సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. -
ప్రాణాలకన్నా ఎన్నికలు ముఖ్యమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు వేలల్లో పెరుగుతున్న వేళ ప్రజల ప్రాణాలకన్నా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ముఖ్యమా అని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిం చింది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎస్ఈసీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సిందని, రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఏమిటంటూ మండిపడింది. ఎన్నికల ప్రాంతాల్లో ఎవరైనా కరోనాతో మరణిస్తే అందుకు ఎవరిది బాధ్యతని నిలదీసింది. ‘ప్రపంచమంతా కరోనా సునామీలా విరుచుకుపడుతున్నా ఎస్ఈసీ అధి కారులకు పట్టదా? వారు భూమ్మీదే ఉన్నారా? మరేదైనా గ్రహంపై ఉన్నారా? ఇప్పుడు ఎన్నికలు పెట్టకపోతే ఆకాశం కూలిపోతుందా? భూమి బద్దలవుతుందా?’ ’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఎస్ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌పై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినందుకే... రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్న అంశంపై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశామని, రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేశాకే నోటిఫికేషన్ ఇచ్చామని అశోక్‌కుమార్ వివరించారు. ఎన్నికల విధుల్లో ఎందరు అధికారులు పాల్గొంటున్నారని ధర్మాసనం ప్రశ్నించగా 7,695 ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వాధికారులు, 2,557 మంది పోలీసులు పాల్గొంటున్నారని వివరించారు. వారిలో ఎందరు కరోనా బారినపడ్డారని ధర్మాసనం ప్రశ్నించగా శుక్రవారం ఎన్నికల సామ్రగ్రి తీసుకునేందుకు సిబ్బంది రావాల్సి ఉన్నందున అప్పుడు తెలిసే అవకాశం ఉందని అశోక్‌కుమార్ బదులిచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఏడు మున్సిపాలిటీల్లోని ఓటర్లతోపాటు సిబ్బంది, పోలీసుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడింది. పోలీసులు, ఇతర అధికారులను ఎన్నికల విధులకు కేటాయించడం వల్ల వారిపై ఒత్తిడి పెంచుతున్నారని వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టుల జోక్యానికి వీల్లేదని, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు ఆపాలంటూ ఇచ్చిన వినతిపత్రంపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని సింగిల్ జడ్జి ఈ నెల 19న ఆదేశించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ నెల 20 నుంచి ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ పెట్టినా ఎస్ఈసీ తగిన చర్యలు తీసుకోలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 195 ప్రకారం అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఎన్నికలను వాయిదా వేయవచ్చని, రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఎస్ఈసీకి కనిపించట్లేదా? అని ప్రశ్నించింది. కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారు? రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా తగ్గుతున్నాయని, దీని వెనుకున్న మర్మం ఏమిటని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. పరీక్షలను ఉద్దేశపూర్వకంగానే మూడు రోజుల నుంచి తగ్గించారని, దీంతోనే కేసుల సంఖ్య తగ్గుతోందని అభిప్రాయపడింది. 26న 92 వేల పరీక్షలు చేస్తే 10,122 కేసులు వచ్చాయని, 27న 82 వేల పరీక్షలు చేస్తే 8 వేల కేసులు వచ్చాయని, 28న 80 వేల పరీక్షలు చేస్తే 7,994 కేసులు వచ్చాయని పేర్కొంది. పరీక్షలు తగ్గితే కేసులూ తగ్గుతాయని, కేసులు తగ్గుతున్నాయి కాబట్టి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని మభ్యపెట్టేందుకే పరీక్షలు తగ్గించారంటూ మండిపడింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంచనా వేయరా ? ‘క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయరా? ప్రజలు కరోనాతో యుద్ధం చేస్తున్నా కనిపించట్లేదా? ప్రపంచమంతా కరోనా సెకండ్ వేవ్ ఫిబ్రవరిలోనే ప్రారంభమైనా ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే వచ్చే ప్రమాదం ఏమిటి? ఎనిమిదేళ్ల క్రితం జీహెచ్ఎంసీలో ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్‌తో ఏడాదిన్నర పాలన కొనసాగించారు? అదే తరహాలో కరోనా కేసులు తగ్గే వరకూ స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తే వచ్చే ప్రమాదం ఏమిటి? కొన్ని మున్సిపాలిటీల్లో జూన్ వరకు, మరికొన్నింటిలో జూలై వరకు ఎన్నికలు నిర్వహించేందుకు సమయం ఉంది. కనీసం అప్పటి వరకు కూడా ఆగకుండా ఆగమేఘాలపై ఎన్నికలు నిర్వహించాలన్న ఆతృత ఎందుకు? స్థానిక పరిస్థితులను పట్టించుకోకుండా గడువులోగా ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనలను గుడ్డిగా అనుసరించాలా? ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉన్నా ఎందుకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు? వారంపాటు ర్యాలీలు, సభలకు ఎందుకు అనుమతించారు? ప్రచార సమయం కుదింపును ఎందుకు పట్టించుకోలేదు?’ అంటూ ఎస్ఈసీ కార్యదర్శికి ధర్మాసనం శరపరంపరగా ప్రశ్నలు సంధించింది. ఇందుకు సమాధానం ఇవ్వలేక అశోక్‌కుమార్ మౌనంగా ఉండిపోయారు. ఎన్నికల నిర్వహణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని, గెలిచిన అభ్యర్థులతోపాటు ఇద్దరు మాత్రమే వచ్చి ఎన్నికల అధికారి దగ్గర అధికారిక పత్రాలను తీసుకోవాలని, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆదేశించామన్నారు. 30 తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు? రాత్రి కర్ఫ్యూ అమలుపై ఇచ్చిన ఉత్తర్వులు శుక్రవారం (30వ తేదీ)తో ముగుస్తాయని, ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోనున్నారో తెలియజేయాలని ధర్మాసనం అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ఆదేశించింది. తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడానని, శుక్రవారం పరిస్థితిపై సమీక్షించాక తగిన నిర్ణయం తీసుకుంటామన్నారని ఆయన తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ చివరి నిమిషం వరకు ఆగడం ఎందుకని, ముందే నిర్ణయం తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. ఎన్నికల ప్రాంతాల్లో 30 నుంచి 3వ తేదీ వరకు మద్యం అమ్మకాలను నిలిపివేసే దిశగా నిర్ణయం తీసుకోవాలని, అప్పుడే పరిస్థితులు అదుపులో ఉంటాయని సూచించింది. 30వ తేదీ తర్వాత తీసుకోనున్న చర్యలపై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఎస్ఈసీ తీరు అలా ఉంది... ‘యుద్ధం చేయాల్సిన అవసరం లేకున్నా సైన్యాధికారి ఆదేశిస్తే సైనికులు చావుకు ఎదురెళ్లాల్సిందే. అలా 600 మంది సైనికులు సైన్యాధ్యక్షుని ఆదేశాలను కాదనలేక వెళ్లి మృత్యువాతపడ్డారు. ఇప్పుడు ఎస్ఈసీ తీరు అలాగే ఉంది. కరోనా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా సిబ్బందిని, పోలీసులను విధులకు హాజరుకావాలని ఆదేశిస్తోంది. ప్రమాదం అని తెలిసినా వారు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించాల్సిందే’ అంటూ ఓ బ్రిటిష్ రచయిత రాసిన 600 సోల్జర్స్ డెత్ వ్యాలీ కవితను జస్టిస్ హిమాకోహ్లి ప్రస్తావించారు. -
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పిటిషన్లపై ముగిసిన విచారణ..!
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని భవనాల క్రమబద్ధీకరణ (బీఆర్ఎస్), అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) పథకాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో... ఇదే అంశంపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలకు సంబంధించి జీవో 131, 152లను సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త జువ్వాడి సాగర్‌రావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు గత ఏడాది విచారణకు స్వీకరించి అన్ని రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ఈ వివాదం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున ఇక్కడ విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో బీఆర్ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించి జారీచేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన 10 పిటిషన్లపై విచారణను ముగించింది. అయితే బీఆర్ఎస్ పథకంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులపై ఎటువంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకూ కొనసాగుతాయని స్పష్టం చేసింది. అలాగే ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు చేపట్టరాదంటూ గత జనవరిలో ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగా గత సెప్టెంబరులో రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం జారీచేసిన మెమోను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పైనా ధర్మాసనం విచారణను ముగించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఎటువంటి పిటిషన్ దాఖలు కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. అయితే బీఆర్ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో భాగంగానే రిజిస్ట్రేషన్లు నిలిపివేసిందని, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అభ్యంతరం ఉంటే మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. -
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టులో పిల్ దాఖలు
హైదరాబాద్: పంప్‌లైన్ విధానం ద్వారా 3 టీఎంసీల నీటిని తరలించడాన్ని సవాల్ చేస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టులో పిల్ దాఖలైంది. తెలంగాణ ఇంజినీర్ ఫోరమ్ కన్వీనర్ దొంతుల లక్ష్మీ నారాయణ ఈ పిల్‌ను దాఖలు చేశారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది మాచర్ల రంగయ్య కోరిన అత్యవసర విచారణను కోర్టు నిరాకరించి, మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. కాగా, పంప్‌లైన్ విధానం ద్వారా నీటిని తరలిస్తే ప్రభుత్వంపై ఏటా రూ.8 వేల కోట్ల అదనపు భారం పడుతుందని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. నీటి తరలింపు ప్రక్రియను పాత పద్ధతినే కొనసాగించాలని ఆయన కోర్టును కోరారు. ఇప్పటిదాకా 2 టీఎంసీల నీటిని కెనాల్ గ్రావిటేషనల్ టన్నెల్ అండ్ లిఫ్ట్ సిస్టం ద్వారా తరలించారన్న పిటిషనర్.. ప్రతి ఏటా ప్రభుత్వంపై వేల కోట్ల నిర్వహణ భారం పడుతుందని కోర్టుకు వివరించారు. పంప్‌లైన్ పద్ధతి ద్వారా నీటిని తరలిస్తే భూసేకరణ సమస్యతో పాటు, విద్యుత్ తదితర సమస్యలు ఎదురవుతాయన్నపిటిషనర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించిందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. గతంలో మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు కాలువల ద్వారానే నీటి సరఫరా జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. -
‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ సంతానం ఉన్నా పోటీ చేసేలా ఇటీవల చట్ట సవరణ చేశారని, అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో పోటీ చేయాలంటే మాత్రం ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధన ఎందుకని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్న వారు అనర్హులంటూ ఉన్న సెక్షన్ 218ని సవాల్ చేస్తూ శ్రీధర్‌బాబు రవి, మహ్మద్ తాహెర్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉన్నవారు కూడా మున్సిపాలిటీల్లో పోటీ చేసేలా ప్రభుత్వం ఇటీవల మున్సిపల్ చట్టానికి సవరణ చేసిందని, అయితే జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం పోటీ చేయడానికి వీల్లేదన్న నిబంధన అలాగే ఉందని, ఇందుకు సరైన కారణాలను కూడా పేర్కొనలేదని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ అభ్యర్థించారు. అయితే ఈ రెండు వారాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయితే ఈ పిటిషన్ వేసి ప్రయోజనం ఉండదని రవిచందర్ నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం, ఈ వ్యవహారంపై ఈనెల 17లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ( చదవండి: డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు? ) -
ఆ ఘటనను రాష్ట్రం మొత్తం ఆపాదించలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న సమయంలో పోలీసులు చేసిన లాఠీఛార్జ్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వనపర్తి ఘటనను రాష్ట్రం మొత్తం ఆపాదించలేమని తేల్చి చెప్పింది. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం హైకోర్టుకు లేదని పేర్కొంది. ప్రజలు రోడ్లపైకి ఎందుకు వచ్చారో.. అత్యవసరమా లేదా అనేది చూడాలని తెలిపింది. వనపర్తి ఘటనపై ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఘటనపై 17 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. -
‘ఎర్రమంజిల్’ కూల్చొద్దు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం 150 ఏళ్ల నాటి ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చి వేసేందుకు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. కేబినెట్ నిర్ణయం ఏకపక్ష నిర్ణయమని, చట్ట విరుద్ధ మని స్పష్టం చేసింది. ఈ విషయంలో చట్ట నిబంధనలు, న్యాయస్థానాల ఆదేశాలు, కీలకమైన విషయాలను విస్మరించిందంటూ కేబినెట్ తీరును హైకోర్టు ఆక్షేపించింది. భవిష్య త్తుకు ప్రణాళి కలు రచించడం ఎంత ముఖ్యమో, గతాన్ని పరిరక్షించు కోవడమూ అంతే ముఖ్యమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. చారిత్రక ఎర్ర మంజిల్ భవనాన్ని కూల్చేసి, దాని స్థానంలో కొత్త అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను నిర్మించిన నవాబ్ సఫ్జదార్ జంగ్ ముషిర్‌దౌలా ఫర్క్‌ల్లా ముల్క్ వారసుడు మిర్ ఆస్గార్ హుస్సేన్, హెరిటేజ్ భవనాన్ని కూల్చరాదని డెక్కన్ ఆర్కియాలజికల్, కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి కె.జితేంద్రబాబు, సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, ఉస్మానియా విద్యార్థి జె.శంకర్‌లతో పాటు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో 8 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం.. సోమవారం 111 పేజీల తీర్పు వెలువరించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. తీర్పు సారాంశం ఇలా.. ‘ఓ నగర గుర్తింపు, ఆనవాళ్లు, దాని వారసత్వ సంపదను చారిత్రక భవనాలే నిర్వచిస్తాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. నగరాల్లోని చారిత్రక భవనాలను విధ్వంసాల నుంచి పరిరక్షించడం, వాటిని పునరుద్ధరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. చారిత్రక కట్టడాల పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన ప్రధానమైన విధి కూడా ప్రభుత్వంపై ఉంది. సంస్కృతి, గుర్తింపు ఇచ్చే చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రభుత్వం తన విలాసత్వంతో చారిత్రక భవనాల విధ్వంసానికి పాల్పడితే, అది నగర ప్రత్యేకతను, గుర్తింపును నాశనం చేయడమే’అని వ్యాఖ్యానించింది. మా ఆదేశాలను కూడా ఉల్లంఘించింది.. ‘జోనల్ నిబంధనల కింద చారిత్రక భవనంగా ప్రకటించిన ఏ భవనాన్ని అయినా కూల్చివేయాలన్నా, ఆధునీకరించాలన్నా, మార్పులు చేయాలన్నా మా అనుమతి తప్పనిసరంటూ పేర్కొంటూ 2016 ఏప్రిల్ 18న ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పూర్తి విస్మరించింది. ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చివేయాలన్న నిర్ణయం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేత విషయంలో ప్రత్యక్షంగా సాధించలేని లక్ష్యాన్ని ప్రభుత్వం పరోక్షంగా సాధించేందుకు ప్రయత్నించింది. ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేత నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వం హెచ్ఎండీఏ చట్ట నిబంధనలను, జోనల్ నిబంధనలను ఉల్లంఘించింది’అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుమతి తీసుకోలేదు.. ‘ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేత నిర్ణయం తీసుకునే ముందు హెచ్ఎండీఏ నుంచి ప్రభుత్వం ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఎర్రమంజిల్ ప్యాలెస్ 2010 మాస్టర్ ప్లాన్‌లో ఉంది. స్పెషల్ రిజర్వేషన్ జోన్లో కూడా ఉంది. జోనల్ నిబంధనల కింద ఎర్రమంజిల్ ప్యాలెస్‌కు ఉన్న రక్షణ కొనసాగుతోంది. జోనింగ్ రెగ్యులేషన్స్ 1981లోని 13వ రెగ్యులేషన్‌ను 2015లో మార్చారు. దీంతో చారిత్రక భవనాలు, చారిత్రక ప్రదేశాలు ‘రక్షిత’హోదా కోల్పోయాయన్న తప్పుడు భావనకు ప్రభుత్వం వచ్చింది. ఇదే సమయంలో 2010లో జోనింగ్ రెగ్యులేషన్స్‌కు రెగ్యులేషన్ 9(ఏ)(2)ను చేర్చారన్న విషయాన్ని కూడా విస్మరించింది. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేయాలన్నా, ఆధునీకరించాలన్నా కూడా హెచ్ఎండీఏ చట్ట నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి. కానీ ఎర్రమంజిల్ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం అలా చేయలేదు. ఎర్రమంజిల్ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం హెచ్ఎండీఏ చట్టాన్ని పూర్తిగా విస్మరించింది. జోనింగ్ నిబంధనల మార్పు, రద్దు చేసే అధికారం పూర్తిగా హెచ్ఎండీఏకే ఉంది తప్ప, ప్రభుత్వానికి కాదు. జోక్యం చేసుకోవచ్చు.. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల విషయంలో న్యాయ సమీక్ష చాలా పరిమితం. అయితే ఈ విధానపరమైన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో చట్ట నిబంధనలను, కీలక విషయాలను విస్మరించినప్పుడు, ఆ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. అందుకే ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేయాలన్న నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ప్రభుత్వం చట్ట నిబంధనలను, కీలక విషయాలను విస్మరించిందా.. లేదా.. అన్న దానిపైనే మేం ప్రధానంగా దృష్టి పెట్టాం. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం ఏకపక్షమైనప్పుడు, అందులో జోక్యం చేసుకోకుండా న్యాయస్థానాలు మౌనంగా ఉండవు’అని ధర్మాసనం పేర్కొంది. -
కేంద్రం వద్ద జడ్జీల పెంపు ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంపుదల చేయాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ వెల్లడించారు. దీనిపై కేంద్రం త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీతోపాటు 24 నుంచి 42 మందికి సంఖ్య పెంపు ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు.. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని గురు వారం హైకోర్టు ప్రధాన భవనం వద్ద సీజే జెండా ఎగుర వేసి.. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవం, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించడంలో ఎందరో మహనీయుల త్యాగాలున్నాయన్నారు. హైకోర్టు లో సాంకేతికతను పుణికిపుచ్చుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, హైకోర్టును పేపర్‌లెస్ చేయబోతున్నట్లు తెలిపారు. తీర్పు వెలువడిన ఒకట్రెండు రోజుల్లో తీర్పుల ప్రతులు ఆన్లైన్లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అందరికీ న్యాయ ఫలాలు అందించడంలో కోర్టుల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్య క్షుడు సూర్యకరణ్‌రెడ్డి మాట్లాడారు. పలువురు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన హైకోర్టు ఉద్యోగుల పిల్లలకు సీజే బహుమతులు ప్రదానం చేశారు. -
తెలంగాణ హైకోర్టు ఏర్పాటుపై చర్చ
న్యూఢిల్లీ: హైదరాబాద్ కింగ్‌కోఠిలోని పరదా ప్యాలెస్‌లో తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేసే అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తుతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈరోజు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రధాన న్యాయమూర్తి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు భవనాన్ని తాత్కాలికంగా ఏపికి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో తెలంగాణ హైకోర్టును కింగ్‌కోఠిలోని నిజాం పరదా ప్యాలెస్‌లో లేదా ఎర్రమంజిల్ ఆర్ అండ్ బీ భవనంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో కలిసి రాజీవ్ శర్మ ఈ రెండు భవనాలను పరిశీలించారు. **