‘ఎర్రమంజిల్‌’ కూల్చొద్దు | High Court Directed The TRS Government About Erramanzil Palace | Sakshi
Sakshi News home page

‘ఎర్రమంజిల్‌’ కూల్చొద్దు

Published Tue, Sep 17 2019 2:32 AM | Last Updated on Tue, Sep 17 2019 3:24 AM

High Court Directed The TRS Government About Erramanzil Palace - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం 150 ఏళ్ల నాటి ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ను కూల్చి వేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. కేబినెట్‌ నిర్ణయం ఏకపక్ష నిర్ణయమని, చట్ట విరుద్ధ మని స్పష్టం చేసింది. ఈ విషయంలో చట్ట నిబంధనలు, న్యాయస్థానాల ఆదేశాలు, కీలకమైన విషయాలను విస్మరించిందంటూ కేబినెట్‌ తీరును హైకోర్టు ఆక్షేపించింది. భవిష్య త్తుకు ప్రణాళి కలు రచించడం ఎంత ముఖ్యమో, గతాన్ని పరిరక్షించు కోవడమూ అంతే ముఖ్యమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. చారిత్రక ఎర్ర మంజిల్‌ భవనాన్ని కూల్చేసి, దాని స్థానంలో కొత్త అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ను నిర్మించిన నవాబ్‌ సఫ్జదార్‌ జంగ్‌ ముషిర్‌దౌలా ఫర్క్‌ల్లా ముల్క్‌ వారసుడు మిర్‌ ఆస్గార్‌ హుస్సేన్, హెరిటేజ్‌ భవనాన్ని కూల్చరాదని డెక్కన్‌ ఆర్కియాలజికల్, కల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధి కె.జితేంద్రబాబు, సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, ఉస్మానియా విద్యార్థి జె.శంకర్‌లతో పాటు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో 8 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం.. సోమవారం 111 పేజీల తీర్పు వెలువరించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.

తీర్పు సారాంశం ఇలా..
‘ఓ నగర గుర్తింపు, ఆనవాళ్లు, దాని వారసత్వ సంపదను చారిత్రక భవనాలే నిర్వచిస్తాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. నగరాల్లోని చారిత్రక భవనాలను విధ్వంసాల నుంచి పరిరక్షించడం, వాటిని పునరుద్ధరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. చారిత్రక కట్టడాల పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన ప్రధానమైన విధి కూడా ప్రభుత్వంపై ఉంది. సంస్కృతి, గుర్తింపు ఇచ్చే చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రభుత్వం తన విలాసత్వంతో చారిత్రక భవనాల విధ్వంసానికి పాల్పడితే, అది నగర ప్రత్యేకతను, గుర్తింపును నాశనం చేయడమే’అని వ్యాఖ్యానించింది.

మా ఆదేశాలను కూడా ఉల్లంఘించింది..
‘జోనల్‌ నిబంధనల కింద చారిత్రక భవనంగా ప్రకటించిన ఏ భవనాన్ని అయినా కూల్చివేయాలన్నా, ఆధునీకరించాలన్నా, మార్పులు చేయాలన్నా మా అనుమతి తప్పనిసరంటూ పేర్కొంటూ 2016 ఏప్రిల్‌ 18న ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పూర్తి విస్మరించింది. ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ను కూల్చివేయాలన్న నిర్ణయం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ కూల్చివేత విషయంలో ప్రత్యక్షంగా సాధించలేని లక్ష్యాన్ని ప్రభుత్వం పరోక్షంగా సాధించేందుకు ప్రయత్నించింది. ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ కూల్చివేత నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వం హెచ్‌ఎండీఏ చట్ట నిబంధనలను, జోనల్‌ నిబంధనలను ఉల్లంఘించింది’అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఎలాంటి అనుమతి తీసుకోలేదు..
‘ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ కూల్చివేత నిర్ణయం తీసుకునే ముందు హెచ్‌ఎండీఏ నుంచి ప్రభుత్వం ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ 2010 మాస్టర్‌ ప్లాన్‌లో ఉంది. స్పెషల్‌ రిజర్వేషన్‌ జోన్‌లో కూడా ఉంది. జోనల్‌ నిబంధనల కింద ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌కు ఉన్న రక్షణ కొనసాగుతోంది. జోనింగ్‌ రెగ్యులేషన్స్‌ 1981లోని 13వ రెగ్యులేషన్‌ను 2015లో మార్చారు. దీంతో చారిత్రక భవనాలు, చారిత్రక ప్రదేశాలు ‘రక్షిత’హోదా కోల్పోయాయన్న తప్పుడు భావనకు ప్రభుత్వం వచ్చింది. ఇదే సమయంలో 2010లో జోనింగ్‌ రెగ్యులేషన్స్‌కు రెగ్యులేషన్‌ 9(ఏ)(2)ను చేర్చారన్న విషయాన్ని కూడా విస్మరించింది. మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేయాలన్నా, ఆధునీకరించాలన్నా కూడా హెచ్‌ఎండీఏ చట్ట నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి. కానీ ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ విషయంలో ప్రభుత్వం అలా చేయలేదు. ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ విషయంలో ప్రభుత్వం హెచ్‌ఎండీఏ చట్టాన్ని పూర్తిగా విస్మరించింది. జోనింగ్‌ నిబంధనల మార్పు, రద్దు చేసే అధికారం పూర్తిగా హెచ్‌ఎండీఏకే ఉంది తప్ప, ప్రభుత్వానికి కాదు.

జోక్యం చేసుకోవచ్చు..
ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల విషయంలో న్యాయ సమీక్ష చాలా పరిమితం. అయితే ఈ విధానపరమైన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో చట్ట నిబంధనలను, కీలక విషయాలను విస్మరించినప్పుడు, ఆ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. అందుకే ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ కూల్చివేయాలన్న నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ప్రభుత్వం చట్ట నిబంధనలను, కీలక విషయాలను విస్మరించిందా.. లేదా.. అన్న దానిపైనే మేం ప్రధానంగా దృష్టి పెట్టాం. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం ఏకపక్షమైనప్పుడు, అందులో జోక్యం చేసుకోకుండా న్యాయస్థానాలు మౌనంగా ఉండవు’అని ధర్మాసనం పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement