పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టుపై పోలీసులకు హైకోర్టు ప్రశ్న
నిందితుల వాంగ్మూలాలను అనుమతిస్తూ.. తీర్పు రిజర్వు
కేసీఆర్.. నరేందర్‌రెడ్డికి రూ.10 కోట్లు ఇచ్చారు: పీపీ
సాక్షి, హైదరాబాద్: ఇంటి వద్దే అరెస్టు చేస్తే పిటిషనర్ (నరేందర్‌రెడ్డి) భార్యకు నోటీసులు ఇవ్వకుండా, సలీమ్ అనే వ్యక్తికి ఎందుకు ఇచ్చారని హైకో ర్టు పోలీసులను ప్రశ్నించింది. విచారణకు సహకరించని, పరారీలోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అరెస్టు చేయడం సరికాదని చెప్పింది. ఇతర నిందితుల వాంగ్మూలం, కాల్ డేటా ఆధారంగా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది.
నరేందర్‌రెడ్డి పేరు వెల్లడించినట్లు చెబుతున్న లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాల కాపీలను అనుమతిస్తున్నట్లు పేర్కొంటూ.. తీర్పు రిజర్వు చేసింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్‌రావు వాదనలు వినిపించారు.
పిటిషన్ విచారణార్హం కాదు..
న్యాయమూర్తికి పెన్‌డ్రైవ్ అందజేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ‘సీఎం రేవంత్‌రెడ్డి, కలెక్టర్ ఎవరొచి్చనా కూడా దాడి చేయాలని పిటిషనర్ (నరేందర్‌రెడ్డి) ప్రేరేపించారు. లగచర్లలో అధికారులపై దాడికి ముందు, తర్వాత ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోల పెన్‌డ్రైవ్ ఉంది. పిటిషనర్ రెచ్చగొట్టకుంటే దాడి జరిగేదే కాదు. పిటిషనర్ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
దర్యాప్తు నిష్పక్షపాతంగా, చట్టప్రకారం సాగుతోంది. వరుసగా పిటిషన్లు వేస్తూ విచారణను ముందుకు సాగకుండా చేస్తున్నారు. కేసీఆర్ నుంచి రూ.10 కోట్లు పిటిషనర్‌కు అందినట్లు తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ విచారణార్హం కాదు.. కొట్టివేయాలి’అని అన్నారు. అయితే సెక్షన్ 482 కేసులో పెన్‌డ్రైవ్ ఎలా సమరి్పస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందస్తు పథకం ప్రకారం దాడి జరిగిందని చెప్పడానికి అందులోని వివరాలే సాక్ష్యమని పీపీ బదులిచ్చారు.
అరెస్టు ఫొటోలను న్యాయమూర్తికి అందజేసిన గండ్ర వాదనలు వినిపిస్తూ.. ‘15 మంది సివిల్ డ్రస్‌లో వచ్చి బలవంతంగా అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో అరెస్టు చేశామన్నారు. పిటిషనర్‌తో పలు పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. అందులో ఏముందో చూసుకునే అవకాశం ఇవ్వలేదు’అని చెప్పారు.
సంతకాలు అభ్యంతరకరం
వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘చట్టపరమైన అవకాశం ఉన్నప్పుడు పిటిషన్లు వేయకుండా అడ్డుకోవడం సాధ్యం కాదు. నివేదికలపై సంతకాలు కూడా అభ్యంతరకరం’అని అన్నారు. గాయపడిన వారి వివరాల్లో ప్రశ్నార్థకాలు ఎందుకున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ప్రాథమిక సమాచారం తీసుకునే క్రమంలో అలా పేర్కొన్నారని పీపీ బదులిచ్చారు.
ఈ సందర్భంగా విచారణ తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేశారు. కాగా, లగచర్ల ఘటనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చటవిరుద్ధమంటూ నరేందర్ రెడ్డి భార్య శ్రుతి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు జస్టిస్ కె.లక్ష్మణ్ ముందు విచారణకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment